ᐅసహకారమూ సాధనే!
ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మోన్నతి అంతా సాధన మీదే ఆధారపడి ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఇంత ప్రాధాన్యం కలిగిన ఈ వ్యవహారం ఎంత సంక్లిష్టమై ఉండాలి? నిజమే. ఆధ్యాత్మిక ప్రపంచ పరిధికి ఆవల ఉన్నవారికి అర్థంకాని విషయం ఒకటుంది. అది... ఆధ్యాత్మిక సాధన ఎంత క్లిష్టమో అంత సులభతరం కూడా. ఎందుకంటే ఈ రంగంలో అత్యల్ప అంశమూ అనల్ప ఫలితాలనిచ్చే వెసులుబాటు ఉంటుంది. నిజానికి అర్థం చేసుకుంటే ప్రపంచంలోని ప్రతి పనిలోనూ ఆధ్యాత్మిక సాధన దాగి ఉంది. ఆసనం మీద కూర్చునే యోగం చేయనక్కర్లేదు. యజ్ఞగుండం ముందు కూర్చున్నవాడే యాజ్ఞికుడు కానక్కర్లేదు. ధర్మవ్యాధుడు ఏ సాధనా చేయలేదు. సక్కుబాయి యాగాలు నిర్వహించలేదు. వారు స్వధర్మాన్ని పాటిస్తూ ధర్మనిరతిని అనుసరించారు. అంతే. ఎందరో సాధకులు, మహాపురుషులు ప్రతి చిన్న పనినీ పూజగా భావించారు. యజ్ఞంలా నిర్వహించారు. ప్రతి మట్టికణాన్నీ మహేశ లింగంగా భావించారు. సేవించారు. ఈ క్రమంలో, ఈ సకల కర్మయోగంలో ఇతరుల సాధనకు సహకరించటం ఉత్తమోత్తమ సాధన.
ఔను. సాధకులకు సహకరించటం, వీలైతే సేవించటం... అదో గొప్ప సాధన. పరమపదాన్ని అందుకునేందుకు సొంత సాధన ఎంత ముఖ్యమో ఇతరుల సాధకులకు సహకరించటం, ఉపకరించటం అంతే ముఖ్యం. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఇందులో ఎంత పరమార్థం ఇమిడివుందో అందరికీ అర్థం కాదు. గృహస్థాశ్రమం అనేక ఇతర ధర్మ కార్యాలకంటే సాధు సత్పురుషులకు, సాధకులకు అవసరమైనవి సమకూర్చటం, వారిని సేవించటంలోనే అధికంగా పునీతమవుతోంది. సాధు సన్యాసుల సేవకు మనదేశం పెద్దపీట వేసింది. సాధక సహకారానికి ప్రథమ తాంబూలం ఇచ్చింది. ఈ సంప్రదాయం మన సంస్కృతికే తలమానికమై వెలుగొందుతోంది. సత్సంగాలకు, ఆశ్రమాల నిర్వహణకు భూరి విరాళాలివ్వటం ఇందులో భాగమే. అమర్‌నాథ్‌లాంటి పవిత్ర యాత్రల్లో యాత్రికులకు అడుగడుగునా ఉచితంగా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు భక్తిభావం గలవారు. ఇదంతా సాధకుల సేవ, సహకారం కలిగించే ఆత్మతృప్తి, ఆత్మ లబ్ధిమీద ఉన్న పవిత్ర అపేక్షే. హరిద్వార్, హృషికేశ్‌లలో ఎందరో మహాత్ములు తమ ఆశ్రమాల్లో నిర్వహించే దైవ కార్యక్రమాల్లో సాధకులకు అవసరమైన ఆహార ఔషధాది సరంజామా సమకూర్చటం ఒకటి. వారికి తగిన వసతి కల్పించటం, సాధనకు తగు ప్రదేశాలు ఎంపికచేసి సూచించటమూ జరుగుతుంది.
పూర్వం రాజులు ఆశ్రమాలను పోషించేవారు. రుషులు తమ పాలితులన్న భావంతోనో, బాధ్యతతోనో కాదు- ధర్మ నిరతితో. లోకకల్యాణ కారకమైన వారి యజ్ఞయాగాదులు సవ్యంగా జరగాలనే భక్తిపూర్వక శ్రద్ధతో. ఈ లోకంలో అత్యంత ధనికులు, రాజులు, చక్రవర్తులు కూడా తలవంచి నమస్కరించేది- దైవం తరవాత అలాంటి మహాత్ములకే. ఆ స్థాయికి వెళ్లబోయేవారే సాధకులు, భక్తులు. ఏ సాధకుడు ఏ మహాపురుషుడిగా పరిణమిస్తాడో ఎవరికెరుక! హనుమంతుడు 'రామభక్తుల భక్తుల, భక్తుల, భక్తుల పాదదాసుణ్ని నేను' అంటాడు. రాణీ రాసమణి, ఆమె అల్లుడు మధురబాబు పేదవాడైన రామకృష్ణ పరమహంసను భగవత్ సమానంగా ఆరాధించి ఆయనకు సకల సౌకర్యాలు సమకూర్చారు. తన చెంపమీద కొట్టిన రామకృష్ణులను రాసమణి చిరునవ్వుతో వీక్షించిన, ఉపేక్షించిన కారణం- ఆయన మహాభక్తుడు, గొప్ప సాధకుడు కావటమే. ఒక భార్య భర్త చేసే సాధనకు అన్ని వనరులూ అమర్చటంలో చూపే శ్రద్ధాసక్తులు ఆమెకు భర్త సాధనా ఫలంలో సగభాగాన్ని సమకూర్చిపెడుతుందంటారు. పతి సేవ సతి ధర్మమే అయినా ఆ పతి సాధకుడు అయినప్పుడు ఆ సేవకు మరింత పవిత్రత, సాఫల్యత సమకూరతాయి.
సాధకులకు సపర్యలు చేసే, సౌకర్యాలు సమకూర్చే సదవకాశాన్ని మనం వదులుకోకూడదు. ముఖ్యంగా వారిని పరిహసించటం, ఏ విధమైన అసౌకర్యాన్ని కలిగించటం అసలే చేయకూడదు.
- చక్కిలం విజయలక్ష్మి