ᐅశుభాభినందన


---------------------------------------
సర్వే జనా సుఖినోభవంతు
----------------------------------------

'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఒక్కరికీ దుఃఖం కలగకూడదు'- ఇది అనాదిగా ప్రతి భారతీయుడు కోరుకునే కోరిక. విశ్వసాహిత్యంలోనే ప్రప్రథమ స్థానాన్ని ఆక్రమించిన వేదాల్లోనూ, రామాయణ మహాభారతాల్లోనూ, పురాణాల్లోనూ, కావ్య నాటకాల్లోనూ వాచ్యంగానో, వ్యంగ్యంగానో ఈ భావన అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది.

ఆధునిక సమాజంలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నా, వివాహాది శుభకార్యాల్లోనూ, పండుగలు, పుట్టిన రోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేయడం పరిపాటి అయింది. అది నాగరికతా చిహ్నంగానూ పరిగణిస్తున్నారు. అయితే ఈ శుభాకాంక్ష సందేశాలు మొక్కుబడిగా, గాలికి పోయే మాటలు కాకూడదు. కొందరు తెలియజేసే శుభాకాంక్షలు, వాటి ఘనతను, ఉనికిని చాటుకునేందుకా అన్నట్లు కృత్రిమంగా ఉంటాయి. శుభకామనలో మైత్రీ హృదయం ఆవిష్కృతం కావాలి.

విశ్వమానవ శ్రేయాన్ని కాంక్షించడం భారతీయ సంస్కృతి మౌలికాంశాల్లో ఒకటి. అది ఏ పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్లా సంక్రమించింది కాదు, అది ఈ జాతి మనోధర్మం. వాస్తవానికి శుభాకాంక్షల ప్రకటన కొన్ని సందర్భాలకే పరిమితం కాదు. మనుషుల మధ్య నిరంతరం సాగాల్సిన ఆదర్శవంతమైన ప్రక్రియ. మన నిత్యరాధనలు, అనుష్ఠానాలు, పూజల్లో అంతర్లీనంగా శుభకామన వ్యాప్తమై ఉంది. వేదాల్లోని సూత్రాలు మానవ శ్రేయాన్ని కాంక్షించే ప్రార్థనలే. 'కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, ఏకాభిప్రాయ మనస్కులై మెలగండి' అనే ఉన్నతాశయాన్ని వేదసూక్తం ప్రకటిస్తోంది. 'మీ తలపులూ అభిప్రాయాలూ సంకల్పం ఒక్కటై ఉండాలి. హృదయగత భావాలు సమానంగా ఉండాలి. మనసు, చింతన, భావన ఏకరూపం కావాలి. మీ మధ్య మంచి సామరస్యం, సహనం, సహకారం, సౌహార్దం నెలకొని ఉండుగాక' అనే మంగళాశంసను మన వాఞ్మయం ప్రకటిస్తోంది. మానవ సమూహాలన్నీ ఏకమనస్కులై కలిసి జీవించాలనే మహత్తరమైన ఆకాంక్షను ఎంతో ప్రబలంగా ప్రవచించిన వేదాలు వసుధైక కుటుంబ భావనను ఏనాడో ప్రతిఫలించాయి. వసుధైక కుటుంబమంటే నేటి స్వార్థపూరిత, సామ్రాజ్యవాద, అనైకమత్య భావాలతో కూడిన ప్రపంచీకరణ, 'గ్లోబల్‌ విలేజ్‌' కాదు. లోక కల్యాణాన్ని భారతీయ రుషులు కాంక్షించినంతగా మరెక్కడా మరే సంస్కృతిలోనూ కానరాదు. 'నేను, నాది' అనే భావం కాక 'మనందరం' అనే ఆదర్శ భావనకు ఆద్యులు భారతీయులే.

సమాజంలోని వ్యక్తులందరి మధ్య సౌమనస్యం రావాలంటే దానికి బీజాలు ముందుగా కుటుంబంలో నాటుకోవాలి. సౌమనస్యం, సౌహార్దం కుటుంబంలో వెల్లివిరిశాయంటే అవి అప్రయత్నంగా సమాజంలోకి ప్రసరిస్తాయి. అందుకే వాజసనీయ సంహిత ఇలా అంటోంది- 'అన్ని ప్రాణులూ నన్ను మైత్రీ పూర్ణమైన చూపులతో చూడాలని కోరమన్నాను. నేను అన్ని ప్రాణులూ మైత్రీపూర్ణమైన చూపులతో చూడాలి. మనందరం ఒకరినొకరు మైత్రీభావంతో చూసుకోవాలి'

'గాలి మాధుర్యంగా వీచు గాక... నదీనదాలు మధురజల ప్రపూర్ణాలై ప్రవహించుగాక... వృక్షాలు పుష్టిగా పెరుగుగాక... భూమ్యాకాశాలు, చంద్రుడు మాధుర్యాన్ని పంచుగాక... పశుసంతతి తియ్యదనాన్ని అందించుగాక' అనే మహోన్నతమైన ఆకాంక్ష ఏ ప్రాంతానికో, మతానికో, వర్గానికో చెందినది కాదు. మనిషి మనసులో ఇటువంటి విచారధార సాగితే అది సమాజ వ్యాప్తమై సామాజిక రుగ్మతలకు విరగడవుతుంది.

'మంగళాది, మంగళమధ్యం, మంగళాంతం' 

అనేది మన భావన. మన నాటకకర్తలు ఆదిలో 'నాంది' రాసేవారు. నాందీవాక్యాలు ఆశీర్వాద పూర్వకంగా ఉండాలి. చివరగా భరత వాక్యం పౌరులకు శుభాశీస్సులందజేయడమే. శుభాకాంక్షలు నిర్మలమైన మనసుతో, చిత్తశుద్ధితో అందించాలి. అప్పుడే అవి ఫలప్రదం అవుతాయి. శుభాకాంక్షలు చెప్పేవారికి తమ క్షేమాలపట్ల తపన ఉండాలి. ఆశీస్సులు అందించేవారి ఆకాంక్ష వాగ్బలం ద్వారా గ్రహీతకు చేరుతుంది. మనం దీవెనలు ఇచ్చేటప్పుడు దేవతలు 'తథాస్తు' అంటారని ఆ విధంగా మన శుభాకాంక్షలకు దైవాశీర్వాదం తోడవుతుందని నమ్ముతాం. నేటి సంకీర్ణ సామాజిక వ్యవస్థలో 'సకల జనులకు శుభం జరగాలి' అనుకోవడం మహదాశయం.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు