ᐅవివేక జ్ఞానం




------------------
 వివేక జ్ఞానం  
------------------


మనిషిగా జన్మించినవాడు జ్ఞానాన్ని ఆర్జించాలని పెద్దలందరూ సూచిస్తుంటారు. జ్ఞానం కలిగిన మనుషులందరూ మానవత్వంతో ప్రవర్తిస్తున్నారా? ఔనని నిర్ద్వంద్వంగా సమాధానం చెప్పలేని ప్రశ్న అది.
రావణబ్రహ్మ మహాజ్ఞాని. పరస్త్రీని ఆశించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎంతో జ్ఞానం కలిగిన ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని కోల్పోయి తన తమ్ముల్ని, ద్రౌపదిని పరాభవానికి గురిచేశాడు. మనం ప్రస్తుతం నివసిస్తున్న సమాజంలోని జ్ఞానవంతులుగా పేరు సంపాదించుకొన్న కొందరు అసాంఘిక శక్తులుగా ఎదుగుతున్న వైనం మనకు తెలుసు. పరమాత్ముని గురించిన జ్ఞానం (బ్రహ్మజ్ఞానం) కలిగిన మహానుభావులెందరో పరమపదాన్ని అధిరోహించలేక లౌకిక ప్రలోభాలకు ఆకర్షితులై దిగజారుతున్నారు. ఎందుకిలా జరుగుతుందంటే, మనసు చంచలమైనది. దేహం పాంచభౌతికమైనది. ఈ రెంటినీ నియంత్రించగల శక్తి జ్ఞానానికి లేదు. జ్ఞానంతో పాటు ధర్మం వివేకం, విచక్షణ కలిగి ఉండటం మనిషికి అవసరం.

వైకుంఠవాసి శ్రీహరి హిరాణ్యాక్షుణ్ని సంహరించిన తరవాత కొడుకు మరణవార్త విని దితి పుత్రశోకంతో కుమిలిపోతుంటుంది. హిరణ్యాక్షుడి పద్నాలుగు మంది భార్యలు, అతని సంతానం హృదయ విదారకంగా దుఃఖించసాగారు. తమను నిరాధారులుగా చేసి పోయావంటూ రోదిస్తూ వాళ్లందరూ హిరణ్యాక్షుడి శరీరంపై పడి ఏడుస్తుంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు అక్కడికి వస్తాడు. వచ్చి కుమిలిపోతున్న తన తల్లి దితితోనూ, తన సోదరుడి భార్య పిల్లలతో చెప్పిన వూరడింపు మాటలు హిరణ్య కశిపుని జ్ఞానసంపదకు కొలబద్దలు.

'తల్లీ! లోకం మంచినీటి సరస్సు వంటిది. ప్రాణులందరూ దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసారుల వంటివారు. ఎవరి దాహం వారు తీర్చుకొని వెళ్లిపోతున్నట్టే మనమూ ఈ లోకంలోకి వచ్చి మన పని కాగానే వెళ్లిపోతుంటాం. ఆ దైవం సమస్తానికి అధిపతి. సర్వమూ తెలిసినవాడు, సర్వత్రా నిండి ఉండేవాడు. దైవం సత్యుడు, నిత్యుడు, ఆత్మస్వరూపుడు. అటువంటి పరమాత్మ తన మాయా ప్రవర్తనాది మహిమలతో మనల్ని సృజించాడు. అమ్మా! ఈ లోకం తీరు చూశావా? కదలని చెట్లు కదులుతున్న నీళ్లలో కదలాడుతున్న విధంగా భావ వికారాలు లేనట్టి పరమాత్ముడు మనలనందరినీ వివిధ భ్రమలకు గురిచేస్తుంటాడు. పుట్టుక, వినాశం సత్యమైనవి, కాని- శోకం, చింత అసత్యమైనవి. ఈ పరమార్థం తెలుసుకోవాలి' అని హిరణ్యాక్షుని భార్యలకూ, తల్లికీ, అతని సంతానానికి బోధిస్తాడు. హిరణ్యాక్షుని కొడుకులైన శకుని, శంబరకాలనాభ, మఠోత్కచులకు తండ్రి రాజ్యాన్ని సమంగా పంచి హిరణ్యకశిపుడు మహాజ్ఞానిగా అందరి మన్ననలనూ పొందుతాడు.

ఎంతో జ్ఞానవంతుడిగా పేరు తెచ్చుకొన్న హిరణ్యకశిపుడు ఆ తరవాత వివేకం కోల్పోయి విచక్షణాధర్మం త్యజించి సోదరుడి మరణం వల్ల ఆవహించిన రోష శోకాలకు ప్రభావితుడయ్యాడు. మహా పరాక్రమశాలి అయిన హిరణ్యాక్షుణ్ని హరి వరాహరూపంలో వచ్చి వధించడం హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. అప్పుడు తన సైనాధ్యక్షులనందరినీ పిలిపించి శ్రీహరిపై యుద్ధానికి సన్నాహపరుస్తూ, ఆ వైకుంఠవాసి గురించి వివరించిన తీరు అందరినీ చకితుల్ని చేస్తుంది. 'సైన్యాధిపతులారా! శ్రీహరి మహా మాయావి. అతడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. నీళ్లలో ఉంటాడు. అడవుల్లో దాగుతాడు. మునుల హృదయాల్లో చొరబడి ఉంటాడు. వాని పుట్టుక గురించి తెలియదు. ఎక్కడివాడో ఎవరూ నిర్ధారించలేకపోయారు. మనం ఎదుర్కొంటే తానూ ఎదుర్కొంటాడు. వెంటపడితే ఎన్నడూ అలసిపోడు. ఎవరికీ దొరకడు. శ్రీహరి లభించాలంటే శరణాగతి చేయాలట. మనం శరణని అనలేము. ఎలాగైనా మాయోపాయంతో అతణ్ని జయించాలి!' అని హిరణ్యకశిపుడు పురిగొల్పుతాడు. హిరణ్యకశిపుడు, మరణం తప్పదని తెలిసీ తపం చేసి ప్రత్యక్షమైన బ్రహ్మను మరణం లేని జీవితాన్ని ఇవ్వమని అర్థిస్తాడు. అంతటి జ్ఞానవంతుడు వివేకం కోల్పోయి చివరికి తన కుమారుడి కారణంగానే శ్రీహరి ధరించిన నరమృగ శరీరంలోని రౌద్రానికి గురై మరణిస్తాడు.

ఈ లోకంలో చాలా రకాల వికారాలున్నాయి. జ్ఞానం కలిగి వివేకం కోల్పోయి ప్రవర్తించడం ఒక వికారమే! భగవంతుని గురించిన జ్ఞానం మహత్తరమైనది. ఆ జ్ఞానాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప గర్వపడకూడదు. జ్ఞానంతో పాటు ధర్మాన్ని వివేకాన్ని, విచక్షణా విజ్ఞతల్ని కలిగి జీవిస్తే మనిషి అమృతమయుడవుతాడు.

- అప్పరుసు రమాకాంతరావు