ᐅఇరుముడి సారం



------------------
ఇరుముడి సారం
------------------


శబరియాత్ర చేసేవారు అయ్యప్ప దర్శనానికి వెళ్లేటప్పుడు తీసుకుని వెళ్లే ఇరుముడి అతిప్రధానమైంది. అతి ముఖ్యమైం. ఈ ఇరుముడే స్వామికి కూడా చాలా ఇష్టమైనదిగా చెబుతారు. ‘ఇరుముడి’. ఇరుము అంటే రెండు భాగాలు అని అర్థం. ముందూ, వెనక రెండు మూతులున్న పెద్ద సంచిని ఇరుముడి అని వ్యవహరిస్తారు. ఈ ఇరుముడిలో ముందుభాగంలో స్వామివారి పూజకి, అభిషేకానికి కావలసిన సామాన్లు పెట్టుకోవడానికి, వెనుకభాగంలో నడిచేటప్పుడు దారిలో వండుకోవడానికి కావలసిన వంట సామానులు, తినుబండారములు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇరుముడి ముందుభాగం మనిషిని, వెనుకనున్న భాగం మనిషి కోర్కెలకు (ప్రారబ్ధకర్మ) ప్రతీక. నడిచి వెళ్లేదారిలో వెనుక వున్న తినుబండారములు ఖాళీ అయినట్లుగా ప్రారబ్ధకర్మ తీరిన తరువాత మనిషి భగవంతుని సన్నిధికి చేరుకుంటాడు. నెయ్యితో నిండిన కొబ్బరికాయ మనిషి శరీరాన్నీ, అందులో వున్న నెయ్యి జీవాత్మని సూచిస్తుంది. కొబ్బరి చిప్పల్ని హోమగుండంలో కాల్చేసి, నెయ్యిని స్వామివారికి అభిషేకం చెయ్యడంలోని అంతరార్థం మనిషి చనిపోయిన తర్వాత శరీరం కాలిపోయి అందులో వున్న జీవాత్మ పరమాత్మతో లీనమైపోతుంది అని దాని పరమార్థం. మనస్సులో వున్న కోరికల్నీ, కల్మషాల్నీ అగ్నిలో కాల్చేసినవాడు భక్తిమార్గం ద్వారా భగవంతుని చూడవచ్చు అన్నదానికి పరమార్థమే ఈ శబరిగిరి యాత్ర- ‘స్వామియే శరణం అయ్యప్ప’. అంతేకాదు తత్వమసి సిద్ధాంతమే ఈ అయ్యప్ప దీక్షకు పట్టుకొమ్మ. తనలో అయ్యప్పస్వామిని చూసుకొని ఎదుటివారిలో కూడా స్వామివారి రూపాన్ని దర్శించకలగడమే ఈ దీక్ష ప్రత్యేకత. అందుకే ఎవరు ఎదురు పడినా ‘స్వామి శరణం’ అంటూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తారు.

- వసంతకుమార్ సూరిశెట్టి


ᐅవిజయదశమి


---------------
విజయదశమి
---------------


శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము 
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?

అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును

ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.

శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.

ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

- కామేశ్వర రావు భైరవభట్ల




ᐅగణేశ స్మృతి


---------------------
వినాయక స్వరూపం
---------------------


శ్రీగణేశ అనే సంస్కృత పదానికి ప్రారంభం అని అర్థం. అందుకే వినాయకుడు ఆదిదేవుడ య్యాడు. సమస్త విఘ్నాలను తొలగించి శుభాలను కలుగజేసేవాడు వినాయకుడు. దేవతాగణాలు ఉద్భవించి సృష్టి ప్రారంభం అయినప్పటి నుంచి ఆదిపురుషునిగా పూజలందుకుంటున్నట్లుగా గణేశపురాణం తెలియజేస్తోంది. గణేశుడు విష్ణుస్వరూపమని ‘శుక్లాంబరధరం విష్ణుం’ శ్లోకం సూచిస్తుంది.

దేజతలలో ప్రథముడైన గణపతిని ముందుగా పూజించిన తర్వాతే ఇష్టదైవాలను ప్రార్థించడం ఆనవాయితీగా వస్తోంది. విఘ్నేశ్వరునికి గణాధిపత్యం ఇవ్వడమే ఇందుకు కారణం. గణపతిని జ్యేష్ఠరాజుగా, సర్వదేవతలలో ప్రథమపూజ్యుడుగా ఋగ్వేదం వర్ణించింది. ముప్పది మూడు కోట్ల మంది దేవతలు గణాలుగా ఉండగా, వారందరికీ అధినాయకుడు గణపతియేనని వేదాలు నిర్దేశించాయి. శ్రీ మహాగణపతి ద్వాదశ ఆదిత్యులకు, ఏకాదశ రుద్రులకు, అష్టవసువులకు కూడా ప్రభువు. ప్రణవనాద స్వరూపుడు కనుక గణపతిగా వెలుగొందుతున్నాడు. యోగానికి అధిపతి గణాధిపుడే అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.

గణపతి సకల విద్యలకూ అధిదేవత. ప్రణవస్వరూపంగా, శుద్ధబ్రహ్మగా, ఆనంద స్వరూపంగా విరాజిల్లే దేవదేవుడు వినాయకుడు. నాయకుడు లేని సర్వ స్వతంత్రుడాయన. ‘గణపతి’ అనే పదంలో ‘గణ’ అనే శబ్దానికి వాక్కు అని అర్థం. కాబట్టి వాగధిపతి గణపతియే!

వినాయకుడు అన్ని యుగాలలో వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు. కృతయుగంలో సింహవాహనంపై పదితలలతో దర్శనమిచ్చాడు. త్రేతాయుగంలో నెమలివాహనంపై మయూరేశుడిగా ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో అరుణకాంతి శోభితుడై, చతుర్భుజుడై అలరారాడు. కలియుగంలో తొండంతో, ఏకదంతుడై సంపద బొజ్జతో ఉన్న గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇందుకు నిదర్శనమేనేమో వివిధ రూపాల్లో వీధివీధుల్లో కొలువుదీరే గజాననుని దివ్య ఆవిష్కారాలు.

తొమ్మిదిరోజులపాటు వినాయక విగ్రహాన్ని భక్తితో పూజించి ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో కలిపి వేయడం బాధగానే ఉంటుంది. కాని అది ఒక సంప్రదాయం. 3, 5, 9 రోజుల పూజ తర్వాత తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహాలకు ఉద్వాసన పలికి ఎక్కడైనా ప్రవహించే నీటిలోగానీ, లోతైన నీటిలోగాని నిమజ్జనం చేస్తారు.ఎన్నో అలంకరణలతో, మనం పోషించుకునే ఈ శరీరం తాత్కాలికమేనని, మూణ్ణాళ్ల ముచ్చటేనని, పంచభూతాలలో నడిచే ఈ శరీరం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవలసిందేననే సత్యాన్ని వినాయక నిమజ్జనం మనకు తెలియపరుస్తుంది.

వినాయకునికి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడికి మంత్రయుక్తంగా పూజ చేసి, దూర్వాయుగ్మం అంటే రెండు గరికలతో పూజ చేస్తారు. వినాయకునికి గరికపూజ ప్రీతిపాత్రం. గరికపోచలలో ఔషధీ గుణం ఉంది. సర్పి, చిడుము మొదలైన వాటికి మంత్రించే వారు గరికపోచలు వాడేది అందుకే.

(Source : Sakhi)

ఓం గం గణపతయే నమః
విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సదా, సర్వదా అభయ, విజయ, లాభ శుభాలు చేకూరాలని.. క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని.. సుఖసంతోషాలు చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు.... !!


ᐅఅణువున వెలసిన దేవా




-------------------------------
అణువు అణువున వెలసిన దేవా
--------------------------------

అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

మనిషిని మనిషె కరిచేవేళ
ద్వేషము విషమయి కురిసేవేళ
నిప్పులు మింగి నిజమును తెలిపి
చల్లని మమతల సుధలను చిలికి
అమరజీవులై వెలిగిన మూర్తుల
అమృత గుణం మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

జాతికి గ్రుహణల పట్టిన వేల
మాతృ భూమి మురు పెట్టిన వేల
స్వరాజ్య సమరం సాగించి
స్వాతంత్ర ఫలమును సాధించి
ధన్య చరితులై వెలిగిన మూర్తుల
త్యాగ నిరతి మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా

వ్యధులు బాధలు ముసిరేవేళ
మ్రుత్యువు కోరలు చాచేవేల
గుండెకు బందులుగా గుండెను పోదిగి
కొన ఊపిరులకు వూపిరిలూది
జీవన దాతవై వెలిగిన మూర్తుల
సేవాగుణం మాకందించరావా
అణువు అణువున వెలసిన దేవా
కనువేలుగై మము నడిపించరావా
అణువు అణువున వెలసిన దేవా



ᐅనవమి కళ్యాణం



---------------------------------
శ్రీరామనవమి-శ్రీరామ కళ్యాణం 
---------------------------------


తెలుగునాట శ్రీరామ నవమి ఉత్సవాలు జరిగేంత వైభవంగా మరే ఉత్సవాలు జరగవన్నది అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంవత్సర ప్రారంభ దినాలలో రామాయణ అనుసంధానంతో వసంత నవరాత్రులు, సీతారామ కళ్యాణం జరుపుకోవడం మన చిర మర్యాద.

వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే |
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా||

వేదవేద్యుడు, పరమ పురుషుడు దశరథరాజ నందనుడుగా అవతరించడంతో వేదం వాల్మీకినోట రామాయణంగా వెలువడింది. రామాయణం సాక్షాత్తు వేదం. వేదంలోని విషయాలను మనకు కనిపించేట్టు చేసేదే రామాయణం. రక్షణ అంటే ఏమి ? భగవంతుడిలోని దయ మనల్ని ఎట్లా కాపాడుతుంది ? ఎట్లా రక్షిస్తాడు ? రక్షించడానికి ఏమేమి పరికరాలు కావాలి ? రక్షణ పొందడానికి మనం ఎం చేయాలి ? దీన్ని తెలుపడానికే రామావతారం.

ప్రపంచంయొక్క సృష్టి, స్థితి, ప్రళయము కార్యాలను భగవంతుడు దయతో చేస్తాడు అని శాస్త్రం చెబుతుంది. సృష్టి, స్థితి అంటే దయతో చేసేవి, ప్రళయం కూడా దయతో చేస్తాడా అనేది ఒక సందేహం. పద్మ పురాణం చెప్పిన విషయం. 'ప్రళయం కూడా దయా కార్యమే'. ఎన్నో జన్మలలో ఎన్నో కర్మలు చేసి ఆ సంస్కారాలని మోసుకు తిరుగుతూ మనల్ని మనం మరచి ప్రవర్తించే అల్పులైన జీవుల్ల దుస్థితిని చూసి జాలి పడి, ఆయన దయా సాగరుడు కనుక ఉపకారం చేయాలని అనుకుంటాడు. కర్మ తొలగించుకొని తనంత ఆనంద స్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో శరీరాన్ని ఇస్తాడు. శరీరానికి ఏర్పడ్డ అవసరాలని ఇస్తూ రక్షణ చేస్తాడు. అవసరం అయ్యాక శరీరాన్ని తీసేయాల్సి వస్తుంది, మనం ధరించే వస్త్రం మాసిపోతే మరొకటి ధరించినట్లుగానే. ఇది కూడా దయతో చేసేది.

మనకు కావాల్సిన విషయాలను మన చుట్టూ ఉన్నవారితో చెప్పిస్తాడు, లేకుంటే గురువుల ద్వారా చెప్పిస్తాడు. అది వీలు పడనప్పుడు తానే ఈ లోకంలో అవతరిస్తాడు. నరసింహుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు ఆయా సందర్భాన్ని బట్టి ఉపకారం చెయ్యడానికి వీలయ్యే అవతారంలో వస్తాడు. ద్వాపర యుగంలో కృష్ణుడిగా వచ్చాడు, ఆ కాలం నియమం ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాడు, అంతకు ముందు త్రేతాయుగంలో రాముడిగా వచ్చినప్పుడు పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నాడు. లోకంలో తాను వచ్చి, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల వలె నడచి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు పడే సుఖదుఃఖాలు తానూ అనుభవిస్తే తప్ప మనకు చెప్పలేడు కనుక తానూ అట్లా అనుభవించాడు. భగవంతుడు ఊరికె చెబితే ఎదుటి వారికి నచ్చదు, మన వలె తానూ అనుభవించి చెప్పాలని మన వద్దకి రాముడిగా వచ్చాడు. నరసింహ అవతారం ఆయన ఒక్కసారిగా స్థంభంలోంచి వచ్చాడు, కానీ రామావతారంకోసం ఆయన నిజంగా పుట్టాడు. ఒక సంవత్సర కాలం గర్భవాసం చేసాడు. నిజంగా పెరిగాడు, నిజంగా తిరిగాడు, నిజంగా గురువులని అనువర్తించాడు. అందుకే మన ఆళ్వార్లు భగవంతుణ్ణి అవతరించాడు అని చెప్పరు, ఆయన పుట్టాడు అని చెబుతారు. ఆయన మన సాటివాడిగా కావాలని మనవలె గర్భవాసం చేసి మన వద్దకు కష్టపడి అంత ఆర్తితో వస్తే, అవతరించాడు అని చెబితే అది ఆయన గొప్పతనాన్ని తగ్గించినట్లు అవుతుందే తప్ప పెంచినట్లు కాదు అని.

అట్లా ఈ లోకంలోకి వచ్చినప్పుడు లౌకికమైన ప్రభావాలు ఆయనపై పడకుండా కాపాడగల్గిన తేజస్వరూపిణి అమ్మ. ఆయన హడావిడిలో నేరుగా వస్తాడు, వచ్చి పూర్తిగా మనిషిగా ప్రవర్తిస్తాడు. కానీ ఆమె వెనకాతల ఏమేమి కావాలో అన్ని పరికరాలతో జాగ్రత్తగా వస్తుంది. రామావతారంలో భగవంతుడు గర్భవాసం చేసి వచ్చాడు, కానీ అమ్మ నేరుగా భూమిలోనే లభించింది. గోదాదేవి అట్లానే వచ్చింది. భగవంతుడు అప్పుడప్పుడు చేయాల్సినవి మరచిపోతుంటే, ఆయనకు చెప్పడానికి ఆమె అన్నీ తెలుసుకొని వస్తుంది. రక్షణ జరిగేది ఆయన వెంట అమ్మ ఉన్నప్పుడే. ఒంటరిగా ఎప్పుడూ రక్షణ చేయడు, ఆయన వెంట శక్తి, యుక్తి, దయ, సౌలబ్యం, సౌశీల్యం ఇలా ఎన్నో ఉండాలి. ఈ కళ్యాణ గుణాలు పైకి రప్పించే అమ్మ ప్రక్కన ఉండాలి. భగవంతుడు రాముడిగా వచ్చినా, ఆయనలో దయని పైకి తేవడానికి అమ్మ సీతగా వచ్చింది. భగవంతుడిని ఆశ్రయించడానికి అమ్మ ప్రక్కన ఉంటే మనలోని లోపాలని చూడ కుండా చేసి ఆయనలోన అణిగి ఉండే ప్రేమ, వాత్సల్యాది గుణాలను పైకి తెచ్చి మనల్ని అనుగ్రహించేట్టు చెప్పగల్గుతుంది. రక్షణ చేయాలంటే ఆమె సాన్నిద్యం ఆయనకి కూడా అవసరం. అమ్మ తన వెంట లేక పోయినట్లయితే, స్వామీ! నీవే కనుక అమ్మను స్వీకరించకపోయినట్లయితే, అమ్మ వెంట లేక నీవు అడవిలో సంచరించినట్లయితే "అసరస మభవిశ్యన్" అని అంటారు పరాశరబట్టర్ వారు. తాను అడవికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అమ్మను తన వెంట రావద్దు అని చెప్పాడు స్వామి. కానీ 'నేను వెంట లేకుంటే నీవు చేయాల్సిన లోకరక్షణ జరగదయా' అని వెంట వచ్చింది అమ్మ. అట్లా రక్షణ కోసం చేసే కార్యాల్లో ప్రధానమైనది సీతమ్మను వివాహ మాడటం.

శ్రీరామచంద్రుడు ధనుర్భగం చేసి సీతమ్మను వివాహమాడే సన్నివేశం మనకు ఎంతో స్పృహణీయం. ఆత్మ ఏ తత్వానిపై నిలపదగును. శాస్త్రాల్లో ధనస్సు అంటే ఓంకారం లేక ప్రణవం అని అంటారు. "ప్రణవో ధనుః శిరోహ్యాత్మా బ్రహ్మతలక్ష్యముచ్చతే" అని ఉపనిషత్ చెబుతుంది. ప్రణవం అంటే వంగేది అని అర్థం. ప్రణవం ఎవరికి వంగుతుందో వాడికి ఆత్మను అర్పించ దగును. ఎందరో ప్రయత్నించారు కానీ ఆ ధనస్సుని వంచలేక పోయారు. లోకంలో ఎందరో ఎన్నో దైవాలను చూపిస్తుంటారు, అట్లా ఎవరికో ఒకరికి అని మన ఆత్మని అర్పించవచ్చా ? దానికి సమాధానం ఓంకారం ఎవరిని చెబుతుందో వారికి అర్పించతగును. ధనస్సు వంగింది రాముడికొక్కడికే. ఓంకారం వంగేది రాముడికి మాత్రమే. రాముడు ఎవరు ? "ఏతస్మిన్ అంతరే విష్ణురుపయాతః మహా ద్యుతిః" అని దశరథుడికి సంతానంగా అవతరించింది విష్ణువే కదా. ఓంకారం ఎవరిని చెబుతుంది అని శాస్త్రానికి ప్రశ్న వేస్తే ఓంకారం కారణ దశలో వెళ్ళి చేరేది అకారంలో. "అదితి భగవతో నారాయణస్య ప్రథమ విధానం" అకారం నారాయణుడి యొక్క మొదటి పేరు. ప్రణవం వంగేది నారాయణుడికి. ఆయన ఆత్మను పాలించగల వ్యక్తి, క్షేమం కలిగించగల వ్యక్తి అని శాస్త్రం చెబుతోంది. అందుకే జనకుడు ధనస్సును పెట్టి, ఆధనస్సుని వంచినవాడికి సీతను అర్పించాడు. మనం చెందేది నారాయణునికి మాత్రమే. అట్లా మన ఆత్మని అర్పించదగినవాడు నారాయణుడు మాత్రమే.


శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృష్యం. ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. ఓంకారానికి తాత్పర్యమేమి ? ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యం. ఓంకారం అంటే 'అ' అనే అక్షరం, 'మ' అనే అక్షరం మద్యన 'ఉ' అనే అక్షరం ఉంది. 'అ' అనేది భగవంతుడి మొదటి నామం. అక్షరానాం అకారోస్మి. ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విరిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు. రెండో ఖండం 'అ' తో కలిసి ఉండే జీవుడు, అంటే మనం. 'మ' అనేది 'మన్ జ్ఞానే మన్ అవభోదనే' జ్ఞానం అనేదే ఆకృతిగా, గుణంగా కలవాడు. అ కి మ కి మధ్యన ఉన్న ఉకారమే ధనస్సు యొక్క రెండు కండాల మధ్య ఉన్న నారి. ఉకారం భగవంతుడికి జీవుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు. సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది. అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడరానిది. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి. ఇది చెప్పడానికే "నీవే తల్లివి తండ్రివి ..." అనే పద్యం. 'త్వమేవ సర్వం మన దేవ దేవ' ఇది భగవంతుడి ఒక్కడితోనే ఇట్లాంటి సంబంధం. ఇది తరగదు, నశించదు, చెదరదు. ఆ సంబంధాన్ని మనం మరిచాం కానీ ఆయన ఎప్పుడు మరవడు. ఇది చూపడానికే ధనస్సు యొక్క రెండు ఖండాలు, దాని మధ్యన విలక్షణమైన సంబంధమే ఆ నారి. అందులో ఒక దాన్ని పట్టుకొని "ఓంకార ప్రతిపాద్య దైవం నేను సుమా! ఓంకారం చెప్పేది నన్ను సుమా! జీవుడు నాకు సంబంధించినవాడే కానీ స్వతంత్రుడు కాదు" అనేది చూపించాడు. ఇక్కడ గుర్తించాల్సింది ఒకటి తత్వమతడు,రెండోది ఇద్దరి మధ్య ఉన్న సంబంధం నిత్యం, మూడోది మనం వానికే చెందే వారిమి. ఇది నిరూపించడం కోసమే ఆనాడు రామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు.అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది, అందుకే వారిరువురిని ఒక చోట చేర్చి సేవించుకొనేందుకు 'సీతారామ కళ్యాణం'.

- శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళా శాసనాలు

శ్రీ సీతా రామ కళ్యాణోత్సవం (2013) - భద్రాచలం : TV9 & SVSC

Part - 1 > http://www.youtube.com/watch?v=PbQwFMicCXY

Part - 2 > http://www.youtube.com/watch?v=UDg2TK06H08

Part - 3 > http://www.youtube.com/watch?v=CdJrGD2-atc

Part - 4> http://www.youtube.com/watch?v=geMV96dx5KM

Part - 5 > http://www.youtube.com/watch?v=7W23uTa2gdI

Part - 6 > http://www.youtube.com/watch?v=aDZdQL01CEs

Part - 7 > http://www.youtube.com/watch?v=xP6ViFLCDyY

Part - 8 > http://www.youtube.com/watch?v=_cnMiBxPPjc

Part - 9 > http://www.youtube.com/watch?v=XqJVUhdthRc

Part - 10 > http://www.youtube.com/watch?v=Xz7JJP2TiaE

Part - 11 > http://www.youtube.com/watch?v=SNJfmTr8BoA



ᐅఉగాది విశిష్ఠత



---------------
ఉగాది విశిష్ఠత
---------------

ఋతువుల్లో వసంత ఋతువు అత్యంత మనోహరమైనది. ఖగోళవిజ్ఞానం ప్రకారం భూమి 23 1/2 డిగ్రీలు ఏటవాలుగా ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతున్న కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతుచక్రం పూర్తికావడానికి సంవత్సరకాలం పడుతుంది. శీతల దేశాల్లో ఋతువులు వసంతం, వేసవి, ఆకురాలు కాలం, చలికాలంగా వుంటే ఎస్కిమోలు నివసించే ప్రాంతాల్లో కేవలం వేసవి, చలి ఋతువులే ఉన్నాయి.

భారతదేశంలో 2 నెలలకాలం ఒక ఋతువుగా చెప్పబడింది. తెలుగు నెలల ప్రకారం చైత్ర, వైశాఖ మాసాలను – వసంత ఋతువుగానూ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలను – గ్రీష్మ ఋతువుగానూ, శ్రావణ, భాద్రపదమాసాలను – వర్ష ఋతువుగానూ, ఆశ్వయుజ, కార్తీక మాసాలను – శరదృతువుగానూ, మార్గశిర, పుష్యమాసాలను – హేమంత ఋతువుగానూ, మాఘ, ఫాల్గుణ మాసాలను – శిశిర ఋతువుగానూ పేర్కొంటూ ఆరు ఋతువులను ఏర్పాటు చేసుకున్నాం.

వసంతం నుండి శిశిరం వరకు సంవత్సరకాలాన్ని లెక్కకట్టుకోవడంలో ఓ ప్రత్యేకత ఉంది. శిశిరంలో వృక్ష సంతతి ఆకులనూ, బెరళ్ళను వదిలేసి వసంతంలో తిరిగి కొత్త అందాలను నింపుకుంటుంది. ఈ మార్పు ప్రకృతిలో పచ్చదనాన్ని నింపడంతో పశుపక్ష్యాదులతో పాటు మానవ సంతతి మనస్సులు కూడా నూతనోత్తేజంతో తొణికిసలాడతాయి. అందుకే వసంతం కొత్త అందాలనే కాదు క్రొత్త ఆశలను కూడా మోసుకొస్తుంది. సాక్షాత్తూ శ్రీ కృష్ణపరమాత్మ సైతం భగవద్గీతలో ఋతువుల్లో నేను వసంత ఋతువునని చెప్పుట ద్వారా వసంత ఋతువు ప్రత్యేకతను ప్రపంచానికి అందించాడు.

కాలమానం.. కాలమానంలో సూక్ష్మ ఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు మొదలైనవన్నీ ఏర్పరచిన అతి ప్రాచీనకాలం మనది. విదేశీయులు కూడా ఖగోళశాస్త్ర ఆధారంగా వారికి తోచినట్లు ఆంగ్ల కాలమానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రపంచమంతా ఆంగ్లకాలమానాన్ని ఏకరీతిన అనుసరిస్తున్నా హిందువులు మనకాలమానాన్ని సరైన కాలమానంగా భావించడం జరుగుతోంది. ఖగోళశాస్త్ర ప్రకారం చంద్రమానం, సౌరమానం, చాంద్ర సౌరమానం అని మూడు కాలమానాలున్నాయి. చంద్రమానంలో ఒకే పద్ధతిని అనుసరించినా, సౌరమానంలో విదేశీ పద్ధతి, హిందువుల పద్ధతి అని రెండు పద్ధతులున్నాయి. చంద్రుని నడకలను అనుసరించి మాసాలను, సూర్యుని నడకలను అనుసరించి సంవత్సరాన్ని లెక్కకడతాం. చంద్ర, సౌరమాన పద్ధతిలో కనిపిస్తుంది. చంద్ర, సౌరమానం వలన ‘లుప్తమాసాలు’, ‘అధికమాసాలు’ ఏర్పడతాయి. భారతదేశంలో అధిక శాతం హిందువులు ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు. కొత్త సంవత్సరం ఆరంభ దినాన్ని ‘యుగాది’ అంటున్నాం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజును సంవత్సరాదిగా సౌరమానాన్ని పాటించే హిందువులు కూడా వున్నారు. తమిళనాడు, కేరళ, ఒడిసా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల హిందువులు ఈ విధంగా సంవత్సరారంభం జరుపుకోవడం వలన ఈ పండుగ వైశాఖ మాసంలో వస్తుంది.

చంద్రుని నడకలను అనుసరించి చైత్రమాస శుద్ధ పాడ్యమినాడు మిగతా ప్రాంత హిందువులు సంవత్సర ఆరంభ దినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇదే తెలుగువారి ఉగాది కూడా. మన దేశంలో యిలా రెండు రకాలైన కాలమానాలను అనుసరించి ఉగాదిని జరుపుకోవడంలో ఖగోళ విశిష్ఠత కనిపిస్తుంది.
హిందువులు రెండురకాలైన ఉగాది పర్వదినం జరుపుకుంటున్నా దానిలో ‘ఏకత్వం’ కనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య కొద్దిపాటి రోజులు తేడాలున్నా రెండూ వసంతకాలంలోనే ఉండడం విశేషం!

చాగంటి కోటేశ్వర రావు > ఉగాది ఉపన్యాసం : http://www.youtube.com/watch?v=5S_uM0evBZ4

ᐅసంక్రాంతకులు


---------------------------
సంక్రాంతకులు
---------------------------


ప్రకృతిలో పరమేశ్వర కారుణ్య స్వరూపాన్ని చూడగలిగినవాడే ధన్యుడు. అలాంటి ధన్యతనిచ్చే సంస్కారాలు భారతీయుల పండుగల్లో ప్రత్యక్షమవుతాయి.
ప్రకృతి పరిణామాల్లో ఉండే దివ్యశక్తిని తెలుసుకొని, ఆ శక్తి మనలో నింపుకొనేలా పర్వదినాలను ఏర్పరచారు మహర్షులు. అలాంటి పర్వమే సంక్రమణం.

'ఈ ద్వావా పృథువులు (ఆకాశం, భూమి) మీకు సాఫల్యమొసగుగాక! ఇవి తండ్రీ తల్లులవంటివి...' అని ఒక వేదమంత్ర భావం.

భూమిని తల్లిగాను, ఆకాశాన్ని తండ్రిగాను మన ఆర్షసంస్కృతి సంభావించింది. మనల్ని తల్లిలా భరించి పోషిస్తున్నది భూమాత. ఈ తల్లికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి, సఫలతను చేకూర్చుతున్నది ఆకాశం.

నింగి నుంచి కురిసే వర్షాదులు, జ్యోతిర్మండలాల కాంతీ, ఆకాశరాజైన సూర్యభగవానుని ప్రాణశక్తి భూమి గ్రహిస్తున్నది. భూవాసులు పోషణ పొందుతున్నారు. అందుకే గగనాన్ని తండ్రి భావంతో దర్శించారు.

ఎన్ని సౌరకుటుంబాలు ఉన్నా మన భూమికి సంబంధించిన సూర్యుడే మనకు ఆకాశరాజు. అందునా గగనంనుంచి సూర్య, మేఘాదుల శక్తులను వేర్వేరు కాలాల్లో, వివిధ ప్రాంతాల్లో ఒకే భూమిపై జీవరాశి రకరకాలుగా పొందుతోంది. ఆయా దేశకాలాల్లో ఉన్నవారిని అనుసరించి విభిన్న ప్రాంతాల్లో పలు పర్వాలు ప్రసిద్ధిచెందుతాయి. భారతదేశంలో అనేక పర్వాలు అన్ని ప్రాంతాలవారికీ సర్వసాధారణమే అయినా, వాటిని జరుపుకొనే రీతుల్లో భిన్న ధోరణులు కనిపిస్తాయి.

సమస్త ధార్మిక గ్రంథాల్లోను సంక్రాంతకులకు ఉత్కృష్ట స్థానం ఇచ్చారు. అందునా ఉత్తరాయణారంభ సంక్రాంతి అయిన 'మకరసంక్రాంతి'కి ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యముంది. ఈరోజున స్నాన, దాన, జపతపాలకు ప్రాముఖ్యం. అందుకే గంగ మొదలుకొని కావేరి వరకు భారతీయ నదీతీరవాసులు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఆ తీరాల్లో పితరులకు తర్పణాదులు సమర్పిస్తారు. దాన, అనుష్ఠానాదులు చేస్తారు. పంటఫలాలను 'భోగి'ంచే పర్వం సంక్రమణాన్ని స్వాగతిస్తుంది.

దక్షిణాపథంలో సూర్య(కాంతి)గమన పరిణామం మాత్రమే కాక, భూమి పండుగగా ఆచరించడమూ కనిపిస్తుంది. భూమాత దయవల్ల, కాంతి వర్షాదుల అనుకూలతవల్ల పంటలు పండాయని భావించి- వారి పట్ల కృతజ్ఞతతో సూర్యారాధన, ఇతర దేవతారాధన చేయడం ప్రధానం.

మన కృషితో మనం వ్యవసాయఫలాన్ని పొందగలం. నిజమే కానీ ఆ కృషి ఫలించేలా దైవం అనుకూలించాలి. అనుకూలించిన దైవానికి కృతజ్ఞతాపూర్వక భక్తిభావాన్ని ప్రకటించాలి. ఆ సంస్కారం ఈ పండుగలో కనిపిస్తుంది.

దేవతల్నీ పితృదేవతల్నీ ఆరాధించిన తరవాత, సాటి మానవులతో పంచుకొని ఆనందించే పర్వంగా సంక్రమణ కాలం గడుస్తుంది. దానాలు, వేడుకలు మొదలైనవి ప్రతి పల్లెలో తారసిల్లుతాయి. వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో వ్యవసాయరంగానికి ఉన్న ప్రత్యేకత, పవిత్రత ఈ పండుగలో స్పష్టమవుతాయి. రైతుకీ, వ్యవసాయానికీ దేశం ప్రాధాన్యమివ్వాలి... అని మన పూర్వగ్రంథాలు నొక్కి చెప్పాయి. ఎంత పారిశ్రామిక ప్రగతి అయినా- ఆహార సమృద్ధి ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రాకృతిక పద్ధతుల్లో సాగిన భారతీయ వ్యవసాయ విధానంలోని గొప్పతనాన్ని ఇప్పుడే ప్రపంచం గుర్తించి అనుసరిస్తోంది.

సేంద్రీయ ఎరువుల వాడకం, పశుసంపద సాయంతో వ్యవసాయం వంటి శ్రేష్ఠమైన పద్ధతులు భారతీయులవి. అందువల్లే- ఈ సౌరపర్వంలో పశువుల్నీ పూజించడం కనబడుతుంది. తమ కృషిలో భాగస్వాములైన పశువులపట్లా కృతజ్ఞతా భావాన్ని ప్రకటించే భారతీయ సంస్కారానికి జోహారులు. శ్రమజీవుల పండుగగా ప్రశంసించదగిన ఈ మహాపర్వంలో సమాజంలో అందరితో పంటఫలాలను పంచి, పరవశించడం ప్రత్యేకత.

ధనుర్మాసంలో సందడిగా, సౌందర్యంగా రంగవల్లులతో, గొబ్బెమ్మలతో పౌష్యలక్ష్మీకళలు ఉట్టిపడే తెలుగువాకిళ్లు, మకర సంక్రమణంతో ఐశ్వర్యాలను ఆహ్వానించి ప్రతిష్ఠచేస్తాయి. పనిచేసే బసవయ్య కూడా అలంకారాలతో హారతులందుకుంటుంటే, మరో ఆబోతు గంగిరెద్దుగా ఈశ్వరవాహనాన్ని తలపింపజేస్తుంది. గోవుమాలక్ష్ములు కోటి దండాలందుకుంటాయి.

కొత్త బియ్యం ఆవుపాలతో ఉడికి పాయసమై, సూర్యదేవునికి నివేదనయై, మనకు 'పొంగలి' ప్రసాదమవుతుంది. పంటతో మొదటిసారి వండి ఆదిత్యునికి నివేదించే ఈ భక్తిభావన- నింగినీ నేలనీ ఆత్మీయంగా అనుబంధించే ఉదాత్త సంస్కృతి. పల్లెబతుకులోని సహవాస సౌందర్యానికి సాకారమైన సంక్రాంతినాటి రీతిలో సాగినప్పుడు, దివీభువీ మనకు అనుకూలించి సాఫల్యాన్ని ఇచ్చి తీరుతుందనడంలో సందేహముంటుందా!

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅసంక్రాంతి అర్థం



-------------
పెద్ద పండుగ 
-------------


మనిషి ఆలోచనలను గ్రహించడానికి మాట ఎలాగో, ఒక జాతి ఆలోచనలను, ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ! ఏ ప్రాంతంలో అయినా, పండుగలను జరుపుకొనే తీరు పరిశీలిస్తే- ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత ప్రజల అలవాట్లు కట్టుబాట్లు తెలుస్తాయి. కనుకనే పండుగలను జాతి జీవనాడికి కొలమానాలుగా చెబుతారు. వాటిని సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. పండుగలనాటి జనజీవన వ్యవహారశైలిని రూపొందించిన మన పెద్దల దృష్టిలో ప్రాణికోటి అంటే మానవులొక్కరే కాదు- జంతువులు, వృక్షాలతో సహా సృష్టిలోని జీవజాలం మొత్తాన్ని వారు ప్రాణికోటిగా పరిగణించారు. ఆచార వ్యవహారాల్లో వాటికి భాగం పంచారు. పశువులూ పక్షులూ మానవ పరివారంలో భాగమేనన్నది పండుగల ద్వారా మనపెద్దలు అందించిన సందేశం. సంక్రాంతి పండుగ దానికి చక్కని ఉదాహరణ. సంక్రాంతి అనే మాటకు చేరువ కావడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని సంక్రాంతిగా పరిగణిస్తారు. పండుగలనేవి మనుషుల్ని కలపడానికే పుట్టాయి. సంక్రాంతి రోజుల్లో మన విధులను పరిశీలిస్తే ప్రకృతితో లయకలిపి జీవించడమే సంక్రాంతి అనే మాటకు అసలు అర్థంగా తోస్తుంది.

మూడు రోజుల పెద్దపండుగలో మొదటిది భోగి పండుగ. ధనుర్మాసానికి ముగింపు అది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న దానికి సంకేతమే భోగి. పాతసామాన్లు, చీపుళ్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులు లాంటి మానవ దారిద్య్ర చిహ్నాలను మంటల్లో తగలబెట్టడం ఆనాటి ఆచారం. లేమి చీకట్లలోంచి భోగవికాసాల్లోకి దారిచూపే ఆ మంటల్ని భోగిమంటలన్నారు. మర్నాటి నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనిషి ఉత్సాహంగా ఆహ్వానించడానికి అవి చిహ్నాలు. పండిన పంటలు చేతికి అందే ఆనందపు రోజులవి. తెల్లగా వెల్లలు పూసిన గాదెలు నిండు ధాన్యపు రాశులతో కళకళలాడే సమయం అది. వాటిని గరిసెల్లో గాదెల్లో నింపడానికి ముందే గ్రామీణులు తమ ఇళ్లచూరులకు, దేవాలయ ప్రాంగణాల్లోను కొత్త ధాన్యపు కంకుల్ని కుచ్చులుగా కట్టి వేలాడదీస్తారు. చూడటానికి అవి వడ్ల కిరీటాల్లా ఉంటాయి. పిచుకలనూ, పిట్టలనూ అవి ఆహ్వానిస్తాయి. మందలు మందలుగా చేరిన పక్షుల బృందగానాల రొదతో కొత్త సున్నాలు వేసిన రైతుల ఇళ్లు చిలకలు వాలిన చెట్లు అయిపోతాయి. ఇంటికి పండుగ వాతావరణాన్ని ఆపాదించడంలో ఆ సందడి చాలా ముఖ్యమైనది. పిల్లల కేకలు, పక్షుల అరుపులు లేకుండా నిశ్శబ్దంగా ఉసూరుమంటూ ఉండే ఇంటికి పండుగ శోభ రమ్మన్నా రాదు. ఇంటి ముంగిట ముగ్గుల్లోని గుల్లసున్నం ఘాటు, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమల వింత పరిమళాలను కలుపుకొని ఇల్లంతా చక్కగా వ్యాపించిందంటే పెద్దపండుగ వచ్చేసిందని అర్థం.

ఇంతలో తంబురమీటుతూ, 'హరిలో రంగ హరి' వినిపిస్తూ (వైష్ణవం) హరిదాసులు, 'శంభో' అని పెద్దధ్వనితో శంఖం పూరిస్తూ (శైవం) జంగందేవరలు, 'అంబ పల్కు జగదంబ పల్కులను వినిపించే బుడబుక్కల వాళ్లూ, 'అయ్యగారికి దండం అమ్మగారికి దండం' అంటూ గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు శోభ చేకూరుస్తాయి. సంపదల సమృద్ధితో సంతోషంగా ఉన్న గృహస్థులు వారిని సత్కరిస్తారు. భోగినాటి ఆకర్షణల్లో గొబ్బెమ్మల పూజ ప్రధానమైనది. భాగవతంలోని కాత్యాయనీ వ్రతమే దీనికి పునాది. కన్యలు వేకువనే లేచి, వాకిట రంగవల్లులు తీర్చి. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి, గుమ్మడి పూలతో అలంకరించి, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే దృశ్యం చూస్తే పండుగంటే ఇదేసుమా అనిపిస్తుంది. పట్టు పరికిణీలు, వెండిమువ్వల కేరింతలు... భోగి కళ కన్నుల పండుగ! 'సుబ్బీ సుబ్బమ్మ! శుభములీయవె, తామర పూవంటి తమ్ముణ్నీయవె, చేమంతి పూవంటి చెల్లెలినీయవె' అంటూ కన్నెపిల్లలు గొబ్బెమ్మల రూపంలోని గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ పాటలోని నిజమైన ఆంతర్యం చివరి పంక్తిలో ఉంది. 'మొగలి పువ్వంటి మొగుణ్ని ఈయవే'- అనేదే అసలైన ప్రార్థన. భార్య సంపెంగ పూవులాను, మొగుడు మొగలిపూవులాను ఉండాలనుకోవడంలో చక్కని చమత్కారం ఉంది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు. మొగలిపూవు శివార్చనకు పనికిరాదు. 'నా మనిషి నాకే సొంతం' తరహా గడుసు అంతరార్థం కారణంగా ఈ పాట తరతరాలుగా నిలిచింది. ఇక తల్లిహోదా పొందిన ఇల్లాళ్లకు ఈరోజు చేతినిండా పని. పదిమందినీ పిలిచి పేరంటం చేసి, తమ పిల్లల నెత్తిన రేగుపళ్లు కొబ్బరిముక్కలు పచ్చిశెనగలు నాణాలు కలిపిన భోగిపళ్ల సంబరాలతో హారతులు ఆశీస్సులు ఇప్పిస్తారు. భోగినాడు ఇంద్రుడికి పొంగలి నైవేద్యం ఆనవాయితీ. రాబోయే వేసవితాపాన్ని తగ్గించి, తొలకరినీ, సకాల, సంపూర్ణ వర్షాలతో పంటలను బాగా అనుగ్రహించాలన్న ప్రార్థనలతో 'ఇంద్ర పొంగలి' నివేదిస్తారు. మొత్తంమీద పెద్దాచిన్నా, ఆడామగ, పిల్లామేకా, పక్షీపశువూ, చెట్టుచేమా... మొత్తం మానవ పరివారానికి చెందిన పూర్తిస్థాయి పండుగ ఇది. అందుకే ఇది పెద్దపండుగ!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

ᐅశివస్వరూపం



----------------------
శివస్వరూపం
---------------------


జన్మించిన క్షణంనుంచీ మనల్ని కాలవాహిని మన రూపురేఖల్ని, తనువును, దాంతో మనసును మారుస్తుంది. జీవన ప్రయాణం మృత్యువు దగ్గర ఆగిపోతుంది. మృత్యుమందిరం దగ్గరకు మనలో అధికులు రోగులుగా, పాపులుగా వీపున దుష్కర్మల మూటలు మోస్తూ చేరుకుంటారు. దైవం మనిషిని శరీర రూపధారిగా గుర్తించడు. ఆత్మగానే చూస్తాడు. పరమాత్మనుంచీ ఆత్మ విడిపోతుండగా, ఆప్యాయంగా జ్ఞానమును సద్వినియోగం చేసుకున్న జీవుడు మృత్యుమందిర ద్వారాలు దాటి, పరమాత్మ ఎదుట తేజోమయమైన ఆత్మస్వరూపుడు అవుతాడు.

గండకీ నది ప్రవాహానికి కరిగిపోయే రాళ్ళే, నునుపుదేలి శివస్వరూపాలైన సాలగ్రామాలవుతాయని ప్రతీతి. అంటే కాలవాహినిలో శిలలు సైతం తమను తాము సంస్కరించుకుని, శివస్వరూపంగా రూపొందుతున్నాయి. మరి మనిషి మాటేమిటి? పూచిక పుల్లలు నీటిలో తేలుతూ ప్రవాహ వాలులో పడికొట్టుకు పోయినట్లు అర్థరహిత జీవితాలు గడపటం తప్ప, జీవితం ముగిసిపోయేదాకా మేలుకోరా? జీవన చరిత్రలో ప్రతి ఏటా వసంతాలు వస్తున్నాయి. శిశిరాలు, గ్రీష్మాలు, వర్షాలు మనల్ని తమతమ ప్రత్యేకతలతో అలరిస్తున్నాయి. ప్రకృతినుంచి మనం ఎలాంటి సందేశాలూ అందుకోవటంలేదు.

అర్థవంతంగా మార్చుకోవాల్సిన జీవితాలను వ్యర్థమయం చేసుకుంటున్నారు. ఎదురుగా హిమశిఖరాలు ఆహ్వానిస్తుంటే దిగువన ఉన్న లోయల్లోకి దిగిపోతున్నారు. ప్రయాణం దిశ మారాలి. పాదాలు ఎత్తుకు అలవాటు పడాలి. ఆధ్యాత్మికత ఉత్తమ, ఉన్నత ప్రమాణాల జీవిత శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడు జీవన ధారలోంచి వేరుపడి, సాక్షిగా ఆ ప్రవాహాన్ని మందహాసంతో వీక్షిస్తారు. అదే మోక్షం.

 - కాటూరు రవీంద్ర తివ్రికమ్‌

ᐅగురు నిర్దేశం


-------------
గురు నిర్దేశం
--------------

చూసేది ఏది, చూసేవాడెవరు అన్నవాటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలిగేవాడు వివేకి. కన్ను చూసేది. వస్తువు కనిపించేది. ఆ రెంటికీ ఉన్న సంబంధాన్ని గుర్తించగలిగేది మనసు. అలాగే జ్ఞానదృష్టి కలిగినవాడు మనసును చూడగలుగుతాడు. పరమాత్మను దర్శించగలుగుతాడు.
ఒక దీపాన్ని చూడటానికి మరో దీపం అవసరంలేదు. చీకటిలో మరో మనిషి ఉన్నాడో లేదో చూడటానికి కావాలి. కాని, మనం ఉన్నామని రూఢి చేసుకోవటానికి ఏ దీపమూ అక్కర్లేదు. ఆధ్యాత్మికమైన మనిషి ఆత్మ పరమాత్మలోని నిత్యమైన ఒక అంశ అని గ్రహించాలంటే ఆత్మసాక్షాత్కారం కావాలి. జ్ఞానికది సుసాధ్యం. అహంకారికది అసాధ్యం. ఈ అహాన్ని వదిలించుకోవాలంటే 'ఇది నాది, చేయించేది నేను' అన్న భావనను విడిచిపెట్టాలి. పరావర్తనం చెందిన ఆ అహం అంతరించిపోయినప్పుడు కాని, శరీరం మీద మమకారం నశించదు. అది పోతేకాని, మనసు పరమాత్మ మీద లగ్నంకాదు. సామాన్యుడికిది గ్రహించే వివేక దృష్టి ఉండదు.

ఒక రాజకుమార్తె వజ్రాలమాలను ఎవరో ఎత్తుకుపోయారు. దాన్ని వెదికితెచ్చినవానికి వెయ్యి బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని మహారాజు ప్రకటన చేశాడు. ఒక ముష్టివాడు ఈ సంగతి విన్నాడు. అతనొక మరికికాలువ పక్కగా వెడుతుండగా ఆ నీళ్ళల్లో తళుక్కుమంటున్న వజ్రాలమాల కనిపించింది. అతను గబగబా కాలువలోకి దిగి ఆ మాలను దొరకబుచ్చుకోవాలనుకున్నాడు. కాని, అది అతని చేతికి అందలేదు. మళ్ళీ గట్టుమీదికి వచ్చి చూశాడు. ఆ మురికి నీళ్ళల్లో అది ఉన్నట్టే కనిపించింది. చిత్రంగా నీళ్ళలో దిగిచూస్తే చేతికి తగలటంలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక సాధువు అటుగా వచ్చాడు. ముష్టివాడు పడుతున్న అవస్థను పరికించాడు. దేనికోసం వెతుకుతున్నావు నాయనా- అని మృదువుగా అడిగాడు. ముష్టివాడికి నిజం చెప్పాలని లేదు. చెబితే తనకు దొరకబోయే బహుమతిలో సాధువుకు సగభాగం పంచి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతని భయం. సాధువు మందహాసం చేశాడు. అతనికి ఏమి దొరికినా తనకు దానితో నిమిత్తం లేదన్నాడు. అప్పుడు ముష్టివాడు తనకు కావాల్సిందేమిటో చెప్పాడు. 'పిచ్చివాడా! ఆ మురికినీళ్లలో వజ్రాలమాల నీకెలా దొరుకుతుంది? గట్టున ఉన్న చెట్టు వైపు చూడు' అన్నాడు.

ముష్టివాడు తలెత్తి చూశాడు. ఇంతసేపూ తాను మురికి నీళ్ళల్లో చూస్తున్నది వాస్తవమైన వజ్రాలమాల కాదని- కేవలం దాని ప్రతిబింబమని గ్రహించాడు. ఏ కాకి తెచ్చిపడేసిందో- ఆ వజ్రాలమాల చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుని అతనికి కనిపించింది.

వస్తువు ఉన్నచోటు వేరు. అతను వెదుకుతున్న చోటు వేరు. ఇంత సేపూ అతనికి వేరేచోట ఉన్నట్టు అనిపించింది. అది తెలుసుకునే వివేకం అతనికి లేదు. అందుకే సాధువు మార్గదర్శనం అవసరమైంది. ఆత్మసాక్షాత్కారం కాక తికమకపడే అన్వేషికి ఆధ్యాత్మిక గురువు అవసరం కూడా ఇలాగే ఉంటుంది!

- తటవర్తి రామచంద్రరావు


ᐅజ్యోతి


--------------
జ్యోతి
--------------

మానవుడు శాశ్వతుడు కాడు. మానవుడు అశాశ్వతుడు. మర్త్యుడు. మర్త్యుడు అంటే చావు కలిగినవాడు అని అర్థం. మట్టిలో కలిసిపోయేవాడు, మృత్యుతత్వం కలవాడు, మరణం కలవాడు అని అర్థం.

గ్రామాల్లో స్త్రీలు నాలుగైదు కుండల్ని దొంతరగా తలమీద పెట్టుకొని పోతూ ఉంటారు. గతుకుల బాటపై సైతం నీటిచుక్కయినా తొణకదు. నిశ్చలచిత్తం కలిగినవారి జీవనయాత్ర ఇలాంటిదే! ఆత్మవిశ్వాసం లేనివాళ్లు ఈ కుండ దొంతరలను సరిగా మోయలేరు. లోపల అనుమానం ఉంటే కాళ్లు తడబడతాయి. నీళ్లు తొణుకుతాయి. శరీరం కంటే మనసు బలంగా ఉంటే భయం ఉండదు. 'ప్రపంచంలో పాపమనేది ఉంటే అది ఆత్మవిశ్వాసం లేకపోవడమే' అంటాడు వివేకానందుడు. ఆత్మవిశ్వాసం పైమెట్టు ఈశ్వరుడిపై విశ్వాసం. ఈశ్వరుడు పరంజ్యోతి స్వరూపుడు. ఈశ్వర విలాసంపై విశ్వాసమున్నవారి హృదయమనే దీపకళిక నిశ్చలంగా ప్రకాశిస్తుంది. తాను హరించుకుపోతున్నా లోకానికి వెలుగునిచ్చే త్యాగగుణానికి 'జ్యోతి' పరమ ప్రతీక. భౌతిక జ్ఞానంకంటే దివ్యజ్ఞానం గొప్పది. యుక్తి ప్రయుక్తులతో పనిలేకుండా దివ్యజ్ఞానంతో మహాత్ములు సత్య స్వరూపాన్ని సందర్శించారు. సూర్యుని వెలుగులో వస్తువులన్నీ వాటికై అవే కనబడతాయి. దివ్యజ్ఞానంతో 'లోలోపలి' విషయాలనూ చూడవచ్చు. ఆ దివ్యజ్ఞానానికి ప్రతీకగా ప్రకాశించేది జ్యోతి!

ᐅదైవకృపాపాత్రం



----------------------------
దైవకృపాపాత్రం
----------------------------


ఉన్నతమైన ఆలోచనల్ని, ఆశయాల్ని దరిచేర్చుకొన్నవారే గొప్పవారు. అందరి మంచితోనూ అందరి ఆనందం ఉందని గ్రహించినవారే నిజమైన శ్రీమంతులు. అశాశ్వతమైనవేవో, శాశ్వతమైనవేవో, భగవంతునికి ఇష్టమైనవేవో వీరు గ్రహించగలరు. వారి జీవితాల్లో ఆధ్యాత్మిక అందాలు విరబూస్తాయి. ఇలాంటి మహావ్యక్తుల వల్లనే సామరస్య భావమాధుర్యాలు జీవం పోసుకొంటాయని లోకహితైషుల ఉద్బోధ.

ప్రపంచంలో విద్యాపారంగతులు ఉంటారు. విజ్ఞానఖనులూ ఉంటారు. కాని 'మానవప్రేమ'ను గ్రహించి ఆచరణలో పెట్టగలిగేవారికోసం అన్వేషించవలసి వస్తోంది. మనం వేరు, వారు వేరు అని మానవుల మధ్య అడ్డుగోడలు కట్టేవారు కనిపిస్తారు. వారి సంకుచిత ధోరణుల ఇంపైన మాటలు ఆసక్తిగా వినేవారూ ఉన్నారు. ఫలితంగా ధర్మేతరశక్తులు తలెత్తుతున్నాయని శాంతికాముకుల ఆవేదన. సాటి మనుషుల్ని ప్రేమించడం, కష్టకాలంలో వారిని ఆదుకోవడం, మృదుభాషణం- ఇవన్నీ అశాశ్వతమైన వజ్రవైఢూర్యాలకన్నా విలువైనవనే మహాత్ముల ప్రబోధాల్ని ఆచరించడంలో విఫలమవుతున్నారు మనుషులు. తనను ఆరాధించేవారికన్నా, బక్కబతుకుల ఆర్తులను ఆదరించేవారినే భగవంతుడు అధికంగా ప్రేమిస్తాడని తత్వవేత్తల అమృతవాక్కు. ఇదే, మతాల పవిత్ర భావాలకు జీవవాయువు. అందువల్లనే హృదయంలో మానవత్వం నిద్రపోతే దైవత్వాన్ని దూరంగా విసిరేసినట్లని మహర్షులు అన్నారు.
తాత్విక ఔన్నత్యం కలిగిన సందేశం అద్భుతమైంది. మానవీయ విలువలకు అర్థాన్ని పరమార్థాన్ని బోధిస్తోంది. లోకప్రేమను చూడలేని అంధత్వం కారుణ్య చికిత్సద్వారా నివారణ అవుతుందనే అమృతభావాన్ని ఆవిష్కరిస్తోంది.

మతం అవసరమే కాని- పరస్పర ప్రేమ, సత్ప్రవర్తన, స్పందించే మనసు, శాంతిపూరిత జీవన సౌందర్యం... మరింత అవసరం. ఒక ప్రాణికి ఉపకారం చేస్తే, అది సాక్షాత్తు దైవసేవే. సాటి నరుల్లో ప్రేమ పల్లవించేలా నిజజీవితంలో అనుక్షణం సద్భావనల్ని ఆచరించి, ధరిత్రిని సుందరంగా నిలిపి భవిష్యత్తరాలకు అందించినప్పుడే మచ్చలేని విశ్వప్రగతి మనం సాధించినట్లు. దేవుని ప్రేమకు పాత్రులమైనట్లు.

ᐅఈశావాస్యం



---------------------------
ఈశావాస్యం
---------------------------



తెల్లవారగానే లోకమంతా వెలుగు జిలుగులతో జిగేలుమంటుంది. చిరుగాలికి వూగే చెట్లూ, చెట్లపై పిట్టల కలకలా రావాలు. ప్రతి ఇంటా సంతోష సరాగాలు. కనబడేది అంతా 'ఈశావాస్యం'- ఈశ్వర స్వరూపం. లోకమంతా సౌందర్యమయం. అన్నిటిలో అణువణువునా ఉన్న ఆ పరమాత్మే అందానికి కారకుడు. రాత్రి చీకటిలో ఈ సౌందర్యం కనబడదు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే, చీకటి పలాయనం చిత్తగిస్తుంది. వెలుగువల్లనే ప్రతిదీ మనకు కనబడుతోంది. వాటిని చూసి ఆనందించగలుగుతున్నాం. 'అవి పరమేశ్వర రూపాలు' అనే జ్ఞానం కలిగితే 'పరమానందం' పొందుతాం.

శివం అంటే ఆనందం. జగన్మాత దివ్య సౌందర్యవతి. ఆనందం, సౌందర్యం కలిస్తే పరమేశ్వరుడు. శంకర భగవత్పాదులవారు శివానంద లహరినీ, సౌందర్య లహరినీ మనకు ప్రసాదించారు. సత్యం, కృతజ్ఞత, పరాక్రమం మొదలైన సద్గుణాలు ఉన్నచోటా; ఇంకా- కోపం, అసూయ మొదలైన దుర్గుణాలు లేని చోటా ఆనందం తాండవిస్తుంది.

'బ్రహ్మవిచారం' చేసిన స్త్రీలను బ్రహ్మవాదినులు అంటారు. కాత్యాయిని, మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్యలు. యాజ్ఞవల్క్యుడు సన్యాసం తీసుకోవాలని నిశ్చయించుకొన్నాడు. తన ధనాన్ని ఇద్దరు భార్యలకూ సమానంగా పంచుతానంటాడు. అప్పుడు బ్రహ్మవాదిని అయిన మైత్రేయి 'అమృతత్వం సిద్ధించే సంపదను నాకు ఇవ్వండి' అని భర్తను అడిగింది.

'భర్త భార్యపై, తల్లిదండ్రులు సంతానంపై, భక్తులు దేవతలపై చూపే ప్రేమ అంతా ఆత్మానందం కోసమే! మన ఆత్మకు ఆనందం కలిగించే వస్తువుపై మనకు అధిక ప్రేమ కలుగుతుంది. అది సంతోషానికి దారి తీస్తుంది. దీన్నిబట్టి, ఆత్మ 'ఆనందమయం'గా గ్రహించవచ్చు. ఈ 'ఆనంద స్వరూపం' గ్రహించగలిగితే, లోకం అంతా మనకు ప్రియమైనదిగానే గోచరిస్తుంది. కొన్నింటిపై ఇష్టం కలగడం వల్లనే మిగతావాటిపై ద్వేషం కలుగుతుంది. అన్నీ ఆనంద స్వరూపాలే అని గ్రహిస్తే అన్నీ అందంగానే కనబడతాయి. దేనిపైనా ద్వేషం కలగదు. జీవునికి 'ఉత్తమ గతి' పరమ సంపద. అదే పరమానందం. ఆ ఆనందంలో లేశమాత్రమైన ఏదో ఒక అంశాన్ని ఆధారం చేసుకొని జగత్తులో జనులు జీవిస్తున్నారు!' అని యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి ఉపదేశించాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


ᐅఆత్మైక్యానందం



--------------------------
ఆత్మైక్యానందం
--------------------------


ఏ సాధన పరమార్థమైనా ఆనందాన్ని పొందడమే. ఆనందం మనో జనితమైన గొప్ప అనుభూతి. ఆహారం శరీర పోషణకైతే- అనుభూతి మనోవికాసానికి. నిజానికి అనుభూతులే జీవితాన్ని పండిస్తాయి. ఆధ్యాత్మిక జగత్తులోని సాధన ఓ తపస్సులాంటిది. భగవత్‌ స్వరూపాన్ని మనోపీఠంపై ప్రతిష్ఠించుకొని, నిరంతర చింతనామృతంతో అభిషేకించే తత్వం- నిశ్చలమైన వివేకాన్ని, మానసిక స్వస్థతను ప్రసాదిస్తుంది.

ఆపై కొనసాగే 'సాధనాధార' ఆనందాన్నిస్తుంది సాధకుడికి. ఏ స్థితిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా ఆ పారవశ్యం వెన్నంటి ఉంటూనే ఉంటుంది. యోగులు, సిద్ధులు, అవతారపురుషులు నిశ్చలానంద జ్యోతిర్మూర్తులై వెలుగొందారంటే కారణం ఇదే.

మానవులు, సగటు జీవులు ఆ స్థితిని పొందగల సాధనామార్గం ఏమిటి?

ఈ చరాచర జగత్తు ఈశ్వరమయం. జగత్తులోని ప్రాణశక్తి, చేతనాశక్తి ఆ ఈశ్వర ప్రసాదితమే. సకల కర్మలు ఈశ్వర ప్రీత్యర్థం జరిగేవే. ఆయా కర్మల ఆచరణలోని, శుద్ధత్వం ఈశ్వరతత్వాన్ని గ్రహించగలుగుతుంది. ఆనందాన్ని అందుకునేందుకు అది తొలిసోపానం.

చేస్తున్న కర్మలపై చిత్తాన్ని ఏకాగ్రతగా నిలపడమే యోగమంటాడు పతంజలి మహర్షి.

వజ్రాన్ని సానబడితేనే ప్రకాశించేవిధంగా- నిగ్రహంతో చిత్తవృత్తిని లక్ష్యసాధనకై ఉపక్రమింపజేయడమే నిజమైన సాధన. ఇదొక అంతర్ముఖ సేద్యంలాంటిది. సాధకుడు తన ఆత్మను లక్ష్యంతో మమేకం చేయాలి. అదే ఆత్మైక్యం.

రామకృష్ణులవారిని పరమహంసగా మార్చింది ఈ ఆత్మైక్యసాధనే. ఆయన బుద్ధి, మనసు, శరీరం జగన్మాతయందే ఐక్యమయ్యాయి. అద్వితీయమైన ఆనందానుభూతిని పొంది, ఆ ఆనందానుభూతి ఎన్నో దివ్యదర్శనాలను కల్పించింది. జడలు కట్టిన శిరస్సుపై పడిన గింజలు, అన్నపు మెతుకులను పక్షులు వాలి తింటున్నా తెలియనంతటి అనుభూతి పారవశ్యం. శారదామాతలోనూ జగన్మాతను దర్శించుకునేంత దివ్యానుభూతి.

సాధన అంటే గంటల తరబడి ధ్యానసమాధిలో ఉండటంకాదు. పూజాదికాలతో దినం వెళ్లబుచ్చటమూ కాదు.  చిత్తవృత్తి, ఆలోచన అంతర్ముఖ సాధనాక్షేత్రాన్ని స్పృశిస్తూనే ఉండాలి. అప్పుడు సుషుప్తావస్థలో సైతం ఆనందానుభూతికి లోనవుతూనే ఉంటాడు సాధకుడు.

భంగు పీలుస్తున్న ఓ రాలుగాయి ముఠా- గురుద్వార్‌కెళ్తున్న గురువును 'నీవెన్నడూ పొందని ఆనందాన్ని చూపిస్తాంరా!' అంటూ ఎకసెక్కంగా పిలవగా- ఆ 'గురువు' నవ్వి- 'ఇంతకన్నా గొప్పదైన ఆనందాన్ని చూపిస్తాను నా వెంటరండి' అంటూ వారిని గురుద్వార్‌కి తీసుకెళ్ళాడు. అక్కడ- ప్రార్థనల్లో భజనల్లో లీనమై ఉన్న భక్తులను చూపి- 'ఈ ఆనందం కన్నా గొప్పదా మీ మత్తు, ఇంతటి పారవశ్యం ఉందా మీరు పొందే మత్తులో?' అని ప్రశ్నిస్తాడు. తమ తప్పును మన్నించండంటూ గురువుకు పాదాభివందనం చేస్తుంది ఆ రాలుగాయి ముఠా.

ఆనందం దొరికే వస్తువు కాదు. భోగభాగ్యాలు, సిరిసంపదలు ఇచ్చే ఆనందం స్వల్పకాలికమే. ఏది శాశ్వతానందాన్ని ఇస్తుందో గ్రహించడమే విజ్ఞత. ఈ తత్వ నిగూఢతను సులువుగా జనబాహుళ్యానికి అందించాలనే ఆశయంతో మహనీయులు- 'నీవు ఆచరించే సత్కర్మల్లోనే దైవం ఉంటాడని తెలుసుకో. జీవనవ్యవహారాల్లో, త్రికరణ శుద్ధితో కూడిన కర్మాచరణలోనే నిత్యానందం ఉంటుందని తెలుసుకో' అంటూ అందించే ప్రబోధాలు సర్వదా స్మరణీయం. ఆచరణీయం.

- దానం శివప్రసాదరావు

ᐅమితభాషణ



------------------------
మితభాషణ
------------------------


కట్టలు తెంచుకొని ప్రవహించే వరద నీటికి మిట్టపల్లాలు తెలియవు. అడ్డువచ్చిన ఏ వస్తువైనా ఆ ప్రవాహ వేగంలో కొట్టుకు పోవలసిందే! అడ్డూ అదుపులేని వాక్‌ధోరణి అలాంటిదే. అదే ఓ నిర్మల జలపాతం సమవేగంతో కిందకు ఉరుకుతూ భూమ్మీద ఓ సొబగైన ప్రవాహాన్ని సృజిస్తుంది. జలపాతం భూమిని చేరినవేళ కమ్ముకొనే పొగమేఘాల్లాంటి నీటి తుంపరలను పైకెగయజేసి చూపరులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సూర్యరశ్మితో చెలిమిచేసి ఆకాశంలో ఓ మనోహర ఇంద్రచాపాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ జలపాత ఝరి ఓ నదానికి రూపకల్పన చేసి అది పారినంతమేర నేలను సస్యశ్యామలం చేసి పాడిపంటలకు కొదవలేకుండా చేస్తుంది. నిర్మల జలపాతం వంటి మౌన యోగుల నోటి వెంట వెలువడే అరుదైన, సున్నితమైన మాట సత్యపూర్ణమై, సత్వగుణశోభితమై, ఆచితూచి మాట్లాడే ప్రతి పలుకూ ప్రభావవంతమవుతుంది.

అరుదైనదేదైనా అపురూపమైనదే అవుతుంది. సాధనాక్రమంలో మౌనానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. ఉత్తములైన భగతదన్వేషకులు తమ హావభావాలు, చేష్టలతో లోకానికి పిచ్చివారుగా కనబడతారు. 'ఎవరి పిచ్చివారికానందం' అన్న నానుడిలోని లోతుపాతులు వివరంగా తెలిసేవి కాకపోయినా, భౌతికానందాల పట్ల వైరాగ్యం కలిగి పరమాత్మ అన్వేషణలో పరవశించే సాధకులు, అది ఓ 'పిచ్చి' గా లోకం భావించినప్పటికీ, వారు ఆ ఆనందస్థితిలో మానవుడు ఆత్మపరంగా పొందవలసిన సకలాన్నీ సాధిస్తారు. ఆ వాక్‌ నియంత్రణలోని ఆనందాన్ని సొంతం చేసుకోవడం ప్రతి ముముక్షువు వాంఛింపదగిందే! అదే అందరూ ఆశించదగిన ఆనందయోగం. మిత భాషణం ఓ శోభాయమాన మౌనయోగం!!

- గోపాలుని రఘుపతిరావు

ᐅభగవత్ప్రేరణ



------------------
భగవత్ప్రేరణ 
------------------


మహర్షి గౌతముడు దుఃఖాలకు కారణమైన మిథ్యా జ్ఞానాన్ని భ్రాంతి, అవిద్య, అవివేకం అని వర్గీకరించారు.
ఒక విషయాన్ని గురించి సరైన జ్ఞానం లేకపోవడమే మిథ్యాజ్ఞానమని తత్త్వశాస్త్ర కోవిదులన్నారు. ఈ మిథ్యాజ్ఞానం పోతే దాని ద్వారా వచ్చిన దోషాలు, ప్రవృత్తి, జన్మలు ఈ మూడూ తొలగిపోతాయంటారు. జన్మ అంటే జీవుడు శరీరంతో కలిసి ఉండటమే. శరీరం లేకపోతే దుఃఖాలుండవు. దుఃఖం నుంచి తప్పుకోవడమే ముక్తి. అప్పుడే భక్తుడు భగవంతునిలోని ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే ముక్తి. ఆ ముక్తినే రుషులు పరంధామమని అన్నారు.

మనం అజ్ఞానంతో తెలియక అపరాధం చేసి వాటికి ఫలితంగా దుఃఖాలనుభవిస్తాం. దీనిలో భగవంతుని ప్రమేయం ఏమీ ఉండదు. మనం చేసే ప్రతి మంచిపనికి ఇది మంచిది, దీన్ని తప్పక చేయి, దీని వలన నీకు ప్రయోజనం ఉంటుందని భగవంతుడు ఉత్సాహాన్ని కల్పిస్తాడు. అట్లాగే ఇది చెడుకార్యం, ఇది చెయ్యవద్దు, దీని వలన నష్టం కలుగుతుంది, దుఃఖం వస్తుంది. గౌరవం పోతుంది అని ఆ పనిని చేయకుండా భగవంతుడు మన హృదయంలో ఆందోళన భయం నిరుత్సాహం కలిగిస్తాడు. మనం ఆ భగవత్ప్రేరణను లెక్కచేయక ఆ చెడు పని చేసినట్త్లెతే తప్పనిసరిగా నష్టపోతాం. దానికి తగిన దుఃఖాన్ని అనుభవిస్తాం.

ఒక గ్రామంలో ఒక పురోహితుడున్నాడు. అతడు దైవభక్తి మెండుగా ఉన్నవాడు. ప్రతినిత్యం ప్రభాత సమయంలో లేచి స్నాన సంధ్యావందనాదులను నిర్వర్తించుకొని తన విధులను సక్రమంగా పాటించేవాడు. ఆ పురోహితుడు స్వయం కృషితో ఉన్నత విద్యలను అభ్యసించాడు. విద్యార్థులకు పాఠాలు బాగా చెప్పేవాడు. కొంతకాలానికి అతడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. శుభ సమయంలో గృహ ప్రవేశం చేశాడు. పాత ఇంట్లోని సామాన్లన్నీ కొత్త ఇంటికి తరలించాడు. ఒక్క వస్తువు మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు. అది ఒక నిలువుటద్దం. చాలా పెద్దది. అతని పూర్వీకులు దాన్ని తయారు చేయించారు. అది అద్భుతమైన పనితనంతో ఉంది. అందరినీ ఆకర్షిస్తుంది ఆ నిలువుటద్దం. చాలామంది వచ్చి వారి శక్తియుక్తులను ప్రయోగించి చూశారు. అద్దం బయటకు రాలేదు.
పురోహితుడికి ఏమి చేయాలో తోచడంలేదు. దాన్ని విడిచిపెడదామంటే, అది పెద్దలిచ్చిన అద్దం. తరతరాలుగా ఆ ఇంట్లో అలంకారంగా ఉంది. విడిచేందుకు మనసొప్పడం లేదు. ఏమి చేయాలా అని బాగా యోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. ఒక రోజు కొందరు పెద్దలను ఆహ్వానించాడు. ఆ అద్దం బయటకు వచ్చే మార్గం గురించి అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన సలహా ఇస్తున్నారు. ఒకరు పై ద్వారాన్ని పగలగొట్టమన్నారు. మరొకరు అద్దాన్ని చిన్నది చేయాలన్నారు. ఇంకొకరు ఆ అద్దాన్ని అట్లా వదిలేస్తేనే మంచిదని అన్నారు. ఈ విధంగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. ఇంతలో వివేకవంతుడైన వృద్ధుడు లేచి ద్వారం చిన్నది. లోన అద్దం పెద్దది. కాని అసలా అద్దం లోపలికి ఎలా రాగలిగిందో వూహించండి. పెద్ద అద్దం చిన్న ద్వారం గుండా లోపలికి ఎట్లా వచ్చింది? ఇప్పుడాలోచించాల్సిన ముఖ్య విషయం అద్దం బయటకు ఎలా పోతుందా అని కాదు, అసలా అద్దం ఎలా లోపలికి రాగలిగిందా అని మనమందరం ఆలోచించాలన్నాడు. అక్కడున్న వారందరికి ఇది చాలా సమంజసంగా సత్యవచనంగా అనిపించింది.

లోకంలో జనం దుఃఖమెట్లా పోతుందా? దుఃఖం పోయేందుకు మార్గం ఏమిటని ఆలోచిస్తున్నారు. మహర్షులు అసలు దుఃఖం ఎందుకు వచ్చిందని ఆలోచించి అజ్ఞానం వలన దేహం, దేహం వలన దుఃఖం వచ్చాయని తెలుసుకున్నారు. అజ్ఞానాన్ని ముందు తొలగిస్తే దుఃఖం దానంతట అదే తొలగిపోతుందని నిశ్చయించారు. దుఃఖ నివారణకై జ్ఞానాన్ని ఆత్మ ప్రబోధాన్ని లోకానికి అందించారు. దుఃఖం పోవాలంటే భగవత్ప్రేరణను భద్రంగా ఆలకించి దాన్ని పాటించాలి.
నిష్కామ భావంతో సత్‌ కర్మలు ఆచరించి ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అప్పుడు ఎవరికీ దుఃఖం ఉండదు.

- డాక్టర్‌ సంధ్యావందనం లక్ష్మీదేవి

ᐅశుభాభినందన


---------------------------------------
సర్వే జనా సుఖినోభవంతు
----------------------------------------

'అందరూ సుఖంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఒక్కరికీ దుఃఖం కలగకూడదు'- ఇది అనాదిగా ప్రతి భారతీయుడు కోరుకునే కోరిక. విశ్వసాహిత్యంలోనే ప్రప్రథమ స్థానాన్ని ఆక్రమించిన వేదాల్లోనూ, రామాయణ మహాభారతాల్లోనూ, పురాణాల్లోనూ, కావ్య నాటకాల్లోనూ వాచ్యంగానో, వ్యంగ్యంగానో ఈ భావన అనేక చోట్ల కనబడుతూ ఉంటుంది.

ఆధునిక సమాజంలో కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్నా, వివాహాది శుభకార్యాల్లోనూ, పండుగలు, పుట్టిన రోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేయడం పరిపాటి అయింది. అది నాగరికతా చిహ్నంగానూ పరిగణిస్తున్నారు. అయితే ఈ శుభాకాంక్ష సందేశాలు మొక్కుబడిగా, గాలికి పోయే మాటలు కాకూడదు. కొందరు తెలియజేసే శుభాకాంక్షలు, వాటి ఘనతను, ఉనికిని చాటుకునేందుకా అన్నట్లు కృత్రిమంగా ఉంటాయి. శుభకామనలో మైత్రీ హృదయం ఆవిష్కృతం కావాలి.

విశ్వమానవ శ్రేయాన్ని కాంక్షించడం భారతీయ సంస్కృతి మౌలికాంశాల్లో ఒకటి. అది ఏ పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్లా సంక్రమించింది కాదు, అది ఈ జాతి మనోధర్మం. వాస్తవానికి శుభాకాంక్షల ప్రకటన కొన్ని సందర్భాలకే పరిమితం కాదు. మనుషుల మధ్య నిరంతరం సాగాల్సిన ఆదర్శవంతమైన ప్రక్రియ. మన నిత్యరాధనలు, అనుష్ఠానాలు, పూజల్లో అంతర్లీనంగా శుభకామన వ్యాప్తమై ఉంది. వేదాల్లోని సూత్రాలు మానవ శ్రేయాన్ని కాంక్షించే ప్రార్థనలే. 'కలిసి నడవండి, కలిసి మాట్లాడుకోండి, ఏకాభిప్రాయ మనస్కులై మెలగండి' అనే ఉన్నతాశయాన్ని వేదసూక్తం ప్రకటిస్తోంది. 'మీ తలపులూ అభిప్రాయాలూ సంకల్పం ఒక్కటై ఉండాలి. హృదయగత భావాలు సమానంగా ఉండాలి. మనసు, చింతన, భావన ఏకరూపం కావాలి. మీ మధ్య మంచి సామరస్యం, సహనం, సహకారం, సౌహార్దం నెలకొని ఉండుగాక' అనే మంగళాశంసను మన వాఞ్మయం ప్రకటిస్తోంది. మానవ సమూహాలన్నీ ఏకమనస్కులై కలిసి జీవించాలనే మహత్తరమైన ఆకాంక్షను ఎంతో ప్రబలంగా ప్రవచించిన వేదాలు వసుధైక కుటుంబ భావనను ఏనాడో ప్రతిఫలించాయి. వసుధైక కుటుంబమంటే నేటి స్వార్థపూరిత, సామ్రాజ్యవాద, అనైకమత్య భావాలతో కూడిన ప్రపంచీకరణ, 'గ్లోబల్‌ విలేజ్‌' కాదు. లోక కల్యాణాన్ని భారతీయ రుషులు కాంక్షించినంతగా మరెక్కడా మరే సంస్కృతిలోనూ కానరాదు. 'నేను, నాది' అనే భావం కాక 'మనందరం' అనే ఆదర్శ భావనకు ఆద్యులు భారతీయులే.

సమాజంలోని వ్యక్తులందరి మధ్య సౌమనస్యం రావాలంటే దానికి బీజాలు ముందుగా కుటుంబంలో నాటుకోవాలి. సౌమనస్యం, సౌహార్దం కుటుంబంలో వెల్లివిరిశాయంటే అవి అప్రయత్నంగా సమాజంలోకి ప్రసరిస్తాయి. అందుకే వాజసనీయ సంహిత ఇలా అంటోంది- 'అన్ని ప్రాణులూ నన్ను మైత్రీ పూర్ణమైన చూపులతో చూడాలని కోరమన్నాను. నేను అన్ని ప్రాణులూ మైత్రీపూర్ణమైన చూపులతో చూడాలి. మనందరం ఒకరినొకరు మైత్రీభావంతో చూసుకోవాలి'

'గాలి మాధుర్యంగా వీచు గాక... నదీనదాలు మధురజల ప్రపూర్ణాలై ప్రవహించుగాక... వృక్షాలు పుష్టిగా పెరుగుగాక... భూమ్యాకాశాలు, చంద్రుడు మాధుర్యాన్ని పంచుగాక... పశుసంతతి తియ్యదనాన్ని అందించుగాక' అనే మహోన్నతమైన ఆకాంక్ష ఏ ప్రాంతానికో, మతానికో, వర్గానికో చెందినది కాదు. మనిషి మనసులో ఇటువంటి విచారధార సాగితే అది సమాజ వ్యాప్తమై సామాజిక రుగ్మతలకు విరగడవుతుంది.

'మంగళాది, మంగళమధ్యం, మంగళాంతం' 

అనేది మన భావన. మన నాటకకర్తలు ఆదిలో 'నాంది' రాసేవారు. నాందీవాక్యాలు ఆశీర్వాద పూర్వకంగా ఉండాలి. చివరగా భరత వాక్యం పౌరులకు శుభాశీస్సులందజేయడమే. శుభాకాంక్షలు నిర్మలమైన మనసుతో, చిత్తశుద్ధితో అందించాలి. అప్పుడే అవి ఫలప్రదం అవుతాయి. శుభాకాంక్షలు చెప్పేవారికి తమ క్షేమాలపట్ల తపన ఉండాలి. ఆశీస్సులు అందించేవారి ఆకాంక్ష వాగ్బలం ద్వారా గ్రహీతకు చేరుతుంది. మనం దీవెనలు ఇచ్చేటప్పుడు దేవతలు 'తథాస్తు' అంటారని ఆ విధంగా మన శుభాకాంక్షలకు దైవాశీర్వాదం తోడవుతుందని నమ్ముతాం. నేటి సంకీర్ణ సామాజిక వ్యవస్థలో 'సకల జనులకు శుభం జరగాలి' అనుకోవడం మహదాశయం.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

ᐅచీకటి - వెలుగు

--------------------
చీకటి - వెలుగు
----------------------


సర్వవ్యాప్తమైన చీకటి. ఆ 'అలోకమైన పెంజీకటికవ్వల' వెలిగే ఒక్కడు. అతడినే భగవంతుడని అన్నారు జ్ఞానులు. చుట్టూఉన్న చీకటిని తిట్టుకోకుండా భగవంతుడు నక్షత్ర దీపాలు వెలిగించాడు. ఆ తరవాత కథ మనకు తెలిసిందే. వెలుగును చూడలేని మనసు దానికి చీకటి అని ముద్దుపేరు పెట్టుకుంది. అంతా బ్రహ్మమే అయినప్పుడు చీకటి కూడా బ్రహ్మమే కావాలి. బ్రహ్మమే చీకటిగా, అచేతనగా, అజ్ఞానంగా మారి ఈ సృష్టిక్రీడను ప్రారంభించింది. మనకు కనిపించే వెలుగు నీడలుగా విడిపోయింది. సర్వవ్యాప్తంగా ఉన్న వెలుగునుంచి విస్ఫులింగాలు, అగ్నిగోళాలు ప్రభవించి కోట్లాది నక్షత్రాలుగా మారి పరిభ్రమించడం ప్రారంభించాయి. 'ఆకాశం' అంటే శూన్యం కాదు, చీకటీ కాదు- అంతటా నిండిన ప్రకాశం అని అసలు అర్థం.

సూర్యుని వెలుతురు ఉంది. విద్యుద్దీపాల కాంతి ఉంది. మెరుపుల వెలుగు ఉంది. వాటికి మించిన వెలుగూ ఉంది. అది అంత సులభంగా కనిపించదు. అదే 'ఆత్మ'. పరమాత్మ. సూర్యుణ్ని మించిన నక్షత్రాలున్నాయంటే వెంటనే నమ్మలేం. కోటానుకోట్ల సూర్యుళ్లు, నక్షత్ర మండలాలు ఉన్నాయని ప్రాచీనులు చెప్పారు.

'చంద్రార్కానల కోటికోటి సదృశా'

అని జగన్మాతను కీర్తించిన కవిద్రష్టలున్నారు. అదే విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలూ ధ్రువీకరించారు. అవి వెదజల్లే వెలుగు అద్భుతమైనదే. కాని ఆ వెలుగును మించిన మరో వెలుగు, శాశ్వతమైన ఆనందం ఇచ్చే తీయని 'వెలుగు' ఉందంటే ఇప్పుడు నమ్మలేని దశలో ఉన్నాం.

మనం పగలు సూర్యకాంతిలో జీవిస్తున్నాం. రాత్రివేళ వెన్నెలలో విహరిస్తున్నాం. అదీ లేకపోతే నక్షత్రాల కాంతి ఉంది. మరి చీకటిని చూసి భయం దేనికి?

వెలుగు తనంత తాను దాక్కొంది. అది మనకు చీకటిగా కనిపిస్తోంది. అది వెలుగు చేసే ఇంద్రజాలం. దుఃఖం ఆనందం ధరించిన విషాదాంబరం. మరణం ఏర్పరచిన మెట్లపై ఆత్మ తన అమృతధామం చేరుకొంటుంది. మనిషి తన నీడను చూసి, వెలుగును నీడగా వెన్నంటి వస్తున్న చీకటిని చూసి భయపడటం మాని జ్యోతిర్మయ శిఖరాలు చేరే రోజు వస్తుంది. ఆ లక్ష్యంతోనే భగవంతుడు ఈ సృష్టి చేశాడనిపిస్తుంది. తన కలాన్ని చీకటిలో ముంచి విశ్వ ప్రణాళికా రచన చేశాడాయన. ప్రకృతి ప్రస్థానం చివరి వెలుగు తానే.

నక్షత్రాలనే అక్షరాలతో విశ్వమనే శ్వేతపత్రం భగవంతుడు లిఖించాడు. అది బుద్ధికి అందదు. మానవ హృదయం, ఆత్మ చదివితే అర్థం అవుతోంది. భగవంతుడే అంతిమ తేజస్సు అని తెలుస్తుంది. అంతవరకు చీకటి మన జీవితాలను పరిహసిస్తూంటుంది. మనతో విధి రూపంలో ఆడుకొంటూనే ఉంటుంది. నీడలోనే కూర్చొని 'నా జీవితం అంతా చీకటి' అని విలపిస్తారు చాలామంది. మనం ఉన్న చీకటి గది పక్కనే వెలుగు నిండిన గది ఉంది.అటు వెళ్లాలన్న ఆలోచనే రాదు. చీకటి గది దాటడానికి వేల జన్మలు, వేల యుగాలు గడచిపోతాయి. మన చీకటి గదికి సగం తెరచిన చిన్న కిటికీలు ఉన్నాయి. సన్నని రంధ్రాలున్నాయి. వాటిలోనుంచి అపుడప్పుడు కాంతికిరణాలు పడుతుంటాయి. అవే మతాలు, ప్రవక్తల ప్రవచనాలు, తత్వ చింతనలు. ఆ కాంతిని గమనించి కూడా మనం అటు కదలలేం.

మన జీవితం 'సగం విరిగిన వీనస్‌'. ఆ కళా'ఖండాన్ని' చూసి మురిసిపోతుంటాం. కొద్దిగా దొరికిన కాంతికిరణాలు చాలు మనకు. జీవితానికి సంపూర్ణ సార్థకత, సంపూర్ణ సాఫల్యం, పూర్ణత్వం లభించాలంటే భగవంతుడనే 'వెలుగు'ను ఆశ్రయించడమొక్కటే మార్గం. అటువైపే మానవ యాత్ర. అందుకోసమే భగవంతుడు ఈ వెలుగునీడల సృష్టిని చేశాడు!

- కె.యజ్ఞన్న

ᐅజీవితపు వైకుంఠపాళి

-------------------------------------------------
జీవితపు వైకుంఠ పాళి - యండమూరి
-----------------------------------------------------------




ᐅవిద్యుక్త ధర్మం




----------------
విద్యుక్త ధర్మం
----------------


దుర్యోధనునకు కౌరవసైన్యంలోని రథాతిరథులను వివరిస్తూ భీష్ముడు కృతవర్మను, శల్యుడుని అతిరథులని పేర్కొంటాడు. సింధురాజు ద్విగుణరథుడని మహిష్మతీ నివాసియగు నీలుడు రథుడని, అవంతి దేశాధీశులగు విందానువిందులను అన్నదమ్ములు రథసత్తములని, త్రిగర్త దేశాధిపతులు రథోదారులని, దుర్యోధనుని కుమారుడు లక్ష్మణుడు దుశ్శాసన కుమారుడును రథసత్తములని, కౌసల్యుడగు బృహద్బలుడు ఏకరథుడని, కృపుడు రథయూథపయూథవుడని, శకుని ఏకరథుడని, అశ్వత్థామ మహారథుడని, ద్రోణుడు రథయూథపయూథములకు యూథనాథుడని పేర్కొంటూ కర్ణ పుత్రుడగు వృషసేనుని మహారథుడని చెబుతాడు. బాహ్లికుడు అతిరథుడని, సత్యవంతుడు మహారథు డని, నలంబుసుడు మహారథుడని పేర్కొంటూ కర్ణుని అర్థరథుడని అంటాడు. కర్ణుని పుత్రుడు మహారథుడట, కర్ణుడు అర్థరథుడట. ఇలా వర్ణించిననాడు సామాన్యుడు కాడు. భీష్మపితామహుడు ఈ సందర్భములో కర్ణుడిని గూర్చి భీష్ముడు పలికిన పల్కులు మహాభారతంలో ఉన్నదున్నట్టు తెలుసు కొంటే బాగుంటుంది. నీకు దయితుండగు నెచ్చెలి, రణకర్కశుండు, నిన్ను పాండవులతోడి యుద్ధంబు నకు మాటిమాటికి ప్రోత్సాహపఱచువాడు, ఆత్మశ్లాఘపరాయణుడు, నీచుండునగు కర్ణుడు నీకు మంత్రియు, బంధువును నేతయునై యున్నవాడు. వీడు మానవంతుడును, అత్యంత గర్వోచ్ఛిత్రుం డునై యుండును. వీడు యుద్ధంబున రథుండును కాదు, అతిరథుండును కాదు. వీడు సహజంబగు కవచంబు కోల్పోయి విచేతనుండైయున్న వాడు పరశురాముని శాపంబునను, బ్రాహ్మణుని భాషణం బునను గరణంబులు గోల్పోవుటను వీడర్థరథుడని నా తలంపు. (పేజీలు 599-600-ఉద్యోగపర్వము -శ్రీమదాంధ్ర వచన మహాభారతము) భీష్ముని ఈ మాటలను వినిన ద్రోణుడు ''శాంతనవా! నీ వాడిన మాటలెల్ల యధార్థంబులై యున్నవి. వీనియంద సత్యము లేశంబేని లేదు. వీడు ప్రతి యుద్ధము నందును దొలుత నత్యభిమానం బొందుటయు తరువాత విముఖుండగుటయు గూడ గలదు. వీడు ఘృణాత్ముండగుటయు, ప్రమాద పరవశుండగుటయు గారణంబులుగ నేనును వీనినర్థరథునిగానే తలంచుచున్నాను "అని అన్నాడు.

సత్యం బ్రూయాత్‌, ప్రియం బ్రూయాత్‌
న భ్రూయాత్‌ సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్‌ 

అను శ్లోకాన్ని చెప్పి సత్యము చెప్పు, ప్రియమైన దాన్ని చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పకు, ప్రియమైన అబద్ధాన్ని చెప్పకు అంటుంటారు చాలా మంది. 'అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు అను విషయం భీష్మద్రోణులకు తెలియదా? అదీ తమ పక్షానికి చెందిన యుద్ధవీరుని గూర్చి అత్యంత కీలక సమయంలో అతని సమక్షంలోనే, అతని ముఖంమీదే, ఇన్ని అప్రియమైన సత్యాలను చెప్పి అతన్ని అధైర్యపరచటం సముచితమేనా, భీష్మద్రోణుల స్థాయికి తగినదా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. భీష్మద్రోణులను తప్పు పట్ట గలిగే ధైర్యం, స్థైర్యం మనకు ఉండదు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, ధర్మజ్ఞులు, నీతిశాస్త్ర కోవిదులు. మరి వారు అలా ఎందుకుచేశారు? వారి మాటలను వినిన కర్ణుడు ఏమన్నాడో చూద్దాం. -సమానులునుదార కర్ములుగల రాజులందు ఎవడిట్లు తేజోవధంబు గావించి యుద్ధంబున భేదంబు గల్పింప సాహసించును? నీవు మారతము చితానుచితంబులెఱుంగక గుణవిద్వేషంబుననపరాగంబు గావింప దలంచుచున్నవాడవు. జీవించిన యేండ్ల వలన గానీ, ఫలితంబులైన శిరోజంబుల వలన గాని, ప్రభూతంబులగు ధనంబు వలన గాని, సమృద్ధమగు బంధుగణంబు వలన గాని క్షత్రియుల మహారథత్వమును నిర్ణయించుటకు శక్యంబుగాదు. క్షత్రంబు బలజ్యేష్టంబనియు, బ్రాహ్మణులు మంత్రజ్యేష్ఠులనియు, వైశ్యులు ధనజ్యేష్ఠులనియు, శూద్రులు వయోజ్యేష్ఠులనియు నార్యులందురు. కామద్వేష సమాయుక్తుండగు నీవు మోహపరవశుండవై నీ యిచ్చ వచ్చిన తెఱంగున రథాతిరథ నిశ్చయంబు గావించుచున్నవాడవు. ఆ తర్వాత కర్ణుడు దుర్యోధనునితో, ''సుయోధనా! వృద్ధుల వచనంబు లాలింపవలయునని శాస్త్రంబులందు విధి కలదు కాని యతి వృద్ధులగు వారి వచనంబు లెన్నండు నాదరింపరాదు. అతి వృద్ధులు మరల బాల్య మందినవారలు కదా? అని అంటాడు. భారతంలోని ఈ ఘట్టాన్ని చదువుతున్నప్పుడు ఎవరికైనా కర్ణుని మాటలే సరియైనవని భీష్మద్రోణుల మాటల తీరు హుందాగా లేదని అనిపిస్తుంది. కానీ ఒకింత నిదానంగా ఆలోచన చేస్తే ఆ సందర్భంలో అంత కటువుగా కాకుండా కొంత మృదువుగా అదే విషయాన్ని భీష్మద్రోణులు చెబితే యధార్థాన్ని కప్పిపుచ్చినట్టే అవుతుంది, తమ విద్యుక్తధర్మానికి హాని చేసినట్టే అవుతుంది. బలాబలాల అంచనా విషయంలో తప్పు చేసినట్టే అవుతుంది. అత్యంత కీలకమైన విషయంలో రాజును తప్పుదారి పట్టించినట్టే అవుతుంది. అప్రియమైన సత్యాన్ని చెప్పకూడదు అనేమాట వారికి తెలియక కాదు. బాగా తెలుసు. అలా చెప్పటం వల్ల ఒక్క కర్ణునికో, లేక అతని మిత్రుడు దుర్యోధనునకో కొంత బాధ కలుగవచ్చు. కానీ సత్యమేమిటో చెప్పకపోతే రాజు కర్ణుని బలపరాక్రమాల విషయంలో ఎక్కువ అంచనా వేసుకోవచ్చు, నాశనం వైపు అతి శీఘ్రంగా పరుగులు తీయవచ్చు. కానీ భీష్మాదులు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పటం వల్ల వారికి నాశనం తప్పిందా, వారు శాస్త్రవాక్కుకు విరుద్ధంగా నడవటం వల్ల ఏమి ప్రయోజనం చేకూరింది? అని ఎవరైనా ప్రశ్నింపవచ్చు. భీష్మద్రోణులు వారి కర్తవ్యాన్ని వారు నిర్వహించారు. ఫలితాన్ని దైవానికి వదిలేశారు. ఎవరైనా వారి నుంచి నేర్చుకోవలసింది అదే.

- "రాచమడుగు శ్రీనివాసులు"


ᐅయువ భవిత



-------------
యువ భవిత 
-------------


కాకిలా కలకాలం బతికే కంటే- హంసలా ఆరుమాసాలు జీవించినా చాలు అనేది నానుడి. జీవించినది కొద్దికాలమే అయినా యువశక్తిని మేల్కొల్పి, మానవాళికి అఖండమైన ఉపకారాన్ని చేసి, భారతీయ తత్వజ్ఞానకేతనాన్ని ఖండాంతరాల్లో ఎగరవేసిన మహనీయుడు స్వామి వివేకానందుడు.
చికాగోలో సర్వమత మహాసభలో ఆయన సంబోధన- 'సోదర సోదరీమణులారా!' అని. ఆ ఒక్క సంబోధనతోనే భారతీయతత్వం ఔన్నత్యం ఎలాంటిదో ప్రపంచం గుర్తించింది. రక్తసంబంధం, ప్రాంతీయ సంబంధం, కనీస పరిచయం ఏదీ లేని ప్రజలందరినీ అలా సంబోధించడంతోనే విశ్వసోదరతత్వంలోని మాధుర్యం తొలిసారిగా చవిచూసిందీ ప్రపంచం.

భారతదేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు పూర్తిగా అణగారే స్థితిలో ఉండి, అంత్యదశకు చేరుకున్నప్పుడు దాన్ని పరిరక్షించడానికి వచ్చిన అవతార పురుషుడాయన. ''అన్నింటికన్నా ఉత్కృష్టమైన జన్మనెత్తిన మానవుడు బలంగా, నిర్భయంగా ఉన్నప్పుడే ఆ జన్మ సాఫల్యత నందుతుంది. దానికి సాధన కావాలి. ఓరిమితో సాధన చేస్తే సాధించలేనిదేమీ లేదు. ఏ ఫలితమూ ఒక్కరోజులో రాదు. ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. మనదేశానికిప్పుడు కావలసింది మూఢవిశ్వాసం కాదు, తార్కికదృష్టి. అది కలిగిననాడు ఇనపకండలూ, ఉక్కునరాలూ గల యువత తయారవుతుంది. ఆ యువశక్తే నేడు దేశాభివృద్ధికి కావలసింది' అని ప్రబోధించారు.

'జీవితం అశాశ్వతమైనది. అందువలన మానవుడు యౌవనంలోనే ధర్మశీలాన్ని అలవరచుకోవాలి' అనేది శాస్త్రవచనం. అందుకే యువతకు పిలుపునిచ్చాడు' 'లేవండి-మేల్కొనండి... భ్రమలను తొలగించుకోండి... వాస్తవాలను గ్రహించండి!' అని. భావనే గొప్పదై ఉండాలి. మన ఆలోచనలెలా ఉంటే మనమూ అలాగే తయారవుతాము. కాబట్టి ఆలోచనా విధానంలో జాగ్రత్త వహించడం అత్యవసరం' అంటారాయన.

నైతిక విలువలేని జీవిత విధానం వలన మనజాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందువలన నైతికతను పెంపొందించుకొమ్మని యువతకు బోధించాడు. బ్రహ్మచర్యాన్ని పాటించవలసిన ఆవశ్యకతను తెలియజెప్పారు.

బ్రహ్మచర్యం పాటించకపోతే ఆయువు, తేజస్సు, బలం, వీర్యం, బుద్ధి, ధనం, కీర్తి, పుణ్యం ప్రీతి ఇవన్నీ కోల్పోతామనేది శాస్త్రవచనం. బ్రహ్మచర్యమంటే పెళ్ళిమానేసి ఇనపకచ్చడాలు కట్టుకుని కూర్చోమని కాదు.

మాటలో, మనసులో, సమస్త పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించడమే బ్రహ్మచర్యం. దాని వలన ఆధ్మాతికప్రగతి. జ్ఞాపకశక్తి, ఆలోచన, తేజస్సు, ఆకర్షణశక్తి, వాగ్బలం ఇవన్నీ పెరుగుతాయి. అటువంటి శక్తిమంతమైన యువత దేశాన్ని ప్రగతిపథం వైపు సునాయాసంగా నడపగలదని అతడి ప్రగాఢ విశ్వాసం.

మానవాళికి మేలు చేసే ఏమతమైనా గొప్పదే. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. అలా ఎన్నో దారులు లేకపోతే ఉన్న ఒక్కదారి ఇరుకుగా మారి కనీసం కదలడానికి సైతం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దారులు వేరవడం మంచిదే. ఎవరికి నచ్చిన మార్గాన వారు నడుస్తారు. అంతేకాదు. వివిధ మతాలు, మనస్తత్వాలు ఉంటే మేధోమథనం జరుగుతుంది. తద్వారా విజ్ఞానం పెరిగి మానవజాతి వికాసం చెందుతుంది. ప్రతి వ్యక్తీ ఇతరుల భావాల్ని, మతాలసారాన్ని గ్రహిస్తూ తన కర్తవ్యాన్ని నెరవేర్చి వికాసం పొందాలి. ఆమాత్రం దానికి ఎవరూ వారి వ్యక్తిత్వాన్ని వదులుకోవలసిన అవసరంలేదు.

ప్రతి మనిషికీ వ్యక్తిత్వమున్నట్టే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుందని చెప్పింది వివేకానందుడే. 'ఒక విత్తనాన్ని భూమిమీద నాటితే గాలి, నీరు, మట్టి, వెలుతురు, ఉష్ణం లాంటివన్నీ దాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి. అంతమాత్రాన ఆ విత్తు నుంచి వచ్చే మొలక వాటిలో ఏ రూపాన్నీ సంతరించుకోవడం లేదు. వాటన్నిటినీ జీర్ణించుకుని ఆమొక్కగానే పరిణమిస్తుంది. అలాగే ఎవరి వ్యక్తిత్వాన్ని వారు నిలబెట్టుకుంటూ మనుగడ సాగించడమే భగవంతుని అభిమతం' అనేది వివేకానందుని సందేశం.

'ఏ పనీ అల్పంకాదు. ఇష్టమైనపని లభిస్తే పరమమూర్ఖుడు సైతం చెయ్యగలడు. అన్ని పనులూ తన కిష్టంగా మలచుకునేవాడే తెలివైనవాడు' అని యువతకు సందేశాన్నిచ్చిన వివేకానందుని దృష్టిలో- దేశభవిత యువతమీదే ఆధారపడి ఉంది!

- అయ్యగారి శ్రీనివాసరావు


ᐅభాషే భూషణం






------------------------------------------------
సమాజ సాంఘిక జీవితం లో భాషే భూషణం
------------------------------------------------ 


మనిషికి అందమైన భాషే మనోజ్ఞమైన అలంకారం. ఒక మనిషి మాట్లాడే విధానాన్నిబట్టి అతని మనస్తత్వాన్ని అతి సులువుగా అంచనా వేయవచ్చంటాడు ఓ మనోవికాసవేత్త. అమృతప్రాయమైనది మనం మాట్లాడే మాట. మధురమైన ఆ సుధను ఎంతగా పంచితే అంతగా జగం మనదవుతుంది. నోరు మంచిదైతే వూరు మంచిదవుతుందన్న ఆర్యోక్తి మనకందరికీ తెలిసిందే! పలుకే బంగారమాయెనా అంటాడు రాముణ్ని కీర్తిస్తూ భక్తరామదాసు. మనం సంభాషణలో వాడే పలుకులు బంగారమే కాదు, అంతకన్నా ఎన్నో రెట్లు విలువైనవి.
ఒక మనిషి మాట్లాడితే మన హృదయంలో ఉన్న క్లేశమంతా తొలగిపోయి, దూదిపింజలా తేలిపోయినట్లుంటుంది. ఇంకొకడు మాట్లాడితే ఉన్న ఆనందం క్షణంలో ఆవిరై చిరాకు, అసహనం పెరుగుతాయి. ప్రియవాక్యాలు పలికి తోటివారి హృదయానికి ఆనందం కలిగించేవాడు జనులందరికీ ఆప్తుడవుతాడనేది వేదవాక్యం. హృదికి నచ్చే మృదుభాషణం, కర్ణపేయమైన ప్రియభాషణం చేసేవాళ్లు సదా విజయులవుతారు. మంచి వర్తనతో పెద్దలను గౌరవించి, జయాన్ని పొందటమే కాక మృత్యుంజయుల కోవలోకి సైతం చేరవచ్చని నిరూపిస్తుంది మార్కండేయుడి చరితం.

మృకండు మహర్షి ప్రియపుత్రుడే మార్కండేయుడు. చిరుప్రాయంలోనే వేదవేదాంగాలను అభ్యసించాడు. పెద్దలను గౌరవించడం, తీయనైన, మృదువైన మాటలతో అందరినీ అలరించడం అనే మంచి అలవాట్లను అలవరచుకున్నాడు. ఒకసారి మృకండుని ఇంటికి విచ్చేసిన సప్తర్షులు మార్కండేయుడు మాట్లాడే విధానానికి ముచ్చటపడి చిరంజీవ అని దీవించారు. వెంటనే మృకండుడు సప్తర్షులతో 'మునివర్యులారా నా పుత్రుడు శివుడిచ్చిన వరం ప్రకారం పదహారేళ్లే బతుకుతాడు. మీరు చిరంజీవ అని దీవించారు. కాలచక్రాన్ని సైతం ఎదిరించగలిగిన తపోధనులు మీరు. మీరిచ్చిన వరం ఫలిస్తుందా' అని ఆశ్చర్యంతో ప్రశ్నిస్తాడు. 'మహర్షీ! మేమిచ్చిన వరం నిజమై తీరుతుంది. తీయని వాక్కులతో, వేదవచనాలతో మమ్మానందింపజేసిన నీ ప్రియపుత్రుడు చిరంజీవిగా మిగులుతాడు' అని వారు పలికి, బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్లి చిరంజీవ అని ఆశీర్వదింపజేస్తారు. పదహారు ఏళ్లు ముగిశాక శివుడి ధ్యానంలో ఉన్న మార్కండేయుని ప్రాణాలు తీయడానికి యముడు రావడం, శివలింగాన్ని భక్తితో హత్తుకుని మార్కండేయుడు శివుడి కృపకు పాత్రుడై మృత్యువును సైతం జయించడం భారతీయ సనాతన సంస్కృతిలోని మనోహరమైన పురాణగాథ. సప్తర్షులనేకాక సృష్టికర్తయైన బ్రహ్మ హృదయాన్నీ తన ప్రియమైన వాక్కులతో రంజింపజేసిన మార్కండేయుడు సన్మార్గదర్శి.

ఈ గాథ మనకు తెలియజెప్పేది ఏమిటంటే- సంభాషణ మన అంతరంగాన్నిగాక, ఎదుటివాడి హృదయాంతరంగమనే వీణను సవ్యంగా మీటాలని, తద్వారా వారి శుభాశీస్సులనుంచి మన మంచిని కాంక్షించే భవ్యమైన సంగీతం ఆవిష్కృతమవుతుందనేది తెలుసుకోదగ్గ నీతి.

- వెంకట్‌ గరికపాటి

ᐅప్రకృతే గురువు




-------------------------
ప్రకృతే పరమ గురువు
-------------------------


జగత్‌ సర్వం ఈశ్వరుని నివాసం. జ్ఞానులు ఏ ప్రాణినీ హీనంగా చూడరు. రమణ మహర్షి కాకిని కూడా ప్రేమతో చూసేవారు. బుద్ధి, భాష- భగవంతుడు మానవుడికిచ్చిన వరాలు. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే ప్రతిదీ నేర్చుకుంటున్నాడు. జంతువులకున్న గొప్ప శక్తులను గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఏనుగు శరీరం, సింహం ధైర్యం, గ్రామసింహం విశ్వాసం, గోమాత క్షీరం, కోకిల కంఠం, నెమలి చందం, హంస అందం, చిలక వాలకం... ఇలా ప్రతి ప్రాణికీ ప్రత్యేకత ఉంది. చిరుతలాగా మనిషి పరుగెత్తలేడు. కాకిలాగా ప్రకృతిని పరిశుభ్రం చేయలేడు. చేపలాగా నీటిలో ఈదలేడు... అలాంటివి సాధించడానికి శాస్త్రజ్ఞులు ఘోర 'తపస్సు' చేశారు. ఆ ప్రాణుల తీరుతెన్నులను పరిశోధించారు. యంత్రాలు తయారుచేశారు. ఆకాశయానం సాధ్యమైంది. జలాంతర్గాములు వచ్చాయి. కాలుష్యం హెచ్చరిల్లకుండా సాధ్యమైనంత చేసే కాకిలాంటి సర్వభక్షక యంత్ర ఆవిష్కరణ కోసం అహరహం శ్రమిస్తున్నాడు. ప్రకృతిలోని ధ్వనులను అనుకరిస్తూ మాటలు నేర్చాడు. మాటలు మనోహరంగా కూరుస్తూ కవిత్వం చెప్పాడు. 'రి'షభాది జంతువుల గొంతులను అనుసరిస్తూ సప్తస్వరాలు పలికాడు; సుమధుర సంగీతాన్ని సాధన చేశాడు. జంతువుల సహజ ఆహార విహారాలు వాటికి ఆరోగ్యాన్ని ఎలా చేకూరుస్తున్నాయో పరిశీలించాడు. ప్రకృతి వైద్యానికి ఆకృతినిచ్చాడు.

'పనికి రాదు' అనుకునే గడ్డిపోచ కూడా గొప్ప పాఠాన్నే నేర్పుతుంది! ఒక చెరువు గట్టుపై మహావృక్షం ఉంది. దాని పెద్ద పెద్ద కొమ్మలు దశదిశలా వ్యాపించాయి. సమీపంలోనే గడ్డి మొక్క ఉంది. 'నీదీ ఒక బతుకేనా? నేను చూడు ఎంత గొప్పదాన్నో! నా కొమ్మలు చూడు... ఎంత విస్తరించి ఉన్నాయో! నువ్వో? చిరుగాలికే పడిపోయేట్లున్న రెండు సన్న ఆకులతో ఊరికే వూగిపోతుంటావు!' అని మహావృక్షం గడ్డి పోచను ఎగతాళి చేస్తూ ఉండేది. ఒకరోజు పెద్ద తుపాను వచ్చింది. ఆ ఝంఝామారుతం దెబ్బకు మహావృక్షం వేళ్లతో సహా పెళ్లగిలి పడిపోయింది. గడ్డి పోచ మాత్రం ఆ గాలివాన వచ్చినంతసేపూ తలవాల్చి ఉంది. గాలి ఆగిపోగానే మళ్ళీ నిటారుగా నించుని మునుపటి కంటే అధిక కళతో విలసిల్లింది- ఇది ప్రపంచ ప్రఖ్యాత ఈసఫ్‌ నీతి కథ. 'అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను' అనే నీతిపద్యం అర్థం ఇదే!

చీమల నుంచి క్రమశిక్షణ మానవుడు నేర్చుకోవాలి. చిన్నచిన్న తేనెచుక్కలను మిక్కిలి పరిశ్రమతో ఒక్క చోటికి చేర్చే తేనెటీగల కృషి అనుసరణీయం. ఇవన్నీ ఎప్పటికీ మానవాళికి సజీవ పాఠ్యాంశాలే! భగవంతుడు బుద్ధి జీవియైన మనిషిని సృష్టించి, అతడి చుట్టూ అడుగడుగునా వివిధ విషయాలను బోధించే గురువులను ఏర్పరచాడు. ఆ గురువులే ఈ ప్రాణులు.

'ఒక రాజు శత్రువుల చేతిలో ఓడిపోయి, ఒక గుహలో తలదాచుకున్నాడు. నిరాశా నిస్పృహలు ఆవరించాయి. గూడు అల్లే సాలెపురుగు అతడి కంట పడింది. ఎన్నిసార్లు దారం తెగినా, అది పట్టు వదలడం లేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరికి చక్కటి సాలెగూడు అల్లి, మధ్యలో స్థిరంగా నిలిచింది. రాజు దాని ప్రయత్నాన్ని చూసే, తన నైరాశ్యాన్ని వదిలించుకొని సైన్యాన్ని వెంటబెట్టుకొని పెక్కు పర్యాయాలు ప్రయత్నించి, చివరకు విజయం సాధించాడు' అనే నీతికథ ప్రకృతి తాలూకు పరమ గురుత్వాన్ని విశదం చేస్తుంది. నీతికథలు ఎక్కువగా ప్రకృతితోనే ముడివడి ఉంటాయి. పశుపక్ష్యాదులు, వృక్షాలు మనుషుల్లాగే మాట్లాడతాయి. నీతి కథలు వినీ, చదివీ మనుషులు తమ జీవితాలను సరిదిద్దుకోవాలని పెద్దల ఉద్దేశం. అందుకే హితోపదేశాన్నీ నీతిచంద్రికనూ మనకు ప్రసాదించారు. ఈ కథలవల్ల నీతితోపాటు ప్రకృతి ప్రియత్వమూ అలవడుతుంది. తాము ప్రకృతిలో ఒక భాగమే అనే సంగతిని బాల్యంలోనే గ్రహించగలుగుతారు.

'మానవుడు సింహంలాగా గొప్ప పనిని సాధించడానికి పూనుకోవాలి. కొంగలాగా దేశ కాలాలకు అనుకూలంగా ప్రవర్తిస్తూ కార్యాన్ని సాధించాలి. పోరాటంలో వెనుదీయకపోవడం, స్వార్జితంతోనే బతకడం అనేవి కోడిని చూసి గ్రహించాలి. దాంపత్య సుఖాన్ని కాకిలాగా రహస్యంగా అనుభవించాలి' అని ఆచార్య చాణుక్యుడు సెలవిచ్చాడు. 'ప్రకృతే పరమ గురువు' అని ఆ మేధావి ఎన్నడో గ్రహించాడు. పరమ గురువైన ప్రకృతిని గౌరవిస్తేనే మానవుని మనుగడ సుఖ సంతోషాలతో సాగుతుంది

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅఆరాధన




------------------------
భగవంతుని ఆరాధన
------------------------


సృష్టి మొత్తం ఒక నియమ పూర్వకమైన సువ్యవస్తతకు లోబడి నడుస్తోంది. గ్రహాలు, నక్షత్రాలు తమ తమ కక్ష్యలలో ఇరుసుమీద ఈమాత్రం అటూఇటూ దారి తప్పకుండా పరిభ్రమిస్తాయి. దివారాత్రులు, ఋతువులు మొదలగు వాటిలో ఒక నియమం ఏర్పడి ఉన్నది. కర్మ ఫలాలు ఒక దైవవ్యవస్తకు సంబంధించినవే. పాలు పెరుగుగా మారటానికి, విత్తనం మొక్కగామారటానికీ కొంతసమయం పడుతుంది. అదే విధంగా కర్మలననుసరించి మంచిచెడుల ఫలితం కొంతసమయం వెనుకా ముందుగానైనా నిశ్చితరూపంలో అందుతుంది. అలాకాని పక్షంలో ప్రపంచమంతా ఆటవిక న్యాయం రాజ్యమేలేది. నోరున్నవాడిమాటే చెల్లుబాటవుతూ, బలమున్నవాడిమాటే సాగుతూ వుండేది. కానీ అలాజరగటంలేదు.

విధ్వాంసులు, ధనవంతులు కళాకారులూ పహిల్వానులు కాగలగాలి అనుకొంటే కృషిసాధన చేసి తీరాలి. కృషికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఏజాతి విత్తనాలు నాటుతామో ఆ జాతి పంటనే కోరుకుంటాము. మధ్యం తాగినవాడికే నిషా తలకెక్కుతుంది. విషంతాగినవాడు ప్రాణాలు పోగొట్టుకొంటాడు. ఇదే కర్మఫలం యొక్క సునిశ్చిత వ్యవస్తకు ప్రత్యక్ష ప్రమాణం.

ఏపనికైనా తాత్కాలంలోనే ఫలితం కనబడుతూ ఉంటే - అనగా దొంగతనం చేసిన వారి చేతులు చచ్చుపడి పోతుంటే, వ్యభిచారం చేసినవారి చేతులు చచ్చుపడి పోతుంటే - ఈ ధర్మాలు, కట్టుబాట్లు అవసరం అయ్యేవి కావు . భగవంతుని సాక్ష్యం పెట్టుకోవలసిన పనీ ఉండదు. మరి అటువంటప్పుడు ఈ అవకాశం మనిషికి ఎందుకు లభించింది? అతడు తన బుధ్ధి కుశలతను ఉపయోగించి వ్యవహరించాలని, తన గౌరవ గరిమను దృష్టిలో ఉంచుకొని సదాశ్యాన్ని కనపరుస్తూ, దుష్యర్మలకు దూరంగా ఉండాలని, కానీ జరిగేదంతా దానికి వ్యతిరేకం. మనిషి తప్పులమీద తప్పులు చేస్తూనే ఉంటాడు. మతి మరుపు అనే గుణం, నిర్లక్ష్య ధోరణి మనిషికి అనేక ఇక్కట్లను తెచ్చిపెడుతున్నాయి. మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవిస్తున్న వారిని చూస్తూ కూడా, జంకులేకుండా ఆ వ్యసనాలకు తాను కూడా బానిస అవుతుంటాడు మనిషి. ఏది మనిషి తెలిసి చేస్తున్న గొప్ప పొరపాటు.

ఆత్మ వికాసం అంతగా జరగక పోవడంతో - మనిషి ఉచితానుచితాలను తేడాను పట్టించుకోకుండా, వెనుకా ముందూ చూడకుండా మనసుకు ఏది తోస్తే అది చేయడమనే మరో పెద్ద తప్పు జరుగుతున్నది. స్వేచ్చాచరణ ఉదృత అహంకారానికి ప్రతిరూపం. పొగరుబోతు వ్యక్తి నియమాలను, ఆంక్షలను ఉపేక్షించి సంకుచిత స్వార్ధభావనా ప్రేరితుడై, ఏది చేయకూడదో అదే చేస్తుంటాడు. ప్రగతికి కావలసిన సమస్త సదుపాయాలు, సమస్త సంపదలు ఉన్నప్పటికీ జనులు వ్యధలలో, కష్టాలలో మునిగి తేలుతూ ఉండటానికి కారణం ఇదే. ఇతర ప్రాణులు హాయిగా సుఖజీవితాన్ని గడుపుతుండగా, మనిషిమాత్రం ప్రతినిమిషం సమస్యలతో , ఉద్విఘ్నతతో బ్రతక వలసి వస్తున్నది. ఈ స్వేచ్చారణ ఎలా ఆగుతుంది? వ్యక్తి సభ్యతతో అనుబంధితుడై ఎలా ఉండాలి? సమాజంలో పరస్పర సహకారం, సత్భావన ప్రసారం ఎలా ఉండాలి? ఏ ప్రశ్నలన్నింటికీ కలిపి ఒకే సమాధానం వస్తుంది. ఒక నియామక సత్తా యొక్క అస్తిత్వాన్ని నిజాయితీగా అనుభవం లోనికి తెచ్చుకోవడం, దానిని సర్వవ్యాపకమైనదిగా, సర్వ దర్శిగా భావించి, దాని న్యాయ నిష్టలపై స్తిరమైన విస్వాసముంచడం, వీటితోపాటు ఆసత్తాకు భగవంతునిగా పూజనీయతం ఇవ్వడం - ఇదే నిజమైన ఆస్తికత.

భగవంతుని ఉనికిని అంగీకరించేవారు, అతడిని ఆరాధించేవారు అసంక్యాకంగా ఉన్నారు. అయితే, వారి పూజలు భ్రాంతులతో నిండి ఉంటాయి. అందువల్ల వాటికి సజ్జనత, ఉదారత మొదలైన రూపాలలో రావలసిన ఫలితాలు తగినంతగా రావడం లేదు.

భగవంతుణ్ణి మానవులకుండె అన్ని దుర్భలతలు కలిగిన వ్యక్తిగా సామాన్యంగా మనుషులంతా ఊహించుకొంటారు, ప్రలోభాలతో ఆయనను ఉబ్బేయవచ్చని ఏమార్చవచ్చని భావిస్తారు. తధ్వారా తమ కోర్కెలు తీర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. స్తోత్రపాటాలు చదువుతూ పూజ పేరుతో పూలు, పళ్ళు, కానుకలూ వంటివి అర్పిస్తుంటారు. అతడు తమవంటి గుణాలున్న వాడిని నమ్ముతారు కనుక - లంచాలకు లొంగుతాడని, పొగడ్తలకు పొంగిపోతాడని, తమకోర్కెలు తప్పక తీరుతాయని ఊహించుకొంటారు. ఒకపక్క పూజలు చేస్తున్నా, మరోపక్క మనసులో భగవంతుని ఉనికివల్ల అపనమ్మకం ఉండటం వల్లనే ఇన్నిరకాలు పూజా విధానాలు, మూఢాచారాలు ఏర్పడ్డాయి. ఎటుపోయి ఎటువచ్చినా కనీసం చెడు జరగకుండా వివత్తులేవీ మీదపడకుండాయఅయినా ఉంటాయని వాటిని పాటిస్తుంటాయని వాటిని పాటిస్తుంటారు తప్ప నిజమైనవిశ్వాసంతోకాదు. ఒకవేళ ఏదైనా మంచి జరిగితే, అదివారి భక్తి ప్రదర్శనకు ప్రతిఫలంగా భగవంతుడిచ్చిన వరదానమని అనుకోరాదు. ఎందుకంటే - భగవంతుని వద్ద అన్యాయానికి తావు లేదు. ఆయనవద్ద ఉన్నతులాదండం కచ్చితమైన న్యాయ సూత్రాలను అమలుచేస్తుంది. ప్రతిపనికీ నిస్పక్షపాతంగా ఫలితాలను నిర్ణయిస్తుంది కనుక వీరితప్పుల తడక వ్యవహారాలను, దురాలోచనలును ఆయన పట్టించుకోడు. పూజలకు ఆయన పొంగిపోడు.

భగవంతునికి కొందరి యందు ప్రేమా మరి కొందరి యందు ద్వేషమూ ఉండదు. కొందరిని ఆశీర్వదిస్తూ మరి కొందరిని శపించడు.ఆయన విధించిన నియమాలను పాటించేవారు సుఖ సంతోషాలతో ఉంటారు. భగవంతుడు వారి యందు ప్రసన్నత కలిగి ఉన్నడన్నదానికి గుర్తు అదే. ఆయన పెట్టిన కట్టుబాట్లను ఉల్లంగించినవారు, చెడుమార్గం పట్టినవారు తమకర్మల దుష్పలితాలను అనుభవిస్తున్నారు, దీనిని భగవంతుని అప్రసన్నతగా భావించాలి. నిజానికి భగవంతుడు సర్వమునూ సర్వులనూ నియమిత అనుసాసనంలో బంధించాడు. ఇతర ప్రాణులన్నీ ఈ అనుశాసనాన్ని సహజ సిధ్ధంగా పాలిస్తున్నాయి. మనిషిమాత్రమే వక్రమార్గం పట్టి అశాంతికి లోనవుతున్నాడు. భగవంతుడు ఎవరితోనూ కఠినం గా వుండడు, మృదువుగానూ వ్యవహరించడు. కానుకలు మొక్కుబడులు ఇచ్చి ఆయనను పక్షపాత ధోరణిలో వ్యవహరింపచేయలేరు. అందుచేత ఆస్తికులైన వారి కర్తవ్యమేమిటంటే - భగవంతుని సర్వవ్యాపకునిగా న్యాయ నిర్ణేతగా అంగీకరించి, తమ అలోచనలు, సీలం విచ్చలవిడిగా ఉండకుండా, ఇతరులను విశృంఖలంగా నడుచుకొన నివ్వకుండా చూచుకోవాలి.

భగవంతుని సామర్ధ్యాలు అనంతములు, ఆయన విభిన్న ప్రయోజనాల కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిలో మనిషి అంతరంగాన్ని ప్రభావితం చేసే ధార సజ్జనత, సదాశయత. దానిని సత్ప్రవృత్తుల సముచ్ఛయిని అని చెప్పవచ్చు. సూర్యుని వెలుగు, వేడి సోకుతూనే కమలములు వికసిస్తాయి. అదేవిధంగా పరబ్రహ్మయొక్క సాన్నిధ్యంకలగగానే మనిషి గుణ, కర్మ, స్వభాలు ఉత్కృష్టత అనే పరిమళం సోకి సుగంధభరిత మవుతుంది. భక్తి అంటే భావావేశం కాదు. అందులో భగవంతునికి చేరువకావాలన్న, ప్రగాఢమైన ఆకాంక్ష నిండి ఉండాలి. సర్వవ్యాపకమైన, అణువణువునా నిండి ఉన్న ఆ శక్తి సహజంగా తన వద్ద కూడా ఉంటుంది. వెలుపలి వాతావరణంలోనూ, అంతరంగంలోపలా కూడా నిండిఉన్నది. ఆఙ్ఞానం వల్ల ఆ శక్తి ఎక్కడో తమకు దూరాన ఉన్నట్లు భావించుకున్నారు. వివేకం, విఙ్ఞానం మేల్కొనగానే అది సర్వత్రా దృష్టిగోచరం అవుతూ ఉంటుంది.

సర్వవ్యాపక సత్తా యొక్క వాస్తవిక రోపం నిరాకారమే అయినప్పటికీ, ధ్యాస ధారణ అనే ఆధ్యాత్మిక సాధన పూర్తి కోసం ఏదో ఒక రూపం ఉండక తప్పదు. మనిషి కల్పన దైవమును కూడా తనలాంటి అవయవాలు గలవిగా ఊహించుకొన్నది. అనేక సాంప్రదాయాలలో భగవంతుడు అనుయాయూల భక్తికి ప్రతిరూపంగా సృజింపబడ్డాడు. అందుకనే "ఏకం సధ్ విప్రా: బహుదావదంతి" అన్నట్లు- ఏకము అనేక రూపాలుగా దృష్టి గోచరమయ్యేది అని చెప్పబడినది. ఈ జగత్ భగవంతుని విరాట్ దృశ్యమాన స్వరూపం. అర్జుననకు, యశోదకూ, కౌసల్యకూ ఈరూపంలోనే భగధర్శనమయినది. భర్మ చక్షులతో ఈ రూపాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చూడవచ్చు. ఈ విరాట్ బ్రహ్మ పూజను స్వచ్చత, ప్రగతి, అలంకరణ రూపములలో చేయవలసి ఉంటుంది. అనగా ఈవిశ్వంలోని పరిసరాలను అందంగా రూపొందించడం, పంచభూతాలను (భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, జలం) కాలుష్య రహితంగా పరిశుభ్రంగా కాపాడుకోవడం, మానవులలో సమత, మమత, మానవతలను పెంపొందించడం మొదలైనవి భగవంతునికి ప్రీతికరమైన ఆరాధనలు - పూజలు.

ఇప్పటికన్నా రాబోయే కాలం మరింత సమృధంగా, సమున్నతంగా, ప్రగతి శీలంగా, సుసంస్కృతంగా ఉంటుంది. అటువంటి కాలంకోసం అందరూ కలసి కృషిచేయాలి. అటువంటి భావనాశీల ప్రపంచాన్ని భగవంతుని ఉధ్యానవనంగా భావించి, తాను కర్తవ్య పరాయణుడైన తోటమాలిగా మారి, దాని ఉత్కర్షలో, అభ్యుదయలో తన కాలాన్ని, శ్రమను ఏకాగ్రతను, సాధనను వినియోగించాలి. దీనినే కర్మయోగమని అంటారు. గీతలో దీనిగురించి ప్రత్యేకంగా చెప్పబడినది.

ఆస్తికతా భావన మనిషి విశృంఖలత మీద అంకుశంవలే పనిచేస్తుంది. ఒంటెను ముక్కుతాడుతో, గుఱాన్ని కళ్ళెంతో, ఏనుగును అంకుశంతో అదుపు చేస్తారు. సర్కసులోని జంతువులను రింగుమాస్టారు కొరడాతో భయపెట్టి కావలసిన పనులను నేర్పుతాడు. చెప్పినట్లు వినేలా చేసుకొంటాడు. అదేవిధంగా భగవంతుని యందున్న నమ్మకం మనిషిని చెడుమార్గాన నడవకుండా అదుపుచేస్తుంది. దేవుడు శిక్షిస్తాడన్న భయంతో మనుషులు తప్పుచేయడానికి జంకుతారు. సన్మార్గాన్ని ఎంచుకుంటారు. దానివలన సమాజపు వ్యవస్త సుస్తిరంగా ఉంటుంది.

- తెలుగుదనం

ᐅజీవన ధార


--------------
జీవన ధార 
--------------


జన్మించిన క్షణంనుంచీ మనల్ని కాలవాహిని తనతోపాటు లాక్కు పోతుంటుంది. ఎన్నో మైలురాళ్లు, మజిలీలు... కాలం మన రూపురేఖల్ని, తనువును, దాంతో మనసును మార్చేస్తుంటుంది.
గమ్యం వైపు వేగంగా దూసుకుపోతున్న రైల్లో కూచున్నట్లు ఒక్కో దృశ్యం గతంలోకి నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా చూస్తుంటాం. ఇవాళ ఖర్చుచేసిన ధనం రేపు మళ్ళీ సంపాదిస్తాం. కానీ, చేజారిపోయినాక ఏ ఒక్క క్షణాన్నీ మనం తిరిగి పొందలేం. ఈ జీవన రహస్యంపట్ల అప్రమత్తంగా ఉండాల్సింది పోయి, ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటాం.

జీవన ప్రయాణం మృత్యువు దగ్గర ఆగిపోతుంది.
మృత్యుమందిరం దగ్గరకు మనలో అధికులు రోగులుగా, పాపులుగా వీపున దుష్కర్మల మూటలు మోస్తూ చేరుకుంటారు. అటు తరవాత ఏం జరిగేదీ ఎవరికీ తెలియదు. అంతా వూహల మయమే.

దైవం మనిషిని శరీర రూపధారిగా గుర్తించడు. ఆత్మగానే చూస్తాడు.

పరమాత్మనుంచీ ఆత్మ విడిపోతుండగా, ఆప్యాయంగా జ్ఞానమనే ధనాన్ని జీవన ప్రయాణబత్తెంగా ఇస్తాడాయన. దాన్ని సద్వినియోగం చేసుకున్న జీవుడు మృత్యుమందిర ద్వారాలు దాటి, పరమాత్మ ఎదుటకు తేజోమయమైన ఆత్మస్వరూపుడిగా వెళ్లి ఆనందపరుస్తాడంటారు. జ్ఞానం విస్మరించిన జీవుడు పశుప్రాయుడిగా, పరమాత్మ ఎదుట అపరాధిలా నిలబడతాడని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

గండకీ నది ప్రవాహానికి కరిగిపోయే రాళ్ళే, నునుపుదేలి శివస్వరూపాలైన సాలగ్రామాలవుతాయని ప్రతీతి. అంటే కాలవాహినిలో శిలలు సైతం తమను తాము సంస్కరించుకుని, శివస్వరూపంగా రూపొందుతున్నాయి.

మరి మనిషి మాటేమిటి?

పూచిక పుల్లలు నీటిలో తేలుతూ ప్రవాహ వాలులో పడికొట్టుకు పోయినట్లు అర్థరహిత జీవితాలు గడపటం తప్ప, జీవితం ముగిసిపోయేదాకా మేలుకోరా?

జీవన చరిత్రలో ప్రతి ఏటా వసంతాలు వస్తున్నాయి. శిశిరాలు, గ్రీష్మాలు, వర్షాలు మనల్ని తమతమ ప్రత్యేకతలతో అలరిస్తున్నాయి. ప్రకృతినుంచి మనం ఎలాంటి సందేశాలూ అందుకోవటంలేదు.

అర్థవంతంగా మార్చుకోవాల్సిన జీవితాలను వ్యర్థమయం చేసుకుంటున్నాం. ఎదురుగా హిమశిఖరాలు ఆహ్వానిస్తుంటే దిగువన ఉన్న లోయల్లోకి దిగిపోతున్నాం.

మన ప్రయాణం దిశ మారాలి. మన పాదాలు ఎత్తుకు అలవాటు పడాలి. ఆధ్యాత్మికత అనే చేతికర్రతో మనం ఉత్తమ, ఉన్నత ప్రమాణాల జీవిత శిఖరాన్ని చేరుకోవాలి. అప్పుడు మనం జీవన ధారలోంచి వేరుపడి, సాక్షిగా ఆ ప్రవాహాన్ని మందహాసంతో వీక్షిస్తాం. అదే మోక్షం!

- కాటూరు రవీంద్ర తివ్రికమ్‌

ᐅజ్ఞానసముపార్జన



----------------------------
పరిపూర్ణ జ్ఞానసముపార్జన 
----------------------------


మానవ జీవితంలో జ్ఞానానికున్న ప్రాధాన్యం మరి దేనికీలేదు. 'జ్ఞ' అంటే తెలుసుకోవడం, 'జ్ఞానం' అంటే తెలుసుకోదగినదని అర్థం. జ్ఞానానికి సమానమైనదేదీ లేదని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మే చెప్పాడు. నేలమీదపడిన బిడ్డ 'క్యా..క్యా' అని రోదిస్తాడట. 'చోళ్లోళ్లోహాయీ' అని తల్లి జోలపాడుతుందట. 'ఈ జగత్తులో హాయిలేదు... ఈ జగత్తే మిథ్య నాయనా' అని మొట్టమొదటి వేదాంత పాఠం బోధిస్తుందట. ఇది ఓ కవి చమత్కారంగా చెప్పిన మాట. 'జగన్మిథ్య- బ్రహ్మసత్యం' అన్న ప్రథమజ్ఞాన సోపానం మీద కన్నతల్లే బిడ్డను నిలబెట్టింది. తరవాత తండ్రి, గురువు, సమాజం, కాలంనుంచి ఎంతో జ్ఞానాన్ని ఆర్జించవలసి ఉంటుంది. జ్ఞానమనేది ఓ దివ్యజ్యోతి. ఆ జ్యోతి ప్రవేశనం వల్లనే మనం మన గమ్యాలను, లక్ష్యాలను సాధించుకోగలం. జ్ఞాన సముపార్జనకు మన పూర్వజులెన్నో వనరులు సమకూర్చిపెట్టారు. అసలు భగవంతుడే 'ప్రకృతి' అనే పాఠశాలను జ్ఞానసముపార్జన కోసం మనకు ప్రసాదించాడు. అందుకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి. జీవితంలోని ఏ క్షేత్రంలో విజయం సాధించాలన్నా, సుఖశాంతులు పొందాలన్నా, పరమపద సద్గతిని పొందాలనుకున్నా జ్ఞానార్జన చేయాలి. జ్ఞానార్చన జరగాలి. జ్ఞానాన్ని అర్చిస్తే, గౌరవిస్తే, ఆహ్వానిస్తే, అది మనకు అఖండ యశో వైభవాన్ని ప్రసాదిస్తుంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడం కేవలం జ్ఞానికే సాధ్యం. ఆత్మజ్ఞానం ఆర్జించినవాడే జ్ఞాని. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, వాల్మీకి అంబరీషాదులంతా తమ జ్ఞాననేత్రంతో పరమాత్మను దర్శించి, పునీతులైన ధన్యాత్ములుగా చెబుతారు. జ్ఞానవంతమైన వాగ్వర్షం కురిసిన చోట, ప్రకాశవంతమైన మేఘాలు వర్షించి సుభిక్షం కలగజేస్తాయని వేదాలు వర్ణిస్తున్నాయి. ప్రపంచానికంతటికీ ప్రాతినిధ్యం వహించగలవాడు కేవలం 'జ్ఞాని' మాత్రమే!

జ్ఞానం పరోక్షమనీ, అపరోక్షమనీ రెండు విధాలు. పాండిత్యం, బుద్ధి కుశలత వల్ల లభించేది పరోక్ష జ్ఞానం. వివేకం, వైరాగ్యం, శమదమాలు, ముముక్షత్వం వల్ల అపరోక్ష జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఈ రెండు విధాల జ్ఞాన సముపార్జన చేసినప్పుడే 'సంపూర్ణజ్ఞాని' అనిపించుకునే అవకాశముంది. అటువంటివాడే 'పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడిమి బ్రతుకునాటకము' అన్న సత్యవాక్కును విశ్వసించగలుగుతాడు. జ్ఞాని ఇతరుల కోసం భగవచ్ఛింతన చేస్తాడు. తన అజ్ఞానాన్ని, తన దోషాలను జ్ఞాని మాత్రమే తెలుసుకోగలుగుతాడు. జ్ఞానాగ్నిలో కర్మలను దహింపజేసుకోగలవాడే పండితుడు, ముముక్షువు కాగలుగుతాడు. హృదయంలోని సంశయాలన్నింటినీ జ్ఞానయోగి మాత్రమే నివృత్తి చేసుకోగలడు. అజ్ఞానం- మార్పును అంగీకరించదు. మూర్ఖతను సమర్థిస్తుంది. జ్ఞానరహితమైన కార్యం వాసన లేని పువ్వు. జ్ఞానాన్ని ప్రవర్ధమానం చేసే శక్తి ఒక్క సత్వ గుణానికే ఉంది. తమో గుణం జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది. జ్ఞాన యోగం చేయగలవాడే పరమాత్మకు సన్నిహితుడు కాగలడు. జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానంకన్నా చైతన్య రూపంలో సమాజాన్ని ప్రభావితం చేయగల పరిమిత జ్ఞానమే మిన్న. శ్రమను ప్రేరేపించలేని జ్ఞానమెంతటిదైనా వ్యర్థమే అన్నారు బుధులు. అటువంటి జ్ఞానంవల్ల ఎన్ని ఆటంకాలు, సమస్యలు, బాధలు ఎదురైనా మానవుడు ఆదిలోనే అధిరోహించగలడు.

సాధకుడికి జ్ఞానాన్ని మించిన గొప్ప సాధనమే లేదు. ఆ జ్ఞానమే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞాని తన కర్మను చేస్తూ, అన్నీ చూస్తూ, తాకుతూ, వింటూ, తింటూ కూడా నిర్లిప్తుడై ఉంటాడు. ఆ పనులన్నీ చేసేది తాను కాదని గ్రహిస్తాడు. ఇంద్రియాలు తమ పనిని తాము చేసుకుపోతున్నాయని గమనిస్తాడు. అన్నింటినీ సమంగా చూస్తాడు. భూషణకు పొంగడు. దూషణకు కుంగడు. సంసారంలో ఉంటూ కూడా సన్యాసిలా వ్యవహరిస్తాడు. ఇదే మోక్ష సౌధానికి ప్రథమ సోపానం. జ్ఞాని అయినవాడు మొట్టమొదట- 'నేనెవరిని, నా శక్తి ఏమిటి, ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి?' అన్న ప్రశ్నలు వేసుకుని సంతృప్తికరమైన సమాధానాలు ఎప్పటికప్పుడు పొందుతూ తన ఆంతరిక, బాహ్యవ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుంటూ జ్ఞానార్జన ద్వారా జ్ఞానార్చనలో సర్వదా లీనమై ఉంటాడు. అందుకు సద్గురువే ఎల్లవేళలా పథప్రదర్శకుడై నడిపిస్తాడు. తోడిన కొద్దీ శుద్ధ జలమిస్తుంది చెలమ. వేడినకొద్దీ మహాజ్ఞానమిస్తాడు గురువు. గురువు కులమతాలతో నిమిత్తం లేకుండా జ్ఞానం గ్రహించేవాడే నిజమైన శిష్యుడు. యుద్ధంలో కత్తితోనే పని, కత్తిని కాపాడే ఒరతో కాదు. అలాగే గురువు ప్రసాదించే జ్ఞానంతోనే పని; అతని కులమతాలతో పనిలేదు శిష్యుడికి. వంద గ్రంథాల జ్ఞానం కన్నా సద్గురువు హితవాణి ఒక్కటే మహిమాన్వితమైనది. మన సమస్యలకు పరిష్కారం గ్రంథాల్లో వెదుక్కోవాలి; కాని, గురువు మన సమస్యకు సూటిగా పరిష్కార మార్గం చూపి, జ్ఞానశిఖరం వైపు తీసుకెడతాడు.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅవివేక జ్ఞానం




------------------
 వివేక జ్ఞానం  
------------------


మనిషిగా జన్మించినవాడు జ్ఞానాన్ని ఆర్జించాలని పెద్దలందరూ సూచిస్తుంటారు. జ్ఞానం కలిగిన మనుషులందరూ మానవత్వంతో ప్రవర్తిస్తున్నారా? ఔనని నిర్ద్వంద్వంగా సమాధానం చెప్పలేని ప్రశ్న అది.
రావణబ్రహ్మ మహాజ్ఞాని. పరస్త్రీని ఆశించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఎంతో జ్ఞానం కలిగిన ధర్మరాజు జూదమాడి రాజ్యాన్ని కోల్పోయి తన తమ్ముల్ని, ద్రౌపదిని పరాభవానికి గురిచేశాడు. మనం ప్రస్తుతం నివసిస్తున్న సమాజంలోని జ్ఞానవంతులుగా పేరు సంపాదించుకొన్న కొందరు అసాంఘిక శక్తులుగా ఎదుగుతున్న వైనం మనకు తెలుసు. పరమాత్ముని గురించిన జ్ఞానం (బ్రహ్మజ్ఞానం) కలిగిన మహానుభావులెందరో పరమపదాన్ని అధిరోహించలేక లౌకిక ప్రలోభాలకు ఆకర్షితులై దిగజారుతున్నారు. ఎందుకిలా జరుగుతుందంటే, మనసు చంచలమైనది. దేహం పాంచభౌతికమైనది. ఈ రెంటినీ నియంత్రించగల శక్తి జ్ఞానానికి లేదు. జ్ఞానంతో పాటు ధర్మం వివేకం, విచక్షణ కలిగి ఉండటం మనిషికి అవసరం.

వైకుంఠవాసి శ్రీహరి హిరాణ్యాక్షుణ్ని సంహరించిన తరవాత కొడుకు మరణవార్త విని దితి పుత్రశోకంతో కుమిలిపోతుంటుంది. హిరణ్యాక్షుడి పద్నాలుగు మంది భార్యలు, అతని సంతానం హృదయ విదారకంగా దుఃఖించసాగారు. తమను నిరాధారులుగా చేసి పోయావంటూ రోదిస్తూ వాళ్లందరూ హిరణ్యాక్షుడి శరీరంపై పడి ఏడుస్తుంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు అక్కడికి వస్తాడు. వచ్చి కుమిలిపోతున్న తన తల్లి దితితోనూ, తన సోదరుడి భార్య పిల్లలతో చెప్పిన వూరడింపు మాటలు హిరణ్య కశిపుని జ్ఞానసంపదకు కొలబద్దలు.

'తల్లీ! లోకం మంచినీటి సరస్సు వంటిది. ప్రాణులందరూ దాహం తీర్చుకోవడానికి వచ్చిన బాటసారుల వంటివారు. ఎవరి దాహం వారు తీర్చుకొని వెళ్లిపోతున్నట్టే మనమూ ఈ లోకంలోకి వచ్చి మన పని కాగానే వెళ్లిపోతుంటాం. ఆ దైవం సమస్తానికి అధిపతి. సర్వమూ తెలిసినవాడు, సర్వత్రా నిండి ఉండేవాడు. దైవం సత్యుడు, నిత్యుడు, ఆత్మస్వరూపుడు. అటువంటి పరమాత్మ తన మాయా ప్రవర్తనాది మహిమలతో మనల్ని సృజించాడు. అమ్మా! ఈ లోకం తీరు చూశావా? కదలని చెట్లు కదులుతున్న నీళ్లలో కదలాడుతున్న విధంగా భావ వికారాలు లేనట్టి పరమాత్ముడు మనలనందరినీ వివిధ భ్రమలకు గురిచేస్తుంటాడు. పుట్టుక, వినాశం సత్యమైనవి, కాని- శోకం, చింత అసత్యమైనవి. ఈ పరమార్థం తెలుసుకోవాలి' అని హిరణ్యాక్షుని భార్యలకూ, తల్లికీ, అతని సంతానానికి బోధిస్తాడు. హిరణ్యాక్షుని కొడుకులైన శకుని, శంబరకాలనాభ, మఠోత్కచులకు తండ్రి రాజ్యాన్ని సమంగా పంచి హిరణ్యకశిపుడు మహాజ్ఞానిగా అందరి మన్ననలనూ పొందుతాడు.

ఎంతో జ్ఞానవంతుడిగా పేరు తెచ్చుకొన్న హిరణ్యకశిపుడు ఆ తరవాత వివేకం కోల్పోయి విచక్షణాధర్మం త్యజించి సోదరుడి మరణం వల్ల ఆవహించిన రోష శోకాలకు ప్రభావితుడయ్యాడు. మహా పరాక్రమశాలి అయిన హిరణ్యాక్షుణ్ని హరి వరాహరూపంలో వచ్చి వధించడం హిరణ్యకశిపుడు సహించలేకపోయాడు. అప్పుడు తన సైనాధ్యక్షులనందరినీ పిలిపించి శ్రీహరిపై యుద్ధానికి సన్నాహపరుస్తూ, ఆ వైకుంఠవాసి గురించి వివరించిన తీరు అందరినీ చకితుల్ని చేస్తుంది. 'సైన్యాధిపతులారా! శ్రీహరి మహా మాయావి. అతడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. నీళ్లలో ఉంటాడు. అడవుల్లో దాగుతాడు. మునుల హృదయాల్లో చొరబడి ఉంటాడు. వాని పుట్టుక గురించి తెలియదు. ఎక్కడివాడో ఎవరూ నిర్ధారించలేకపోయారు. మనం ఎదుర్కొంటే తానూ ఎదుర్కొంటాడు. వెంటపడితే ఎన్నడూ అలసిపోడు. ఎవరికీ దొరకడు. శ్రీహరి లభించాలంటే శరణాగతి చేయాలట. మనం శరణని అనలేము. ఎలాగైనా మాయోపాయంతో అతణ్ని జయించాలి!' అని హిరణ్యకశిపుడు పురిగొల్పుతాడు. హిరణ్యకశిపుడు, మరణం తప్పదని తెలిసీ తపం చేసి ప్రత్యక్షమైన బ్రహ్మను మరణం లేని జీవితాన్ని ఇవ్వమని అర్థిస్తాడు. అంతటి జ్ఞానవంతుడు వివేకం కోల్పోయి చివరికి తన కుమారుడి కారణంగానే శ్రీహరి ధరించిన నరమృగ శరీరంలోని రౌద్రానికి గురై మరణిస్తాడు.

ఈ లోకంలో చాలా రకాల వికారాలున్నాయి. జ్ఞానం కలిగి వివేకం కోల్పోయి ప్రవర్తించడం ఒక వికారమే! భగవంతుని గురించిన జ్ఞానం మహత్తరమైనది. ఆ జ్ఞానాన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలి తప్ప గర్వపడకూడదు. జ్ఞానంతో పాటు ధర్మాన్ని వివేకాన్ని, విచక్షణా విజ్ఞతల్ని కలిగి జీవిస్తే మనిషి అమృతమయుడవుతాడు.

- అప్పరుసు రమాకాంతరావు

ᐅమనసే మంత్రం




------------------
మనసే మంత్రం 
------------------

మనకున్న జ్ఞానేంద్రియాలు అయిదు, కర్మేంద్రియాలు అయిదు కదా! ఈ పది ఇంద్రియాలతోపాటు భగవంతుడు మనకు ప్రసాదించిన మరో ఇంద్రియం మనసు. అది కంటికి కనబడకుండానే అనేక ఇంద్రజాల మహేంద్రజాలాలను అనుభూతిలోనికి తెస్తుంది.
సాక్షాత్తు పరమశివుడినే ద్వంద్వయుద్ధంలో జయించి, పాశుపతాస్త్రాన్ని వరంగా పొందిన అర్జునుడిని సైతం 'కృష్ణా! నా శరీరం వణుకుతున్నది; నాలుక పిడచకడుతోంది... కళ్లు బైర్లు కమ్ముతున్నాయి... గాండీవం చేతినుంచి జారిపోతున్నది' అనేట్లుగా బలహీనుడిని చేసింది అతడి మనసే!

ఉత్తరగోగ్రహణ సమయంలో అర్జునుడి వైపు ఒక్క ఉత్తరకుమారుడు మాత్రమే ఉండగా- కౌరవుల వైపున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధన దుశ్శాసన కర్ణాది కురువృద్ధులు, గురువృద్ధులు అందరూ ఉన్నారు. ఆనాడు ఆ వీరాధివీరులనందరినీ ఒకే ఒక్క అస్త్రంతో మూర్ఛిల్లజేసేంత గుండెధైర్యాన్ని అర్జునుడికి ఇచ్చిందీ అతడి మనసే!

'సాగితే బండి; సాగకపోతే మొండి' అనేది మనసుకున్న లక్షణం. అది ఉత్సాహంగా ఉన్నదా, మనిషిని నక్షత్రమండలం దాకా పెంచగలదు. పిరికితనం ముసిరిందా, పాతాళలోకందాకా కుంగదీయగలదు. మనిషిని గుడిగోపురంలాగా, గిరిశిఖరంలాగా నిటారుగా నిలబెట్టగలది మనసే! కూకటివేళ్లతో సహా కూలిపోయిన వృక్షంలాగా నేలమీద పడవేయగలదీ మనసే!

పురాణాలను దాటి వర్తమానంలోకి వద్దాం! మనకందరికీ అనుభవంలో ఉన్న విషయమే! మన అబ్బాయి- పది పదకొండు సంవత్సరాలవాడు మనం ఇంట్లో లేని సమయంలో సైకిల్‌ వేసుకొని బజారుకు వెళ్లాడు. ఇంటికి రాగానే మనకు ఆ సంగతి తెలిసింది. అంతే! గుండెలో గుబులు మొదలు... 'బజారులోనా బండ్ల రద్దీ ఎక్కువ. వీడా పసివాడు, బండిని జాగ్రత్తగా నడుపుతాడో లేదో! మనం జాగ్రత్తగా ఉన్నంత మాత్రాన సరిపోదాయె. అవతలి బండివాడు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా! వాడు వీడి మీద పడితే! బతుకంతా వైకల్యమే కదా!...' ఈ ఆలోచనలకు అంతు ఉండదు. ఆలోచిస్తున్నంతసేపూ గుండె దడదడ.

గమ్మత్తు ఏమిటంటే ఇప్పటివరకూ మన పిల్లవాడికి జరిగిన ప్రమాదమేమీలేదు. ఆ ప్రమాదాలన్నీ మన మనసులోనే, మన ఊహలలోనే జరిగి మనకు నరకాన్ని చూపిస్తాయి.

ఇంతలో మన మిత్రుడు వస్తాడు. విషయం తెలుసుకొంటాడు. అతడు తెలుసుకొనే దాకా ఎందుకు? మనమే చెబుతాం. అతగాడు అంతా విని నవ్వుతాడు. 'ఒరే! మీవాడు మా ఇంటికే వచ్చాడురా! మా వాడితో ఆడుకొంటున్నాడు' అని చెబుతాడు. ఇప్పుడు చూడండి. మన ఆవేదన అంతా అరక్షణంలో అదృశ్యం.

ఒకరాత్రి వేళ మనం ఆదమరచి గాఢంగా నిద్రపోతున్నాం. పెద్దపాము ఒకటి మన పొట్టమీదుగా జరజరా పాకుతూ వెళ్లిపోయింది. మనకు కించిత్తయినా భయం కలిగిందా? లేదు! మరొకరోజున బల్లిపిల్ల ఒకటి 'టపీమని మన ఒడిలో పడ్డది. చూశాం. ఏమైంది? గుండె అదిరిపోయింది.

పాము మన మీదుగా వెళితే ప్రశాంతంగా నిద్రపట్టడమేమిటి? బల్లిపిల్ల మీదపడితే గుండె అదరటమేమిటి? అంటే- పాము సంగతి మన మనసుకు తెలియదు. బల్లి సంగతి తెలిసింది. ఇదే తేడా!

మన మనస్సు ఇంద్రజాలికుడి సంచీ. అందులో ఉండని వస్తువు ఉండదు. ఉండని విషయమంటూ ఉండదు. భయం, ధైర్యం, దిగులు, ఆనందం, ఆందోళన, ప్రశాంతత, ఆశ, తృప్తి- అదీ ఇదీ ఏమిటి? అన్నీ ఆ సంచీలోనే ఉంటాయి. హాయిగా నిద్రపోతుంటాయి. దేన్ని మేల్కొలిపితే అది మేల్కొని, మనకు దుఃఖాన్నో ఆనందాన్నో కలిగిస్తుంటుంది.

మనమందరమూ ఈ విషయాన్ని తెలుసుకొని మనసులోని అవలక్షణాలనన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుదాం. ఆనందాన్ని, ధైర్యాన్ని సంతృప్తినే మేల్కొలుపుదాం. బయటకు తీద్దాం. వాటి తాలూకు ఆనందాన్ని అనుభవిద్దాం! ఆ అనుభూతులను ఇతరులకు పంచిపెడదాం. అప్పుడు మన మనసు మనకొక వరమే అవుతుంది.

- డాక్టర్‌ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

ᐅఆనంద పరీమళం



----------------------
ఆనంద పరీమళం 
----------------------

ఏ ఒక్కరి జీవితమూ పుడుతూనే పూలబాటకాదు. ధనం ఉన్నా లేకున్నా విద్య ఉన్నా లేకున్నా రూపం ఉన్నా లేకున్నా ఏ స్థితిలోనైనా ఆ స్థితికి తగిన ఇబ్బందులు అవి తెచ్చే దుఃఖాలూ ఎంతో సహజాతిసహజం. మానవుడు పుడుతూ ఏదీ నేర్చుకోడు. అన్నీ పెరుగుతూనే నేర్చుకొంటాడు. ఈ క్రమంలో అలా నేర్చుకొనే వాటిలో ఏవి ఆనందాన్నిస్తాయో ఏవి దుఃఖాన్నిస్తాయో తెలుసుకోలేక తికమకపడి సరిగ్గా కష్టాల్ని కొనితెచ్చిపెట్టే అలవాట్లను ఇష్టంగానూ, నిత్యానందాన్ని అందించే అలవాట్లని కష్టంగానూ భావిస్తాడు. కొన్ని ఉదాహరణల్ని చూస్తే ఈ విషయంలోని లోతు ఇట్టే అర్థమవుతుంది. ఎవరైనా సరే నిత్యం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని నిత్యం కలవరపెట్టే విషయాలనుంచి దూరంగా ఉండటం మంచిది.

1. ఎప్పుడూ ఎవరినీ ద్వేషించకుండా ఉండాలి.

2. ఎప్పుడూ మనసును ఆందోళనలకు దూరంగా ఉంచాలి. కంగారు పడకూడదు.

3. నిరాడంబర జీవనం సాగించాలి.

4. తక్కువ ఆశించాలి.

5. ఎక్కువ త్యాగం చేయాలి.

6. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.

7. తీరిక సమయాల్లో- నచ్చిన, నమ్మిన భగవన్నామస్మరణ చేయాలి.

ఈ ఏడు అలవాట్లు పైకి మామూలుగా కనిపించినా, ఎప్పుడూ ఎవరికీ నిత్యంగా లభించని ఆనందాన్ని పట్టితెచ్చి మన అరచేతిలో ఉంచుతాయి. ఎందుకంటే, ఎప్పుడైనా మనం అదుపు తప్పేది ఒకరిపై ద్వేషం పుట్టినప్పుడే. ఎవరేం చేసినా నేను ఎవరినీ ద్వేషించనని ముందే మనసులో మనం ఒక స్థిర నిర్ణయానికి వస్తే- ద్వేషంవల్ల వచ్చే ప్రతీకార వాంఛ, క్రోధం వంటి దుర్గుణాల్ని నిరోధించవచ్చు. ద్వేషాన్ని రూపుమాపుకొన్నవాడే తన ప్రియభక్తుడని కృష్ణభగవానుడే చెప్పాడు. ఇక ఆందోళనలకు కారణం మనస్సు. మానవుని బంధనానికిగానీ, జీవన్విముక్తికిగానీ కారణం మనసే. ఆ మనసు అతి చంచలమైనది. సత్కర్మాచరణ, ధార్మికనిష్ఠ సత్కథాకాలక్షేపాల వంటి నియమిత కర్మలను నిరంతరంగా ఆచరించడం ద్వారా మనసు తాలూకు వక్రబుద్ధిని సరిచేసుకోవచ్చు. ఆడంబరాలు మనసును కలుషితం చేస్తాయి. జగత్తులో సర్వమూ మిథ్య అనే వేదాంతం ఆడంబరాల్ని రూపుమాపుతుంది. దర్పం, అహంకారం వంటి దుర్గుణాలకు గొడ్డలిపెట్టు నిరాడంబరత్వం. ఆశ మనల్ని దాసుల్ని చేసి ఆడిస్తుంది. సాధ్యమైనంత తక్కువ ఆశించాలి. మనం దేన్నైనా ఆశించడం మొదలుపెట్టామా? దుఃఖంలోనికి దిగుతున్నట్లే లెక్క. ఆశించినదే ఎల్లప్పుడూ దక్కదు కదా! అప్పుడు దుఃఖమూ తప్పదు. అందుకే మొదటినుంచీ పుచ్చుకోవడంలోకన్నా ఇవ్వడంలో ఎక్కువ ఆనందం ఉందనే భావనను అలవరచుకోవాలి. ఒక్కసారి ఆ ఆనందంలోని మాధుర్యం చవిచూస్తే ఎప్పుడూ మనసు 'ఆశ' జోలికిపోదు.

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. హృదయం నిర్మలంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం. సాధ్యమైనంత వరకూ హృదయహాసాన్ని నిత్యం ధరిస్తే, ఆ హాస్యం ముఖంలో ప్రతిబింబిస్తుంది. ఆ మనోల్లాసమే ఇతరుల హృదయ వికాసానికి దోహదం చేస్తుంది. ఈ లక్షణాలన్నీ సాధించాలంటే మానవుని మానవునిగా చూస్తే సరిపోదు. ప్రతి జీవిలోనూ దివ్యత్వం, దైవత్వం ఉన్నట్లు భావించాలి. సృష్టిలో ఏ ప్రాణిని చూసినా దైవస్వరూపంగా తలపోయాలి. అప్పుడే నిత్యానందం కరతలామలకమవుతుంది. ప్రయత్నపూర్వకంగా సాధించిన ఈ ఆధ్యాత్మిక సుమ పరీమళం లోకమంతా వ్యాపించి ఆనందం అందరికీ అందుతుంది.

- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌


ᐅఆనందోబ్రహ్మ



---------------------------
అంతరంగం - జ్ఞానజ్యోతి 
---------------------------

'ఆధ్యాత్మికతకు మొదటి చిహ్నం ఎందరికో సమ్మతమైన మతాన్ని అనుసరించటం. దానికి ప్రథమ లక్షణం ఆనందంగా ఉండగలగటం. అందుకే ఆనందోబ్రహ్మ అన్నారు జ్ఞానులు. మనిషి దుఃఖభాజనుడైతే స్తబ్ధుగా ఉండిపోతాడు. ముఖం ముడుచుకొనిపోతుంది. ఎవరి ఆనందాన్నీ భరించలేడు. మనసులో చికాకుగా ఉంటే దానంతట అది బయటకిపోదు. పోలేదు. గదిలో తలుపు వేసుకొని మనసులోని ఖేదానికి కారణాన్ని అన్వేషించాలి. ఈ రుగ్మతకు హేతువేమిటో మూలాల్లోకి వెళ్ళి చూడాలి.

నిజమైన ఆధ్మాత్మికతను సాధించినవాడి ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది. దృక్పథంలో విశాలత ఉంటుంది. అందర్నీ ప్రేమించగల సౌశీల్యత ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోడు. ఎదుటి వ్యక్తి అభిప్రాయం తప్పయినా విమర్శించడు. అతనికా అభిప్రాయం ఉండటమనే హక్కును హరించాలని ఏ కోశానా అనుకోడు.

కొందరికి మతం ఒక వ్యాపార సాధనం. కేవలం ధనార్జన కోసం ఆధ్మాత్మికత అనే ముసుగు వేసుకొని అమాయకుల్ని మోసం చేస్తారు. అలాంటివారు ఒకరితో ఇంకొకరు పోటీపడతారు. ఏదోనాడు వారి కోపతాపాలు బయటపడిపోతాయి. ముసుగు తొలగిపోతుంది. వారి నిజరూపం అందరికీ తెలిసిపోతుంది.

అసలు ప్రపంచంలో క్రౌర్యమెందుకుంటోంది? ప్రపంచమెలా కనిపిస్తూంటే మనం అలా చూస్తాం... ఉదాహరణకు, ఒక గదిలో ఒక పాప ఉంది. ఆ పాప ముందు సంచీలో బంగారముంది. ఆ బంగారం విలువ ఆ పాపకు తెలియదు. ఒక దొంగ హఠాత్తుగా ఆ గదిలోకి దూరి ఆ సంచీని పట్టుకుపోయాడు. ఏం పోయిందో ఆ పాపకు తెలియదు. మన మనసులోనూ సహజంగా అలాంటి భావనే ఉంటుంది. పాపలో దొంగలేడు. అందుకే కళ్ళెదుట జరిగినా దొంగతనం గురించి పాపకు తెలియదు. మనసులో క్రౌర్యం లేకపోతే మనమూ లోకంలోని క్రౌర్యాన్ని గుర్తించలేం.

'పాపభూయిష్ఠమైన ప్రపంచంలో పుట్టాం... మనం కష్టాల్ని, ఇబ్బందుల్ని అనుభవించక తప్పదు' అని కొందరు పెద్దలు చిన్నవారికి నూరిపోస్తుంటారు. అది చాలా తప్పు. మన గతమెంతో ఉత్కృష్టమైనదని, మన వంశం ఎంతో ఉన్నతమైనదని చెప్పాలి. మనలో ఉన్న బలహీనతల్ని పారదోలాలి. సంకుచిత భావాలతో పిల్లల మనసుల్ని కలుషితం చేయకూడదు. పక్షవాతం వచ్చినట్టు మనసులు నిరాశతో నిస్పృహతో నింపరాదు. ఆశావాదం, దృఢసంకల్పం పిల్లల మస్తిష్కాల్లో పాదుగొల్పాలి. ఇదే ఆధ్యాత్మికతను సంతరించుకోవటానికి తొలిమెట్టు.

ప్రవక్తలందరూ బోధించేది ఇదే. వారికా శక్తి లభించినది అలాంటి బోధనలనుంచే! వారెవరూ పుస్తకాలు రాయలేదు. వారు మాట్లాడింది చాలా తక్కువ. క్రీస్తులా, బుద్ధుడిలా జ్ఞానజ్యోతిని అంతరంగంలో వెలిగించుకోవాలి. అదే శక్తి- ఆ దేవదేవుని దగ్గరకు సుళువుగా చేర్చగలిగేది!' అని స్వామి వివేకానంద ఆధ్యాత్మికతను నిర్వచించారు.