ᐅవికాస గురువు




---------------------------------------
శ్రీ రాముడు మన వికాస గురువు
---------------------------------------

సీతను వెతుక్కుంటూ బయల్దేరినప్పుడు... రాముడు, వెనకాలే లక్ష్మణుడు. ఇద్దరంటే ఇద్దరే! లంకాపురిపై దండెత్తే సమయానికి... ఆ ఇద్దరికి తోడుగా విభీషణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, ఆంజనేయుడు మొదలైన యోధానుయోధులు. ఆ వెనకాలే వేలమంది వానరవీరులు. రాముడు ఎవర్నీ మాటలతో ప్రలోభపెట్టలేదు. గెలిపిస్తే, పదవులిస్తాననో అధికారం కట్టబెడతాననో వూరించలేదు. వ్యక్తిత్వ సంపదతో, ధర్మాచరణతో, ప్రేమగుణంతో అంతమందిని ఆకట్టుకున్నాడు.

ఒక్కసారి రాముడిని చూసినవారు, ఒక్కసారి రాముడితో మాట్లాడినవారు... జీవితాంతం మరచిపోలేరు. ఆ దివ్యమోహన రూపం ఒక కారణం అయితే, ఆయన స్వభావం మరో కారణం. రాముడు స్మితపూర్వభాషి... ఏదైనా మాట్లాడటానికి ముందు చిరునవ్వు నవ్వేవాడట. పూర్వభాషి... తనే ముందుగా పలకరించేవాడట. మధురభాషి... చాలా మధురంగా మాట్లాడేవాడట! నిత్యం ప్రశాంతాత్మా... ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడట!

న చానృతకథః... అబద్ధాలంటే తెలియనివాడు. నిభృతః... చాలా అణకువ కలవాడు.

ఎదుటి వ్యక్తి అభిమానాన్ని పొందడానికి ఇంతకుమించిన అర్హతలేం ఉంటాయి? అందుకే, తొలి పరిచయంలోనే హనుమంతుడు వీరాభిమానిగా మారిపోయాడు. రావణుడి సోదరుడైన విభీషణుడు అన్ననూ ఆస్తులనూ వదులుకుని వచ్చి రాముడి పక్షాన నిలబడ్డాడు. సముద్ర ఇవ సింధుభిః..నదులన్నీ సముద్రంలో కలవాలని ఆశించినట్టే, సజ్జనులంతా శ్రీరామ సాంగత్యాన్ని కోరుకునేవారట. ఎంత మంచి పోలిక!

రాముడు సమదర్శి. విశ్వామిత్ర, వసిష్ఠాది రుషులతో ఎంత గౌరవంగా మాట్లాడాడో... గుహుడు, శబరి మొదలైన సామాన్యులతోనూ అంతే ప్రేమగా వ్యవహరించాడు. 'మమ్మల్ని కలుసుకోడానికి అంతదూరం నుంచి వచ్చావా మిత్రమా!' అంటూ గుహుడిని ఆలింగనం చేసుకున్నాడు. గిరిజన మహిళ శబరి మీదా అపారమైన ప్రేమ కురిపించాడు. 'ఆధ్యాత్మిక సాధన ఎలా సాగుతోందమ్మా' అని ప్రేమగా పలకరించాడు. భక్తితో ఆమె సమర్పించిన ఎంగిలి పళ్లను ఇష్టంగా తిన్నాడు.

అంతెందుకు, ఇప్పటిదాకా వేయికిపైగా రామాయణాలొచ్చాయి. ఆ మహాకావ్యాన్ని ఎన్నో భాషల్లోకి అనువదించారు. రామకథ అంటే కవులకు ఎందుకింత ప్రేమ... ముక్తికోసమో, భుక్తి కోసమో కాదు. నిజానికి రాముడెక్కడా తాను అవతార పురుషుడినని ప్రకటించుకోలేదు. 'దశరథ పుత్రుడిని... శ్రీరాముడిని' అని మాత్రమే చెప్పుకున్నాడు. కృష్ణుడిలా మహత్యాలు చూపలేదు. బుద్ధుడిలా సర్వస్వాన్నీ త్యజించలేదు. ప్రవక్తలా బోధనలు చేయలేదు. మనిషిగా బతికాడు. మనుషుల హృదయాల్లో దేవుడయ్యాడు! కంబోడియా, శ్రీలంక, చైనా, ఇండొనేసియా, థాయ్‌లాండ్‌, మలేసియా, నేపాల్‌... తదితర చాలా దేశాల్లో రామకథ ప్రచారంలో ఉంది. 'రాముడి వంటిగొప్ప కథానాయకుడు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి వ్యక్తిత్వాల్ని చిత్రించినప్పుడే మాలాంటివారి జన్మ సార్థకం అవుతుంది' అంటారు 'అనర్ఘరాఘవ' కవి మురారి.