ᐅవిద్యుక్త ధర్మం




----------------
విద్యుక్త ధర్మం
----------------


దుర్యోధనునకు కౌరవసైన్యంలోని రథాతిరథులను వివరిస్తూ భీష్ముడు కృతవర్మను, శల్యుడుని అతిరథులని పేర్కొంటాడు. సింధురాజు ద్విగుణరథుడని మహిష్మతీ నివాసియగు నీలుడు రథుడని, అవంతి దేశాధీశులగు విందానువిందులను అన్నదమ్ములు రథసత్తములని, త్రిగర్త దేశాధిపతులు రథోదారులని, దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు దుశ్శాసన కుమారుడును రథసత్తములని, కౌసల్యుడగు బృహద్బలుడు ఏకరథుడని, కృపుడు రథయూథపయూథవుడని, శకుని ఏకరథుడని, అశ్వత్థామ మహారథుడని, ద్రోణుడు రథయూథపయూథములకు యూథనాథుడని పేర్కొంటూ కర్ణ పుత్రుడగు వృషసేనుని మహారథుడని చెబుతాడు. బాహ్లికుడు అతిరథుడని, సత్యవంతుడు మహారథు డని, నలంబుసుడు మహారథుడని పేర్కొంటూ కర్ణుని అర్థరథుడని అంటాడు. కర్ణుని పుత్రుడు మహారథుడట, కర్ణుడు అర్థరథుడట. ఇలా వర్ణించిననాడు సామాన్యుడు కాడు. భీష్మపితామహుడు ఈ సందర్భములో కర్ణుడిని గూర్చి భీష్ముడు పలికిన పల్కులు మహాభారతంలో ఉన్నదున్నట్టు తెలుసు కొంటే బాగుంటుంది. నీకు దయితుండగు నెచ్చెలి, రణకర్కశుండు, నిన్ను పాండవులతోడి యుద్ధంబు నకు మాటిమాటికి ప్రోత్సాహపఱచువాడు, ఆత్మశ్లాఘపరాయణుడు, నీచుండునగు కర్ణుడు నీకు మంత్రియు, బంధువును నేతయునై యున్నవాడు. వీడు మానవంతుడును, అత్యంత గర్వోచ్ఛిత్రుం డునై యుండును. వీడు యుద్ధంబున రథుండును కాదు, అతిరథుండును కాదు. వీడు సహజంబగు కవచంబు కోల్పోయి విచేతనుండైయున్న వాడు పరశురాముని శాపంబునను, బ్రాహ్మణుని భాషణం బునను గరణంబులు గోల్పోవుటను వీడర్థరథుడని నా తలంపు. (పేజీలు 599-600-ఉద్యోగపర్వము -శ్రీమదాంధ్ర వచన మహాభారతము) భీష్ముని ఈ మాటలను వినిన ద్రోణుడు ''శాంతనవా! నీ వాడిన మాటలెల్ల యధార్థంబులై యున్నవి. వీనియంద సత్యము లేశంబేని లేదు. వీడు ప్రతి యుద్ధము నందును దొలుత నత్యభిమానం బొందుటయు తరువాత విముఖుండగుటయు గూడ గలదు. వీడు ఘృణాత్ముండగుటయు, ప్రమాద పరవశుండగుటయు గారణంబులుగ నేనును వీనినర్థరథునిగానే తలంచుచున్నాను "అని అన్నాడు.

సత్యం బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌
న భ్రూయాత్‌ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్‌ 

అను శ్లోకాన్ని చెప్పి సత్యము చెప్పు, ప్రియమైన దాన్ని చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పకు, ప్రియమైన అబద్ధాన్ని చెప్పకు అంటుంటారు చాలా మంది. 'అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు అను విషయం భీష్మద్రోణులకు తెలియదా? అదీ తమ పక్షానికి చెందిన యుద్ధవీరుని గూర్చి అత్యంత కీలక సమయంలో అతని సమక్షంలోనే, అతని ముఖంమీదే, ఇన్ని అప్రియమైన సత్యాలను చెప్పి అతన్ని అధైర్యపరచటం సముచితమేనా, భీష్మద్రోణుల స్థాయికి తగినదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. భీష్మద్రోణులను తప్పు పట్ట గలిగే ధైర్యం, స్థైర్యం మనకు ఉండదు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, ధర్మజ్ఞులు, నీతిశాస్త్ర కోవిదులు. మరి వారు అలా ఎందుకుచేశారు? వారి మాటలను వినిన కర్ణుడు ఏమన్నాడో చూద్దాం. -సమానులునుదార కర్ములుగల రాజులందు ఎవడిట్లు తేజోవధంబు గావించి యుద్ధంబున భేదంబు గల్పింప సాహసించును? నీవు మారతము చితానుచితంబులెఱుంగక గుణవిద్వేషంబుననపరాగంబు గావింప దలంచుచున్నవాడవు. జీవించిన యేండ్ల వలన గానీ, ఫలితంబులైన శిరోజంబుల వలన గాని, ప్రభూతంబులగు ధనంబు వలన గాని, సమృద్ధమగు బంధుగణంబు వలన గాని క్షత్రియుల మహారథత్వమును నిర్ణయించుటకు శక్యంబుగాదు. క్షత్రంబు బలజ్యేష్టంబనియు, బ్రాహ్మణులు మంత్రజ్యేష్ఠులనియు, వైశ్యులు ధనజ్యేష్ఠులనియు, శూద్రులు వయోజ్యేష్ఠులనియు నార్యులందురు. కామద్వేష సమాయుక్తుండగు నీవు మోహపరవశుండవై నీ యిచ్చ వచ్చిన తెఱంగున రథాతిరథ నిశ్చయంబు గావించుచున్నవాడవు. ఆ తర్వాత కర్ణుడు దుర్యోధనునితో, ''సుయోధనా! వృద్ధుల వచనంబు లాలింపవలయునని శాస్త్రంబులందు విధి కలదు కాని యతి వృద్ధులగు వారి వచనంబు లెన్నండు నాదరింపరాదు. అతి వృద్ధులు మరల బాల్య మందినవారలు కదా? అని అంటాడు. భారతంలోని ఈ ఘట్టాన్ని చదువుతున్నప్పుడు ఎవరికైనా కర్ణుని మాటలే సరియైనవని భీష్మద్రోణుల మాటల తీరు హుందాగా లేదని అనిపిస్తుంది. కానీ ఒకింత నిదానంగా ఆలోచన చేస్తే ఆ సందర్భంలో అంత కటువుగా కాకుండా కొంత మృదువుగా అదే విషయాన్ని భీష్మద్రోణులు చెబితే యధార్థాన్ని కప్పిపుచ్చినట్టే అవుతుంది, తమ విద్యుక్తధర్మానికి హాని చేసినట్టే అవుతుంది. బలాబలాల అంచనా విషయంలో తప్పు చేసినట్టే అవుతుంది. అత్యంత కీలకమైన విషయంలో రాజును తప్పుదారి పట్టించినట్టే అవుతుంది. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు అనేమాట వారికి తెలియక కాదు. బాగా తెలుసు. అలా చెప్పటం వల్ల ఒక్క కర్ణునికో, లేక అతని మిత్రుడు దుర్యోధనునకో కొంత బాధ కలుగవచ్చు. కానీ సత్యమేమిటో చెప్పకపోతే రాజు కర్ణుని బలపరాక్రమాల విషయంలో ఎక్కువ అంచనా వేసుకోవచ్చు, నాశనం వైపు అతి శీఘ్రంగా పరుగులు తీయవచ్చు. కానీ భీష్మాదులు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటం వల్ల వారికి నాశనం తప్పిందా, వారు శాస్త్రవాక్కుకు విరుద్ధంగా నడవటం వల్ల ఏమి ప్రయోజనం చేకూరింది? అని ఎవరైనా ప్రశ్నింపవచ్చు. భీష్మద్రోణులు వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించారు. ఫలితాన్ని దైవానికి వదిలేశారు. ఎవరైనా వారి నుంచి నేర్చుకోవలసింది అదే.

- "రాచమడుగు శ్రీనివాసులు"