ᐅ రజ్జు సర్ప భ్రాంతి
మనిషి అమృత పుత్రుడు. ఆత్మస్వరూపుడు. సాక్షాత్ బ్రహ్మ! సాధారణ స్థాయిలోని మనుషులెవరూ ఈ మాటల్ని నమ్మరు. పూర్తిస్థాయి సాధన చేయనివారూ పూర్తిగా నమ్మరు. సహజమే. ఎప్పటికప్పుడు మరణిస్తూ పోతున్న మనిషికి మరణం లేకపోవటమేమిటి?! అమృతత్వమేమిటి!?
మనిషికున్న భయాల్లో మరణం తరవాతే ఏదైనా. అయితే మరణం అన్నది మనం కల్పించుకున్నదే. మన మనసు కల్పించుకున్నదే. కనీసం దాని అర్థం. దేహ, మనో స్థాయులనుంచి పైకెదగలేని, భూస్థాయిలోని మనిషికి మరణ భయం సహజమే. మనం శరీరం కాదు. ఆత్మ అనే జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆత్మకు మరణం లేదు కాబట్టి అమృతత్వాన్ని పొందటం అంటే ఏమిటో అర్థమవుతుంది. చాలామందికి అనుమానం... మరణం లేకపోవటం ఏమిటి! వీరాధివీరుడైనా, చక్రవర్తి అయినా, చివరకు మహా భక్తుడైనా, మహిమాన్వితుడైనా మనిషన్నాక మరణించే తీరుతున్నాడు కదా అని. నిజమే. కానీ దేహభావం నశించాక ఇక మరణం ఎక్కడుంది? తాను దేహం కాదు, ఆత్మ అని గ్రహించాక జీర్ణమైన వస్త్రాన్ని తొలగించుకున్నట్లు మరణం పేరిట దేహం రాలిపోతుంటే నిర్వికారంగా, నిర్లిప్తంగా చూస్తాడు మనిషి.
అయితే 'మరక... మంచిదే' అన్నంత సులభం కాదు మరణం మంచిదే అనటమైనా. నమ్మటమైనా. ఎందుకంటే 'నేను దేహం కాదు, ఆత్మ' అనే స్పృహ ఉన్నవారే మరణాన్ని కేవలం మార్పుగానే అంగీకరించగలరు. ఆనందించగలరు. ఎందుకంటే జీర్ణవస్త్రాన్ని వదిలివేయటం ఎవరికైనా ఆనందదాయకమే! దేహం వస్త్రంలాంటిదనే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం, స్థాయి వూరకే రావు. దాని వెనక ఎంతో ప్రయత్నం, పట్టుదల, సాధన, సుకృతం ఉండాలి. వీటివల్ల రాత్రి చీకట్లో ఉన్నంత అయోమయంలోంచి క్రమంగా ఉదయించే కాంతిపుంజాల జల్లులో తానే ఓ ఉషోదయమైనట్లు మనిషి ప్రయత్న ఫలంగా, తపోఫలంగా తనకు తెలీకుండానే తానే ఓ జ్ఞానజ్యోతిలా వెలగటం ప్రారంభిస్తాడు. అలాంటివారికి మాత్రమే నేను ఆత్మననే ఉత్కృష్ట భావన స్థిరమవుతుంది. తనను తాను ఆత్మగా భావించేవారు, ఆత్మగా జీవించేవారు తాను మరణిస్తాననే భావనకు అతీతంగా ఉంటారు. అంతర్ముఖులై ఉంటారు. ఇదే మరణాతీతం అంటే. అమృతత్వం అంటే. మరణ భావన లేనివాడు అమృత పుత్రుడు. ఇది ఉన్నపాటున రాదు. మనం ముందు సద్గురువు ద్వారా, సత్సంగం ద్వారా పరతత్వాన్ని గ్రహించాలి. గ్రహించినదాన్ని ఆచరణలో పెట్టాలి. తీవ్ర సాధన చేయాలి. 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' అని వినటం, చదవటం, అనుకోవటం... చాలా సులభం. అయినంత మాత్రాన ఆత్మ భావంలో నిలబడలేం. చిత్తశుద్ధితో సాధన చేయాలి. తపించాలి. ప్రాణంపెట్టి ఆ భావాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేయాలి.
మరణ భయం మనిషిని అనుక్షణం మరణింపజేస్తుంది. ఈ భయాన్నించి మనిషి బయటపడినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరణం అనేది ఎప్పుడైనా సూచించి వచ్చేది కాదు. ఉరికంబం ఎక్కి మెడలో ఉరితాడు పడినవాడూ శిక్షనుంచి బయటపడవచ్చు. శ్మశానంలో చితిమీద శవంగా ఉంచబడినవాడూ లేచిరావచ్చు. మరణం అనేది మామూలు మనిషికి సంబంధించినంత వరకూ ఒక ప్రమాదం. అనుకోని అకస్మాత్ సంఘటన. దానికోసం అనుక్షణం భయంతో మరణించాల్సిన అవసరం లేదు. ఇంత జీవితాన్నీ చివరాఖర్లో ఎప్పుడో వచ్చే మరణం కోసం వెచ్చించవలసిన అగత్యం లేదు. ధైర్యంగా, ప్రశాంతంగా జీవితాన్ని ఆనందించాలి. జన్మించిన కారణాన్ని గ్రహించి ఆ ప్రయత్నంలో తలమునకలుగా మునిగిపోవాలి. ప్రాపంచికంగా మనం ఏం ఆస్వాదించదలచుకున్నా ఆ ఆలోచన వెనక, ఆ ఆనందం వెనక జీవిత సాఫల్యతకు సంబంధించిన స్పృహ పరిమళించాలి. ప్రతి అనుభవం వెనక, ఆనందం వెనక సాధన వెన్నెముక కావాలి. అనుక్షణ అప్రమత్త ప్రయత్నమే సాధన. సాధనల సర్వోత్కృష్ట ఫలమే ఆత్మ భావన. అదే అమృతత్వ భావన. ఈ భావనలో స్థితులమైతే, స్థిరులమైతే మరణభయం పోతుంది. భయంతో అనుక్షణం మరణించే మనిషి జీవిత స్వారస్యాన్ని ఆస్వాదించలేడు. తనకు తానే శిక్ష వేసుకుంటూ జీవితకాల ఖైదీలా జీవిస్తాడు... కాదు కాదు... మరణిస్తూ జీవిస్తాడు. ఆత్మ భావన మరణాన్ని అధిగమిస్తుంది.
నిజానికి మరణం అన్నదాని అర్థం జ్ఞాని దృష్టిలో వేరు. శాశ్వతమైన ఆత్మ జీవాత్మగా లోకంలో నడయాడేందుకు ఓ ఉపాధి కావాలి. ఆ ఉపాధే దేహం. కాలానుగుణంగా ఆ ఉపాధి జీర్ణమైపోతే మరో ఉపాధి వస్త్రాన్ని ధరించే ప్రయత్నమే మరణం. ఏదిఏమైనా మనం మరణమనే ఈ 'రజ్జు సర్ప భ్రాంతి' నుంచి బయటపడాలి. మనం భయపడే ఈ మరణం కేవలం రజ్జువు మాత్రమే. సర్పం కాదు.
- చక్కిలం విజయలక్ష్మి