ᐅ స్వరరాగ సుధారసయుత భక్తి



ᐅ స్వరరాగ సుధారసయుత భక్తి

ఆధ్యాత్మికోన్నతికి భక్తిసాధన అవసరం. దైవాన్ని నమ్మిన ప్రతి మనిషీ తనలో అంతర్లీనంగా ఉన్న భక్తిని తనకు తానే ఏదో ఒక సాధనాన్ని వూతంగా చేసుకుని ఆవిష్కరించుకోవాలి. ఇటువంటి సాధకులే దివ్యమైన ఆత్మానుభూతికి అర్హులు. అతి కొద్దిమంది సాధకులు ఇలాంటి దివ్య అనుభూతిని అనుభవించగలరు. అలాంటివారిలో నాదబ్రహ్మ కాకర్ల త్యాగరాజు ఒకరు. ధనంతో సమకూర్చుకోలేని ఆధ్యాత్మిక శక్తిని త్యాగయ్య సంగీతంతో సంపాదించారు. ముక్తికోసం సంగీతాన్నే సాధనగా చేసుకున్నారాయన. సంగీతానికి భక్తికి భేదం లేదని త్యాగయ్య అనేవారు. త్యాగయ్య ఆధ్యాత్మిక పరిణతి ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేసింది. తన సంగీతంతో భగవంతునిపై ప్రేమ మానవీయ ఔదార్యాలను సమాజానికి అందించారు కాకర్ల త్యాగరాజు. త్యాగరాజ స్వామి క్రీ.శ. 1767నుంచి 1847 వరకు జీవితాన్ని గడిపారు. ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగయ్య సమకాలికులు. వీరిని సంగీత త్రిమూర్తులని పిలిచేవారు. జనవరి ఆరో తేదీన త్యాగయ్య వర్ధంతి. అప్పటినుంచి వారం రోజులు ఆయన జన్మస్థలం తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు రివాజుగా నిర్వహిస్తారు. ఈసారి ఆరాధనోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. త్యాగయ్య తండ్రిపేరు రామబ్రహ్మమ్‌, తల్లి సీతమ్మ. 'సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి' అని లలితరాగంలో కీర్తన ఆలపించి తల్లిదండ్రులకు నివాళి అర్పించాడు త్యాగరాజు.
త్యాగరాజు 24వేల కీర్తనలు రచించారని ప్రతీతి. వాల్మీకి రాసిన రామాయణంలోనూ 24వేల శ్లోకాలున్నాయి. త్యాగరాజు రచించిన 24వేల కీర్తనల్లో ప్రస్తుతం 700 కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. చాలావరకు త్యాగయ్య తెలుగులోనే కీర్తనలు రచించారు. సంస్కృతంలోనూ ఆయన కీర్తనలు రాశారు. ఘనరాగ పంచరత్న కీర్తనల్లో మొదటిదైన 'జగదానంద కారక జానకీ ప్రాణదాయక'- సంస్కృత భాషలో రాశారు. పంచరత్న కీర్తనలన్నీ భావయుక్త సంగీత గుళికలు. తను పూజించే శ్రీరాముడు ఎటువంటివాడు?... ఇంద్రనీలమణి సన్నిభావ ఘనచంద్ర సూర్యనయనా ప్రమేయ వాజీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమనవైరి సన్నుతుడు! హృదయం పల్లవిస్తుంది ఇలాంటి భావంతో. సంగీతంలో భావమే ప్రధానమైందని త్యాగయ్య తన శిష్యులతో అనే వారట. భావం తరవాతి స్థానాలనే రాగం, తాళం ఆక్రమిస్తాయి. త్యాగయ్య తన పదమూడు సంవత్సరాల వయస్సులోనే దేశిక తోడి రాగంలో నమో నమో రాఘవాయ అనే పల్లవితో కీర్తన రచించాడు. ఆయన తన ఇరవై మూడోఏట సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.

శొంఠి వెంకట రమణయ్య వద్ద త్యాగరాజు శిష్యరికం ప్రారంభించాడు. 'నాయనా! నీ ఇష్ట దైవం శ్రీరామచంద్రుని చేర్చగల పెన్నిధి సంగీతమే'నని శొంఠి వెంకట రమణ త్యాగయ్యకు బోధించేవారు. ఆయన మాటలే త్యాగరాజుకు శిరోధార్యాలయ్యాయి. సామవేదంలోని సప్తస్వరాలకు సృష్టికర్త అయిన శంకరునికి తలవంచి నమస్కరిస్తాను అని అన్నారాయన ఒక సందర్భంలో. నలభై సంవత్సరాల వయసు నాటికి త్యాగయ్య దక్షిణ భారతదేశం మొత్తంలో సామవేద సాధకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. త్యాగయ్య గానామృతాన్ని వినడానికి తహతహలాడిన ఎందరో సంగీతజ్ఞులు శొంఠి వెంకట రమణయ్యను ఆశ్రయించి త్యాగయ్య సంగీత కచేరీ ఏర్పాటు చేయమని కోరారు. గురువు మాట మన్నించి త్యాగయ్య తన సంగీత సభలో సభాసదులందరికీ నమస్కరించి శ్రీరాగంలో 'ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' అని గానం చేశాడు. తానొక్కడే కాదు- సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయు వారెందరో ఉన్నారు- వారందరికీ వందనాలని స్వచ్ఛమైన భావంతో అన్నాడు త్యాగయ్య. ఒకసారి త్యాగయ్య శిష్యుడు వేంకట రమణ భాగవతార్‌ తన గురువు కోసం శ్రీరామచంద్ర స్వామి చిత్రపటం గీయించి 10 క్రోసుల దూరం నడచి త్యాగయ్యకు సమర్పించాడు. పటంలోని శ్రీరామచంద్రుని అందాన్ని చూస్తూ ఆర్ద్రతతో- 'నను పాలింపగ నడచి వచ్చితివా నా ప్రాణనాథ... కరమున శరకోదండ కాంతితో ధరణీ తనయతో... నను పాలింపగ నడచి వచ్చితివా' అని కీర్తించాడు త్యాగరాజు.

త్యాగరాజు సామవేద సారాన్ని సామాన్యులకు సైతం తెలియజెప్పిన మహామహితాత్మజుడు. సంగీతంవల్ల ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని తెలియజేసిన గొప్ప భావుకుడు, శ్రీరామభక్తుడు. త్యాగయ్య పూజించే సీతారామలక్ష్మణ విగ్రహాలను ఎవరో స్వార్థంతో కావేరీ నదిలోకి విసిరేసినప్పుడు ఆయన వెతికి వెతికి వేసారి- 'మరుగేలరా ఓ రాఘవా... చరాచర రూప పరాత్పర సూర్య సుధాకరలోచన' అంటూ వేడుకున్నాడు. త్యాగయ్య దివ్యసంక్తీరనలతోపాటు సంప్రదాయ కీర్తనలు సైతం రచించాడు. ప్రహ్లాద చరిత్ర, నౌకాచరితం అనే గేయ రూపకాలను ఆయన రచించాడు.

- అప్పరుసు రమాకాంతరావు