-------------
యువ భవిత
-------------
కాకిలా కలకాలం బతికే కంటే- హంసలా ఆరుమాసాలు జీవించినా చాలు అనేది నానుడి. జీవించినది కొద్దికాలమే అయినా యువశక్తిని మేల్కొల్పి, మానవాళికి అఖండమైన ఉపకారాన్ని చేసి, భారతీయ తత్వజ్ఞానకేతనాన్ని ఖండాంతరాల్లో ఎగరవేసిన మహనీయుడు స్వామి వివేకానందుడు.
చికాగోలో సర్వమత మహాసభలో ఆయన సంబోధన- 'సోదర సోదరీమణులారా!' అని. ఆ ఒక్క సంబోధనతోనే భారతీయతత్వం ఔన్నత్యం ఎలాంటిదో ప్రపంచం గుర్తించింది. రక్తసంబంధం, ప్రాంతీయ సంబంధం, కనీస పరిచయం ఏదీ లేని ప్రజలందరినీ అలా సంబోధించడంతోనే విశ్వసోదరతత్వంలోని మాధుర్యం తొలిసారిగా చవిచూసిందీ ప్రపంచం.
భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణగారే స్థితిలో ఉండి, అంత్యదశకు చేరుకున్నప్పుడు దాన్ని పరిరక్షించడానికి వచ్చిన అవతార పురుషుడాయన. ''అన్నింటికన్నా ఉత్కృష్టమైన జన్మనెత్తిన మానవుడు బలంగా, నిర్భయంగా ఉన్నప్పుడే ఆ జన్మ సాఫల్యత నందుతుంది. దానికి సాధన కావాలి. ఓరిమితో సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు. ఏ ఫలితమూ ఒక్కరోజులో రాదు. ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. మనదేశానికిప్పుడు కావలసింది మూఢవిశ్వాసం కాదు, తార్కికదృష్టి. అది కలిగిననాడు ఇనపకండలూ, ఉక్కునరాలూ గల యువత తయారవుతుంది. ఆ యువశక్తే నేడు దేశాభివృద్ధికి కావలసింది' అని ప్రబోధించారు.
'జీవితం అశాశ్వతమైనది. అందువలన మానవుడు యౌవనంలోనే ధర్మశీలాన్ని అలవరచుకోవాలి' అనేది శాస్త్రవచనం. అందుకే యువతకు పిలుపునిచ్చాడు' 'లేవండి-మేల్కొనండి... భ్రమలను తొలగించుకోండి... వాస్తవాలను గ్రహించండి!' అని. భావనే గొప్పదై ఉండాలి. మన ఆలోచనలెలా ఉంటే మనమూ అలాగే తయారవుతాము. కాబట్టి ఆలోచనా విధానంలో జాగ్రత్త వహించడం అత్యవసరం' అంటారాయన.
నైతిక విలువలేని జీవిత విధానం వలన మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందువలన నైతికతను పెంపొందించుకొమ్మని యువతకు బోధించాడు. బ్రహ్మచర్యాన్ని పాటించవలసిన ఆవశ్యకతను తెలియజెప్పారు.
బ్రహ్మచర్యం పాటించకపోతే ఆయువు, తేజస్సు, బలం, వీర్యం, బుద్ధి, ధనం, కీర్తి, పుణ్యం ప్రీతి ఇవన్నీ కోల్పోతామనేది శాస్త్రవచనం. బ్రహ్మచర్యమంటే పెళ్ళిమానేసి ఇనపకచ్చడాలు కట్టుకుని కూర్చోమని కాదు.
మాటలో, మనసులో, సమస్త పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించడమే బ్రహ్మచర్యం. దాని వలన ఆధ్మాతికప్రగతి. జ్ఞాపకశక్తి, ఆలోచన, తేజస్సు, ఆకర్షణశక్తి, వాగ్బలం ఇవన్నీ పెరుగుతాయి. అటువంటి శక్తిమంతమైన యువత దేశాన్ని ప్రగతిపథం వైపు సునాయాసంగా నడపగలదని అతడి ప్రగాఢ విశ్వాసం.
మానవాళికి మేలు చేసే ఏమతమైనా గొప్పదే. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. అలా ఎన్నో దారులు లేకపోతే ఉన్న ఒక్కదారి ఇరుకుగా మారి కనీసం కదలడానికి సైతం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దారులు వేరవడం మంచిదే. ఎవరికి నచ్చిన మార్గాన వారు నడుస్తారు. అంతేకాదు. వివిధ మతాలు, మనస్తత్వాలు ఉంటే మేధోమథనం జరుగుతుంది. తద్వారా విజ్ఞానం పెరిగి మానవజాతి వికాసం చెందుతుంది. ప్రతి వ్యక్తీ ఇతరుల భావాల్ని, మతాలసారాన్ని గ్రహిస్తూ తన కర్తవ్యాన్ని నెరవేర్చి వికాసం పొందాలి. ఆమాత్రం దానికి ఎవరూ వారి వ్యక్తిత్వాన్ని వదులుకోవలసిన అవసరంలేదు.
ప్రతి మనిషికీ వ్యక్తిత్వమున్నట్టే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుందని చెప్పింది వివేకానందుడే. 'ఒక విత్తనాన్ని భూమిమీద నాటితే గాలి, నీరు, మట్టి, వెలుతురు, ఉష్ణం లాంటివన్నీ దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. అంతమాత్రాన ఆ విత్తు నుంచి వచ్చే మొలక వాటిలో ఏ రూపాన్నీ సంతరించుకోవడం లేదు. వాటన్నిటినీ జీర్ణించుకుని ఆమొక్కగానే పరిణమిస్తుంది. అలాగే ఎవరి వ్యక్తిత్వాన్ని వారు నిలబెట్టుకుంటూ మనుగడ సాగించడమే భగవంతుని అభిమతం' అనేది వివేకానందుని సందేశం.
'ఏ పనీ అల్పంకాదు. ఇష్టమైనపని లభిస్తే పరమమూర్ఖుడు సైతం చెయ్యగలడు. అన్ని పనులూ తన కిష్టంగా మలచుకునేవాడే తెలివైనవాడు' అని యువతకు సందేశాన్నిచ్చిన వివేకానందుని దృష్టిలో- దేశభవిత యువతమీదే ఆధారపడి ఉంది!
- అయ్యగారి శ్రీనివాసరావు