ᐅక్షేమ పాలకుడు



-------------------------------------------
సర్వ ప్రజా క్షేమ పాలకుడు .. మన రాముడు
-------------------------------------------

ఎక్కడున్నా, ఏం చేస్తున్నా రాముడి ఆలోచనలన్నీ ప్రజల చుట్టే - రామో రాజ్యముపాసిత్వా! ఆయన దృష్టిలో పాలన ఒక ఉపాసన. నేటి పాలకుల్లా సొంత వ్యాపారాల్లేవు. బినామీ వ్యవహారాల్లేవు. 'మహర్షి కల్పేన'...రుషులు తపస్సుచేసినంత ఏకాగ్రచిత్తంతో రాముడు పరిపాలన సాగించాడు. అంత నిస్వార్థంగా పాలించాడు కాబట్టే... రామరాజ్యంలో కరవుల్లేవు, కష్టాల్లేవు, శాంతిభద్రతల సమస్యల్లేవు. ప్రజలకు తమ నాయకుడంటే ఎంత గౌరవమంటే, ఒకరికొకరు అభివాదం చేసుకుంటున్నప్పుడు 'శ్రీరామ... శ్రీరామ' అనేవారట. రాముడు అడవులకెళ్తుంటే, అయోధ్య అయోధ్యంతా ఆయన వెనకాలే నడిచింది. రాముడే అడ్డు చెప్పకపోతే ఆ మహానగరం వల్లకాడైపోయేది. అదే జరిగితే, రామయ్య తట్టుకోగలడా? ఆ ప్రయత్నం మానుకోమని కోరాడు. వెనక్కి వెళ్లిపోయి పిల్లాపాపలతో సుఖంగా ఉండమన్నాడు. భరతుడికి సహకరించమని ఆదేశించాడు.

మన నాయకులు... పదవిని సొంతం చేసుకోడానికి ఎన్ని తిప్పలుపడతారో, ఆ పదవిని కాపాడుకోడానికి అంతకంటే ఎక్కువ కష్టపడతారు. నానాగడ్డీ కరుస్తారు. నానాదార్లూ తొక్కుతారు. రాముడికెప్పుడూ పదవీ వ్యామోహం లేదు. తండ్రి అడవులకెళ్లమని ఆదేశించగానే... కారణమైనా అడక్కుండా బయల్దేరాడు. 'తల్లీ! పితృవాక్యం కంటే నాకు రాజ్యం ఎక్కువకాదు' అని కైకేయికి స్పష్టం చేశారు. రావణసంహారం తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు కూడా తన దూత హనుమంతుడికి ఓ సూచన చేస్తాడు... 'మారుతీ! వెంటనే వెళ్లి, నేను రావణుడిని సంహరించిన విషయం భరతుడికి చెప్పు. సీతా సమేతంగా తిరిగొస్తున్న సంగతీ చెప్పు. నీ మాటలు వింటున్నప్పుడు భరతుడి ముఖకవళికల్లో వచ్చే మార్పును జాగ్రత్తగా గమనించు. కించిత్‌ బాధ కనిపించినా, నేను అయోధ్యకు వెళ్లను. ఏమో, తనకే ఈ రాజ్యం దక్కాలన్న కోరిక భరతుడికి ఉందేమో. తనని ఇబ్బందిపెట్టడం నాకిష్టంలేదు' అంటాడు.

రామో ద్విర్నాభిభాషతే... రాముడు ముందొకటీ వెనకొకటీ మాట్లాడడు. ఒకటి చెప్పి, మరొకటి చేయడు. అతనికి రెండు గొంతుకల్లేవు. ఒకే మాట. ఒకటే బాణం. శ్రీరాముడికి మాతృభూమి మీద అపారమైన ప్రేమ. అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు 'అయోధ్య నగరమా! సెలవు. వనవాసం తర్వాత మళ్లీ నీ దర్శనం చేసుకుంటాను' అని నమస్కరించి వెళ్లాడు. తిరిగివస్తున్నప్పుడు కూడా ఆ మట్టికి ప్రణామాలు చేశాకే... నగరంలో కాలుమోపాడు. సకల సౌభాగ్యాలతో తులతూగుతున్న లంకాపురిని పాలించే అవకాశం వచ్చినా 'జననీ జన్మభూమిశ్చ...' అంటూ సున్నితంగా తిరస్కరించాడు. నా అయోధ్యే నాకు గొప్పని చెప్పాడు.

మన పాలకులూ ఉన్నారు... సంపాదన భారత్‌లో, ఆస్తులు దుబాయ్‌లో, పిల్లలు అమెరికాలో, బ్యాంకుఖాతాలు స్విట్జర్లాండ్‌లో! ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేయకూడదో నిర్ణయించుకునే ముందు ఒక్కసారి రాముడిని తలుచుకుంటే చాలు... స్పష్టత వచ్చేస్తుంది.