ᐅచీకటి - వెలుగు

--------------------
చీకటి - వెలుగు
----------------------


సర్వవ్యాప్తమైన చీకటి. ఆ 'అలోకమైన పెంజీకటికవ్వల' వెలిగే ఒక్కడు. అతడినే భగవంతుడని అన్నారు జ్ఞానులు. చుట్టూఉన్న చీకటిని తిట్టుకోకుండా భగవంతుడు నక్షత్ర దీపాలు వెలిగించాడు. ఆ తరవాత కథ మనకు తెలిసిందే. వెలుగును చూడలేని మనసు దానికి చీకటి అని ముద్దుపేరు పెట్టుకుంది. అంతా బ్రహ్మమే అయినప్పుడు చీకటి కూడా బ్రహ్మమే కావాలి. బ్రహ్మమే చీకటిగా, అచేతనగా, అజ్ఞానంగా మారి ఈ సృష్టిక్రీడను ప్రారంభించింది. మనకు కనిపించే వెలుగు నీడలుగా విడిపోయింది. సర్వవ్యాప్తంగా ఉన్న వెలుగునుంచి విస్ఫులింగాలు, అగ్నిగోళాలు ప్రభవించి కోట్లాది నక్షత్రాలుగా మారి పరిభ్రమించడం ప్రారంభించాయి. 'ఆకాశం' అంటే శూన్యం కాదు, చీకటీ కాదు- అంతటా నిండిన ప్రకాశం అని అసలు అర్థం.

సూర్యుని వెలుతురు ఉంది. విద్యుద్దీపాల కాంతి ఉంది. మెరుపుల వెలుగు ఉంది. వాటికి మించిన వెలుగూ ఉంది. అది అంత సులభంగా కనిపించదు. అదే 'ఆత్మ'. పరమాత్మ. సూర్యుణ్ని మించిన నక్షత్రాలున్నాయంటే వెంటనే నమ్మలేం. కోటానుకోట్ల సూర్యుళ్లు, నక్షత్ర మండలాలు ఉన్నాయని ప్రాచీనులు చెప్పారు.

'చంద్రార్కానల కోటికోటి సదృశా'

అని జగన్మాతను కీర్తించిన కవిద్రష్టలున్నారు. అదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలూ ధ్రువీకరించారు. అవి వెదజల్లే వెలుగు అద్భుతమైనదే. కాని ఆ వెలుగును మించిన మరో వెలుగు, శాశ్వతమైన ఆనందం ఇచ్చే తీయని 'వెలుగు' ఉందంటే ఇప్పుడు నమ్మలేని దశలో ఉన్నాం.

మనం పగలు సూర్యకాంతిలో జీవిస్తున్నాం. రాత్రివేళ వెన్నెలలో విహరిస్తున్నాం. అదీ లేకపోతే నక్షత్రాల కాంతి ఉంది. మరి చీకటిని చూసి భయం దేనికి?

వెలుగు తనంత తాను దాక్కొంది. అది మనకు చీకటిగా కనిపిస్తోంది. అది వెలుగు చేసే ఇంద్రజాలం. దుఃఖం ఆనందం ధరించిన విషాదాంబరం. మరణం ఏర్పరచిన మెట్లపై ఆత్మ తన అమృతధామం చేరుకొంటుంది. మనిషి తన నీడను చూసి, వెలుగును నీడగా వెన్నంటి వస్తున్న చీకటిని చూసి భయపడటం మాని జ్యోతిర్మయ శిఖరాలు చేరే రోజు వస్తుంది. ఆ లక్ష్యంతోనే భగవంతుడు ఈ సృష్టి చేశాడనిపిస్తుంది. తన కలాన్ని చీకటిలో ముంచి విశ్వ ప్రణాళికా రచన చేశాడాయన. ప్రకృతి ప్రస్థానం చివరి వెలుగు తానే.

నక్షత్రాలనే అక్షరాలతో విశ్వమనే శ్వేతపత్రం భగవంతుడు లిఖించాడు. అది బుద్ధికి అందదు. మానవ హృదయం, ఆత్మ చదివితే అర్థం అవుతోంది. భగవంతుడే అంతిమ తేజస్సు అని తెలుస్తుంది. అంతవరకు చీకటి మన జీవితాలను పరిహసిస్తూంటుంది. మనతో విధి రూపంలో ఆడుకొంటూనే ఉంటుంది. నీడలోనే కూర్చొని 'నా జీవితం అంతా చీకటి' అని విలపిస్తారు చాలామంది. మనం ఉన్న చీకటి గది పక్కనే వెలుగు నిండిన గది ఉంది.అటు వెళ్లాలన్న ఆలోచనే రాదు. చీకటి గది దాటడానికి వేల జన్మలు, వేల యుగాలు గడచిపోతాయి. మన చీకటి గదికి సగం తెరచిన చిన్న కిటికీలు ఉన్నాయి. సన్నని రంధ్రాలున్నాయి. వాటిలోనుంచి అపుడప్పుడు కాంతికిరణాలు పడుతుంటాయి. అవే మతాలు, ప్రవక్తల ప్రవచనాలు, తత్వ చింతనలు. ఆ కాంతిని గమనించి కూడా మనం అటు కదలలేం.

మన జీవితం 'సగం విరిగిన వీనస్‌'. ఆ కళా'ఖండాన్ని' చూసి మురిసిపోతుంటాం. కొద్దిగా దొరికిన కాంతికిరణాలు చాలు మనకు. జీవితానికి సంపూర్ణ సార్థకత, సంపూర్ణ సాఫల్యం, పూర్ణత్వం లభించాలంటే భగవంతుడనే 'వెలుగు'ను ఆశ్రయించడమొక్కటే మార్గం. అటువైపే మానవ యాత్ర. అందుకోసమే భగవంతుడు ఈ వెలుగునీడల సృష్టిని చేశాడు!

- కె.యజ్ఞన్న