---------------------------
అంతరంగం - జ్ఞానజ్యోతి
---------------------------
'ఆధ్యాత్మికతకు మొదటి చిహ్నం ఎందరికో సమ్మతమైన మతాన్ని అనుసరించటం. దానికి ప్రథమ లక్షణం ఆనందంగా ఉండగలగటం. అందుకే ఆనందోబ్రహ్మ అన్నారు జ్ఞానులు. మనిషి దుఃఖభాజనుడైతే స్తబ్ధుగా ఉండిపోతాడు. ముఖం ముడుచుకొనిపోతుంది. ఎవరి ఆనందాన్నీ భరించలేడు. మనసులో చికాకుగా ఉంటే దానంతట అది బయటకిపోదు. పోలేదు. గదిలో తలుపు వేసుకొని మనసులోని ఖేదానికి కారణాన్ని అన్వేషించాలి. ఈ రుగ్మతకు హేతువేమిటో మూలాల్లోకి వెళ్ళి చూడాలి.
నిజమైన ఆధ్మాత్మికతను సాధించినవాడి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. దృక్పథంలో విశాలత ఉంటుంది. అందర్నీ ప్రేమించగల సౌశీల్యత ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోడు. ఎదుటి వ్యక్తి అభిప్రాయం తప్పయినా విమర్శించడు. అతనికా అభిప్రాయం ఉండటమనే హక్కును హరించాలని ఏ కోశానా అనుకోడు.
కొందరికి మతం ఒక వ్యాపార సాధనం. కేవలం ధనార్జన కోసం ఆధ్మాత్మికత అనే ముసుగు వేసుకొని అమాయకుల్ని మోసం చేస్తారు. అలాంటివారు ఒకరితో ఇంకొకరు పోటీపడతారు. ఏదోనాడు వారి కోపతాపాలు బయటపడిపోతాయి. ముసుగు తొలగిపోతుంది. వారి నిజరూపం అందరికీ తెలిసిపోతుంది.
అసలు ప్రపంచంలో క్రౌర్యమెందుకుంటోంది? ప్రపంచమెలా కనిపిస్తూంటే మనం అలా చూస్తాం... ఉదాహరణకు, ఒక గదిలో ఒక పాప ఉంది. ఆ పాప ముందు సంచీలో బంగారముంది. ఆ బంగారం విలువ ఆ పాపకు తెలియదు. ఒక దొంగ హఠాత్తుగా ఆ గదిలోకి దూరి ఆ సంచీని పట్టుకుపోయాడు. ఏం పోయిందో ఆ పాపకు తెలియదు. మన మనసులోనూ సహజంగా అలాంటి భావనే ఉంటుంది. పాపలో దొంగలేడు. అందుకే కళ్ళెదుట జరిగినా దొంగతనం గురించి పాపకు తెలియదు. మనసులో క్రౌర్యం లేకపోతే మనమూ లోకంలోని క్రౌర్యాన్ని గుర్తించలేం.
'పాపభూయిష్ఠమైన ప్రపంచంలో పుట్టాం... మనం కష్టాల్ని, ఇబ్బందుల్ని అనుభవించక తప్పదు' అని కొందరు పెద్దలు చిన్నవారికి నూరిపోస్తుంటారు. అది చాలా తప్పు. మన గతమెంతో ఉత్కృష్టమైనదని, మన వంశం ఎంతో ఉన్నతమైనదని చెప్పాలి. మనలో ఉన్న బలహీనతల్ని పారదోలాలి. సంకుచిత భావాలతో పిల్లల మనసుల్ని కలుషితం చేయకూడదు. పక్షవాతం వచ్చినట్టు మనసులు నిరాశతో నిస్పృహతో నింపరాదు. ఆశావాదం, దృఢసంకల్పం పిల్లల మస్తిష్కాల్లో పాదుగొల్పాలి. ఇదే ఆధ్యాత్మికతను సంతరించుకోవటానికి తొలిమెట్టు.
ప్రవక్తలందరూ బోధించేది ఇదే. వారికా శక్తి లభించినది అలాంటి బోధనలనుంచే! వారెవరూ పుస్తకాలు రాయలేదు. వారు మాట్లాడింది చాలా తక్కువ. క్రీస్తులా, బుద్ధుడిలా జ్ఞానజ్యోతిని అంతరంగంలో వెలిగించుకోవాలి. అదే శక్తి- ఆ దేవదేవుని దగ్గరకు సుళువుగా చేర్చగలిగేది!' అని స్వామి వివేకానంద ఆధ్యాత్మికతను నిర్వచించారు.