ᐅభగవత్ప్రేరణ



------------------
భగవత్ప్రేరణ 
------------------


మహర్షి గౌతముడు దుఃఖాలకు కారణమైన మిథ్యా జ్ఞానాన్ని భ్రాంతి, అవిద్య, అవివేకం అని వర్గీకరించారు.
ఒక విషయాన్ని గురించి సరైన జ్ఞానం లేకపోవడమే మిథ్యాజ్ఞానమని తత్త్వశాస్త్ర కోవిదులన్నారు. ఈ మిథ్యాజ్ఞానం పోతే దాని ద్వారా వచ్చిన దోషాలు, ప్రవృత్తి, జన్మలు ఈ మూడూ తొలగిపోతాయంటారు. జన్మ అంటే జీవుడు శరీరంతో కలిసి ఉండటమే. శరీరం లేకపోతే దుఃఖాలుండవు. దుఃఖం నుంచి తప్పుకోవడమే ముక్తి. అప్పుడే భక్తుడు భగవంతునిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ముక్తి. ఆ ముక్తినే రుషులు పరంధామమని అన్నారు.

మనం అజ్ఞానంతో తెలియక అపరాధం చేసి వాటికి ఫలితంగా దుఃఖాలనుభవిస్తాం. దీనిలో భగవంతుని ప్రమేయం ఏమీ ఉండదు. మనం చేసే ప్రతి మంచిపనికి ఇది మంచిది, దీన్ని తప్పక చేయి, దీని వలన నీకు ప్రయోజనం ఉంటుందని భగవంతుడు ఉత్సాహాన్ని కల్పిస్తాడు. అట్లాగే ఇది చెడుకార్యం, ఇది చెయ్యవద్దు, దీని వలన నష్టం కలుగుతుంది, దుఃఖం వస్తుంది. గౌరవం పోతుంది అని ఆ పనిని చేయకుండా భగవంతుడు మన హృదయంలో ఆందోళన భయం నిరుత్సాహం కలిగిస్తాడు. మనం ఆ భగవత్ప్రేరణను లెక్కచేయక ఆ చెడు పని చేసినట్త్లెతే తప్పనిసరిగా నష్టపోతాం. దానికి తగిన దుఃఖాన్ని అనుభవిస్తాం.

ఒక గ్రామంలో ఒక పురోహితుడున్నాడు. అతడు దైవభక్తి మెండుగా ఉన్నవాడు. ప్రతినిత్యం ప్రభాత సమయంలో లేచి స్నాన సంధ్యావందనాదులను నిర్వర్తించుకొని తన విధులను సక్రమంగా పాటించేవాడు. ఆ పురోహితుడు స్వయం కృషితో ఉన్నత విద్యలను అభ్యసించాడు. విద్యార్థులకు పాఠాలు బాగా చెప్పేవాడు. కొంతకాలానికి అతడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. శుభ సమయంలో గృహ ప్రవేశం చేశాడు. పాత ఇంట్లోని సామాన్లన్నీ కొత్త ఇంటికి తరలించాడు. ఒక్క వస్తువు మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు. అది ఒక నిలువుటద్దం. చాలా పెద్దది. అతని పూర్వీకులు దాన్ని తయారు చేయించారు. అది అద్భుతమైన పనితనంతో ఉంది. అందరినీ ఆకర్షిస్తుంది ఆ నిలువుటద్దం. చాలామంది వచ్చి వారి శక్తియుక్తులను ప్రయోగించి చూశారు. అద్దం బయటకు రాలేదు.
పురోహితుడికి ఏమి చేయాలో తోచడంలేదు. దాన్ని విడిచిపెడదామంటే, అది పెద్దలిచ్చిన అద్దం. తరతరాలుగా ఆ ఇంట్లో అలంకారంగా ఉంది. విడిచేందుకు మనసొప్పడం లేదు. ఏమి చేయాలా అని బాగా యోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. ఒక రోజు కొందరు పెద్దలను ఆహ్వానించాడు. ఆ అద్దం బయటకు వచ్చే మార్గం గురించి అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన సలహా ఇస్తున్నారు. ఒకరు పై ద్వారాన్ని పగలగొట్టమన్నారు. మరొకరు అద్దాన్ని చిన్నది చేయాలన్నారు. ఇంకొకరు ఆ అద్దాన్ని అట్లా వదిలేస్తేనే మంచిదని అన్నారు. ఈ విధంగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. ఇంతలో వివేకవంతుడైన వృద్ధుడు లేచి ద్వారం చిన్నది. లోన అద్దం పెద్దది. కాని అసలా అద్దం లోపలికి ఎలా రాగలిగిందో వూహించండి. పెద్ద అద్దం చిన్న ద్వారం గుండా లోపలికి ఎట్లా వచ్చింది? ఇప్పుడాలోచించాల్సిన ముఖ్య విషయం అద్దం బయటకు ఎలా పోతుందా అని కాదు, అసలా అద్దం ఎలా లోపలికి రాగలిగిందా అని మనమందరం ఆలోచించాలన్నాడు. అక్కడున్న వారందరికి ఇది చాలా సమంజసంగా సత్యవచనంగా అనిపించింది.

లోకంలో జనం దుఃఖమెట్లా పోతుందా? దుఃఖం పోయేందుకు మార్గం ఏమిటని ఆలోచిస్తున్నారు. మహర్షులు అసలు దుఃఖం ఎందుకు వచ్చిందని ఆలోచించి అజ్ఞానం వలన దేహం, దేహం వలన దుఃఖం వచ్చాయని తెలుసుకున్నారు. అజ్ఞానాన్ని ముందు తొలగిస్తే దుఃఖం దానంతట అదే తొలగిపోతుందని నిశ్చయించారు. దుఃఖ నివారణకై జ్ఞానాన్ని ఆత్మ ప్రబోధాన్ని లోకానికి అందించారు. దుఃఖం పోవాలంటే భగవత్ప్రేరణను భద్రంగా ఆలకించి దాన్ని పాటించాలి.
నిష్కామ భావంతో సత్‌ కర్మలు ఆచరించి ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అప్పుడు ఎవరికీ దుఃఖం ఉండదు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి