ᐅవేదన-నివేదన
మనిషి జగన్నాటకంలో లీనమై, తన పాత్రలోనే నిమగ్నుడై కొట్టుమిట్టాడుతున్నంత కాలం వేదనలనుంచి తప్పించుకోలేడు. సున్నిత మనస్కుడు ప్రతి చిన్న విషయానికీ అతిగా వేదన చెందుతుంటాడు. భగవంతుడు ప్రతి మానవుడికీ జ్ఞానమనే అమూల్యమైన మణిని అనుగ్రహించాడు. దాన్ని సరిగా వినియోగించుకోగలిగితే అదే చింతామణి! మరింత సద్వినియోగపరచుకోగలిగితే అది జ్ఞానచింతామణిగా పరివర్తన చెందుతుంది.
జ్ఞానశూన్యత అంటే ఆధ్యాత్మిక అవగాహన లోపంగా అర్థం చేసుకోవాలి. ఆత్మజ్ఞానమే అసలు జ్ఞానం. భగవంతుడు మనకు జ్ఞానమణిని ప్రసాదించింది, ఆ వెలుగులో ఆత్మను వెతికి పట్టుకునేందుకే! దానికి బదులు మనుషులు ప్రాపంచిక ఆధిక్యతలకు, గౌరవ మర్యాదలకు, ఆస్తిపాస్తుల అక్రమార్జనకు తమ జ్ఞానాన్ని దుర్వినియోగపరచుకుంటున్నారు.
జ్ఞానం ప్రదర్శించేది కాదు. సహజంగా వెలుగులీనుతూ ఉంటుంది. తనను మహాజ్ఞానిగా భావిస్తూ, లోకం ప్రత్యేకంగా గుర్తించాలని తహతహ చెందేవాడు జ్ఞాని కానేకాడు. కొద్దో గొప్పో ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నంతమాత్రాన- ఆత్మానందానుభూతి కలిగి ఉన్నాడని చెప్పలేం. అంతో ఇంతో ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించి ఎంతో జనరంజకంగా బోధలు చేసేవాళ్లు, స్వయంగా ఆ బోధల్ని ఆచరించకపోవడం- కమ్మని వంటకాలను వండటానికి ఉపయోగించే పాత్రకు దాని రుచి తెలియకపోవడం లాంటిదే. కొందరికి ఆధ్యాత్మిక అహంకారం ఉంటుంది. అది ఆత్మవినాశ హేతువు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానిలో అహంకారం ఆవగింజంతైనా ఉండదు. సహజమైన వినయంతో అందరి మన్ననలు పొందగలుగుతాడు. కొందరు వినయం నటిస్తారు. దీనివల్ల తమకు తామే అపకారం చేసుకుంటారు. ఎందుకంటే, వారి వినయాన్ని ఎవరూ విశ్వసించరు.
వేదన కలిగినప్పుడల్లా మనిషి తనను రక్షింపమని భగవంతుడికి నివేదించుకుంటూనే జీవితాన్ని గడిపేస్తాడు. చివరకు ఆ జీవితం అర్థరహితంగా ముగిసిపోతుంది. జీవితానికి అర్థం, పరమార్థం కలిగించగలవి ఆధ్యాత్మిక వేదన, భక్తి నివేదనలు మాత్రమే. భగవంతుని సాక్షాత్కారం కోసం రామకృష్ణ పరమహంస అనుక్షణం వేదన చెందేవాడు. మదర్ థెరెసా నిరంతర సేవలే తన భక్తి నివేదనలుగా జీవించి తరించింది.
ప్రాపంచిక వేదనలు విస్మరించి, పరమాత్మను అంతర్యామిలో ఆత్మ స్వరూపునిగా దర్శించుకునేందుకు ఉపయోగపడేదే ఆధ్యాత్మిక వేదన. జీవన కాలాన్ని సమాజసేవకు వినియోగించడమే దైవాన్ని ప్రసన్నం చేసే నివేదన.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్