ᐅ ప్రేమే దైవం
'ప్రేమ కన్నను ఎక్కువేముందిరా ఎల్లకామ్య పదవుల కన్న ప్రేమ ఎక్కువరా' అన్నాడు భావకవి. 'ప్రేమ కలుగక బ్రతుకు చీకటి' అన్నాడు గురజాడ. 'మనం ఆశించాల్సింది, అనుభవించేది, ఆనందించేది ప్రేమ మాత్రమే. పరితపించేది ప్రేమ కోసమే' అనేవారు సత్యసాయి. ప్రేమ నిత్యమైనది, సత్యమైనది అంటారు తత్వజ్ఞులు.
ప్రేమ అనే రెండక్షరాలు మహిమాన్వితమైనవి. మధురమైనవి. ప్రేమను వర్ణించడానికి భాష లేదు. మాటలు చాలవు. మనసు కన్నా, మాటల కన్నా, అతీతమైనది ప్రేమ. ప్రేమ చాలా సహజమైనది. పువ్వులు పరిమళాన్ని వెదజల్లడం, చంద్రుడు వెన్నెల కురిపించడం, నీరు ప్రవహించడం, గాలి వీచడం ఎంత సహజంగా జరుగుతాయో మనిషి హృదయంలో ప్రేమ కూడా అంతే సహజంగా పుడుతుంది.
మానవాళిని కలిపి ఉంచేది ప్రేమసూత్రం. ఆత్మను ఆత్మను కలిపి కట్టే దారమే ప్రేమ అంటారు భవభూతి మహాకవి. దేహసౌందర్యం నుంచి ఆత్మసౌందర్యం వైపు, ఆత్మసౌందర్యం నుంచి ఆధ్యాత్మిక సౌందర్యం వైపు నడిపించే మహత్తర శక్తే ప్రేమ అన్నది ప్లేటో మహాశయుడి వివరణ.
ప్రేమ ఆకాశం నుంచే వూడిపడదు. పాతాళంనుంచి ఉద్భవించదు. అది మనలోనే ఉంది. ప్రేమను మించిన అమృతత్వం మరొకటి లేదు.
ప్రేమ అనే మాటను భిన్నరీతుల్లో వింటుంటాం. ప్రేమకు ఎన్నో రూపాలు. ప్రేయసీప్రియులది ఆకర్షణ, వ్యామోహం. అది ప్రేమగా భ్రమిస్తారు. భార్యాభర్తలది వలపు. అది కూడా శాశ్వతం కాదు. అందుకే 'మరులు ప్రేమని మది దలంచకు, మరులు మరలును వయసు తోడనే' అన్నారు గురజాడ. పిల్లలపై తల్లిదండ్రులకు ఉండే ప్రేమ- వాత్సల్యం. మిత్రుల మధ్య ప్రేమ- స్నేహం! ఇవన్నీ లౌకికమైన ప్రేమలు. ఈ లౌకికమైన ప్రేమలో కామం, మోహం, స్వార్థం, ప్రతిఫలాపేక్ష చోటు చేసుకుంటాయి. స్వార్థప్రేమ విద్యుత్ కాంతి వంటిది. కృత్రిమమైనది. అన్యోన్య ప్రేమ పరస్పర క్షేమాన్ని ఆశించినా పరిమితమైనదే. అది చంద్రుడి వెలుగులాంటిది. స్పష్టత తక్కువ. పదార్థప్రేమ సూర్యకాంతి వంటిది. సర్వత్రా వ్యాపిస్తుంది. మనం ద్వేషాన్ని పెంచుకొంటున్నాం. కానీ, లోకానికి ప్రేమను పంచాలి. మనుషుల్లో ప్రేమను పెంచాలి. అందుకు మన హృదయం ప్రేమమయం కావాలి. మన దృష్టి ప్రేమమయమైనప్పుడే ఈ సృష్టి బ్రహ్మమయంగా భాసిస్తుంది. పరమేశ్వరుడిపై చూపించే భక్తే ప్రేమ అన్నాడు నారద మహర్షి. ఆర్ద్ర హృదయుడైన మానవుడు తన ప్రేమను ఈశ్వరాభిముఖంగా మరల్చినపుడు చిత్తం ద్రవిస్తుంది. భగవంతుడిపై ప్రేమ జనిస్తుంది. ఇదే పరమప్రేమ. ధర్మార్థ కామ మోక్షాలు కాక మానవుడు సాధించాల్సిన అయిదో పురుషార్థం ఈ పరమప్రేమ అంటారు తాత్వికులు.
పరమాత్మ- ప్రేమ స్వరూపుడు. పరహిత బుద్ధితో జీవనం గడుపుతూ, ప్రపంచాన్ని భగవన్మయంగా భావించేవారికి ప్రేమే దైవం. వారి బతుకు పరిపూర్ణం, ధన్యం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు