-------------
గురు నిర్దేశం
--------------
చూసేది ఏది, చూసేవాడెవరు అన్నవాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలిగేవాడు వివేకి. కన్ను చూసేది. వస్తువు కనిపించేది. ఆ రెంటికీ ఉన్న సంబంధాన్ని గుర్తించగలిగేది మనసు. అలాగే జ్ఞానదృష్టి కలిగినవాడు మనసును చూడగలుగుతాడు. పరమాత్మను దర్శించగలుగుతాడు.
ఒక దీపాన్ని చూడటానికి మరో దీపం అవసరంలేదు. చీకటిలో మరో మనిషి ఉన్నాడో లేదో చూడటానికి కావాలి. కాని, మనం ఉన్నామని రూఢి చేసుకోవటానికి ఏ దీపమూ అక్కర్లేదు. ఆధ్యాత్మికమైన మనిషి ఆత్మ పరమాత్మలోని నిత్యమైన ఒక అంశ అని గ్రహించాలంటే ఆత్మసాక్షాత్కారం కావాలి. జ్ఞానికది సుసాధ్యం. అహంకారికది అసాధ్యం. ఈ అహాన్ని వదిలించుకోవాలంటే 'ఇది నాది, చేయించేది నేను' అన్న భావనను విడిచిపెట్టాలి. పరావర్తనం చెందిన ఆ అహం అంతరించిపోయినప్పుడు కాని, శరీరం మీద మమకారం నశించదు. అది పోతేకాని, మనసు పరమాత్మ మీద లగ్నంకాదు. సామాన్యుడికిది గ్రహించే వివేక దృష్టి ఉండదు.
ఒక రాజకుమార్తె వజ్రాలమాలను ఎవరో ఎత్తుకుపోయారు. దాన్ని వెదికితెచ్చినవానికి వెయ్యి బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని మహారాజు ప్రకటన చేశాడు. ఒక ముష్టివాడు ఈ సంగతి విన్నాడు. అతనొక మరికికాలువ పక్కగా వెడుతుండగా ఆ నీళ్ళల్లో తళుక్కుమంటున్న వజ్రాలమాల కనిపించింది. అతను గబగబా కాలువలోకి దిగి ఆ మాలను దొరకబుచ్చుకోవాలనుకున్నాడు. కాని, అది అతని చేతికి అందలేదు. మళ్ళీ గట్టుమీదికి వచ్చి చూశాడు. ఆ మురికి నీళ్ళల్లో అది ఉన్నట్టే కనిపించింది. చిత్రంగా నీళ్ళలో దిగిచూస్తే చేతికి తగలటంలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక సాధువు అటుగా వచ్చాడు. ముష్టివాడు పడుతున్న అవస్థను పరికించాడు. దేనికోసం వెతుకుతున్నావు నాయనా- అని మృదువుగా అడిగాడు. ముష్టివాడికి నిజం చెప్పాలని లేదు. చెబితే తనకు దొరకబోయే బహుమతిలో సాధువుకు సగభాగం పంచి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతని భయం. సాధువు మందహాసం చేశాడు. అతనికి ఏమి దొరికినా తనకు దానితో నిమిత్తం లేదన్నాడు. అప్పుడు ముష్టివాడు తనకు కావాల్సిందేమిటో చెప్పాడు. 'పిచ్చివాడా! ఆ మురికినీళ్లలో వజ్రాలమాల నీకెలా దొరుకుతుంది? గట్టున ఉన్న చెట్టు వైపు చూడు' అన్నాడు.
ముష్టివాడు తలెత్తి చూశాడు. ఇంతసేపూ తాను మురికి నీళ్ళల్లో చూస్తున్నది వాస్తవమైన వజ్రాలమాల కాదని- కేవలం దాని ప్రతిబింబమని గ్రహించాడు. ఏ కాకి తెచ్చిపడేసిందో- ఆ వజ్రాలమాల చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుని అతనికి కనిపించింది.
వస్తువు ఉన్నచోటు వేరు. అతను వెదుకుతున్న చోటు వేరు. ఇంత సేపూ అతనికి వేరేచోట ఉన్నట్టు అనిపించింది. అది తెలుసుకునే వివేకం అతనికి లేదు. అందుకే సాధువు మార్గదర్శనం అవసరమైంది. ఆత్మసాక్షాత్కారం కాక తికమకపడే అన్వేషికి ఆధ్యాత్మిక గురువు అవసరం కూడా ఇలాగే ఉంటుంది!
- తటవర్తి రామచంద్రరావు