ᐅమాయమ్మ


----------------------------------
సీతమ్మ మాయమ్మ
------------------------------------------------

రాముడు ధర్మాన్ని గౌరవించాడు. సీత రాముడిని గౌరవించింది. 
అతను ధర్మమూర్తి. ఆమె ప్రేమమూర్తి. 

వాల్మీకి మలిచిన సీతమ్మ... సద్గుణరాశి, ధైర్యవంతురాలు. ధర్మాధర్మాల గురించి రాముడితో చర్చించగలిగిందీ అంటే, వేదవేదాంగాల్ని చదువుకునే ఉంటుంది. కన్యాదానం చేస్తున్నప్పుడు జనకమహారాజు 'ఈమె సీత. నా కూతురు. ధర్మయాత్రలో... నీడలా నీ వెనకే నడుస్తుంది' అని రాముడితో చెబుతాడు. సీత చక్కని మాటకారి. 'మీదేశంలో పొలాన్ని దున్నితే ఆడపిల్లలు దొరుకుతారట!' అని కొంటెగా అడిగిన రామయ్యకు... 'మీ వూళ్లో పాయసం తింటే అబ్బాయిలు పుట్టేస్తారని విన్నానూ' అని గడుసుగా జవాబిచ్చింది. ఆ మృదుభాషిణి తప్పనిసరైనప్పుడు, కాస్త కటువుగానే మాట్లాడింది. శ్రీరాముడు తనను అడవులకు తీసుకెళ్లనని చెప్పినప్పుడు, 'నటుడు వేషానికి వెళ్తూ, తన భార్యని ఏ బంధువుల ఇళ్లలోనో దిగబెట్టి వెళ్లినట్టు... నన్నూ వదిలెళ్తారా?' అని ప్రశ్నించింది. అయినా రాముడు తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, 'మీరు పురుషరూపంలో ఉన్న స్త్రీ అన్న సంగతి మా నాన్నగారికి తెలియదేమో?' అంటూ నిష్ఠూరాలాడింది. పెనిమిటి రాజ్యం పోయినందుకు బాధపడలేదు. రాణిగా అనుభవించాల్సిన భోగభాగ్యాలు దూరమైనందుకూ చింతించలేదు. అంత మాటలన్నది, ఎక్కడ రాముడు తనను వదిలి వెళ్తాడో అన్న భయంతోనే!

అశోకవనంలో... రావణుడితో సంభాషించాల్సి వచ్చినప్పుడు... గడ్డిపోచను చూస్తూనే మాట్లాడేది. ఏం చెప్పినా, ఏం అడిగినా గడ్డిపోచతోనే. అంతర్లీనంగా 'నువ్వు గడ్డిపోచతో సమానం' అన్న తిరస్కారభావం. రావణ సంహారం తర్వాత, అగ్నిప్రవేశం చేయాలన్న నిర్ణయం కూడా తనే తీసుకుంది.అది కూడా రాముడికి మచ్చపడకూడదన్న ఆలోచనతోనే. పట్టాభిషేక సమయంలో... తన మెడలోని చూడామణి హారాన్ని తీసి, మారుతికి బహుమతిగా ఇచ్చింది. 'ఉన్నాడు లెస్స రాఘవుడు, రానున్నాడు, నిన్ను గొనిపోనున్నాడు నిజము నమ్ముముర్వీతనయా!' అని ధైర్యం చెప్పిన రామదూతకు కృతజ్ఞతాపూర్వక కానుక.

'ఉత్తర రామాయణం'లో... అడవులపాలైనప్పుడూ ఆమె స్త్థెర్యాన్ని కోల్పోలేదు. అందుకే, 

తాం క్షమా... మానవరూపం దాల్చిన భూదేవి, వసుధాయాః వసుధాం... భూదేవికే భూదేవి 

అని కీర్తించాడు వాల్మీకి. లవకుశులను పెంచి, ప్రయోజకుల్ని చేసిన తీరు... మాతృమూర్తిగా ఆమెకు పరిపూర్ణతను ప్రసాదించింది. రామాయణమంటే రామకథే కాదు. సీతకథ కూడా.

'సీతాయాశ్చరితమ్‌' ఆదికావ్యానికి మరో పేరు.