ᐅనిరహంకారం
మానవుణ్ని అధఃపాతాళంలోకి తోసేసే ప్రమాదకరమైన అవలక్షణం 'అహంకారం'. ఈ అహంకార బీజం మనోక్షేత్రంలో మొలకెత్తిందంటే- అది విషవృక్షమై మానవుణ్ని సర్వనాశనం చేస్తుంది. చరిత్రహీనుణ్ని చేస్తుంది. అహంకారి తన జీవితాన్నే కాదు, తన చుట్టూ ఉన్న సాటి మానవుల జీవితాన్నీ భ్రష్టు పట్టిస్తాడు. జాతికీ దేశానికీ ద్రోహం చేస్తాడు. సత్యం, ప్రేమ, అహింస, కరుణ అనే సద్గుణాల్ని పూర్తిగా విస్మరిస్తాడు. 'నేను, నాది', అన్న అహం మనసులో ప్రవేశిస్తే- మర్యాద పట్టించుకోడు, మంచిమాటల్ని పెడచెవిన పెడతాడు. ఎవ్వరి హితవును వినడు, మంచిని కనడు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని మూర్ఖపు వాదనలు చేస్తూంటాడు. మంచి-చెడుల విచక్షణను కోల్పోతాడు. బాంధవ్యం, అనుబంధం, మైత్రి, సత్సాంగత్యం- అన్నీ వదిలేస్తాడు. అన్ని అనర్థాలకూ ప్రధాన హేతువు ఈ అహంకారమే.
అహంకారానికి కారణభూతమైనవి ప్రధానంగా యౌవనం, ధనం, అధికారం, అజ్ఞానం- అనే నాలుగు లక్షణాలని విజ్ఞులు చెబుతారు. యువరక్తం వేడిగా, వాడిగా శరీరంలో ప్రవహిస్తున్నప్పుడు సహజసిద్ధంగానే శారీరకశక్తి విజృంభించి మానవుడి వివేకాన్ని కప్పేస్తూ ఉంటుంది. ఫలితంగా అతనెవ్వరినీ లెక్కచెయ్యడు. ఎదురుదెబ్బ తినేవరకూ అహంకారంతో ప్రవర్తిస్తూంటాడు. పెద్దలముందు తలవంచడు, గౌరవించడు. తన దూకుడుకు కళ్లెం పడేవరకు కన్నూమిన్నూ కానకుండా హుంకరిస్తూంటాడు. అందరినీ తూలనాడుతూ అవమానిస్తూంటాడు, హింసిస్తూంటాడు. రెండోది, ధనసంపద. సుఖ జీవితానికి ధనసంపద అవసరమే. ధనమే జీవితం కారాదు. 'ధనమూలమిదంజగత్' అని నమ్మే వ్యక్తి 'ధర్మమూలమిదంజగత్' అని ముందుగా విశ్వసించాలి. అలాకాకుండా అధర్మమార్గంలో అక్రమ ధనార్జన చేసినవాడిని అహంకారమే నిలువునా ఆవరిస్తుంది. అలా నడమంత్రపుసిరి కనుక వచ్చిందంటే, ఆ మనిషికెవ్వడూ కనపడడు. జగత్తంతా ఇది తప్పని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నా లక్ష్యపెట్టడు. అన్యాయంగా, అవసరాన్ని మించి ఆర్జించిన సంపద అతణ్ని అధోగతిపాలు చేస్తుంది. 'అహంకారానికి మూలమై సంపద ఏమాత్రం సుఖశాంతుల్నివ్వదు. సమాజానికీ ఉపయోగపడదు. అటువంటి అన్యాయార్జిత విత్తంగల తండ్రి కుమారుడిని చూసినా భయపడుతూనే ఉంటాడు'- అంటారు ఆదిశంకరులు. ఇక మూడో ప్రధాన కారణం- 'అధికారం'. అధికారం అందలమెక్కించగానే మానవుడి అహంకారానికి పట్టపగ్గాలుండవు. అధికారమనే పదునైన ఆయుధం మంచికీ, చెడుకీ కూడా ఉపయోగపడుతుంది. అధికారి తన మాటకు చేతకు తిరుగులేదనుకున్నప్పుడు, ఏ మాత్రం అహంకారం మనసులో విషపుచుక్కలా ప్రవేశించినా- అధికారం అధఃపతనం కావడానికి మూలమవుతుంది.
నాలుగో అంశం అజ్ఞానం. అజ్ఞాని మంచి-చెడులు గ్రహించడు. అధ్యయనం, అనుశీలనం చేయడు. జ్ఞానార్జనకై కనీసం యత్నించడు. ఇతరులు మంచి సూచనలు, సలహాలు చెప్పినా వినడు. తనను తాను తెలుసుకోగలిగేవాడే జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఏకోశానా అహంకారమే ఉండదు.
ఈ నాలుగు అంశాల్లోను బుద్ధి అంకుశంగా పనిచేస్తే అహంకారమే దరిచేరదు. పూర్వజన్మ సంస్కారాలు, సత్సాంగత్యం, సాత్వికాహార నియతి, వేదపురాణాధ్యయనంవల్ల బుద్ధి సక్రమమై మానవుణ్ని సక్రమమార్గంలో నడిపిస్తుంది. ప్రేమ, పరోపకార బుద్ధి, సహనం వంటి సద్గుణాలతో జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. సాత్వికాహంకారం ఆ వ్యక్తికే హాని కలిగిస్తుంది. తామసాహంకారం అతని చుట్టుపక్కల వారికి ద్రోహం చేస్తుంది. రాజసహంకారం దేశానికీ, మానవజాతికీ మహాప్రమాదకారి అవుతుంది. అహంకారం మనసులో నాటుకుందంటే ఎప్పటికైనా ఎవరికైనా అపకారకారకమే, అనర్థదాయకమే. ఆచరణకంటే ఆలోచన గొప్పది. ఆలోచన కంటే మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. అటువంటి బుద్ధిని గౌరవించి, అది చూపే మార్గదర్శకత్వాన్ని సమాదరించి, అనుసరిస్తే అహంకారమనే అగ్ని- వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ దహించదు.
అహంకారం వల్లనే రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకశ్యపుడు, విశ్వామిత్రుడు వంటివారెందరో పతనమై అపఖ్యాతి పాలైపోయారు. అహంకారంవల్ల విద్వేషం, విద్వేషంవల్ల క్రోధం, క్రోధంవల్ల విశృంఖలత్వం, విశృంఖలత్వంవల్ల వినాశనం సంభవిస్తాయి. ఇలాంటి పరిణామాలు సమాజశ్రేయస్కరం కావు. ఆధ్యాత్మిక పురోగతికి అహంకారం పెద్ద అవరోధం. ఒక్క మనిషిలో తప్ప ప్రకృతిలోని ఏ అణువూ అహంకారంతో లేదు. ఈ నిరహంకార పరోపకార లక్షణమే భారత ధార్మిక సువ్యవస్థకు పునాది. జాతి నవజీవన స్రవంతికి అది పరశువేది.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి