ᐅమనోశిల్పం




మనోశిల్పం 

మనం నిత్యజీవితంలో అనుక్షణం ఏదో ఒక పనిచేస్తూనే ఉంటాం. చివరకు ధ్యానం, నిద్రలాంటిదైనా సరే... ఏదో పని. చేసే పని ఏదైనా ఆ పనికి తగిన, అనుకూలమైన మానసికస్థితిని కలిగి ఉండటమనేది- ఆ పనిలో విజయం సాధించేందుకు ప్రాథమిక అర్హత. ఒక్కోసారి అదే, ప్రధాన అర్హతా అవుతుంది. అనుకూలమైన స్థితి అంటే? ఆ పనే ధ్యేయమైన స్థితి. మరో పనిపట్ల తొందర, ఆలోచన, అవసరం లేని స్థితి. ఆ పనిపట్ల ఇష్టం, ఉత్సాహం, సాధించాలనే ధ్యేయం...! ఉదాహరణకు నిద్ర. సరైన పడక, పరిసరాలు ఉండి, అత్యవసరంగా చేయవలసిన పని లేని పరిస్థితి కలిగి, మనసు శరీరం నిద్రనే కోరుకునే స్థితి. మంచి పడక, పరిసరాలు ఉన్నా మనసు అనుకూలంగా లేకపోతే నిద్ర సుదూరమే.
మనం తెలివిగలవారమైనా, సమర్థులమైనా- చేసే పనిపట్ల తగిన మానసిక ఆనుకూల్యత లేకపోతే మనలోని మిగిలిన నైపుణ్యాలన్నీ వృథా అయిపోతాయి. కనీసం అర్ధ నైపుణ్యస్థితిలో మిగిలిపోతాయి. పూర్తిస్థాయిలో వాడుకోవటంలో విఫలమైపోతాయి. ఏ పనికైనా శారీరక నిపుణతకంటే, బలం కంటే, పరిసరాలు-పరికరాలకంటే మానసిక సంసిద్ధతే పూర్తిస్థాయి విజయాన్ని సాధించే క్రమంలో ముందుంటుంది. శారీరక శక్తిమీద, ప్రేరణ మీద మనసుకంటే, మనోశక్తిమీద, దాని ప్రేరణమీద శరీరం ఎక్కువగా ఆధారపడుతుంది. మనసు 'సై' అంటే శరీరం కొత్త శక్తి పుంజుకుంటుంది. ద్విగుణీకృతోత్సాహాన్ని సంతరించుకుంటుంది. మనసుకంగీకారమైతే శరీరం యథాలాపంగా దానివెంటే ఉంటుంది. మనో-దేహాలు ఏకమై సాగితే విజయం నీదే!

మనం చేయాలనుకున్న లేదా చేయవలసివున్న పనిపట్ల మనసు నిరాసక్తంగానో, అస్థిరంగానో ఉంటే- బలిమినో, చెలిమినో దానికి ఆ పని పట్ల ఉత్సాహాన్ని కలిగించాలి. ఇష్టాన్ని పెంచాలి. ఏకాగ్రమయ్యే దిశగా పురిగొల్పాలి. అన్ని మానసిక కోణాలూ ఏకోన్ముఖమయ్యేలా దారి మళ్ళించాలి. మనసు మనది. దాన్ని మలచుకునే బాధ్యతా మనదే. అందుకోసం బుద్ధి శక్తిని మేల్కొల్పాలి. ఉత్సాహాన్ని రగుల్కొల్పాలి.

మనం ధ్యానం చేయాలనుకుంటాం. మనసు ధ్యానం చేయాలని ఇష్టపడాలి. ఆ సమయంలో సినిమాకో, మరోదానికో వెళ్లాలనే ఇష్టాన్ని తోసిరాజనాలి. అది మరో తొందరపని లేని ఖాళీ సమయమై ఉండాలి. ధ్యానంపట్ల గౌరవం, అనుకూలధోరణి, సానుకూల దృక్పథం, దాన్నించి లభించే ప్రయోజనం పట్ల అవగాహన, ఆశ... ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా ధ్యాన ప్రక్రియపట్ల కొంతైనా జ్ఞానం ఉండాలి. అప్పుడే మనం ధ్యానానికై ఆసనం మీద కూర్చోగానే, తొందరగా క్రమపద్ధతిలో ధ్యాన నిమగ్నులమవుతాం.

కేవలం ధ్యానమే కాదు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక విషయాలేవైనా సరే- మనో ఆనుకూల్యత కలిగి ఉన్నట్లయితే... సగం విజయం సాధించినట్లే. ఆధ్యాత్మికంగా ఈ అంశం మరింతగా వర్తిస్తుంది. దైవాన్ని పూజించాలన్నా, అర్చించాలన్నా, ఆరాధించాలన్నా పరిసరాలు, శారీరక స్థితులు, ఆహార నియమాలు, పూజావిధులు... ఒకటేమిటి అన్నీ... మనసును ఆయత్తపరచే దిశగా తోడ్పడేలా ఏర్పాటుచేసుకోవాలి. ఈ విధివిధానాలతో మనసు ఆముఖమై, ఆ ధ్యేయ వస్తులబ్ధికై పూర్తిస్థాయిలో, పూర్తి తయారీతో ప్రయత్నం ప్రారంభిస్తుంది. మనసును ఆయత్తపరచే దిశలో ధ్యేయ వస్తు సంస్కారాలనూ, సంస్కృతినీ కూడా తన మీదికి ఆపాదించుకుని, ఆవాహన చేసుకుని అదే తానై, తానే అదై, తత్వమసి స్థాయిలో మనసును విలీనం చేయగలిగిన స్థితిలో మాత్రమే- అర్చనకు, ఆరాధనకు అర్హత లభిస్తుందని శాస్త్రం సూచిస్తోంది. ఆచరించమని సలహా ఇస్తుంది. రుద్రుడిగా మారనిదే రుద్రార్చనకు అర్హత లభించడమంటే ఇదే. ఏ ఉపాయంతోనైనా సరే- చేసే పనిపట్ల మనసును పూర్తిస్థాయిలో లగ్నం చేయాలన్నదే భావం. ఆ పనిలో లేదా ఆ ధ్యేయ వస్తువులో లయమయ్యేందుకు అణువణువూ ఆయత్త స్థితిలో ఉండాలని అర్థం. ఈ పరిస్థితే, ఈ మానసిక స్థితే, ఏ పనిలోనైనా, పని ప్రారంభించకముందే సగం పని చేసిపెడుతుంది.

మనసు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, ఉదాత్త స్థాయిలో ఆలోచించగలిగినప్పుడు- ఉత్తమ కార్యాలకై సన్నద్ధ స్థితిలోకి మలచుకునే వీలుకలుగుతుంది. అందువల్ల మనసును అనవరతం పవిత్రమైన, పరిమళవంతమైన ప్రమాణాలతో విరాజిల్లేలా మనం కృషిచేయాలి. దాని నుంచి పూర్తిస్థాయి నైపుణ్యాలను, ప్రయోజనాలను రాబట్టుకోవాలి. ఔను. మనోశిల్పాన్ని మలచుకోవాలి... అందంగా, కళాత్మకంగా.

- చక్కిలం విజయలక్ష్మి