----------------------------
పరిపూర్ణ జ్ఞానసముపార్జన
----------------------------
జ్ఞానం పరోక్షమనీ, అపరోక్షమనీ రెండు విధాలు. పాండిత్యం, బుద్ధి కుశలత వల్ల లభించేది పరోక్ష జ్ఞానం. వివేకం, వైరాగ్యం, శమదమాలు, ముముక్షత్వం వల్ల అపరోక్ష జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈ రెండు విధాల జ్ఞాన సముపార్జన చేసినప్పుడే 'సంపూర్ణజ్ఞాని' అనిపించుకునే అవకాశముంది. అటువంటివాడే 'పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి బ్రతుకునాటకము' అన్న సత్యవాక్కును విశ్వసించగలుగుతాడు. జ్ఞాని ఇతరుల కోసం భగవచ్ఛింతన చేస్తాడు. తన అజ్ఞానాన్ని, తన దోషాలను జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలను దహింపజేసుకోగలవాడే పండితుడు, ముముక్షువు కాగలుగుతాడు. హృదయంలోని సంశయాలన్నింటినీ జ్ఞానయోగి మాత్రమే నివృత్తి చేసుకోగలడు. అజ్ఞానం- మార్పును అంగీకరించదు. మూర్ఖతను సమర్థిస్తుంది. జ్ఞానరహితమైన కార్యం వాసన లేని పువ్వు. జ్ఞానాన్ని ప్రవర్ధమానం చేసే శక్తి ఒక్క సత్వ గుణానికే ఉంది. తమో గుణం జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. జ్ఞాన యోగం చేయగలవాడే పరమాత్మకు సన్నిహితుడు కాగలడు. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానంకన్నా చైతన్య రూపంలో సమాజాన్ని ప్రభావితం చేయగల పరిమిత జ్ఞానమే మిన్న. శ్రమను ప్రేరేపించలేని జ్ఞానమెంతటిదైనా వ్యర్థమే అన్నారు బుధులు. అటువంటి జ్ఞానంవల్ల ఎన్ని ఆటంకాలు, సమస్యలు, బాధలు ఎదురైనా మానవుడు ఆదిలోనే అధిరోహించగలడు.
సాధకుడికి జ్ఞానాన్ని మించిన గొప్ప సాధనమే లేదు. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞాని తన కర్మను చేస్తూ, అన్నీ చూస్తూ, తాకుతూ, వింటూ, తింటూ కూడా నిర్లిప్తుడై ఉంటాడు. ఆ పనులన్నీ చేసేది తాను కాదని గ్రహిస్తాడు. ఇంద్రియాలు తమ పనిని తాము చేసుకుపోతున్నాయని గమనిస్తాడు. అన్నింటినీ సమంగా చూస్తాడు. భూషణకు పొంగడు. దూషణకు కుంగడు. సంసారంలో ఉంటూ కూడా సన్యాసిలా వ్యవహరిస్తాడు. ఇదే మోక్ష సౌధానికి ప్రథమ సోపానం. జ్ఞాని అయినవాడు మొట్టమొదట- 'నేనెవరిని, నా శక్తి ఏమిటి, ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి?' అన్న ప్రశ్నలు వేసుకుని సంతృప్తికరమైన సమాధానాలు ఎప్పటికప్పుడు పొందుతూ తన ఆంతరిక, బాహ్యవ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటూ జ్ఞానార్జన ద్వారా జ్ఞానార్చనలో సర్వదా లీనమై ఉంటాడు. అందుకు సద్గురువే ఎల్లవేళలా పథప్రదర్శకుడై నడిపిస్తాడు. తోడిన కొద్దీ శుద్ధ జలమిస్తుంది చెలమ. వేడినకొద్దీ మహాజ్ఞానమిస్తాడు గురువు. గురువు కులమతాలతో నిమిత్తం లేకుండా జ్ఞానం గ్రహించేవాడే నిజమైన శిష్యుడు. యుద్ధంలో కత్తితోనే పని, కత్తిని కాపాడే ఒరతో కాదు. అలాగే గురువు ప్రసాదించే జ్ఞానంతోనే పని; అతని కులమతాలతో పనిలేదు శిష్యుడికి. వంద గ్రంథాల జ్ఞానం కన్నా సద్గురువు హితవాణి ఒక్కటే మహిమాన్వితమైనది. మన సమస్యలకు పరిష్కారం గ్రంథాల్లో వెదుక్కోవాలి; కాని, గురువు మన సమస్యకు సూటిగా పరిష్కార మార్గం చూపి, జ్ఞానశిఖరం వైపు తీసుకెడతాడు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి