ᐅ ప్రేమపరీక్ష



ᐅ ప్రేమపరీక్ష

ప్రేమ స్వరూపమైన ఆ పరమాత్మను సాధకుడు నిండుమనసుతో ప్రేమిస్తాడు. నిరంతరం ఆ పరమాత్మ పేరునే స్మరిస్తుంటాడు. అతడు సంపూర్ణ ప్రేమమూర్తిగా మారిపోతాడు. చివరికి ఆ సాధకుడే ఓ పరమాత్మ అవుతాడు. పరమాత్ముడు సకల సద్గుణ భూషణుడు. సర్వాంతర్యామి. నిరాకారుడు. ఎవరికీ కనిపించడు.
ఆ పరమాత్మ భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ప్రేమించినవారికి ఆశీస్సులందిస్తాడు. అలాంటి పరమాత్మను నిత్యం ప్రేమించడం అసలైన ప్రేమా? కాదు.

ఆ పరమాత్మ తనను ప్రేమించమని ఎవర్నీ అడగడు. కానీ, భక్తులకెన్నో పరీక్షలు పెడుతుంటాడు.

సాధకుడి మనసులో ఉన్న ప్రేమను పరీక్షిస్తుంటాడు. ఈ పరీక్షలో సాధకుడు విజయం సాధించాలంటే నిర్మలమైన మనసుతో ఆ పరమాత్మ సృష్టించిన ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రేమించాలి.

ఆ పరమాత్మ సృష్టించిన అన్ని ప్రాణుల్నీ ప్రేమించాలి. అదంత సులభం కాదంటారు చాలామంది. ఆ పరమాత్మను ప్రేమించినవాళ్లు ఆ బ్రహ్మండనాయకుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఎందుకు ప్రేమించరు? ప్రేమించాలి.

అసలైన ప్రేమంటే ఇదే! పరమాత్మ అనుగ్రహం సంపాదించాలంటే ఈ లోకంలో అందర్నీ సమదృష్టితో చూడాలి. ఈ లోకం అందమైనది కాదు. నిజమే.

ఇక్కడ అనాథలుంటారు. అంగవైకల్యంతో బాధపడేవాళ్లుంటారు. గూడు, గుడ్డ లేని పేదవాళ్లుంటారు. అల్పులు, అధములు ఉంటారు.

పరమాత్మ సృష్టించిన అద్భుతమైన జలపాతాల్ని, నదుల్ని, కొండల్ని, లోయల్ని ప్రేమించిన సాధకుడు విధివంచితుల్ని ఎందుకు ప్రేమించలేడు? పరమాత్మ పెట్టిన ప్రేమపరీక్షలో నెగ్గాలంటే సాధకుడు ఎలాంటి భేదభావమూ లేకుండా అందర్నీ ప్రేమించాలి.

పరోపకారంతో అందరి పట్లా దయకలిగి ఉండాలి.

చాలామంది పుణ్యంకోసం నదుల్లో మునుగుతూ తీర్థయాత్రలు చేస్తుంటారు. చుట్టుపక్కలవాళ్లను మాత్రం ద్వేషిస్తుంటారు. దీనివల్ల ఆ పరమాత్మ అనుగ్రహం లభించదు. మనకు కావలసిన ప్రేమను ఒకరికి పంచితేనే... తిరిగి దాన్ని పొందగలుగుతాం. ఇది సత్యం.

ఇతరులు ఏది చేస్తే మన మనసు నొచ్చుకుంటుందో... ఆ పనులు మనం ఇతరులకు చెయ్యకుండా ఉండటమే ఉత్తమ ధర్మమని మహాభారతం చెబుతోంది. అందుకే ప్రతీ ప్రాణిపట్ల దయకలిగి... సహాయం, సహకారం అందించాలి. ఎదుటి వ్యక్తి దుఃఖాన్ని పోగొట్టాలి.

చేతులు కలిస్తేనే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుంది. సహాయంవల్ల మనిషి ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తాడు. అంటే... ప్రతీ ఒక్కరిలో ప్రేమ వెల్లివిరియాలి.

పూర్ణమానవుడిగా మారాలనుకున్న సాధకుడు స్వచ్ఛమైన ప్రేమతో ఈ విశ్వాన్ని ప్రేమించాలి. అదే జీవన ధర్మం. అదే జీవన న్యాయం. అలా మారిన సాధకుణ్ని లోకమంతా ప్రేమిస్తుంది. అతణ్ని పరమాత్మలా కొలుస్తుంది. అప్పుడు సాధకుడు ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాడు. విజేతగా నిలిచిపోతాడు!

- విశ్వనాథ రమ