ᐅజీవుడే దేవుడు



అహం బ్రహ్మాస్మి

"దేహమే దేవాలయం జీవుడే దేవుడు" అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే.

"జ్ఞాన హీనః పశుభిస్సమానః" అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి విచక్షణాజ్ఞానం లేని పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము

(1) "అహం బ్రహ్మాస్మి" = నేనే పరబ్రహ్మమును

(2) "అయమాత్మాబ్రహ్మ" = నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు

(3) "ప్రజ్ఞానం బ్రహ్మ" = విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ

(4) "తత్వమసి" = ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.

పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా "సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా" మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు 'సుఖం ' లేదు 'శాంతి ' లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం. అంటే మన నుండి ఉద్భవించిన సుఖం. జ్ఞానం మనం మరచిపోయినందువల్లనే ఒక్క మానవ జీవితానికే ఇంత బాధ్యత తద్వారా ఇన్ని అనర్ధాలు, బాధలు, దుఃఖాలు, భయాలు కలుగుతున్నాయి. ఇది అనుభూతిలోకి రావడానికి వేదవాక్యముపై విశ్వాసముంచి తద్వారా ఆ ఆత్మభూతస్థితిలో ఉండుటే  మార్గము.