ᐅ నీ జీవితానికి నీవే సృష్టికర్తవి
ᐅ నీ జీవితానికి నీవే సృష్టికర్తవి!
'అనుక్షణం మంచి కోసం నిరీక్షించు. నీకు మంచే జరుగుతుంది. ఎందుకంటే, ఆ మంచి జరగటానికి నీ మనసే విత్తు నాటింది కనుక. నీవు ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది. ఏదైనా చెడు జరిగితే అనాలోచితంగానే ఆ ప్రమాదం జరగటానికి నీవే కారకుడివయ్యావని అర్థం!
ఒక్కోసారి మనకు ఏదో తప్పు జరిగినట్టనిపిస్తుంది. దానికి కారణం... మనం అనుకున్నట్లుగా అది జరగలేదు కనుక. ఒకటిచేసి మరొకటి జరగాలని ఆశించినప్పుడే ఇలాంటి ఆశాభంగం కలుగుతుంది. ఒకరకం పూలమొక్కను వేసి మరోరకం పూలు పూయలేదని విచారించటంలో అర్థం ఉందా?
నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి నీవే సృష్టికర్తవి! 'మనకేదో ప్రమాదం ముంచుకొస్తుంది' అని పదేపదే భయపడేవాళ్లు కొందరుంటారు. తప్పకుండా ఏదోటి జరుగుతుంది. అప్పుడది భరించలేని బాధకు కారణమవుతుంది. నీ చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ అందరికీ సాయపడుతూ నీ ప్రపంచాన్ని ఆనందమయం చేసుకుంటూ వెడితే... ఎలాంటి ఇబ్బంది కలిగినా అది కష్టమనిపించదు. అదికూడా జీవితంలో ఒక భాగమైపోతుంది. కేవలం తాత్కాలిక మనఃక్లేశం అనిపిస్తుంది. దాన్ని తట్టుకునే శక్తి నీకు అంతర్గతంగా ఉంటుంది. ఆ ఇబ్బంది తప్పిపోతుంది... కొన్నాళ్లకు అదసలు జరిగిన విషయమే మరుగున పడిపోతుంది.
అసలు మానవజీవితమే ప్రణాళికాబద్ధంగా ఆరంభమవుతుంది. మనల్ని దేవుడు సర్వస్వతంత్రులుగా సృష్టించాడు. ఏం చేయాలనుకున్నా అది మన చేతుల్లోనే ఉంది. నువ్వొక సాహితీవేత్తవి, సంగీతకారుడివి, రాజకీయ నాయకుడివి- స్వయంకృషితో ఏదైనా కాగలవు. అలాగే- హిట్లరువి కావాలన్నా, గౌతమ బుద్ధుడివి కావాలన్నా... నీ చేతుల్లోనే ఉంది. నువ్వు వేసే ప్రతి అడుగూ నీ జీవితపథాన్ని నిర్దేశిస్తుంది. నీ జీవితంలో ఏం జరిగినా ఎలాంటిది జరిగినా దానికి పూర్తిగా నువ్వే కారకుడివి, బాధ్యుడివి. ఆ పరాత్పరుడు నీకలా అన్ని అవకాశాలూ ఇస్తూనే ఉంటాడు కనుక!
జీవితంలో అన్నీ సంతోషపెట్టేవే జరగవు. ఒక్కోసారి దుఃఖపెట్టేవీ సంభవించవచ్చు. రెంటికీ ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పటం మరిచిపోకు. ఎందుకంటే, నీ ఎదుగుదలకు ఒక్కోసారి బాధకూడా అవసరం. అంతిమ గమ్యం కొండశిఖరమైతే, నడిచే దారిలో రాళ్లురప్పలు తప్పవు. అందువల్ల జీవితంలో ఏది జరిగినా అది నీ ఉన్నతికి దొరికిన సదవకాశంగానే భావించు. అక్కడినుంచి ఇంకా ఇంకా పైపైకి చేరటానికి కృషి చెయ్యి.
'మీ ప్రాణస్నేహితుడు హఠాత్తుగా మరణించాడు. అది బాధాకరమే! కానీ, ఆ సంఘటన మిమ్మల్ని కుంగదీయకూడదు. నీ గమ్యాన్ని అయోమయం చేయకూడదు. దేవుడిచ్చిన జీవితం ఎంత? చాలా చిన్నది. డెబ్భై ఏళ్లనుకోండి. దానిలో మూడోవంతు నిద్రలోనే గడిచిపోతుంది. మరోవంతు సంపాదన కోసం తాపత్రయపడటంతో గడిచిపోతుంది. తక్కిన మూడోవంతు తప్పులు చేస్తూ, చేసిన తప్పులు దిద్దుకుంటూ గడిపేస్తుంటారు. చివరి క్షణం సమీపించినప్పుడు- అయ్యో, జీవితాన్ని ఇంత చిన్న విషయాలకోసం ఎంత వృథాగా గడిపేశానని వగచి ప్రయోజనమేముంది? చేద్దామనుకున్న మంచి పనులు చేయకుండానే కాలయాపన చేశానే అని గిజగిజలాడి లాభమేముంటుంది?
'పుట్టిన ప్రతి జీవికీ మృత్యువు తప్పదు. ఆ మృత్యువుతో పోలిస్తే వృథా అయిన సమయం గొప్పది కాదు... దానికి ఏ క్షణానైనా సంసిద్ధుడివి కాగలగటమే గొప్ప! అంతకు ఎంతముందైనా చేద్దామనుకున్న మంచి పనులు త్వరత్వరగా చేయటం మరీ గొప్ప! ఏం చేయాలనుకున్నా అంతా నీ చేతుల్లోనే ఉంది...' అని ముగించారు ఆచార్యులు.
శిష్యుల మనసులు విచ్చుకున్నాయి. ఉత్తేజితమయ్యాయి. వారి మస్తిష్కాల్లో జ్ఞానజ్యోతులు వెలిగాయి.
- తటవర్తి రామచంద్రరావు