ᐅక్రిస్మస్ కానుకలు




క్రిస్మస్ కానుకలు 

ఒక గ్రామం చుట్టూ ఉన్న కొండల్లో కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలను మందగా ఉంచి కాపలా కాస్తున్నారు. అది రాత్రి సమయం. అంతలో అకస్మాత్తుగా వారికి దివ్యంగా వెలుగుతున్న ఒక తార కనిపించింది. ఆ వెలుగు భరించలేక వారు తమ కకళ్లు మూసుకున్నారు. భయభ్రాంతులకు లోనయ్యారు. అంతలో వారికి ఒక స్వరం వినిపించింది. దేవదూత ప్రత్యక్షమైంది. 'భయపడకండి ఈ విశ్వంలోని ప్రజలకందరికీ ఒక శుభవర్తమానం. నేడు బెత్లహేములో మీ కొరకు ఒక రక్షకుడు జన్మించాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆ దైవకుమారుడు పశువుల శాలలోని ఒక తొట్టిలో నిద్రిస్తూ ఉండటం మీరు చూస్తారు... ఆ బాలయేసును మీరు దర్శించండి' అని చెప్పి ఆ దేవదూత అంతర్ధానమైంది. ఆ మాటలతో ఆశ్చర్యానుభూతికి లోనయిన ఆ గొర్రెల కాపరులు స్తోత్రగీతాలు ఆలపిస్తూ వెళ్లి ఆ బాలయేసును దర్శించారు. ఈ అద్భుత సంఘటన జరిగి దాదాపు రెండువేల సంవత్సరాలకు పైగా అయి ఉంటుందంటారు బైబిలు చరిత్రకారులు. ఈ ఘటనలో ఇమిడి ఉన్న పరమార్థం ఏమిటి?! ముందుగా యేసు జననం గురించి అమాయకులు, నిరక్షరాస్యులు అయిన ఆ గొర్రెల కాపరులకు దేవదూత ఆ వర్తమానం ఎందుకు అందజేసింది?ఈ ప్రశ్నలకు సమాధానం ఆయన ప్రవచనాల్లోనే దొరుకుతుంది. పేదలైనవారు ధన్యులు. దేవుని రాజ్యం వారిది. ఆకలిగొన్నవారు ధన్యులు, వారికి సంతృప్తి లభిస్తుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్పు పొందుతారు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చు గౌరవం పొందుతాడు. ఆయన ప్రవచించిన విధంగా దీనులకోసం, వ్యధాభరిత చీకటి జీవితాల్లోనివారికి వెలుగులు నింపడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకు ఇలాంటి నిదర్శనాలు, గాథలు బైబిలు లేఖనాల్లో మనకు కనిపిస్తాయి.
ఒకసారి ఒక భక్తుడు క్రీస్తును ప్రశ్నించాడు- 'ప్రభూ, నూతన జీవితాన్ని పొందడానికి నేను ఏమి చేయాలి?' అని. అందుకు క్రీస్తు ప్రభువు 'నీ పూర్ణహృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణశక్తితో దేవుణ్ని ఆరాధించాలి. నిన్నువలే నీ పొరుగువాణ్ని ప్రేమించాలి' అని చెప్పాడు. 'నా పొరుగువాడు ఎవరు?' అన్నాడా భక్తుడు. అందుకు క్రీస్తు ఒక కథ చెప్పాడు. ఒక యూదుడు వూరికి ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో దొంగలు తీవ్రంగా కొట్టి అతని వద్దనున్నవన్నీ దోచుకున్నారు. గాయపడిన ఆ వ్యక్తి సహాయం కోసం కేకలు వేశాడు. ఆ సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఆ ప్రాంతపు వ్యక్తి సహాయం చేయకుండానే వెళ్ళిపోయాడు. తదుపరి ఒక ధర్మశాస్త్ర ఉపన్యాసకుడూ ఆ ఆర్తనాదాలను లక్ష్యపెట్టకుండానే ముందుకు సాగాడు. మరికొంతసేపటికి ఒక విదేశీ బాటసారి- సహాయం అర్థిస్తున్న ఆ వ్యక్తికి ప్రథమ చికిత్స చేశాడు. పరిచర్యల నిమిత్తం వసతి గృహంలో చేర్పించాడు. అందుకయ్యే ఖర్చును చెల్లించాడు. అలా సేవలు చేసిన వ్యక్తి గాయపడిన యూదుడు ద్వేషించే ఒక సమరయుడు. ఈ కథ చెప్పిన యేసు 'ఇంతకూ... గాయపడిన ఆ యూదుడికి మంచి పొరుగువాడు ఎవరు?' అని ఆ భక్తుణ్ని ప్రశ్నించాడు. 'అతనికి సేవచేసిన ఆ సమరయుడే మంచి పొరుగువాడు' అని సమాధానం ఇచ్చాడా భక్తుడు. 'నీవూ అలాగే ఉండు' అని ఆ భక్తుడికి ఉపదేశం చేశాడు క్రీస్తు.

'మీరు సంపదలు సమకూర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. వాటిని ఎవరైనా దోచుకోవచ్చు. ధర్మమార్గాన జీవించండి. దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. ద్వేషభావాన్ని విడనాడండి. ఇతరులు మీపట్ల చేసిన తప్పులను సరిదిద్దండి. అప్పుడు దేవుడు మీ తప్పులను క్షమిస్తాడు. ఇది క్రీస్తు సమస్త మానవాళికి అందించిన దివ్యమైన ఉపదేశం. తాను చెప్పినదాన్నే ఆచరిస్తూ క్రీస్తు ప్రభువు సమస్త లోకవాసులకు రక్షకుడయ్యాడు. ఆయన జన్మించిన క్రిస్మస్ రోజు మానవాళికి మహోదయం. సకల జనులకు శుభోదయం. 'క్రిస్మస్' అనే పదానికి అర్థం- 'ఇవ్వడం'. క్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆయనను దర్శించడానికి వచ్చిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఆ బాలయేసుకు బంగారం, బోళం, పరిమళ సాంబ్రాణి కానుకలుగా సమర్పించారు. బంగారం పవిత్రమైన ప్రేమకు, బోళం కరుణకు, పరిమళ సాంబ్రాణి సేవానిరతికి సాదృశ్యాలుగా ఆధ్యాత్మికవాదులు పేర్కొంటారు. క్రీస్తు అందరిపై చూపిన ప్రేమ, కరుణ, సేవానిరతి అనేవి మూడు బహుమానాలుగా క్రిస్మస్ పండుగ అందరికీ అందించే దివ్యమైన కానుకలుగా మనం అర్థం చేసుకోవాలి.

- డాక్టర్ ఎమ్.సుగుణరావు