---------------------------
సంక్రాంతకులు
---------------------------
ప్రకృతిలో పరమేశ్వర కారుణ్య స్వరూపాన్ని చూడగలిగినవాడే ధన్యుడు. అలాంటి ధన్యతనిచ్చే సంస్కారాలు భారతీయుల పండుగల్లో ప్రత్యక్షమవుతాయి.
ప్రకృతి పరిణామాల్లో ఉండే దివ్యశక్తిని తెలుసుకొని, ఆ శక్తి మనలో నింపుకొనేలా పర్వదినాలను ఏర్పరచారు మహర్షులు. అలాంటి పర్వమే సంక్రమణం.
'ఈ ద్వావా పృథువులు (ఆకాశం, భూమి) మీకు సాఫల్యమొసగుగాక! ఇవి తండ్రీ తల్లులవంటివి...' అని ఒక వేదమంత్ర భావం.
భూమిని తల్లిగాను, ఆకాశాన్ని తండ్రిగాను మన ఆర్షసంస్కృతి సంభావించింది. మనల్ని తల్లిలా భరించి పోషిస్తున్నది భూమాత. ఈ తల్లికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, సఫలతను చేకూర్చుతున్నది ఆకాశం.
నింగి నుంచి కురిసే వర్షాదులు, జ్యోతిర్మండలాల కాంతీ, ఆకాశరాజైన సూర్యభగవానుని ప్రాణశక్తి భూమి గ్రహిస్తున్నది. భూవాసులు పోషణ పొందుతున్నారు. అందుకే గగనాన్ని తండ్రి భావంతో దర్శించారు.
ఎన్ని సౌరకుటుంబాలు ఉన్నా మన భూమికి సంబంధించిన సూర్యుడే మనకు ఆకాశరాజు. అందునా గగనంనుంచి సూర్య, మేఘాదుల శక్తులను వేర్వేరు కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒకే భూమిపై జీవరాశి రకరకాలుగా పొందుతోంది. ఆయా దేశకాలాల్లో ఉన్నవారిని అనుసరించి విభిన్న ప్రాంతాల్లో పలు పర్వాలు ప్రసిద్ధిచెందుతాయి. భారతదేశంలో అనేక పర్వాలు అన్ని ప్రాంతాలవారికీ సర్వసాధారణమే అయినా, వాటిని జరుపుకొనే రీతుల్లో భిన్న ధోరణులు కనిపిస్తాయి.
సమస్త ధార్మిక గ్రంథాల్లోను సంక్రాంతకులకు ఉత్కృష్ట స్థానం ఇచ్చారు. అందునా ఉత్తరాయణారంభ సంక్రాంతి అయిన 'మకరసంక్రాంతి'కి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యముంది. ఈరోజున స్నాన, దాన, జపతపాలకు ప్రాముఖ్యం. అందుకే గంగ మొదలుకొని కావేరి వరకు భారతీయ నదీతీరవాసులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఆ తీరాల్లో పితరులకు తర్పణాదులు సమర్పిస్తారు. దాన, అనుష్ఠానాదులు చేస్తారు. పంటఫలాలను 'భోగి'ంచే పర్వం సంక్రమణాన్ని స్వాగతిస్తుంది.
దక్షిణాపథంలో సూర్య(కాంతి)గమన పరిణామం మాత్రమే కాక, భూమి పండుగగా ఆచరించడమూ కనిపిస్తుంది. భూమాత దయవల్ల, కాంతి వర్షాదుల అనుకూలతవల్ల పంటలు పండాయని భావించి- వారి పట్ల కృతజ్ఞతతో సూర్యారాధన, ఇతర దేవతారాధన చేయడం ప్రధానం.
మన కృషితో మనం వ్యవసాయఫలాన్ని పొందగలం. నిజమే కానీ ఆ కృషి ఫలించేలా దైవం అనుకూలించాలి. అనుకూలించిన దైవానికి కృతజ్ఞతాపూర్వక భక్తిభావాన్ని ప్రకటించాలి. ఆ సంస్కారం ఈ పండుగలో కనిపిస్తుంది.
దేవతల్నీ పితృదేవతల్నీ ఆరాధించిన తరవాత, సాటి మానవులతో పంచుకొని ఆనందించే పర్వంగా సంక్రమణ కాలం గడుస్తుంది. దానాలు, వేడుకలు మొదలైనవి ప్రతి పల్లెలో తారసిల్లుతాయి. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో వ్యవసాయరంగానికి ఉన్న ప్రత్యేకత, పవిత్రత ఈ పండుగలో స్పష్టమవుతాయి. రైతుకీ, వ్యవసాయానికీ దేశం ప్రాధాన్యమివ్వాలి... అని మన పూర్వగ్రంథాలు నొక్కి చెప్పాయి. ఎంత పారిశ్రామిక ప్రగతి అయినా- ఆహార సమృద్ధి ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రాకృతిక పద్ధతుల్లో సాగిన భారతీయ వ్యవసాయ విధానంలోని గొప్పతనాన్ని ఇప్పుడే ప్రపంచం గుర్తించి అనుసరిస్తోంది.
సేంద్రీయ ఎరువుల వాడకం, పశుసంపద సాయంతో వ్యవసాయం వంటి శ్రేష్ఠమైన పద్ధతులు భారతీయులవి. అందువల్లే- ఈ సౌరపర్వంలో పశువుల్నీ పూజించడం కనబడుతుంది. తమ కృషిలో భాగస్వాములైన పశువులపట్లా కృతజ్ఞతా భావాన్ని ప్రకటించే భారతీయ సంస్కారానికి జోహారులు. శ్రమజీవుల పండుగగా ప్రశంసించదగిన ఈ మహాపర్వంలో సమాజంలో అందరితో పంటఫలాలను పంచి, పరవశించడం ప్రత్యేకత.
ధనుర్మాసంలో సందడిగా, సౌందర్యంగా రంగవల్లులతో, గొబ్బెమ్మలతో పౌష్యలక్ష్మీకళలు ఉట్టిపడే తెలుగువాకిళ్లు, మకర సంక్రమణంతో ఐశ్వర్యాలను ఆహ్వానించి ప్రతిష్ఠచేస్తాయి. పనిచేసే బసవయ్య కూడా అలంకారాలతో హారతులందుకుంటుంటే, మరో ఆబోతు గంగిరెద్దుగా ఈశ్వరవాహనాన్ని తలపింపజేస్తుంది. గోవుమాలక్ష్ములు కోటి దండాలందుకుంటాయి.
కొత్త బియ్యం ఆవుపాలతో ఉడికి పాయసమై, సూర్యదేవునికి నివేదనయై, మనకు 'పొంగలి' ప్రసాదమవుతుంది. పంటతో మొదటిసారి వండి ఆదిత్యునికి నివేదించే ఈ భక్తిభావన- నింగినీ నేలనీ ఆత్మీయంగా అనుబంధించే ఉదాత్త సంస్కృతి. పల్లెబతుకులోని సహవాస సౌందర్యానికి సాకారమైన సంక్రాంతినాటి రీతిలో సాగినప్పుడు, దివీభువీ మనకు అనుకూలించి సాఫల్యాన్ని ఇచ్చి తీరుతుందనడంలో సందేహముంటుందా!
- సామవేదం షణ్ముఖశర్మ