ᐅప్రకృతే గురువు




-------------------------
ప్రకృతే పరమ గురువు
-------------------------


జగత్‌ సర్వం ఈశ్వరుని నివాసం. జ్ఞానులు ఏ ప్రాణినీ హీనంగా చూడరు. రమణ మహర్షి కాకిని కూడా ప్రేమతో చూసేవారు. బుద్ధి, భాష- భగవంతుడు మానవుడికిచ్చిన వరాలు. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే ప్రతిదీ నేర్చుకుంటున్నాడు. జంతువులకున్న గొప్ప శక్తులను గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏనుగు శరీరం, సింహం ధైర్యం, గ్రామసింహం విశ్వాసం, గోమాత క్షీరం, కోకిల కంఠం, నెమలి చందం, హంస అందం, చిలక వాలకం... ఇలా ప్రతి ప్రాణికీ ప్రత్యేకత ఉంది. చిరుతలాగా మనిషి పరుగెత్తలేడు. కాకిలాగా ప్రకృతిని పరిశుభ్రం చేయలేడు. చేపలాగా నీటిలో ఈదలేడు... అలాంటివి సాధించడానికి శాస్త్రజ్ఞులు ఘోర 'తపస్సు' చేశారు. ఆ ప్రాణుల తీరుతెన్నులను పరిశోధించారు. యంత్రాలు తయారుచేశారు. ఆకాశయానం సాధ్యమైంది. జలాంతర్గాములు వచ్చాయి. కాలుష్యం హెచ్చరిల్లకుండా సాధ్యమైనంత చేసే కాకిలాంటి సర్వభక్షక యంత్ర ఆవిష్కరణ కోసం అహరహం శ్రమిస్తున్నాడు. ప్రకృతిలోని ధ్వనులను అనుకరిస్తూ మాటలు నేర్చాడు. మాటలు మనోహరంగా కూరుస్తూ కవిత్వం చెప్పాడు. 'రి'షభాది జంతువుల గొంతులను అనుసరిస్తూ సప్తస్వరాలు పలికాడు; సుమధుర సంగీతాన్ని సాధన చేశాడు. జంతువుల సహజ ఆహార విహారాలు వాటికి ఆరోగ్యాన్ని ఎలా చేకూరుస్తున్నాయో పరిశీలించాడు. ప్రకృతి వైద్యానికి ఆకృతినిచ్చాడు.

'పనికి రాదు' అనుకునే గడ్డిపోచ కూడా గొప్ప పాఠాన్నే నేర్పుతుంది! ఒక చెరువు గట్టుపై మహావృక్షం ఉంది. దాని పెద్ద పెద్ద కొమ్మలు దశదిశలా వ్యాపించాయి. సమీపంలోనే గడ్డి మొక్క ఉంది. 'నీదీ ఒక బతుకేనా? నేను చూడు ఎంత గొప్పదాన్నో! నా కొమ్మలు చూడు... ఎంత విస్తరించి ఉన్నాయో! నువ్వో? చిరుగాలికే పడిపోయేట్లున్న రెండు సన్న ఆకులతో ఊరికే వూగిపోతుంటావు!' అని మహావృక్షం గడ్డి పోచను ఎగతాళి చేస్తూ ఉండేది. ఒకరోజు పెద్ద తుపాను వచ్చింది. ఆ ఝంఝామారుతం దెబ్బకు మహావృక్షం వేళ్లతో సహా పెళ్లగిలి పడిపోయింది. గడ్డి పోచ మాత్రం ఆ గాలివాన వచ్చినంతసేపూ తలవాల్చి ఉంది. గాలి ఆగిపోగానే మళ్ళీ నిటారుగా నించుని మునుపటి కంటే అధిక కళతో విలసిల్లింది- ఇది ప్రపంచ ప్రఖ్యాత ఈసఫ్‌ నీతి కథ. 'అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను' అనే నీతిపద్యం అర్థం ఇదే!

చీమల నుంచి క్రమశిక్షణ మానవుడు నేర్చుకోవాలి. చిన్నచిన్న తేనెచుక్కలను మిక్కిలి పరిశ్రమతో ఒక్క చోటికి చేర్చే తేనెటీగల కృషి అనుసరణీయం. ఇవన్నీ ఎప్పటికీ మానవాళికి సజీవ పాఠ్యాంశాలే! భగవంతుడు బుద్ధి జీవియైన మనిషిని సృష్టించి, అతడి చుట్టూ అడుగడుగునా వివిధ విషయాలను బోధించే గురువులను ఏర్పరచాడు. ఆ గురువులే ఈ ప్రాణులు.

'ఒక రాజు శత్రువుల చేతిలో ఓడిపోయి, ఒక గుహలో తలదాచుకున్నాడు. నిరాశా నిస్పృహలు ఆవరించాయి. గూడు అల్లే సాలెపురుగు అతడి కంట పడింది. ఎన్నిసార్లు దారం తెగినా, అది పట్టు వదలడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి చక్కటి సాలెగూడు అల్లి, మధ్యలో స్థిరంగా నిలిచింది. రాజు దాని ప్రయత్నాన్ని చూసే, తన నైరాశ్యాన్ని వదిలించుకొని సైన్యాన్ని వెంటబెట్టుకొని పెక్కు పర్యాయాలు ప్రయత్నించి, చివరకు విజయం సాధించాడు' అనే నీతికథ ప్రకృతి తాలూకు పరమ గురుత్వాన్ని విశదం చేస్తుంది. నీతికథలు ఎక్కువగా ప్రకృతితోనే ముడివడి ఉంటాయి. పశుపక్ష్యాదులు, వృక్షాలు మనుషుల్లాగే మాట్లాడతాయి. నీతి కథలు వినీ, చదివీ మనుషులు తమ జీవితాలను సరిదిద్దుకోవాలని పెద్దల ఉద్దేశం. అందుకే హితోపదేశాన్నీ నీతిచంద్రికనూ మనకు ప్రసాదించారు. ఈ కథలవల్ల నీతితోపాటు ప్రకృతి ప్రియత్వమూ అలవడుతుంది. తాము ప్రకృతిలో ఒక భాగమే అనే సంగతిని బాల్యంలోనే గ్రహించగలుగుతారు.

'మానవుడు సింహంలాగా గొప్ప పనిని సాధించడానికి పూనుకోవాలి. కొంగలాగా దేశ కాలాలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ కార్యాన్ని సాధించాలి. పోరాటంలో వెనుదీయకపోవడం, స్వార్జితంతోనే బతకడం అనేవి కోడిని చూసి గ్రహించాలి. దాంపత్య సుఖాన్ని కాకిలాగా రహస్యంగా అనుభవించాలి' అని ఆచార్య చాణుక్యుడు సెలవిచ్చాడు. 'ప్రకృతే పరమ గురువు' అని ఆ మేధావి ఎన్నడో గ్రహించాడు. పరమ గురువైన ప్రకృతిని గౌరవిస్తేనే మానవుని మనుగడ సుఖ సంతోషాలతో సాగుతుంది

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు