ᐅఅసలైన విజయం
జీవితంలో విజయం సాధించటం అంటే అంతులేని ధనరాశులు కూడబెట్టడం, విలాసవంతమైన భవనాలు నిర్మించడమని భావిస్తారు. అవి అవసరమే కాని, వాటిని మాత్రమే సాధించడం ఘనవిజయంగా భావించడం సముచితం కాదు. మరి కొందరు, బహుశా కొద్దిమంది- చిత్రకళలు, సంగీతం, నాట్యం వంటి నిర్ణీత క్షేత్రాల్లో శ్రమించి జీవితాలను అందంగా తీర్చిదిద్దుకొంటారు. ఇవి మనసుకు అఖండ సంతృప్తి కలిగించే అపూర్వ విజయాలు. జీవితం ఏ కోణంలోనుంచి చూసినా పరిపూర్ణత్వపు మాధుర్యంగా పల్లవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సాఫల్య మకుటం. సాధారణంగా ఎన్ని ఐహిక సంపదలున్నా ఆ ఆనందంతో సరితూగలేవు.
అటువంటివారి దృష్టిలో ధనం ఒక లక్ష్యసాధనకు ఉపకరణం మాత్రమే. ధనమే ధ్యేయం కాదు. మన శరీరంలోని కాలు, చెయ్యిలాగా ధనం కూడా పనిచెయ్యాలి. లేకపోతే అది తలకు మించిన భారం అవుతుంది. మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారి తీయవచ్చు. ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే ఉంటారు. చాలినంత సంపాదనతో జీవించేవారు మరింత తృప్తిగా రోజులు గడుపుతారు. శాంతి, సామరస్య, సౌజన్యతే వారి పొదుపు. ప్రేమానురాగాలే వారి బ్యాంకు ఖాతా.
ఆర్థికస్థితి మెరుగుపడిన కొద్దీ సుఖసంతోషాలు పెరుగుతాయని భరోసా లేదు. భద్రత అన్నది ఎండమావి. డబ్బువల్ల హంసతూలికా తల్పం కొనవచ్చు. కాని, నిద్రను కొనలేం. పుస్తకాలు కొనవచ్చు. కాని, ప్రజ్ఞాప్రాభవం బజార్లో దొరికే వస్తువు కాదు. ఆహారం కోకొల్లలుగా కొనవచ్చు. కాని, ఆకలిని కొనలేం. అందమైన వస్తువులు ఎన్నైనా కొనవచ్చు. కాని 'సౌందర్యం' ధనరాశులకు అందదు. ఎన్నో అంతస్తుల మేడ కొనవచ్చు, 'శాంతిధామాన్ని' కొనలేం. మందులు కొనగలుగుతారు. ఆరోగ్యం కొనలేరు. విలాసవస్తువులను కొనవచ్చు. సంస్కారం, సంస్కృతి అంగట్లో దొరకవు. మనిషి కేవలం ఆహారం తిని మాత్రమే బతకలేడు. అతనికి నలుగురి సానుభూతి కావాలి. సువిశాలమైన అనంత ప్రపంచంలోని మహోత్కృష్ట కాంతివైపు తలుపులు మూసివేసి, వెలుగు అనుకుంటున్న చీకటి నిశ్శబ్దంలో తనను బంధించుకున్న వ్యక్తి నిజమైన ఆనంద సముద్రాలను ఏనాటికీ చూడలేడు. జీవితాన్ని అలౌకిక విజయంగా భావించి, ఆదర్శ శిఖరాల్లో ఆశయదీప్తితో జీవించడానికి మించిన సౌభాగ్యం లేదు.
ఆనందమే చిట్టచివరి భవితవ్య తీరం కాదు. అదొక నిరంతర మహా ప్రయాణం. పరమాద్భుతమైన కాంతిపుంజాలు, కాంచన ద్వీపాల వైపు ఆ యాత్ర సాగుతుంది. ఆ ఆనంద స్వర్గాలు, విజ్ఞాన భూమికలు, పరిపూర్ణత్వం నిజంగా ఉన్నాయా? అవి మనిషి అందుకోగలడా అని చాలామంది సందేహం. అటు ఆరోహించడం సాధ్యం కాదు అనేవారున్నారు. ప్రాచీన క్రాంతదర్శులు వాటిని సిద్ధింపజేసుకున్నట్లు వారు మానవాళికి వదిలివెళ్లిన ప్రవచనాలే సాక్ష్యం... ఆధునిక కాలంలో జన్మించిన ఆత్మజ్ఞాన సంపన్నులూ చెబుతున్నారు. మృగప్రాయమైన మన జీవితం జయించలేని ఔన్నత్యాల్లో అంతులేని ఆనందాలు, తేజోమయ ప్రజ్ఞాన మహార్ణవాలు, అనంత శాంతిసీమలు మన ఆవిష్కరణకై నిరీక్షిస్తున్నాయి. క్షణంపాటు మెరిసే మెరుపును చూసినట్లు ఆ అంతర్నిక్షిప్త రత్నరాశులను ఒక్కసారి వీక్షిస్తే చాలు- వాటిని పూర్తిగా కైవసం చేసుకునేవరకు మానవాళి నిద్రించదు. వారు జీవితంలోని సర్వస్వాన్నీ త్యజించి వాటికై పరుగులు తీస్తారు. వాటికి మార్గం బాగా సన్నది. తలుపులు తెరవటం అంత తేలికకాదు. భయం, అవిశ్వాసం, సందేహం అనే చీకటి రాజభటులు కాపలాకాస్తూ మనల్ని ఆ రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వరు.
చర్విత చర్వణమై విసుగు పుట్టించే జీవన నిరామయ, నిరాసక్త, కల్లోలిత జలధి తరంగాల నుంచి, అజ్ఞాన తమస్సు నుంచి విముక్తమయ్యే మనసుకు సమావిష్కృతమయ్యే బంగారు ఉషోదయాలు అవి. యుగయుగాలుగా జన్మజన్మలుగా సాగే భువన జీవన రూపకానికి సరికొత్త భాష్యం చెప్పే అంతిమ కిరణం అక్కడే దాగి ఉంది. వాటిని సాధించడమే అసలైన విజయం!
- కె. యజ్ఞన్న