ᐅమహిమాన్విత మాఘం



మహిమాన్విత మాఘం 

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. మాఘం అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. యజ్ఞాలకు అధిష్ఠాన దైవం ఇంద్రుడు. ఇంద్రుడికి 'మఘవుడు' అనే పేరు కూడా ఉంది. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది. ఇది శిశిర రుతుమాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్తృతంగా కాచేవేళ. శూన్యమాసమైన పుష్యమాసం తరవాత వచ్చే కల్యాణకారకమాసం.
మాఘ స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశినిబట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని చెబుతున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ స్నాన విధులను మాఘపురాణం పేర్కొంటోంది. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది. మృకండముని, మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాకస్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.

మాఘమాసం ఎన్నో పర్వదినాలకు నెలవు. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పరిగణిస్తారు. ఈ రోజు సంపదల సమృద్ధికోసం లక్ష్మీదేవిని పూజిస్తారు. రతీమన్మథులను పూజించే మహోత్సవంగా ఈ పంచమిని కొందరు పండితులు పేర్కొన్నారు. మాఘశుద్ధ సప్తమి రథసప్తమి. జగత్తుకు చైతన్యదీప్తి అయిన కర్మసాక్షి సూర్యభగవానుడికి కృతజ్ఞతాభివందనాలు అందించే పుణ్యతిథి.

మాఘశుద్ధ అష్టమినాడు భారతవీరుడు భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజు భీష్మాష్టమి. ఆ తరవాత వచ్చే ఏకాదశిని భీష్మైకాదశి అంటారు. భీష్మ పంచకవ్రతం ఆచరిస్తారు. ఈ ఏకాదశిని కామదైకాదశి అనీ వ్యవహరిస్తారు. చిమ్మిలితో చేసిన గోవు ప్రతిమను దానం చేయడం ప్రశస్తంగా భావిస్తారు. మాఘశుద్ధ పూర్ణిమను 'మహామాఘి' అంటారు. ఆ రోజున సింధునదీ స్నానం పరమ పవిత్రమని సనాతన విశ్వాసం. మాఘ బహుళ ఏకాదశి జయైకాదశి శ్రీరాముడు లంకా ప్రవేశానికి సముద్రంపై సేతువు నిర్మాణం ఆరంభించిన దినమని భావన. ఆ రోజు పాదరక్షల దానం ప్రశస్తమైనదని ఒక నమ్మకం.

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి లింగోద్భవ వేళ. శివరాత్రి మర్నాడు నదీ, సముద్ర స్నానాలు ప్రసిద్ధం. పవిత్ర స్నానాలకూ, భగవచ్ఛింతనకూ నెలవైన విశిష్ట మాసం మాఘం.

- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు