----------------------------
గణేశాంతర్య పురాణ వివరణ
----------------------------
సనాతన ధర్మ ప్రకారం- సృష్టి స్థితి లయ కారణమైన ఏక చైతన్యాన్ని 'పరబ్రహ్మ' అనీ, 'పరమేశ్వరుడు' అనీ వ్యవహరిస్తారు. 'దేవతలు' అని బహువచనం వినబడుతుందిగానీ, 'ఈశ్వరులు' అనే బహువచనం లేదు. ఈశ్వరుడొక్కడే. ఆయన శక్తులే వివిధ దేవతలు. ఆ ఈశ్వరుని ఉపాసనా సంప్రదాయాలను అనుసరించి శివ, విష్ణు, శక్తి, గణేశ, సూర్య, స్కంద అనే ఆరు పద్ధతుల్లో ఆరాధిస్తారు. ఈ ఆరూ వేద సమ్మతమైనవి. ఈ షణ్మతాల్లో మళ్ళీ బహు ఉపశాఖలూ ఉన్నాయి. శాఖోపశాఖలుగా ఉన్న ఈ సంప్రదాయాలన్నీ ఏకేశ్వరుని ఉద్దేశించినవే.
గణేశ భావన సంపూర్ణ పరబ్రహ్మతత్వాన్ని ఆవిష్కరించే పరంపరను నెలకొల్పింది. విశ్వం, విశ్వేశ్వరుడు... ఈ రెండింటి అనుబంధాన్ని ఒకే పదంలో కలిపిన అద్భుత నామం, గణేశ. ఇదే 'గణపతి' అనే వ్యవహారం కూడా. అనేకంగా కనిపించే విశ్వం 'గణం' వీటన్నింటా వ్యాపించి నియమించే ఈశ్వరుడు 'గణేశుడు'. విశ్వమంతా వ్యాపించి శాసించే సర్వశక్తిమంతుడే 'గణపతి'. లోకాన్ని నియమబద్ధంగా నడిపించే 'నేత' వినాయకుడు.
గణపతి ఆరాధనలో బహు పద్ధతులున్నాయి.
నిర్గుణ నిరాకారతత్వంగా వేదాంతానుసారం జ్ఞానపరంగా వర్ణించిన విధానాలున్నాయి. ప్రతి కార్యారంభంలో పసుపు ముద్దలో గణపతిని భావించే సంప్రదాయంలో ఆంతర్యం ఈ జ్ఞాన భావనే. లక్ష్మీగణపతి, బాలగణపతి, విద్యాగణపతి, హేరంబగణపతి, క్షిప్రగణపతి, ఉచ్చిష్టగణపతి, శక్తిగణపతి, విరిగణపతి... ఇలా పలు విధాల గణపతి మంత్రాలు, రూపాలు ఆగమ శాస్త్రాల్లో ఆవిష్కృతాలు. వీటి ఉపాసనా ఫలాలూ అద్భుతమని శాస్త్రాలు సప్రమాణంగా చాటుతున్నాయి.
గణేశ... శబ్దంలోని మూడక్షరాలు ఓంకారంలో, మూడక్షరాలకు (అ, ఉ, మ) మరో రూపమని పురాణ వివరణ. బ్రహ్మ విష్ణురుద్రాత్మకంగా సృష్టిస్థితిలయలనే మూడు పనులను, సత్వరజస్తమో (త్రి) గుణాలను నియంత్రిస్తూ నడిపించే పరమాత్మగా 'గణేశ' నామభావాన్ని శాస్త్రం వివరించింది. త్రిగుణాలతో కూడిన దేవ, అసుర, మానుష్య, తిర్యక్ (పశుపక్ష్యాదులు) అనే గణాలే ఈ విశ్వం. అందుకే 'గణేశు'నకు 'గుణేశ' అనే నామమూ ఉంది.
గణేశుడు తన భక్తుడైన వరేణ్యుడికి 'గీత'ను ఉపదేశించిన ఘట్టాన్ని 'గణేశపురాణం' అందిస్తోంది. ప్రసిద్ధి చెందిన 'భగవద్గీత' లాగానే కర్మజ్ఞాన, ఉపాసనామార్గాలను బోధిస్తున్న ఈ గీత- మన ధార్మిక గ్రంథాలన్నింటిలోనూ ఒకే ఆంతర్యంఉందని స్పష్టం చేస్తోంది.
'గణేశగీత' పదకొండు అధ్యాయాల గ్రంథం. ఎన్నో విశ్వజనీన జ్ఞానాంశాలను ఒక ఆచార్యుడిగా గణపతి బోధించిన రీతి అద్భుతం. ఇందులో గణపతి విశ్వరూప ప్రదర్శనా ఒక గొప్ప విజ్ఞానం.
* యోగం- అంటే లౌకిక సుఖాలను, భోగాలను, సంపదలను సాధించడం కాదు. అలాగే పరలోక సుఖాలను అనుభవించడమూ కాదు. దేనివల్ల లౌకిక విషయలాలస దూరమవుతుందో, సంసార తాపత్రయం తొలగుతుందో- అదే యోగం.
* ఇంద్రియాలను జయించి, దయ కలిగిన హృదయంతో జగతిని పవిత్రం చేసేవారు యోగులు. వారు తమలోనే ఉన్న నన్ను (పరమాత్మను) అభిన్నంగా దర్శిస్తారు. వారు చిత్తస్వాధీనం, సమదృష్టి కలవారు.
* శివుడు, విష్ణువు శక్తి, సూర్యుడు, నేను (గణపతి)... ఒక్కటే అనే అభేద బుద్ధే యోగం. సర్వదేవతలు, లోకాలు నా స్వరూపాలే.
* సత్కర్మ వల్లనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. శుద్ధచిత్తంలో అభేదజ్ఞానం ఉదయిస్తుంది.
* అంతటా సమబుద్ధి కలిగి ఉండటమే అసలైన యోగం.
* కర్మను మానివేయడం కంటే, నిష్కామంగా చేసిన సత్కర్మను నాకు అర్పణంగా చేయడం శ్రేష్టం. నాకు అర్పణంగా చేసిన కర్మ బంధాన్ని కలిగించదు.
* మనిషి తప్పనిసరిగా సత్సాంగత్యానికై ప్రయత్నించాలి. సత్సంగం సుగుణ సంపదను పెంపొందించి, ఆపదలను దూరం చేస్తుంది.
* జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు లేదు. భక్తి, ఇంద్రియ నిగ్రహం, శ్రద్ధ కలవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు. జ్ఞానమే శీఘ్రంగా ముక్తినిస్తుంది. భక్తి, శ్రద్ధలేని 'సందిగ్ధచిత్తుడు' శుభాలను పొందలేడు.
* మనసు నిలకడకు, పాపనాశనానికి ప్రాణాయామం సహకారి.
* ఉపాసనా మార్గం గొప్ప సాధన. ఉపాసనాశక్తి లేనివాని జన్మ వ్యర్థం. భక్తి ఉపాసనకు శక్తి. అభ్యాసంతో నన్ను పొందడం సులభం.
* భక్తి లేనివాడే అధముడు. భక్తుడు ఏ జాతివాడైనా అతడే సర్వాధికుడు.
* వివిధ క్షేత్రాల్లో, వేర్వేరు సమయాల్లో భిన్న రూపాలుగా ఉన్న నన్ను శాస్త్రానుసారం ఆరాధించేవారికి ఇహపరాలు లభిస్తాయి. భాద్రపదశుక్ల చతుర్థినాడు, నాలుగు చేతులున్న నా(గణేశ) ప్రతిమను 'మట్టి'తో చేసి ఆరాధించేవాడు సర్వాభీష్టాలు పొందుతాడు...' ఇవి గణపతి గీతలోని వాక్యారత్నాల్లో కొన్ని.
పై చెప్పిన బోధనలను అనుసరించి సంస్కారాలను వృద్ధి చేసుకొనేవాడే గణపతి కృపకు పాత్రుడు.
- సామవేదం షణ్ముఖశర్మ