-----------------------------
శ్రీ రాముని ధర్మమార్గం
-----------------------------
రామరావణులిద్దరూ విద్యావంతులే, బలవంతులే, అస్త్రశస్త్ర సంపన్నులే. రాముడివైపు విభీషణ హనుమంతాదులుంటే, రావణుడివైపు కుంభకర్ణుడూ ఇంద్రజిత్తూ తదితరులున్నారు.
రావణుడివైపు లేనిది...
రాముడివైపు ఉన్నది... ధర్మం!
'ధర్మం వెంబడే సంపద వస్తుంది. ధర్మం వెంబడే సుఖం వస్తుంది. ధర్మాన్ని ఆచరించేవాడు ప్రతీదీ పొందుతాడు. ప్రపంచానికి ధర్మమే పునాది' అంటాడు వాల్మీకి మహర్షి అరణ్యకాండలో. వృత్తివ్యాపార ఉద్యోగాలకూ ఈమాట వర్తిస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు. దొడ్డిదారి పెట్టుబడులే పునాదులుగా వెలిసిన వ్యాపార సంస్థల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ధర్మాచరణకు దూరమైన ఉన్నతాధికారులూ నాయకులూ కటకటాల పాలు అవుతున్నారు.
...ఇది అధర్మమార్గం. రావణుడి దారి.
విలువల దారిలో, పారదర్శక విధానాలతో ఒక్కోమెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సంస్థల్నీ చూస్తున్నాం. ఆ ఎదుగుదల సంస్థలకే పరిమితం కావడం లేదు. ఉద్యోగులకు మంచి జీతాలిస్తున్నాయి. వాటాదారులకు లాభాలు పంచుతున్నాయి. ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాయి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తాము సృష్టించిన సంపదను సమాజంతో పంచుకుంటున్నాయి.
...ఇది ధర్మమార్గం. రాముడిదారి.
ఎక్కడైనా సరే, అంతిమంగా గెలిచేది ధర్మమే.
అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. లక్ష్యసాధనకు (రావణసంహారానికి) రాముడు అనుసరించిన ధర్మమార్గం ఆధునిక జీవితంలోనూ ఆచరణ సాధ్యమైందే. బృందాన్ని ఎంచుకోవడంలోనే శ్రీరామత్వం స్పష్టమైంది. హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణుడు, జాంబవంతుడు... అదో 'విలువల' టీమ్! ఆవైపున ఉన్నది... పరమ దుర్మార్గులు, ధర్మాధర్మ విచక్షణ తెలియని మూర్ఖులు, రాక్షసమాయలో ఆరితేరినవారు. అయినా సరే, రామబృందం ఎక్కడా నీతి తప్పలేదు. ధర్మాన్ని వదిలిపెట్టలేదు. సైనికశక్తిని అంచనా వేయడానికి మారువేషంలో వచ్చిన గూఢచారులను కూడా రాముడు సగౌరవంగా వెనక్కి పంపాడు. అంతిమ లక్ష్యాన్ని సాధించాక, లంకాధిపతిని సంహరించాక... ఇదంతా నా ఘనతే అని ఎక్కడా చెప్పుకోలేదు. 'సహచరుల సహకారంతో యుద్ధంలో గెలిచాను' అనే అన్నాడు. సర్వకాలసర్వావస్థల్లో వెన్నంటి నిలిచిన బృందాన్ని గౌరవించే పద్ధతి ఇదే.
రాముడి యుద్ధనీతి... వ్యాపార విషసంస్కృతులకు ఒక హెచ్చరిక. ఇంద్రజిత్తుతో పోరాడుతున్నప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడతాడు. అదే జరిగితే అపార ప్రాణహాని తప్పదు. అందుకే శ్రీరాముడు 'ఒక వ్యక్తితో పోరాడటానికి... మిగిలినవారందర్నీ బలిచేయడం ధర్మం కాదు. పోరాడనివాణ్ని అసలు చంపకూడదు' అని వారిస్తాడు. ఒక కంపెనీ షేర్ విలువను కృతకంగా పెంచడానికో, మరో కంపెనీని పాతాళానికి లాగడానికో... అమాయకులైన మదుపర్ల పొట్టకొట్టే మార్కెట్ వ్యూహకర్తలకు ఇదో పాఠం.
'మీ విజయ రహస్యం ఏమిటి?' అనడిగారట విలేకరులు ఓ సంస్థ అధినేతను. 'పోటీ సంస్థలే. అవే లేకపోతే... నేనెంత వెనుకబడి ఉన్నానో తెలిసేది కాదుగా' అని చెప్పాడా వ్యాపారవేత్త. ఎంత గొప్పమాట! ఓ స్థాయికి చేరేసరికి చాలా సంస్థల్ని అహం కమ్మేస్తుంది. ఎదుటివారిలోని మంచినీ, పోటీ సంస్థ ఉత్పత్తిలోని నాణ్యతనూ గుర్తించడం మానేసి, రంధ్రాన్వేషణ ప్రారంభిస్తాయి. మంచి ఎక్కడున్నా ఏ కొంత ఉన్నా గుర్తించాలి, గౌరవించాలి. రాముడు ఎవర్నీ తూలనాడి ఎరుగడు. పరమశత్రువైన రావణుడి గురించి కూడా ఎప్పుడూ చెడు మాట్లాడలేదు. రావణాసురుడిని తొలిసారిగా చూసినప్పుడు 'అహో దీప్త మహాతేజా రావణో రాక్షసేశ్వరః' అంటూ అతని తేజస్సంపదను ప్రశంసించాడు. 'సీతాపహరణం చేయకపోయి ఉంటే, ఇతడు దేవలోకానికి కూడా రాజై ఉండేవాడు' అనుకున్నాడు. శత్రువును బేరీజు వేయడంలోనూ అంత నిజాయతీ!