--------------
జ్యోతి
--------------
మానవుడు శాశ్వతుడు కాడు. మానవుడు అశాశ్వతుడు. మర్త్యుడు. మర్త్యుడు అంటే చావు కలిగినవాడు అని అర్థం. మట్టిలో కలిసిపోయేవాడు, మృత్యుతత్వం కలవాడు, మరణం కలవాడు అని అర్థం.
గ్రామాల్లో స్త్రీలు నాలుగైదు కుండల్ని దొంతరగా తలమీద పెట్టుకొని పోతూ ఉంటారు. గతుకుల బాటపై సైతం నీటిచుక్కయినా తొణకదు. నిశ్చలచిత్తం కలిగినవారి జీవనయాత్ర ఇలాంటిదే! ఆత్మవిశ్వాసం లేనివాళ్లు ఈ కుండ దొంతరలను సరిగా మోయలేరు. లోపల అనుమానం ఉంటే కాళ్లు తడబడతాయి. నీళ్లు తొణుకుతాయి. శరీరం కంటే మనసు బలంగా ఉంటే భయం ఉండదు. 'ప్రపంచంలో పాపమనేది ఉంటే అది ఆత్మవిశ్వాసం లేకపోవడమే' అంటాడు వివేకానందుడు. ఆత్మవిశ్వాసం పైమెట్టు ఈశ్వరుడిపై విశ్వాసం. ఈశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు. ఈశ్వర విలాసంపై విశ్వాసమున్నవారి హృదయమనే దీపకళిక నిశ్చలంగా ప్రకాశిస్తుంది. తాను హరించుకుపోతున్నా లోకానికి వెలుగునిచ్చే త్యాగగుణానికి 'జ్యోతి' పరమ ప్రతీక. భౌతిక జ్ఞానంకంటే దివ్యజ్ఞానం గొప్పది. యుక్తి ప్రయుక్తులతో పనిలేకుండా దివ్యజ్ఞానంతో మహాత్ములు సత్య స్వరూపాన్ని సందర్శించారు. సూర్యుని వెలుగులో వస్తువులన్నీ వాటికై అవే కనబడతాయి. దివ్యజ్ఞానంతో 'లోలోపలి' విషయాలనూ చూడవచ్చు. ఆ దివ్యజ్ఞానానికి ప్రతీకగా ప్రకాశించేది జ్యోతి!