ᐅప్రవక్త



మహమ్మదు ప్రవక్త సూక్తులు


  • ప్రేమించు-ప్రేమింపజేసుకో-ఇదే జీవిత ముఖ్య లక్ష్యం. 

  • పరస్పానురాగాలతో ప్రవృద్ధి పొందే వారిని స్వర్గం ఆహ్వానిస్తుంది. పరస్పర ద్వేషులకు నరకమే ప్రాప్తి. 

  • వివేకాన్ని మించిన అమూల్య వస్తువు లేదు. 

  • ధర్మ మార్గంలో చింతించు, ఇదే మంచి మానవుని లక్షణం. ధర్మ మార్గంలో నడుచుకో, అదే దివ్య లక్షణం. 

  • ఆపేక్షించే గర్భదరిద్రులకు గుప్తంగా సహకరించి ఆదుకో. బహిరంగంగా నీతులు బోధించడం నేర్చుకో. 

  • సత్యవాదికి ధర్మ దూషణ పనికిరాదు. 

  • ఆమరణాంతం ఉత్తమ జ్ఞానాన్ని వృద్ధి పెంపొందించుకో. 

  • సంతాన హీనులకు చింత ఎందుకు? సమ్రక్షించి పెంచగలిగితే అనాధుని దత్తు చేసుకో. 

  • కన్న తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉత్తమ గురువులు. చాకచక్యంతో, నేర్పుతో, అనురాగంతో ఉపదేశించు. 

  • విద్యాభూషణమే ఉత్తమ భూషణము. విద్యాశయం వ్యాపారం కాకూడదు. మంచిని పెంచేదే విద్య. నవనాగరీకంగా ఉండాలి. నిష్ఫలమైనదిగా ఉండకూడదు. 

  • సంపద కలిగినపుడు భగవంతుని అభినందించు. కష్టాలు కలిగితే శరణు వేడుకో. ఎవరి ముక్తి మార్గం వారే చూసుకోవాలి.



ᐅభక్త కబీరుదాసు



కబీరు బీజక్

కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు.

నిరాడంబరమైన సహజ భావనలతో, ఆధ్యాత్మిక తత్త్వముతో బ్రహ్మానందదాయకమైన వీరిపాటలు, వీరికి అఖండ కీర్తిని గడించాయి. భారతీయ యోగులలో సుప్రసిద్ధుడని ఘనత వహించిన కారణ జన్ముడు.

క్రీ.పూ. 1440 లో జననమొందిన కబీరు బాల్యం ఒక విచిత్ర గాధ. తండ్రిలేని కబీరుని ఇతని తల్లి పరిహరించినది. ఆనాధుడైన కబీరు కాశీ పరిసర ప్రాంతాలలో లహర్‌తోలో అనే సరస్సులో పడి మునిగి పోవుచుండగా నిరు, నిమా అనే ముస్లిం దంపతులు రక్షించి ఇంటికి తీసుకుపోయారు. పుత్ర సంతతికి నోచుకోని ఈ ముస్లిం దంపతులు తమకు దొరికిన ఈ బాలుని అత్యంత ఆదరాబిమానాలతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. మహమ్మదీయుల ఇంట మహమ్మదీయ సంప్రదాయలతో వర్ధిలుతున్న కబీరు హైందవ ఆచారాలను ఆదరిస్తూ ఉండేవాడు. ఇది ఆ మహమ్మదీయ దంపతులకే కాదు ఇరుగు పొరుగు వారి అగ్రహానికి కూడా ముఖ్య కారణమైంది.

చిన్ననాటి నుండి కబీరు ఆధ్యాత్మిక జీవనాన్ని అభిలషిస్తూ ఉండే వాడేగాని ప్రత్యేకంగా ఒక హిందూ మతాభిమానాన్ని గానీ, మహమ్మదీయ మతాభిమానాన్ని గానీ ప్రకటించలేదు. గురువు లేక ఎటువంటి గుణవంతునకైనను జ్ఞాన సాధన సాధ్యం కాదని తలచి, సద్గురువు ఆవశ్యకతను గ్రహించి, అట్టి గురువుకోసం తహతహపడ్డాడు. ఆ సమయంలో కాశీలో నివసిస్తూ ఉన్న రామానందులను గురించి విని వారి సాన్నిధ్యంలో వారి సేవకు ఎంతో కుతూహలం పొందాడు. కాని హీన జాతిలో పెరిగిన తనను రామానందుడు అనుగ్రహించి శుశ్రూషకు అంగీకరించునో లేదో అనే సంశయంతో భాధ పడ్డాడు. చివరకు ఒకనాడు రామనందుడు గంగానదిలో స్నానముచేయు రేవువద్ద కబీరు మెట్లపై మునుగు కప్పి పడుకున్నాడు.తెల్లవారు జామున స్తానానికి వచ్చిన రామానందుడు మేట్లపై పరుండిన బాలుని చీకటిలో గమనించక కాలితో తొక్కిన అపచారమునకు ' రామ రామ ' అని రామనామస్మరణం చేశాడు. వెంటనే కబీరు ఆ రామ నామమే తనకు మహామంత్రమని నిశ్చయించుకుని ఆ నాటి నుండి తాను రామానందుల శిష్యుడని రామానందునితో చెప్పి శ్రుశ్రూషకు ప్రాధేయపడ్డాడు. కబీరు గొప్పదనాన్నీ, అభిలాషనూ గ్రహించి వెంటనే రామానందులు అతన్ని తన శిష్యునిగా అంగీకరించాడు. నాటినుండి కబీరు రామ నామ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు.

రామానందులు సామాన్యులు కారు. కఠినుడు. కబీరు అనేక సంవత్సరాలపాటు శుశ్రూష చేసి వారి వలన నిర్గుణోపాసనచే దైవము సర్వ మతములకు సమ్మతమైన పరమాత్మ తత్వమనియు ఏదో ఒక రూపము చేతను, పేరు చేతను నిర్దేశింపదగినవడు కాడని తెలుసుకున్నాడు. కుల మత వ్యవస్థలతో చెల్లాచెదురైన మానవాళిలో రేగుతున్న ద్వేష వైషమ్యాలకు మిక్కిలి చింతించి, మహమ్మదీయ మత గురువులతో, హైందవ యోగులతో కలసి మెలసి ఉండుటకు ప్రారంభించాడు. దీని వలన కబీరు ప్రజాదరణ పొందలేకపోయాడు.

కబీరు శిష్టాచార సంప్రదాయాలను నిరాకరించి, విగ్రహారాధనను విమర్శించాడు. ఫలితంగా అనేక మందితో విరోధాన్ని తెచ్చిపెట్టుకున్నా, తన గురువు ఉపదేశాలను దేశం నలుమూలలా ప్రకటించాడు. కబీరు ఉపదేశామృతం అతని మృదు మధుర వాక్కులలోను, పాటలలోనూ, పద్యాలలోనూ తొణికిసలాడుతుంటాయి. భక్తులు ఆ పాటలను పాడుతూ కబీరు కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు.

కబీరు మరణించినపుడు అతడి హిందు, మహమ్మదీయ భక్తులు అతడి మృతదేహ ఖనన విషయంలో కొట్లాడుకున్నారు. మహమ్మదీయులు దేహాన్ని భూస్థాపితం చేయాలని, హిందువులు దహన క్రియలు చేయాలని వాదులాడుకున్నారు. వాదోపవాదాలతొ మృత దేహంపైని వస్త్రాన్ని తొలగించగా ఆయన కళేబరానికి బదులు అక్కడ పుష్ప రాశి ఉండడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. కబీరు రచించిన బిజక్‌లోని ఉపదేశాలనుంచి, సందేశాలనుంచి మనం ఎంతైనా తెలుసుకోవచ్చు.

కబీరు మానవాళికి అందించిన కొన్ని అమూల్య ప్రవచనాలు (సాఖీలు) :


  • ఏది చేసినా నువ్వే. నాది ఇసుమంతయూ లేదు. నేనేదైనా చేసినన్నచో నాలోనున్నవాడవు నీవే చేసితివి.

  • హరినెందుకు ప్రేమింతువు? హరిజనులను ప్రేమించుము.హరి నీకు సంపదనిచ్చును, హరిజనుడు నీకు హరినే ఇచ్చును.

  • ఆకలి కుక్కవంటిది. అది భజనకు భంగం చేయును. దానికి ముక్కబడవేయుము. జంకు విడిచి స్మరియింపుము.

  • విరహం లేని హృదయం వల్లకాడువంటిది.

  • సాఖీలు వల్లిస్తే ఉపయోగం లేదు. వాటి సారాన్ని గ్రహించాలి.

  • గోవిందుడికన్నా గురువెక్కువ.

  • పళ్ళెమును నీటిలో నానబెడితే ఉపయోగం ఏముంది? దుర్జనుడూ అంతే. వాడి హృదయం మెత్తబడదు.

  • ఎత్తైన మేడలు చూసి గర్వించకు. రేపు నేలబొర్లెదవు. మీద గడ్డి ఒలుచును.

  • అడుగుటకన్నా చచ్చుట మేలు.

  • మనసు గజరాజు. అంకుశంతో దానిని అణుచుము.

  • రామ నామము నాల్గు వేదములకు మూలము.

  • మతాల పేరిట సామరస్యం చెడగొట్టుకోవటం అవివేకం

  • "రామ్ రహీమ్ ఏక్ హై"

  • భగవంతుని కొరకు అక్కడ - ఇక్కడ వెతకవలసిన పనిలేదు, అతడు నీలోనే ఉన్నాడు . నీలో వున్న ఆత్మారాముని కనుగొనలేక కస్తూరి మృగం చందంబున అక్కడక్కడ వెదకులాడిన ఏమి లాభం? పూవులోని వాసనలా దేవుడు నీలోనే ఉన్నాడు. తన నాభినుండి బయట పడుతున్న కస్తూరి గంధాన్ని, తెలుసుకొనలేని జింక, దాన్నిబయట గడ్డిలో వెతుకుతుంది. అలాగే నీలోని భగవంతుని బయట వెతకవద్దు .

ᐅగురుముఖి




|| సత్ నాం, వహ్ గురు ||

సిక్కు మతము గురునానక్ ప్రభోధనల ఆధారంగా యేర్పడిన మతము. ఏకేశ్వరోపాసన వీరి అభిమతము. సిక్కు మతములో దేవుని పేరు "వాహే గురు". వీరి పవిత్ర గ్రంధము గురుగ్రంధ సాహిబ్ లేదా ఆది గ్రంధము లేదా ఆది గ్రంధ్. వీరి పవిత్ర క్షేత్రము అమృత్ సర్ లోని స్వర్ణ మందిరము.

గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. తృప్త, మెహతా కలు ఇతడి తల్లిదండ్రులు. ఇతడి తండ్రి ధనవంతుడైన ఒక గొప్ప జమీందారు వద్ద కొలువు చేశాడు. తన తల్లిదండ్రులకు గురునానక్ మూడవ సంతానం. ఇతడి జన్మస్థలమైన తల్పండిని ఈ రోజు మనం నన్‌కానా సాహిబ్ అనే పేరుతో పిలుస్తున్నారు. పసితనం నుండీ నానక్‌కు గురుభక్తి మెండుగా ఉండేది. అందరికీ ముక్తి మార్గం చూపేందుకు అతడు ఒక చోటు నుండీ మరొక చోటుకీ పోయేవాడు. అతడు సుదూర ప్రాంతాల వరకు టిబెట్, బెంగాల్, దక్కన్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కందహార్, టర్కీ, బాగ్దాద్, మక్కా, మదీనాలను ప్రయాణం చేశాడు. అతడు భగవంతుడిని వాహేగురు అని పిలిచాడు. ప్రజలు తమను తాము అర్పించుకోవాలని ప్రజలకు అతడు సలహా ఇచ్చాడు. ఇతడు సిక్కుల మతాన్ని స్థాపించాడు. గొప్ప కవిగా, వేదాంతిగా, మానవతావాదిగా పేరును పొందాడు. ఇతడిని విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ "మానవాళి గురువు"గా అభివర్ణించాడు.

గురునానక్ అతి అమూల్యమైన కొన్ని ఉపదేశాలు :


  • బయట కనబడే తీరు ముఖ్యం కాదు. బయటి రూపాన్ని చూసి మనిషి ప్రాశస్త్యాన్ని మనం అంచనా వేయలేము.

  • భగవంతుడే అతి ముఖ్యమైన వాడు. దేవుడు ఒక్కడే అని అతడు ఉపదేశం చేశాడు.

  • ఇతరుల సంపాదనపై ఆధారపడి జీవించకూడదు.

  • దయ, సంతృప్తి, సహనం, సత్యం ఇవే ముఖ్యమైనవి.

  • ఆకలితో అలమటించే వారికి అన్నం యిచ్చేవారినీ, గుడ్డల అవసరం ఉన్నవారికి గుడ్డలను ఇవ్వగల్గే వ్యక్తినే భగవంతుడు ప్రేమిస్తాడు.

  • అందరూ గొప్ప పుట్టుక కలవారే.

  • పేరాశను జయించిన వారిని భగవంతుడు ప్రేమిస్తాడు.

  • అర్ధంలేని ఆచారాలు రూపరహితుడైన భగవంతుడిని అర్ధం చేసుకునే మార్గపు అవరోధాలు అవుతాయి.

  • పవిత్రమైన హృదయంతో అతడిని ధ్యానించడం, అతడిని ప్రశంశించడం అన్నవే ముక్తి మార్గాలు.



"గురుగ్రంధసాహిబ్" సిక్కుల పవిత్ర గ్రంధం. పదిమంది సిక్కు గురువుల ఉపదేశాలూ, వారి సూక్తులూ ఇందులో సంగ్రహించబడి వున్నాయి. ఇందులో హిందూమతపు, మహమ్మదీయుల మతపు పండితుల, భక్తుల రచనలు చాలా ఉన్నాయి. ఈ మత గ్రంధమే సిక్కుమతానికి మార్గదర్శకత్వం వహిస్తుంది.సిక్కులు తమ మత స్థాపకుడి పటాన్నె ఆరాధిచడంగానీ ఏ ఇతర గురువుల పటాన్ని తమ మత గ్రంధం వద్ద పెట్టడం కానీ చేయరు. గురుగ్రంధ సాహెబ్‌ను గౌరవిస్తారు. "నేను దేవుడిని కాదు.నేను అతడి అవతారం కూడా కాదు. అతని సందేశాన్ని అందజేసే మత ప్రవక్తను మాత్రమే" అని గురునానక్ చెప్పాడు.

పంచ "క" కారాలను శిక్కులకు ఆవశ్యం. మొదటి "క" కారం కేశాలకు సంబంధించినది. తలపై కాని, గడ్డం పై గాని కేశ ముండన క్రియ జరపరాదు. రెండవది "కంఘ" ధారణ. అంటే జుట్టులో ఎప్పుడూ దువ్వెన ఉంచుకోవాలి. మూడవది రెండు "కభాల" ను ధరించాలి. అభాలంటే పొట్టిలాగులు - డ్రాయర్లు. ఇలా ధరిస్తే తేలికగా కదలడానికి వీలవుతుంది. నాలుగవది కుడి మణి కట్టు కు "కడా" లేదా "కరా" ను (ఉక్కు కడియాన్ని) ధరించాలి. ఇది బలం కోసం, ఆత్మ నిగ్రహం కోసం, ఐదవది "కృపాణ" ధారణ. ఇది ఆత్మ రక్షణ కోసం. ఇంకా ఇతడు ధూమ , మదిరపానాలను నిషేధించాడు. ఈ విధంగా ఇతడు శిక్కులను ఒకే కుటుంబానికి చెందిన వారిగా మలచాడు. తలపాగా, గడ్డంలో వారికి ఒక ప్రత్యేకతను - చూడగానే శిక్కులని తెలిసేట్టు - కల్పించాడు.\

 "పవిత్ర హృదయంతో అతడు పవిత్రతను ప్రబోధించాడు. ప్రేమావతారుడైన అతడు ప్రేమనౌ నేర్పాడు. వినయ సంపన్నుడైన అతడు విధేయతను నేర్పాడు. సదాచార సంపన్నుడైన అతడు దైవత్వాన్ని బోధించాడు. శ్డాంతి దూత అయిన అతడు న్యాయాన్ని వాదించాడు. సమానత్వం, పైత్రతల సాకార రూపమైన అతడు భగవంతుడిపట్ల భక్తి, సదాచారం, గౌరవం ఉండాలని తెలియజేశాడు". నన్నాహాల్ సింగ్ రాసిన ఈ కవిత గురునానక్ సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.

ᐅజైన మహావీరుడు


జైన  వర్ధమాన్ మహావీర తీర్ధంకరుడు

బుద్ధ భగవానుని సమకాలికుడైన మహావీరుడు - బుద్ధుని మహా పరిత్యాగం, బుద్ధుని తపస్సు, మానవాళిపట్ల బుద్ధుని ప్రేమను పదే పదే గుర్తుకు తెస్తాడు. బీహార్‌లోని పాట్నాకు సమీపంలోగల ఒక పట్టణంలో మహావీరుడు 599 బిసిలో జన్మించాడు. అతని తండ్రి ఒక ప్రముఖుడు. వజ్జీ రాజ్యధిపతి అయిన చేతకుని కుమార్తి ప్రియకరణి లేక త్రిశల - మహావీరుని తల్లి. బాల్యదశలో మహావీరుడు పాఠశాలకు పంపబడ్డాడు. పాఠశాలలో అధ్యాపకుల అవసరం అతనికి లేదని వివేకాన్ని అతడు మనస్సులోనే నెలకొల్పుకున్నాడు. బుద్ధునివలెనే అతడు కూడా ప్రపంచ పరిత్యాగం చేయాలనే ఆశతో కొట్టాడాడు. తన కుటుంబంతో కలసి 28 ఏళ్ళ వయస్సు వరకు గడిపాడు. ఆ సమయంలోనే అతని తల్లిదండ్రులు కాలధర్మం చెందారు. ఇక తాను సన్యాసం స్వీకరించడం అవసరమని భావించాడు. సన్యాస స్వీకారానికి అనుమతించమని తన అన్నగారిని అభ్యర్థించాడు. " ఇంకా గాయాలు మాసిపోలేదు, కొన్నాళ్ళు అగు " అని అన్నగారు చెప్పారు.

మరో రెండేళ్ళ పాటు వేచి చూశాడు. అప్పుడు అతడు ముప్పది ఏళ్ళ వయస్సులో ఉన్నాడు. తాను కూడా సర్వసంగ పరిత్యాగం చేయాలని, యోగమైన, ఉపయోగకరమైన కార్యం నేరవేర్చాలని జీనస్వలే భావించాడు. బుద్ధుని మాదిరిగా తన సంపదను పేదలకు పంచి పెట్టాడు. తన కుటుంబాన్ని విడనాడిన రోజునే తన రాజ్యాన్ని సోదరునకు అప్పగించాడు. తపస్సు, ప్రార్ధనలతో నిండిన జీవితంలోకి ప్రవేశించాడు. 12 సంవత్సరాల ధ్యానం, తపస్సుల తర్వాత మహావీరునికి వెలుగు కనిపించింది. జృంభిక గ్రామంలోని రిజికుల ఒడ్డున అతనికి ఆత్మ వివేకం ( జ్ఞానం ) కలిగింది. అతడు తీర్ధంకరుడయ్యాడు. తీర్ధంకరుడంటే పూర్ణ పురుషుడు అని అర్థం చెప్పబడింది.

తరువాత బుద్ధుని వలనే ప్రబోధ ప్రచారం - జీవిత ధర్మంగా ప్రారంభించాడు. 30 సంవత్సరాలు ఒకచోటి నుండి మరోచోటికి పయనం సాగించాడు. ఆనందానికి ( సంతోషానికి ) సంబధించిన తన గొప్ప (శుభ ) సందేశాన్ని బెంగాల్, బీహారులలో ప్రబోధించాడు. తన సందేశాన్ని కౄర ( అనాగరిక ) జాతులకు కుడా - తనపట్ల వారి కౄర వైఖరిని గురించి ఏమీ ఆలోచించకుండా - అందించాడు. తన ప్రచార కార్యక్రమం కోసం శ్రావస్తికీ, హిమాలయాలకూ వెళ్ళాడు. బాల్యంలో అతని పెరు ' వీరా ' అతణ్ణి ' వర్ధమాన్ ' అని పిలిచేవారు. తరువాత ' మహావీర ' ( గొప్ప వీరుడు, కథానాయకుడు ) అని పిలవటం ప్రారంభించారు. ఈ సార్థకనామం అతనికి ఎలా వచ్చిందనేందుకు ఒక కథ ఉంది. ఒకరోజు తన స్నేహతులతో కలిసి ఆటలాడుతున్నప్పుడు, ఒక నల్లని పాము పడగ పైన తనపాదం మోపి దాన్ని అణచివేశాడు. ఈ విధంగా మహావీరుడు మోహం అనే సర్పాన్ని అణచటం జరిగింది.

తన సిద్ధాంతాన్ని ప్రబోధించేందుకు అతడు ఒక చోటినుండి మరోచోటికి ప్రయాణం చేశాడు. ఎందరో అతణ్ణి పరిహసించారు. కానీ అతడు మౌనం వహించేవాడు! సమావేశాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు అతణ్ణి కలతబెట్టి బాధించేవారు, అవమానపర్చేవారు. అయినా అతడు నిశ్శబ్దంగా ఉండేవాడు. అతడు ఒక అడవిలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఒక ముఠా మనుషులు అతణ్ణి కొట్టారు. అయినా అతడు మౌనంగానే ఉన్నాడు! ఒక అనుచరుడు అతణ్ణి వదలివేసి అతనిపై చెడ్డ ( పాపపు ) ప్రచారం వ్యాపింపచేశాడు.అయినా అతడు నిశ్శబ్దంగానే ఉన్నాడు! అతడు మహావీరుడుగా రూపొందాడు. ఒక గొప్ప విజేత, ఒక మహాపురుషుడుగా రూపొందేందుకు కారణం అతడు శాంతి శక్తిని అభివృద్ధి చేసుకున్నందువల్లనే.

అతని బోధనలు సాహసోపేతమైనవి." అన్ని ప్రాణులను నీవలనే భావించుకో, దేనికీ హాని చెయ్యకు ". అన్నింటిలో ఏకత్వాన్ని దర్శించడమంటే ఎవరికీ కలిగించకుండా ఉండటమే. మహావీరుని సుభాషితాలలో విశిష్టమైన ఒక సుభాషితం " నీకు నీవే స్నేహితుడివి, నీకు నీవే శత్రువు కూడా. కనుక మిత్రునిగానే ఉండు! నీకు నీవే శత్రువు కావద్దు! మనమంతా సంతోషం ( ఆనందం ) కోసం వెదుకుతున్నాము; తద్వారా ఇతరులకు కూడా ఆనందం కలిగిస్తాము. ఇదే శాసనం (న్యాయం ). ఇతరులను ఎవరైతే హాని కలిగిస్తారో, వారికి హాని కలుగుతుంది.

మహావీరునకు పదకొండు మంది ప్రధాన అనుచరులు, నాలుగువేలకు పైగా సన్యాసులు మరియు సామాన్యులు - మత ( విశ్వాసం ) కలవారు ఉండేవారు. బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులను కుడా చేర్చుకునేవారు. అతనికి " కులం " మీద నమ్మకం లేదు. 526 బి.సి.లో పావపురి ( బీహార్ )లో తన 72వ ఏట మహావీరుడు దీపావళి రోజున కాలధర్మ చెందాడు.