ᐅభాషే భూషణం






------------------------------------------------
సమాజ సాంఘిక జీవితం లో భాషే భూషణం
------------------------------------------------ 


మనిషికి అందమైన భాషే మనోజ్ఞమైన అలంకారం. ఒక మనిషి మాట్లాడే విధానాన్నిబట్టి అతని మనస్తత్వాన్ని అతి సులువుగా అంచనా వేయవచ్చంటాడు ఓ మనోవికాసవేత్త. అమృతప్రాయమైనది మనం మాట్లాడే మాట. మధురమైన ఆ సుధను ఎంతగా పంచితే అంతగా జగం మనదవుతుంది. నోరు మంచిదైతే వూరు మంచిదవుతుందన్న ఆర్యోక్తి మనకందరికీ తెలిసిందే! పలుకే బంగారమాయెనా అంటాడు రాముణ్ని కీర్తిస్తూ భక్తరామదాసు. మనం సంభాషణలో వాడే పలుకులు బంగారమే కాదు, అంతకన్నా ఎన్నో రెట్లు విలువైనవి.
ఒక మనిషి మాట్లాడితే మన హృదయంలో ఉన్న క్లేశమంతా తొలగిపోయి, దూదిపింజలా తేలిపోయినట్లుంటుంది. ఇంకొకడు మాట్లాడితే ఉన్న ఆనందం క్షణంలో ఆవిరై చిరాకు, అసహనం పెరుగుతాయి. ప్రియవాక్యాలు పలికి తోటివారి హృదయానికి ఆనందం కలిగించేవాడు జనులందరికీ ఆప్తుడవుతాడనేది వేదవాక్యం. హృదికి నచ్చే మృదుభాషణం, కర్ణపేయమైన ప్రియభాషణం చేసేవాళ్లు సదా విజయులవుతారు. మంచి వర్తనతో పెద్దలను గౌరవించి, జయాన్ని పొందటమే కాక మృత్యుంజయుల కోవలోకి సైతం చేరవచ్చని నిరూపిస్తుంది మార్కండేయుడి చరితం.

మృకండు మహర్షి ప్రియపుత్రుడే మార్కండేయుడు. చిరుప్రాయంలోనే వేదవేదాంగాలను అభ్యసించాడు. పెద్దలను గౌరవించడం, తీయనైన, మృదువైన మాటలతో అందరినీ అలరించడం అనే మంచి అలవాట్లను అలవరచుకున్నాడు. ఒకసారి మృకండుని ఇంటికి విచ్చేసిన సప్తర్షులు మార్కండేయుడు మాట్లాడే విధానానికి ముచ్చటపడి చిరంజీవ అని దీవించారు. వెంటనే మృకండుడు సప్తర్షులతో 'మునివర్యులారా నా పుత్రుడు శివుడిచ్చిన వరం ప్రకారం పదహారేళ్లే బతుకుతాడు. మీరు చిరంజీవ అని దీవించారు. కాలచక్రాన్ని సైతం ఎదిరించగలిగిన తపోధనులు మీరు. మీరిచ్చిన వరం ఫలిస్తుందా' అని ఆశ్చర్యంతో ప్రశ్నిస్తాడు. 'మహర్షీ! మేమిచ్చిన వరం నిజమై తీరుతుంది. తీయని వాక్కులతో, వేదవచనాలతో మమ్మానందింపజేసిన నీ ప్రియపుత్రుడు చిరంజీవిగా మిగులుతాడు' అని వారు పలికి, బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్లి చిరంజీవ అని ఆశీర్వదింపజేస్తారు. పదహారు ఏళ్లు ముగిశాక శివుడి ధ్యానంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలు తీయడానికి యముడు రావడం, శివలింగాన్ని భక్తితో హత్తుకుని మార్కండేయుడు శివుడి కృపకు పాత్రుడై మృత్యువును సైతం జయించడం భారతీయ సనాతన సంస్కృతిలోని మనోహరమైన పురాణగాథ. సప్తర్షులనేకాక సృష్టికర్తయైన బ్రహ్మ హృదయాన్నీ తన ప్రియమైన వాక్కులతో రంజింపజేసిన మార్కండేయుడు సన్మార్గదర్శి.

ఈ గాథ మనకు తెలియజెప్పేది ఏమిటంటే- సంభాషణ మన అంతరంగాన్నిగాక, ఎదుటివాడి హృదయాంతరంగమనే వీణను సవ్యంగా మీటాలని, తద్వారా వారి శుభాశీస్సులనుంచి మన మంచిని కాంక్షించే భవ్యమైన సంగీతం ఆవిష్కృతమవుతుందనేది తెలుసుకోదగ్గ నీతి.

- వెంకట్‌ గరికపాటి