----------------------------
దైవకృపాపాత్రం
----------------------------
ఉన్నతమైన ఆలోచనల్ని, ఆశయాల్ని దరిచేర్చుకొన్నవారే గొప్పవారు. అందరి మంచితోనూ అందరి ఆనందం ఉందని గ్రహించినవారే నిజమైన శ్రీమంతులు. అశాశ్వతమైనవేవో, శాశ్వతమైనవేవో, భగవంతునికి ఇష్టమైనవేవో వీరు గ్రహించగలరు. వారి జీవితాల్లో ఆధ్యాత్మిక అందాలు విరబూస్తాయి. ఇలాంటి మహావ్యక్తుల వల్లనే సామరస్య భావమాధుర్యాలు జీవం పోసుకొంటాయని లోకహితైషుల ఉద్బోధ.
ప్రపంచంలో విద్యాపారంగతులు ఉంటారు. విజ్ఞానఖనులూ ఉంటారు. కాని 'మానవప్రేమ'ను గ్రహించి ఆచరణలో పెట్టగలిగేవారికోసం అన్వేషించవలసి వస్తోంది. మనం వేరు, వారు వేరు అని మానవుల మధ్య అడ్డుగోడలు కట్టేవారు కనిపిస్తారు. వారి సంకుచిత ధోరణుల ఇంపైన మాటలు ఆసక్తిగా వినేవారూ ఉన్నారు. ఫలితంగా ధర్మేతరశక్తులు తలెత్తుతున్నాయని శాంతికాముకుల ఆవేదన. సాటి మనుషుల్ని ప్రేమించడం, కష్టకాలంలో వారిని ఆదుకోవడం, మృదుభాషణం- ఇవన్నీ అశాశ్వతమైన వజ్రవైఢూర్యాలకన్నా విలువైనవనే మహాత్ముల ప్రబోధాల్ని ఆచరించడంలో విఫలమవుతున్నారు మనుషులు. తనను ఆరాధించేవారికన్నా, బక్కబతుకుల ఆర్తులను ఆదరించేవారినే భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడని తత్వవేత్తల అమృతవాక్కు. ఇదే, మతాల పవిత్ర భావాలకు జీవవాయువు. అందువల్లనే హృదయంలో మానవత్వం నిద్రపోతే దైవత్వాన్ని దూరంగా విసిరేసినట్లని మహర్షులు అన్నారు.
తాత్విక ఔన్నత్యం కలిగిన సందేశం అద్భుతమైంది. మానవీయ విలువలకు అర్థాన్ని పరమార్థాన్ని బోధిస్తోంది. లోకప్రేమను చూడలేని అంధత్వం కారుణ్య చికిత్సద్వారా నివారణ అవుతుందనే అమృతభావాన్ని ఆవిష్కరిస్తోంది.
మతం అవసరమే కాని- పరస్పర ప్రేమ, సత్ప్రవర్తన, స్పందించే మనసు, శాంతిపూరిత జీవన సౌందర్యం... మరింత అవసరం. ఒక ప్రాణికి ఉపకారం చేస్తే, అది సాక్షాత్తు దైవసేవే. సాటి నరుల్లో ప్రేమ పల్లవించేలా నిజజీవితంలో అనుక్షణం సద్భావనల్ని ఆచరించి, ధరిత్రిని సుందరంగా నిలిపి భవిష్యత్తరాలకు అందించినప్పుడే మచ్చలేని విశ్వప్రగతి మనం సాధించినట్లు. దేవుని ప్రేమకు పాత్రులమైనట్లు.