ᐅలోభి నీతి
లోభం అంటే పిసినారితనం. అది ఉన్నవాడు లోభి. లోభాన్ని, లోభులను గురించి పెద్దలు చాలా విషయాలే చెప్పారు. 'లోభివాని నడుగ లాభంబు లేదయా' అంటాడు వేమన. లోభికి దానభోగాలు శత్రువులు. అందుకే వాటి జోలికి వాళ్లు పోనేపోరు. పుణ్యం రాకపోతే రాకపోనీ. సుఖం లేకపోతే లేకపోనీ. ఒక్క రూపాయి కూడా చేజారిపోకూడదు. ఇదే లోభినీతి. లోభి గురించి పూర్వం ఒక కవి ఏమన్నాడో తెలుసా?- 'లోభి వంటి దాత లోకంలో లేడు, ఉండబోడు. ఎందుకంటారా? అతడు తన సంపదలను చేతితో ముట్టకుండానే చివరికి ఇతరులకు చెందేటట్లు చేస్తాడు'. ఈ మాట పరమసత్యమే కదా!
భర్తృహరి అందుకే అన్నాడు- ఆర్జించిన ధనానికి దానం, భోగం, నాశం అనే మూడు మార్గాలే ఉన్నాయని. తాము సంపాదించిన డబ్బును ఎవరు దానధర్మాలు చేసి ఖర్చుపెట్టరో, ఎవరు ఆ డబ్బును సుఖాలకోసం వాడుకోరో, అలాంటివారి ధనానికి మూడో మార్గం అయిన నాశనం తప్పనే తప్పదని స్పష్టంగా చెప్పాడు. చలినుంచి, గాలినుంచి, ఎండనుంచి తన శరీరాన్ని కాపాడుకుంటున్న మనిషిని చూసి మృత్యువు పరిహాసంగా నవ్వుకొంటుందట. వీడు తన శరీరాన్ని ఎంతగా రక్షించుకున్నా చివరికి నన్ను చేరక తప్పదు అని. అలాగే డబ్బును పెట్టెల్లోపెట్టి దాచుకొనే లోభులను చూసి, భూదేవి పరిహాసంగా హసిస్తుందట. ఈ డబ్బు అంతా నాలో కలిసిపోవలసిందేకదా అని.
ధనాన్ని సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు. అహోరాత్రాలు కష్టపడాలి. బాధలను తట్టుకోవాలి. సహనంతో పనిచేయాలి. ఎంతో నేర్పు ప్రదర్శించాలి. ఇతరులను మెప్పించాలి. అప్పుడుగానీ ధనం రాదు. అలా సంపాదించుకొన్న డబ్బును శరీర రక్షణ కోసం, శరీర సంవర్ధనం కోసం, కుటుంబ సుఖంకోసం, భుక్తికోసం ఖర్చుచేస్తే సంపాదించిన డబ్బుకు సార్థకత ఏర్పడుతుంది. శరీర రక్షణను పట్టించుకోకుండా, తిండి సరిగా తినకుండా, మంచి బట్ట కట్టుకోకుండా, సుఖంగా నివసించకుండా కూడబెట్టిన సొమ్మువలన ఏం ప్రయోజనం ఉంటుంది? అలాంటి సొమ్ము మరణానంతరం ఇతరులకే ఉపయోగపడుతుందిగానీ సంపాదించినవాడికి ఎంతమాత్రం అక్కరకురాదు. అలాంటి ధనం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే.
చాతకపక్షి వర్షపు చినుకులు తాగి బతుకుతుంది. అలాంటి ఆ పక్షి ఎప్పడు మేఘాలు వస్తాయా, ఎప్పుడు వానపడుతుందా అని ఆకాశం వైపు చూస్తుంది. వర్షకాలంలో తప్ప ఇతర కాలాల్లో వచ్చే మేఘాలు వాన కురిపిస్తాయని కచ్చితంగా చెప్పలేం. శరత్కాలంలో వచ్చే మేఘాలు తెల్లగా, దూదిపింజల్లా ఉంటాయేగాని, ఒక్క వాన చినుకునూ రాల్చవు. అలాంటి శరత్కాలమేఘాన్ని చాతకపక్షీ నీటికోసం యాచించదంటాడు కాళిదాసమహాకవి రఘువంశ మహాకావ్యంలో. లోభి శరత్కాల మేఘంలాంటివాడు కనుక, అతణ్ని ఎంత కోరినా ఏ ప్రయోజనమూ ఉండదని భావం. లోభి వలన లోకానికి ఏ లాభమూ కలగదని పెద్దలమాటగా గుర్తుంచుకోవాలి.
ఔదార్యం అనేది దేవుడు ప్రసాదించే గొప్ప వరం. అది అందరిలోనూ ఉండాలని భగవంతుణ్ని ప్రార్థించాలి. ఆ సుగుణం పేదవానికి ఉంటే ఏం లాభం? ఇవ్వడానికి వాడికి ఏమీ ఉండదు. ఉన్నవాడికి ఔదార్యగుణం లేకుంటే ఏం లాభం? వాడు ఎవరికీ ఏదీ ఇవ్వడు. ధనవంతుడి ఔదార్యమే ఫలిస్తుంది గానీ, పేదవాడి ఔదార్యం ఫలించదు.
ధనం ఒక స్త్రీ వంటిది. దాన్ని చేపట్టినవాడు భర్త వంటివాడు కనుక, అనుభవించడం పురుషలక్షణం అవుతుంది. కానీ లోభి అయినవాడు తాను సంపాదించిన ధనాన్ని దానమూ చేయడు, తానూ అనుభవించడు కనుక- కేవలం చేతులతో తాకుతూ ఆనందించే నపుంసకుని వంటివాడేనని నీతికోవిదుల ఉపదేశం.
'బొచ్చె పట్టుకొని ఇంటింటికీ తిరిగి బిచ్చం అడుక్కునే బిచ్చగాళ్ళు లోకానికి ఏమని సందేశం ఇస్తున్నారో తెలుసా? బిచ్చం వేయకుంటే ఇలా బొచ్చె పట్టుకొనే గతి పడుతుందని'- ఒక కవి చమత్కారమది.
బిర్రబిగుసుకొన్న పిడికిలిపట్టుతో ఒరలో ఎప్పుడూ దాగిఉండే కత్తికీ, లోభికీ ఏ తేడాలేదనీ, అవి రెండూ కఠినమైనవే అనీ అంటాడొక కవి. 'లోభి, దాత ఇద్దరూ దారిద్య్రానికి భయపడతారట. దానం చేస్తూపోతే దరిద్రం రావచ్చునని లోభికి భయం. కనుక దానం చేయడు. దాత దానంచేసే అవకాశం ఎప్పుడూ ఇలాగే ఉండాలనీ, దరిద్రం ఎప్పుడూ రాకూడదనీ భయపడుతూ దానం చేస్తాడు' అని ప్రబోధిస్తాడొక నీతికారుడు. లోకంలో ధనానికి కొదవలేదు. ధనవంతులకూ కొరతలేదు. కానీ దానగుణానికి మాత్రమే ఎక్కడలేని కరవు ఏర్పడింది.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ