ᐅ లాలనా లోలుడు

 ᐅ లాలనా లోలుడు

భగవంతుడు భక్త సులభుడు. భగవంతుడు అత్యంత గహనమైనవాడు. అంత సులభంగా అందుబాటులోకి రాడు. ఎముకలు అరిగిపోవాలి. కండలు కరిగిపోవాలి. కన్నీళ్లు కడలినిండి పొంగిపొరలాలి. నిజమేనా, ఏది నిజం? ఒక విషయంలో ఇంత విభిన్న ధోరణి సాధకుణ్ని బెంబేలెత్తించదా? అసలే భగవంతుడి ఉనికి పట్ల అంతంతమాత్రపు విశ్వాసం మనకు. సాధనలో సగం దూరం ప్రయాణించాక కూడా 'కలడు కలండనెడివాడు కలడో లేడో!' అని పక్కచూపులు, బిత్తరచూపులు చూస్తూ డోలాయమాన స్థితిలో ఉంటాం. పాలు తెల్లగా ఉంటాయని ఒకరు, లేదు- నల్లగా ఉంటాయని మరొకరు పూర్తి వ్యతిరేకాభిప్రాయాలు వెల్లడిస్తే మన గతేం కాను! కనీసం పాలు కంటికి కనిపిస్తూ ఉంటాయి. తెల్లగానే ఉన్నాయిలే అని మనకు మనం నిర్ధారించుకునే అవకాశం ఉంది. మరి భగవంతుడు? చివరాఖరికైనా మనమే భగవంతుడైపోవాలి తప్ప 'ఇదిగో ఇది నేను' అని ఆయన కనిపించే అవకాశమే లేదు. అలాంటివాడి గురించి స్పష్టమైన, సత్యమైన నిర్వచనాన్ని ఇచ్చేవారెవరు? ఎవరూ లేరు. ఉన్నా మనం అసత్యాన్నే ఎక్కువగా నమ్ముతాం. మనకు అనుకూలమైన అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటాం. అయినా దేనికైనా వేదాలు శాశ్వత ప్రమాణాలు. ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు, గీత... భారతీయ వాఞ్మయ సర్వస్వం భగవంతుడి ఉనికిని, వైభవాన్ని కీర్తించటానికే ఆవిర్భవించింది. సరే. 'కలడో లేడో' అనేవాడు కలడు. ఒప్పుకొందాం. మరి భక్త సులభుడేనా? యుగాల పర్యంతం ఎముకలు కూడా శిథిలమయ్యే స్థాయిలో తపస్సు చేసిన తపోధనుల మాటేమిటి? తలమీద పక్షుల గూళ్లు, శరీరం చట్టూ పాముల పుట్టలు... ఏమిటి?!
నిజానికి మనకు ఏ ఉదాహరణలు, ఉపమానాలు అవసరం లేదు. ఎవరి హామీలతో పనిలేదు. ఇచ్చి పుచ్చుకో అనే సూత్రం ప్రకృతి మనకు ప్రసాదించిన అమూల్యపాఠం. భగవంతుడి పట్లా ఈ సూత్రమే వర్తిస్తుంది. అహేతుక ప్రేమమయుడైన భగవంతుడు మనకు జన్మతో సహా అన్నీ ఇచ్చినా జన్మ సార్థక్యాన్ని సాధించుకునే విషయంలో మాత్రం మనకు స్వేచ్ఛను, ఇచ్ఛాపూర్వక ఎంపిక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన కావాలా, వద్దా అన్నది మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. ఆయన ప్రమేయంగానీ, ప్రయత్నంగానీ ఏమీ ఉండదు. నడక నేర్చుకుంటున్న పసివాణ్ని కిందపడినా తండ్రి పట్టించుకోకుండా కేవలం పరిశీలిస్తూ ఉండిపోయినట్లు మనం చేసే ప్రయత్నాలను నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తూ ఉంటాడు. స్వప్రయత్నాన్ని, స్వప్రయోజకత్వాన్ని ప్రోత్సహిస్తాడు. ఔను. ఈ దశలో మనమే ముందుగా ఆయనకు మన ప్రేమను, ఆరాధనను అందివ్వాలి. తడబడే అడుగులను కూడగట్టుకుని తపస్సు చేసేదాకా ఎదగాలి. మనం ఆ ప్రయత్నంలో ఉన్నామనే విశ్వాసాన్ని ఆయనకు కలిగించాలి. అదే సాధన. అదే ఎముకలు అరిగించటం, కండలు కరిగించటం. బాహ్యమైన సాధనలు ఎన్ని చేసినా, నిజంగానే ఆ ప్రక్రియల్లో ఎముకలు విరిగినా, అరిగినా ఆంతరిక భావ ప్రధానం కాని సాధనలు ఫలితాన్నందించటంలో వెనకబడతాయి. మాధవుడితో మనసు కలిపినవాడికి, అనంతుడితో అంతరంగాన్ని నింపుకొన్నవాడికి భగవంతుడు - నిజంగానే భక్తసులభుడు.

అంటే, భగవంతుడు అందిపోయాడా? లేదు. అంత పనీ, అందినంత పనీ చేశాడు. అనుక్షణం భావముఖంలో ఉంటూ భగవంతుడితో అనుసంధానమై జీవితాన్ని ప్రేమ రసమయ రాగరంజితం చేసుకున్నవాడికి భగవంతుడు ప్రత్యేకంగా కనిపించనక్కర్లేదు. అణువణువునూ ఆయనగా అనుభూతి పొందేవాడికి ప్రత్యేకం ఒక స్పర్శా సదృశ ఘన పదార్థం అక్కర్లేదు. దృశ్యమాన వస్తువు అవసరం లేదు. భగవంతుడు అంతర్లీన కేంద్రం. అనుభూతి సాంద్రం. 'శ్రీ రామ నీ నామ మెంత రుచిరా' అనగలిగినవాడు, 'నిధిచాల సుఖమా రాముని సన్నిధి సుఖమా?' అని ప్రశ్నించగలిగినవాడు, బంగారాన్నీ, మట్టిపెడ్డనూ సమ సదృశంగా గంగలో పడేయ గలిగినవాడు, ఈ స్థాయిలో భగవంతుణ్ని ప్రేమించలిగినవాడు... వాడు, వారు... ఆ సౌలభ్యం ఎరిగినవారు. యుగాల తపమాచరించినా వారు అంధకారంలో వెలుగును వెదికినవారు కారు. వెదికే పనిలో లేరు. ఆ ప్రకాశాన్ని ఆస్వాదిస్తూ యుగాలు మరచినవారు, మైమరచినవారు. ప్రకాశంతో మమేకమైనవారు. యుగాల తపో రహస్యం ఇదే.

ఔను. భగవంతుడు భక్తసులభుడు. మనం పిల్లల్ని ప్రేమిస్తే పిల్లలూ మనల్ని ప్రేమిస్తారు. మన రూప లావణ్యాలతో పని లేదు. ధనం, హోదాలతో పనిలేదు. మనమిచ్చే విలువైన కానుకలతో పనిలేదు. దేవుడైనా అంతే. పసివాడు. అంతకంటే మరీ పసివాడు. లాలనా లోలుడు. ఇక్కడ అందమైన రహస్యం ఏమిటంటే- ఈ సుకుమారుడు, ఈ శిశు సమానుడు అటుకులకు అనంత సంపదలిచ్చేవాడు. పండిపోయిన ఉసిరికాయకు పసిడి ఉసిరి రాశులను కురిపించేవాడు.

- చక్కిలం విజయలక్ష్మి