----------------------------------------------------------
శ్రీ రామ దాశరధియం అపురూపం అనిర్వచీయనీయం
----------------------------------------------------------
శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః |
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః || ౧ ||
జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః |
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః || ౨ ||
వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః |
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః || ౩ ||
కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః |
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః || ౪ ||
సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః |
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః || ౫ ||
వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ |
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || ౬ ||
త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః |
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యపావనః || ౭ ||
అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః |
జితేంద్రియో జితక్రోధో జగన్మిత్రో జగద్గురుః || ౮ ||
ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః |
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః || ౯ ||
సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః |
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః || ౧౦ ||
సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః |
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః || ౧౧ ||
సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః |
ఆదిపురుషః పరమపురుషో మహాపురుష ఏవ చ || ౧౨ ||
పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః |
స్మితవక్త్రో మితాభాషీ పూర్వభాషీ చ రాఘవః || ౧౩ ||
అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః |
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః || ౧౪ ||
సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః |
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః || ౧౫ ||
సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః |
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః || ౧౬ ||
పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః |
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః
పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః || ౧౭ ||
సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణిస్తే అది ఉత్తరాయణమైంది. దక్షిణం వైపు ప్రయాణిస్తే అది దక్షిణాయనమైంది. అయోధ్యలో మొదలై, మళ్లీ అయోధ్యకు తిరిగొచ్చి జనరంజకంగా పాలించేదాకా... శ్రీరాముడు సాగించిన విలువలయాత్రే రామాయణమైంది. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముడిని తలుచుకుంటే తనువు పులకిస్తుంది. ఉత్తరాలైనా రాతకోతలైనా 'శ్రీరామ' నామంతోనే. బిడ్డకు లాలపోస్తూ 'శ్రీరామరక్ష' అనుకుంటే, అమ్మకెంత నిశ్చింత! పల్లెపల్లెకో రామాలయం. ఇంటింటికో రామ్, రామారావు, రామిరెడ్డి, రామయ్య! తరాలనాటి పాలకుడిని ఇంకా గుర్తుంచుకున్నామంటే, గుండెల్లో గుడికట్టుకుని పూజిస్తున్నామంటే... అందుకు కారణం శ్రీరాముడి సుగుణాలే, వ్యక్తిత్వసంపదే.
త్రేతాయుగం కావచ్చు, కలియుగం కావచ్చు. అయోధ్య కావచ్చు, ఆంధ్రదేశం కావచ్చు. ఏ యుగంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా ధర్మం ధర్మమే. ధర్మస్వరూపుడైన రాముడు రాముడే! నాయకుడంటే, దారిచూపేవాడు. రామ - ది లీడర్!
సుప్రజారాముడు...
దేశం ఎదుర్కొంటున్న అతితీవ్ర సమస్య... నిరుద్యోగమో, పేదరికమో కాదు-నాయకత్వ కొరత! మనకిప్పుడు రాముడిలాంటి నాయకుడు కావాలి. దశరథ మహారాజుకు పెద్దకొడుకుగా పుట్టడమే ఆయనకున్న ఏకైక అర్హత కాదు. ఆ ఒక్క కారణంతోనే సార్వభౌముడు కాలేదు. బాల్యం నుంచే సకలగుణాభిరాముడిగా పేరుతెచ్చుకున్నాడు. ప్రజల్ని ప్రేమించాడు. సేవకుల్ని ఆదరించాడు. శత్రువుల్ని తుదముట్టించాడు. గురువులంటే భక్తి. పెద్దలంటే గౌరవం. ఆ వినయాన్ని చూసి రుషులు సంతోషించారు. పౌరులు మెచ్చుకున్నారు. కాబట్టే, నిండుసభ ఏకగ్రీవంగా దశరథుడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. శ్రీరామ పట్టాభిషేకానికి మద్దతు పలికింది.
బలవాన్ (బలవంతుడు), ధృతిమాన్ (ధైర్యవంతుడు), స్త్థెర్యవాన్ (నిలకడ ఉన్నవాడు)... అంటూ రాముడి గుణగణాల్ని వర్ణిస్తాడు వాల్మీకి మహర్షి. నాలసః... సోమరితనం లేనివాడు, నిస్తంద్రీ... అలసట తెలియనివాడు, అప్రమత్తః... ఏమరుపాటు లేనివాడు, జితక్రోధః... క్రోధాన్ని జయించినవాడు అని మనసారా కీర్తిస్తాడు. ఇవన్నీ ప్రజానాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. బలహీనుడు మంచి పాలకుడు కాలేడు. పిరికివాడు ఎంతగొప్ప మేధావి అయినా ఏం ప్రయోజనం? అపారమైన ధైర్యం ఉన్నా, అద్భుతమైన తెలివితేటలుఉన్నా... నిలకడలేని వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోలేడు. అప్రమత్తత కరవైన నాయకుడు వైరిపక్షాల వలలో ఇట్టే చిక్కుకుపోతాడు. క్రోధాన్ని జయించలేనివాడు కొంపలు ముంచేయగలడు.