అందాల రాముడు - బంధాల రాముడు - అనుబంధాల రాముడు
...దినపత్రికల
శీర్షికలు చాలు, బంధాలెలా
బీటలువారుతున్నాయో అర్థమైపోతుంది. వ్యవస్థకు కుటుంబం పునాది. కుటుంబానికి
ప్రేమాభిమానాలు పునాది. ప్రస్తుత పరిస్థితుల్లో సీతాపతి మార్గమే... శ్రీరామరక్ష!
తల్లి, తండ్రి, సోదరులు, జీవితభాగస్వామి, బంధువులు... ప్రతి
బంధానికీ రాముడు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. మనసు తెలుసుకుని మసలుకున్నాడు. రాముడికి
దశరథుడు అంటే అపారమైన గౌరవం. స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టిన తర్వాత కూడా, తండ్రి అనుమతి
తీసుకున్నాకే సీతమెడలో వరమాల వేశాడు. అలా అని, సీతంటే ప్రేమ లేదని కాదు. ప్రాణేభ్యోపి గరీయసీ... 'నా ప్రాణంకన్నా ఎక్కువ' అని ప్రకటించాడు. తండ్రి
అనుమతితో పెళ్లాడటం వల్ల ఆ ప్రేమ పదింతలు పెరిగిందని వాల్మీకి వ్యాఖ్యానిస్తాడు.
తనకెన్ని పేర్లున్నా 'దాశరథీ...' అని పిలిస్తే రాముడికి
మహదానందం. అమ్మ కౌసల్య అంటే అపారమైన అనురాగం. యాగసంరక్షణకు వెళ్లినప్పుడు, రాముణ్ని మేల్కొలపడానికి
విశ్వామిత్రుడు ముందుగా తల్లిపేరే తలుస్తాడు 'కౌసల్యా సుప్రజారామా...'అంటూ! మిగిలిన ఇద్దరు అమ్మల్ని కూడా కన్నతల్లితో సమానంగా
గౌరవించాడు. రాముడి వనవాసానికి కారణమైన కైకేయి మీద లక్ష్మణుడు పాములా
బుసలుకొట్టాడు. భరతుడూ దుర్భాషలాడాడు. రాముడు మాత్రం పల్లెత్తు మాట కూడా అనలేదు.
అరణ్యవాసం నుంచి తనను వెనక్కి తీసుకెళ్లాలని వచ్చిన భరతుడితో 'అమ్మ కైకేయిని జాగ్రత్తగా
చూసుకో. తేడావస్తే... నా మీద ఒట్టే' అని గట్టిగా చెప్పాడు. సోదరుల విషయంలో 'తండ్రి తర్వాత తండ్రి'లా వ్యవహరించాడు.
లక్ష్మణుడిని 'నువ్వు నా ఆత్మ' అని కొనియాడాడు. ఓ
సందర్భంలో 'భరతశత్రుఘ్నులు
నా ప్రాణంతో సమానం. వాళ్లను సోదరుల్లా, బిడ్డల్లా అభిమానించు' అని సీతకు చెప్పాడు. జీవితభాగస్వామి విషయంలో రాముడు చూపిన
ప్రేమ, శ్రద్ధ... ఆలూమగల
అనుబంధానికి నిర్వచనంలా నిలుస్తాయి. సీతంటే రాముడే, రాముడంటే సీతే!