ᐅ స్వరరాగ సుధారసయుత భక్తి



ᐅ స్వరరాగ సుధారసయుత భక్తి

ఆధ్యాత్మికోన్నతికి భక్తిసాధన అవసరం. దైవాన్ని నమ్మిన ప్రతి మనిషీ తనలో అంతర్లీనంగా ఉన్న భక్తిని తనకు తానే ఏదో ఒక సాధనాన్ని వూతంగా చేసుకుని ఆవిష్కరించుకోవాలి. ఇటువంటి సాధకులే దివ్యమైన ఆత్మానుభూతికి అర్హులు. అతి కొద్దిమంది సాధకులు ఇలాంటి దివ్య అనుభూతిని అనుభవించగలరు. అలాంటివారిలో నాదబ్రహ్మ కాకర్ల త్యాగరాజు ఒకరు. ధనంతో సమకూర్చుకోలేని ఆధ్యాత్మిక శక్తిని త్యాగయ్య సంగీతంతో సంపాదించారు. ముక్తికోసం సంగీతాన్నే సాధనగా చేసుకున్నారాయన. సంగీతానికి భక్తికి భేదం లేదని త్యాగయ్య అనేవారు. త్యాగయ్య ఆధ్యాత్మిక పరిణతి ప్రపంచాన్ని సైతం ప్రభావితం చేసింది. తన సంగీతంతో భగవంతునిపై ప్రేమ మానవీయ ఔదార్యాలను సమాజానికి అందించారు కాకర్ల త్యాగరాజు. త్యాగరాజ స్వామి క్రీ.శ. 1767నుంచి 1847 వరకు జీవితాన్ని గడిపారు. ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, త్యాగయ్య సమకాలికులు. వీరిని సంగీత త్రిమూర్తులని పిలిచేవారు. జనవరి ఆరో తేదీన త్యాగయ్య వర్ధంతి. అప్పటినుంచి వారం రోజులు ఆయన జన్మస్థలం తిరువయ్యూరులో ఆరాధనోత్సవాలు రివాజుగా నిర్వహిస్తారు. ఈసారి ఆరాధనోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. త్యాగయ్య తండ్రిపేరు రామబ్రహ్మమ్‌, తల్లి సీతమ్మ. 'సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి' అని లలితరాగంలో కీర్తన ఆలపించి తల్లిదండ్రులకు నివాళి అర్పించాడు త్యాగరాజు.
త్యాగరాజు 24వేల కీర్తనలు రచించారని ప్రతీతి. వాల్మీకి రాసిన రామాయణంలోనూ 24వేల శ్లోకాలున్నాయి. త్యాగరాజు రచించిన 24వేల కీర్తనల్లో ప్రస్తుతం 700 కీర్తనలు మాత్రమే లభ్యమవుతున్నాయి. చాలావరకు త్యాగయ్య తెలుగులోనే కీర్తనలు రచించారు. సంస్కృతంలోనూ ఆయన కీర్తనలు రాశారు. ఘనరాగ పంచరత్న కీర్తనల్లో మొదటిదైన 'జగదానంద కారక జానకీ ప్రాణదాయక'- సంస్కృత భాషలో రాశారు. పంచరత్న కీర్తనలన్నీ భావయుక్త సంగీత గుళికలు. తను పూజించే శ్రీరాముడు ఎటువంటివాడు?... ఇంద్రనీలమణి సన్నిభావ ఘనచంద్ర సూర్యనయనా ప్రమేయ వాజీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమనవైరి సన్నుతుడు! హృదయం పల్లవిస్తుంది ఇలాంటి భావంతో. సంగీతంలో భావమే ప్రధానమైందని త్యాగయ్య తన శిష్యులతో అనే వారట. భావం తరవాతి స్థానాలనే రాగం, తాళం ఆక్రమిస్తాయి. త్యాగయ్య తన పదమూడు సంవత్సరాల వయస్సులోనే దేశిక తోడి రాగంలో నమో నమో రాఘవాయ అనే పల్లవితో కీర్తన రచించాడు. ఆయన తన ఇరవై మూడోఏట సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.

శొంఠి వెంకట రమణయ్య వద్ద త్యాగరాజు శిష్యరికం ప్రారంభించాడు. 'నాయనా! నీ ఇష్ట దైవం శ్రీరామచంద్రుని చేర్చగల పెన్నిధి సంగీతమే'నని శొంఠి వెంకట రమణ త్యాగయ్యకు బోధించేవారు. ఆయన మాటలే త్యాగరాజుకు శిరోధార్యాలయ్యాయి. సామవేదంలోని సప్తస్వరాలకు సృష్టికర్త అయిన శంకరునికి తలవంచి నమస్కరిస్తాను అని అన్నారాయన ఒక సందర్భంలో. నలభై సంవత్సరాల వయసు నాటికి త్యాగయ్య దక్షిణ భారతదేశం మొత్తంలో సామవేద సాధకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. త్యాగయ్య గానామృతాన్ని వినడానికి తహతహలాడిన ఎందరో సంగీతజ్ఞులు శొంఠి వెంకట రమణయ్యను ఆశ్రయించి త్యాగయ్య సంగీత కచేరీ ఏర్పాటు చేయమని కోరారు. గురువు మాట మన్నించి త్యాగయ్య తన సంగీత సభలో సభాసదులందరికీ నమస్కరించి శ్రీరాగంలో 'ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు' అని గానం చేశాడు. తానొక్కడే కాదు- సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయు వారెందరో ఉన్నారు- వారందరికీ వందనాలని స్వచ్ఛమైన భావంతో అన్నాడు త్యాగయ్య. ఒకసారి త్యాగయ్య శిష్యుడు వేంకట రమణ భాగవతార్‌ తన గురువు కోసం శ్రీరామచంద్ర స్వామి చిత్రపటం గీయించి 10 క్రోసుల దూరం నడచి త్యాగయ్యకు సమర్పించాడు. పటంలోని శ్రీరామచంద్రుని అందాన్ని చూస్తూ ఆర్ద్రతతో- 'నను పాలింపగ నడచి వచ్చితివా నా ప్రాణనాథ... కరమున శరకోదండ కాంతితో ధరణీ తనయతో... నను పాలింపగ నడచి వచ్చితివా' అని కీర్తించాడు త్యాగరాజు.

త్యాగరాజు సామవేద సారాన్ని సామాన్యులకు సైతం తెలియజెప్పిన మహామహితాత్మజుడు. సంగీతంవల్ల ఆధ్యాత్మిక జ్ఞానం లభిస్తుందని తెలియజేసిన గొప్ప భావుకుడు, శ్రీరామభక్తుడు. త్యాగయ్య పూజించే సీతారామలక్ష్మణ విగ్రహాలను ఎవరో స్వార్థంతో కావేరీ నదిలోకి విసిరేసినప్పుడు ఆయన వెతికి వెతికి వేసారి- 'మరుగేలరా ఓ రాఘవా... చరాచర రూప పరాత్పర సూర్య సుధాకరలోచన' అంటూ వేడుకున్నాడు. త్యాగయ్య దివ్యసంక్తీరనలతోపాటు సంప్రదాయ కీర్తనలు సైతం రచించాడు. ప్రహ్లాద చరిత్ర, నౌకాచరితం అనే గేయ రూపకాలను ఆయన రచించాడు.

- అప్పరుసు రమాకాంతరావు

ᐅ సంతృప్తి



ᐅ సంతృప్తి

'తృప్తి చెందని మనిషి సప్తద్వీపాల్లోనూ బాగుపడడు' అని కవివాక్కు. నిజమే. 'తృప్తిలేనివాడికి సుఖం ఎక్కడిది?' అని సుభాషిత కర్తలూ నొక్కి వక్కాణించారు. అంటే, మనిషి ఏదో ఒక దశలో ఉన్నవాటితో సంతృప్తి చెందడం అవసరం. అలా కానప్పుడు అడుగడుగునా దుఃఖం కలగడమే కాక, మనశ్శాంతి కూడా కరవై, అనారోగ్యాల పాలబడటం అనివార్యం.
మనిషి తనకు కావలసిన ప్రాథమికావసరాలైన కూడు, గుడ్డ, గూడు కోసం తొలుత ప్రయత్నిస్తాడు. పూటగడవని పరిస్థితిలో పట్టెడు అన్నం దొరికితే చాలు అదే పదివేలని అనిపిస్తుంది. ఒక్క జత బట్టలతో కాలంగడవని దుస్థితిలో మారు జత ఉంటే ఎంత బాగుండునని ఆశ కలుగుతుంది. పరుల పంచన కాలక్షేపం చేస్తున్నప్పుడు సొంతంగా ఒక పూరిగుడిసె అయినా సమకూర్చుకోవాలనే తపన బయలుదేరుతుంది. ఈ కనీసావసరాలు లభించగానే మనిషిలో అత్యాశ మొదలవుతుంది. పంచభక్ష్య పరమాన్నాలకోసం, పట్టుపీతాంబరాలకోసం, ఖరీదైన భవనాలకోసం మనిషి ఎగబడుతాడు. వీటిని సాధించడానికి అహోరాత్రాలు శ్రమిస్తాడు. బుద్ధి వక్రిస్తే పక్కదారులు వెదకి, పాపకర్మలు చేసి అయినా సుఖపడాలని అనుకొంటాడు. కానీ, లభించినది చాలునని వూరుకోడు. ఇది మానవసహజ స్వభావం.

మనిషి మనుగడకు ఎంతచోటు కావాలి? ఈ ప్రశ్నకు ఆరు అడుగుల నేల చాలునని వేదాంతులు చెబుతారు. నిజానికి మనిషికి అంతే చోటు చాలు. కానీ అతడు అంతటితో సంతృప్తిపడతాడా? ఎంతమాత్రం సంతృప్తి చెందడనీ, ఈ భూమండలమంతా ఇచ్చినా, ఇంకా చాలదని అంటాడనీ పెద్దలు చెబుతారు.

పూర్వం ఇలాంటి దురాశాపరుడొకడు బ్రహ్మదేవుడికోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏమికావాలో కోరుకొమ్మన్నాడు. అప్పుడతడు తనకు తగినంత భూమి కావాలన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు- 'నాయనా! నీవు ఇక్కడినుంచి ఓపిక ఉన్నంత దూరం పరుగెత్తు. నీవు ఎంత దూరం వరకు వెళ్తావో, అంతదూరం వరకుగల భూమి నీ సొంతం అవుతుంది. ఇక వెళ్లు!' అని ఆశీర్వదించి, అంతర్థానమైపోయాడు. అప్పుడు ఆ భక్తుడు దురాశతో, సూర్యాస్తమయందాకా పరుగుతీస్తే చాలా భూమి నా సొంతం అవుతుందికదా అని పరుగుతీయడం ప్రారంభించాడట. నట్టనడి ఎండలో మిట్టమధ్యాహ్నం దాకా పరుగుతీసేసరికి, ఆయాసంతో రొప్పుతూ, నేలపైపడి, గుండె ఆగి, మరణించాడు. కొంత భూమి చాలనుకొని తృప్తిపడక, దురాశ పడినందుకు ఎంతటి దుర్గతి పట్టిందో అర్థమవుతుంది.

నేడు మనిషికి సంతృప్తి ఉందా అంటే, అనుమానమే! ఏనుగులు కావాలనుకొనేవాడికి ఎలుకలు ఒక లెక్కా అన్నట్లు- పరిమిత సంపాదనతో తృప్తిపడని మానవుడికి కొండలూ గుట్టలూ కూడా కబళించే పదార్థాలే అవుతున్నాయి. ఎవరైనా తన అవసరానికి తగినంత మాత్రమే దాచుకొని, మిగిలినదంతా పరులకు పంచిపెట్టాలని ఈశావాస్యోపనిషత్తు ప్రబోధిస్తోంది. భోగం ఒక్కటే జీవితం కాదు. త్యాగం కూడా జీవితమే. త్యాగంతో కూడిన బతుకు ధన్యమవుతుంది. లోభంతో కూడిన జీవితం వ్యర్థమవుతుంది. కనుక త్యాగమే జీవితం.

అసంతృప్తిపరుడు త్యాగం చేయలేడు. లభించినదానితో సంతృప్తిపడేవాడికి, మిగిలినదంతా పరోపకారానికి వినియోగించాలనిపిస్తుంది. పరోపకార జీవనమే శ్రేయస్కరం.

కొందరు ఎన్ని ఉన్నా బిచ్చగాళ్లవలె దీనత్వాన్ని నటిస్తుంటారు. అన్నీ ఉన్నా ఏమీ లేదంటుంటారు. ఏమీలేదని ఎల్లప్పుడూ మనసులో వెలితిని నింపుకొంటే మనిషికి ఏమీ మిగలకుండానే పోతుంది. నిత్యతృప్తుడే నిరామయుడని ఒక సూక్తి. తృప్తిగలవాడికి ఆరోగ్యం లభిస్తుంది. అసంతృప్తితో రోగాలు మొదలవుతాయి. రోగాలవల్ల ఆయుష్షు తగ్గిపోతుంది. కనుక మనిషి ఎప్పుడూ నిత్యతృప్తితో ఉండటమే మంచిది. 'నేను ఎంతో బాగున్నాను. నాకేమీ తక్కువ లేదు' అనుకొనే మనిషి నూరేళ్లు సంపూర్ణంగా బతుకుతాడు.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

ᐅ ఆధ్యాత్మిక ప్రగతి



ᐅ ఆధ్యాత్మిక ప్రగతి

లోకంలో సాధారణమార్గాలు వేరు, ఆధ్యాత్మిక మార్గాలు వేరు.
అతి తక్కువమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కోరి కొండనెక్కేవారు ఎందరు? నేల మీదనే బావుందనుకుంటారు అధికులు.
ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక వృత్తి- ఆదాయ మార్గాలుగా మనకు తెలుసు. ఆధ్యాత్మిక మార్గం వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనమూ కనిపించదు. వ్యర్థమని కూడా అనిపిస్తుంది. మహా భక్తుల జీవితాలు పరిశీలిస్తే, వాళ్లను ప్రాపంచిక ప్రలోభాల్లోకి లాక్కురావాలని అయినవాళ్లు పడిన ప్రయాసలెన్నో కనిపిస్తాయి.

భక్తులకు మొదటి పరీక్ష, దరిద్రం.

దరిద్రుడు దేనికైనా సిద్ధపడతాడు. ఆ పూట గడవాలి గనక, దేనికీ సంకోచించడు. కానీ, భక్తుడు అలా కాదు. అల్ప సంతోషిగా, తృప్తిగా జీవిస్తాడు. దరిద్రంవల్ల కలిగే అవమానాలను మందహాసంతో స్వీకరిస్తాడు.

భక్తతుకారం అలాంటి జీవితమే గడిపాడు.

సిరిసంపదలతో తులతూగుతూ కూడా భక్తుడిగా రాణించగలవాళ్లు చాలా అరుదు. సుఖభోగాలకు విరక్తుడు కాకపోతే భగవంతుడి పట్ల భక్తి కలగదు.

సంపన్నుడు జ్ఞాని కావచ్చు. భక్తుడు కావటం చాలా కష్టం. జనకుడు రాజర్షిగా రాణించాడు. మహాజ్ఞానిగా పేరు పొందాడు. కానీ, భక్తశ్రేణిలోకి రాలేకపోయాడు.

జ్ఞాని భగవంతుని గురించి తెలుసుకోగలడు.

భక్తుడు భగవంతుడి సాన్నిహిత్యాన్ని పొందగలడు. ఇదే ఇద్దరికీ తేడా.

నిష్కల్మషమైన ఏ ఆధ్యాత్మిక మార్గమైనా యోగమేనని శ్రీకృష్ణుడు చెప్పాడు. యోగ్యత కలిగించేదే యోగం. దైవానుగ్రహ యోగ్యతే యోగానికి ప్రధాన లక్ష్యం.

భక్తులు- భగవంతుణ్ని ప్రేమించటం, ఆరాధించటం, సేవలో తరించటం తమ కర్తవ్యంగా భావిస్తారు. ప్రవర్తిస్తారు. ఫలితాల కోసం నిరీక్షించరు. రాలేదని నిరాశ చెందరు. దీన్నే నిస్వార్థభక్తి అంటారు.

సాధకులు అలా కాదు.

'సాధించటానికే సాధన' అన్నట్లు తమ ప్రగతిని కొలమానం వేసుకుంటూ ఉంటారు. కుండలినీ నిద్ర లేచిందా, ఏ చక్రం తాకింది, ఏ చక్రం దాటింది, సహస్రారం ఎప్పుడు చేరుకుంటుంది? ఇదే ధ్యాస!

నీళ్లు మోసేవాడు ఒకడు- శివుడికి నూరు బిందెల నీళ్లు అభిషేకం చేస్తే రాజయోగం పడుతుందని తెలిసి వెంటనే ఆ పనిలో పడ్డాడు. ప్రతి పది బిందెల నీళ్లకు శరీరంకేసి చూసుకునేవాడు, రాజలక్షణాలు ఏమైనా వచ్చాయా? నెత్తిమీద కిరీటం వచ్చిందా అని తడిమి చూసుకునేవాడు- తొంభైతొమ్మిది బిందెల నీళ్లూ అభిషేకించాక నూరో బిందెను కోపంగా శివుడి నెత్తికేసి కొట్టాడట! కారణం- తనకు తక్షణ రాజయోగం కలగలేదని. ఇలాంటి సాధన పనికిరాదు!

చెట్లు కూడా సాధన చేస్తాయి. ఆకులు రాలుస్తాయి. కొత్తచివుళ్లు వేస్తాయి. మెలమెల్లగా ఆకాశంవైపు ఎదుగుతుంటాయి. అవి ఆకాశం వైపే... ఆ పరంధాముడి వైపే దృష్టి పెడతాయి. నేలచూపులు చూడవు. ఎదుగుతూనే ఉండాలనే ఆకాంక్ష వాటిలో గాఢంగా కనిపిస్తుంది.

సాధకుడి ఆదర్శం అలా ఉండాలి.

పాము కుబుసాన్ని విడిచినట్టు తనలోని దుర్గుణాలు వదిలేస్తూ చెదరని విశ్వాసంతో సాధన చెయ్యాలి.

మలిన వస్త్రాన్ని శుభ్రం చేస్తున్న కొద్దీ మెరిసిపోయినట్లు, మనలోని మాలిన్యాలనే దుర్లక్షణాలు వదిలించుకొంటున్న కొద్దీ మనసు ఉత్తేజితమవుతుంది. ఆత్మ ప్రబోధితమవుతుంది. మనలో ఆధ్యాత్మిక వికాసం ఆరంభమవుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తిత్వం నిర్మాణమవుతుంది.

అప్పుడు మనం ఒక విభిన్నత కలిగి ఉంటాం.

అందరిలాగా ప్రవర్తించం. మన మాటల్లో, చర్యల్లో ప్రసన్నత, ఆత్మీయత తొణికిసలాడతాయి.

ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా, మనల్ని అవమానించినా, మనం కోపగించుకోం.

'ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం గనుక?' అనే వైరాగ్య భావన మనల్ని స్థిరచిత్తుల్ని, ప్రసన్న చిత్తుల్ని చేస్తుంది. అంతకన్నా ఆధ్యాత్మిక ప్రగతి ఇంకేముంటుంది.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌

ᐅ ఆనందసౌధం

ᐅ ఆనందసౌధం

మాతృదేవి గర్భంలో శిశువు గర్భచెర నవమాసాలూ అనుభవిస్తుంది. ప్రసవ సమయంలో తల్లితోపాటు బిడ్డా వేదన పడుతుంది. గర్భచెర వీడాక ప్రపంచ వాతావరణంలో ఇమడలేక బిడ్డ రోదిస్తే సరి; లేదా గిల్లి ఏడిపించడం లోకంతీరు. తల్లి పురిటి నొప్పుల నుంచే శిశువుకు జీవన పోరాటం ఆరంభమవుతుందన్నమాట! తరవాత ఎన్నో బాలారిష్టాలు. వైద్యశాస్త్రం పెద్దగా అభివృద్ధిచెందని రోజుల్లో ఈ బాలారిష్టాలు ప్రాణాంతకంగా ఉండేవి!
విద్యాభ్యాసంలో బిడ్డ మరిన్ని విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. అప్పజెప్పాల్సిన పాఠ్యాంశాల నుంచి ఆటపాటల్లో పోటీదాకా అన్నీ సవాళ్లే! తొలి గురువు తల్లి సాహచర్యంలో మాతృభాష నేర్వడం నుంచి బాంధవ్యాలు నెరపడం నేర్చేదాకా అన్నీ పాఠాలే!

యౌవనంలో తనువు, మనసు వికసిస్తాయి. ఆరోగ్యంతో కాంతులీనే ముఖ వర్ఛస్సుతో ఉండే యువతీ యువకులకు శాంతి లభిస్తుందా? అప్పటికి తగిన సమస్యలు అప్పుడుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, జీవిత భాగస్వామి ఎంపిక, సంతానం- ఇలా ఎన్నో సవాళ్లు. మరి మానవ జీవితంలో ఆనందం ఉండనే ఉండదా? ఈ విషయంపై ఎందరో మహనీయులు కసరత్తు చేశారు. మార్గాలూ సూచించారు.

తమ బిడ్డ- అయితే ఓ చక్రవర్తి, లేకపోతే ఓ సన్యాసి అవుతాడని జ్యోతిష పండితులు చెప్పినప్పుడు శుద్ధోధన మహారాజు కలతచెందాడు. తమ కుమారుడు సిద్ధార్థుడు ఓ సన్యాసి కాకూడదని ఎంచి అతడికి ఎటువంటి కష్టమూ తెలియకుండా రాజభవనంలో స్వర్గ సౌఖ్యాల మధ్య పెంచి పెద్దచేశాడు. యుక్తవయస్సు వచ్చాక రాకుమారుడికి ఓ అందాలరాశితో వివాహం జరిపించాడు. ఒకరోజు సిద్ధార్థుడు యథాలాపంగా ఓ వృద్ధుని, రోగిని, సన్యాసిని, శవాన్ని చూసి మనోవ్యాకులత చెందాడు. అంతే! సౌందర్యవతి అయిన భార్యను, ముద్దులు మూటకట్టే కుమారుని, రాజభోగాలను పరిత్యజించాడు. మానవుడు అనుభవిస్తున్న రోగాలు, జరామరణాది దుఃఖాలకు పరిష్కారమార్గం ఉంటే కనుగొనాలని బయలుదేరాడు. విస్తృతంగా దేశ సంచారం చేశాడు. ఓ వటవృక్షం కింద తపస్సు చేసి, జ్ఞానం పొందాడు. బుద్ధుడయ్యాడు. మనిషి 'నేను', 'నాది' అనే భ్రాంతి, కళ్ళెం వేయలేని కోరికలు, అజ్ఞానం వల్లనే దుఃఖభాజనుడవుతున్నాడని గ్రహించాడు. లోకాన్ని అద్వైత దర్శనం చేయగలిగిననాడు అజ్ఞానం తొలగి అతడికి శాంతి, ఆనందం చేకూరతాయని సిద్ధాంతీకరించాడు.

మనుషులు తమ తమ స్థాయుల్లో తమకు అందని వాటిని (ఆనందాన్ని) కోరుకుంటూ దుఃఖానికి లోనవుతుంటారు. సన్నిహితులు అనుభవిస్తున్న సంపద, సౌఖ్యాలు తమకు లభ్యంకానప్పుడు మనిషి పొందే అసూయ, బాధ వర్ణనాతీతం. ఓ జ్ఞాని చెప్పినట్లు సుఖంలాగే దుఃఖం కూడా ఓ మనోజనిత వికారం! 'నాకు దుఃఖం లేదు; నేను ఆనందంగా ఉన్నా'నని మనసును సమాధానపరచగలిగినప్పుడు- దుఃఖపు చారికలు మనసుకు అంటవు. దైవం ఆనందస్వరూపుడు. ఆయన బిడ్డలం. మనకు దుఃఖమేమిటి? ఈ పవిత్రభావన మనిషి జీవితాన్ని బలోపేతం చేస్తుంది. ప్రపంచం నశ్వరం, దుఃఖభాజనమే. అయినా, భయశోకాది మనస్తాపాలు లేని జీవితం కొందరికి లభిస్తునే ఉంది కదా!ఎందరో మహానుభావులు భౌతిక, ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లుతున్నవారే! మరి మిగిలిన వారి గతి ఏమిటి? ఇందుకు సమాధానం-భావదారిద్య్రాన్ని వదిలించుకొని, మనిషి దృఢసంకల్ప శక్తితో ఆనందాన్వేషి కావాల్సి ఉంటుందని చెప్పాలి. మనోహరమైన ఆనంద సౌధాన్ని నిర్మించుకొనే అవకాశం వ్యక్తికి ఎప్పుడూ ఉంది. లేదంటే అది ప్రయత్నలోపమే అనిపించుకుంటుంది. ముమ్మాటికీ అది కాదనలేని నిజం!

- గోపాలుని రఘుపతిరావు

ᐅ యోగి- భోగి



ᐅ యోగి- భోగి

ఒక భోగి. ఒక యోగి. అక్షరమే తేడా. కానీ ఎంత తేడా! భోగి క్షరుడు. యోగి అక్షరుడు. పొంతనే లేని వ్యాపారం. వ్యవహారం. జీవితాన్ని, ఆయుష్షును కొంతకాలానికే పరిమితం చేసి అంతలోపలే ఆబగా అనుభవించాలనుకునే అమాయకుడు భోగి. ఆయుష్షును ఆత్మతో అనుసంధానం చేసి, ఆ రీత్యా దానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి చిరంతానందంలో ఓలలాడుతున్నవాడు యోగి. భోగి తదుపరి పరిణామం రోగి. భోగ కారకమైన ఏ వస్తువైనా, ఏ అనుభవమైనా రోగానికే హేతువవుతుంది. సామాన్య జీవితం నుంచి అసామాన్య భోగలాలసకు ఎగబాకిన ఎవరైనా వైకుంఠ పాళిలోని పాము నోట్లో పడక తప్పదు. విషప్రాయమైపోకా తప్పదు. జీవితం ఇది. జీవించేందుకు. కేవలం మరణించేందుకు కాదు. అయితే ఏది జీవితం, ఏది మరణం? యుగయుగాలుగా మనం ఎందరినో స్మరిస్తున్నాం. మరెందరినో విస్మరిస్తున్నాం. యోగులు, త్యాగులు, విరాగులు, మహాత్ములు, మహోన్నతులు. వీళ్లంతా అమృతమయులు. వీరికి మరణం లేదు. భోగులు, రోగులు (మానసిక), నిరంకుశులు, స్వార్థపరులు (సంపన్నులే కానీగాక. సౌందర్యమూర్తులే కానీగాక)... వీరు మృతప్రాయులు. జీవించీ మరణించినవారు. అలాంటివాళ్లంతా విస్మరణీయులు. ఔన్నత్యానికి మరణం లేదు. నీచత్వానికి జీవితం లేదు. ఈ రెంటినీ అర్థం చేసుకోవాలి.
యోగి ప్రత్యేకంగా ఉండడు. ప్రత్యేక వేషధారణ ఉండదు. జీవితాన్ని దాని నియోగార్థంలో వినియోగించుకున్నవాడు యోగి. అష్టాంగ యోగాన్ని ఔపోసన పట్టవలసిన అవసరం లేదు. ఆత్మను గ్రహించినవాడు, ఆత్మానుభూతితో చరించేవాడు, లోకాన్ని తిరస్కరించవలసిన అవసరం లేకుండా లోకంతో మమత్వంతో కాకుండా మానవీయతతో మమేకమై ఏకాత్మతా భావంతో నిరామయంగా, నిర్వికారంగా ఉన్నవాడు యోగి. అలాంటివాడు యోగి. అతడు నిరాడంబరుడు. ఆడంబరాన్నీ నిరాడంబరంగా మలచుకునే యోగ్యుడు. భోగంలోని మాలిన్యాన్ని మహత్వంగా గెలుచుకునేవాడు. నిత్యానిత్య వస్తు వివేకాన్ని కలిగినవాడు. ఆంతర్యంలోనే ఆనందాన్ని దర్శించినవాడు. కళ్లు తెరవాల్సిన అవసరమే లేకుండా అన్నీ పొందిన ఆ భాగ్యశాలికి ఇక కోరికలతో పనేముంది? కోరికల వెంపర్లాట లేనివాడికి క్రోధం లేదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అసలే లేవు. మరో, మరే ఆశ, ఆలోచన లేనివాడు. నిరంతర ఆత్మావశిష్టుడై ఉంటాడు. ఇంతకంటే మానవ జన్మకు మరో ఉద్దేశం, ఉన్నతాశయం, వూర్ధ్వగమనం... ఏమీ ఉండదు. అతనికి ఎవరూ ఉండరు. కానీ అందరూ అతని వారే. అతనికి అందరూ ఉంటారు. అయినా అతను ఎవరూ లేనివాడే. ఏక నిరంజనుడే.

మనిషి భోగే కావాలనుకుంటే అందుకు మనిషే కానక్కర్లేదు. ఆహార నిద్రాభయ మైథునాలను పశుపక్ష్యాదులు కూడా భోగిస్తాయి- కానీ మానవ జన్మ, జీవితం ఒక యోగం. యోగి కావడమే సహజం కావాలి కూడా. పళ్ల చెట్టు పళ్లు కాస్తుంది. పూల మొక్క పూలు పూస్తుంది. సహజం. యోగమే జీవితంగా జన్మించిన మనిషి మరి యోగి కావడమే సహజం. సహజ వినిమయం. యోగమంటే సన్యాసం కాదు. విసర్జనం కాదు. సవ్య వినిమయం. సమర్థ వినిమయం. వేద విహిత జీవనం. ధర్మబద్ధ జీవనం. దీనికై మనిషి వేద పఠనమే చేయనక్కర్లేదు. ప్రతి అడుగూ ఆధ్యాత్మిక స్పర్శను కలిగి ఉండాలి. ప్రతి శ్వాసా పారమార్థిక పరిమళాలతో నిండాలి. ధర్మం ఆదర్శం కావాలి. ఆచరణ కావాలి. మరి... ఏది ధర్మం, ఏది వేదవిహిత జీవనం? ఎవరు చెప్పేవాడు, సూచించేవారు, నిర్దేశించేవారు? సత్సంగం. సద్గ్రంధ పఠనం. సద్విషయ శ్రవణం. సద్గురు సమాశ్రయం.

కాలం చేతివేళ్ల సందుల్లోని నీళ్లలా మనకు తెలీకుండానే జారిపోతూంటుంది. అలా పోనీయకూడదు. అమృత సమానంగా ఒడిసి పట్టుకుని, ఆచమన సదృశంగా కేశవ నామాలతో పానం చేయాలి. తులసి తీర్థంలా ఆచరణ యోగ్యంగా స్వీకరించిన కాలం మన జీవన ఆంగణాన్ని, ఆంతర్య ప్రాంగణాన్ని పరమపవిత్రం చేస్తుంది. అప్పుడు ప్రపంచమే పరమపదమై మోక్షకారిక సదనంగా భాసిస్తుంది!

- చక్కిలం విజయలక్ష్మి

ᐅ మహా కుంభమేళా



ᐅ మహా కుంభమేళా

జీవకోటి మనుగడకు జలమే ఆలంబన. నీటి వనరులపైనే జీవనచక్రం ఆధారపడి ఉంది. జల ప్రవాహాల వెంటే నాగరికత విలసిల్లింది. ఎక్కడ జలసిరులు పరిఢవిల్లుతాయో, అక్కడ జీవన వికాసం వర్ధిల్లుతుంది. అందుకే జల నిధుల్నీ, నదీనదాల్ని దేవతా స్వరూపాలుగా ఆరాధించుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యభాగం. ఆ పరంపరకు చెందినవే- పుణ్య స్నానాలు, పవిత్ర పుష్కరాలు, కుంభమేళా మహోత్సవాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా వినుతికెక్కిన మహాకుంభమేళా మకర సంక్రమణం జరిగిన జనవరి 14 నుంచి ప్రారంభమైంది. మహా శివరాత్రి (మార్చి 10) వరకు ఇది కొనసాగుతుంది. 56 రోజుల పాటు నేత్రోత్సవంగా ఆకట్టుకునే ఈ మహాకుంభమేళాలో పుష్యపౌర్ణమి (జనవరి 27) నుంచి ఆచరించే పుణ్యస్నానాలు మరింత పవిత్రమైనవిగా చెబుతారు.
కుంభమేళా ఎప్పుడు ఎక్కడ జరిగేది సూర్యుడు, బృహస్పతిల స్థానాల ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ రెండు గ్రహాలు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోను, బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకరరాశిలో ఉన్న సందర్భంలో ప్రయాగలోను, ఈ రెండు గ్రహాలు వృశ్చికరాశిలో ఉంటే ఉజ్జయినిలోను కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి మూడేళ్లకు ప్రయాగ (అలహాబాద్‌), నాసిక్‌, హరిద్వార్‌, ఉజ్జయినిలలో కుంభమేళా కొనసాగుతుంది. ప్రతి ఆరేళ్లకు హరిద్వార్‌, ప్రయాగలలో అర్ధ కుంభమేళా జరుగుతుంది. పన్నెండేళ్లకోసారి ప్రయాగలోని త్రివేణి సంగమంలో పూర్ణకుంభమేళా వెల్లివిరుస్తుంది. పన్నెండు పూర్ణకుంభమేళాలు అంటే 144 సంవత్సరాలకోసారి మహాకుంభమేళా వస్తుంది. దీన్ని ప్రయాగలోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆ మహాకుంభమేళాయే!

ఈ మహాకుంభమేళాలో మకర సంక్రాంతితో పాటు పుష్యపౌర్ణమి, మౌని అమావాస్య (ఫిబ్రవరి 10), వసంత పంచమి (ఫిబ్రవరి 15), రథసప్తమి (ఫిబ్రవరి 17), మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 25), మహా శివరాత్రి పర్వ దినాల్లో ఆచరించే పవిత్ర స్నానాలు మరింత విశేషమైనవిగా చెబుతారు. పదికోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ మహాసంరంభం... ఉవ్వెత్తున ఎగసే ఆధ్యాత్మిక భక్తి తరంగం... అనిర్వచనీయమైన భక్తిపారవశ్యం. ఆనందాతిరేకాల అపురూప సన్నివేశం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ పుణ్యక్షేత్రంలో గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమస్థలిలో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా ప్రకటితమవుతోంది. ఈ కుంభమేళా ఆవిష్కారానికి పురాణ నేపథ్య కథనాన్నీ చెబుతారు. భాగవత, విష్ణు పురాణాలు, రామాయణ, మహాభారతాల ప్రకారం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా అమృతకుంభం వెలువడిందంటారు. ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజులు (మనుషుల గణన ప్రకారం 12 సంవత్సరాలు) యుద్ధం జరిగిందంటారు. ఈ అమృతాన్ని దానవులు సేవిస్తే, వారు అజేయులవుతారని భావించిన దేవతలు శ్రీహరిని శరణు వేడతారు. విష్ణువు మోహినీ రూపంలో ఆ అమృత కలశాన్ని దక్కించుకుని వెళ్తుండగా, అందులోని అమృత బిందువులు ప్రయాగ, హరిద్వార్‌, నాసిక్‌, ఉజ్జయినిలోని పుణ్య నదుల్లో పడ్డాయని పురాణగాథ. అందుకే ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఇహపరముక్తి ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం. క్రీ.శ. 629-645 మధ్య కాలంలో హర్షవర్ధనుడి పరిపాలన కాలంలో, మనదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌సాంగ్‌ తన రచనలో కుంభమేళా ఉత్సవాన్ని వివరించాడు.

కుంభమేళాకు సంబంధించి యోగశాస్త్రపరంగా ఎన్నో ఆంతర్యాలున్నాయి. ఇడ, పింగళ అనే రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన శ్వాసక్రియ కొనసాగుతుంది. ఇడ, పింగళ ద్వారా తీసుకున్న శ్వాస సుషుమ్ననాడి (తిలకం దిద్దుకునే ప్రదేశం) దగ్గర ఏకీకృతమవుతుంది. ఇదే త్రివేణీ సంగమం. ఇడ, పింగళ రంధ్రాలు గంగ, యమునలకు ప్రతీకలైతే- బయటకు గోచరంకాని సుషుమ్ననాడి అంతర్వాహిని అయిన సరస్వతి నదికి సూచిక. శిరస్సు అనే కుంభంలో జరిగే ఈ సమ్మేళన ప్రక్రియే కుంభమేళా. మన వెన్నెముక అడుగున కుండలినీ అనే పాము దాగి ఉంటుంది. యోగ సాధనద్వారా సాధకుడు ఆ సర్పాన్ని మెల్లిగా పైకి ప్రయాణించేలా చేసుకుని తన (కుంభం)లోని సహస్రారానికి చేర్చాలి. అప్పుడు ఆ కుంభం అమృత భాండమవుతుంది. తద్వారా జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. దేవదానవులు ఇడ, పింగళ రంధ్రాలద్వారా తల(కుంభం)లో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో చిలికినప్పుడు జ్ఞానమనే అమృతం వెలువడిందని చెబుతారు. కుంభమనే శిరస్సులో జ్ఞానామృతాన్ని నింపుకోవడం ద్వారా సాధకుడు దైవత్వాన్ని సాధించవచ్చని క్షీరసాగర మథన ప్రక్రియ సందేశమిస్తుంది. శ్రీకరంగా, శుభకరంగా, పరమ పావనకరంగా శోభిల్లే మహా కుంభమేళా తరుణం... భక్తి విశ్వాసాల ఆలంబనకు ఓ మహత్తర ఘట్టం.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

ᐅ మీలాదున్నబి



ᐅ మీలాదున్నబి

ఎదురైన కష్టాలతో పోరాడి మానవుల మనస్సులలోని తమస్సును విడదీస్తే అవినీతి, అన్యాయాలకు శ్వాస ఆగిపోతుంది. ప్రతి వూరు, వాడ శాంతిమందిరాలై శోభిల్లుతాయి. సమత్వపు సౌరభాలు గుబాళిస్తాయి. అందాల ఆలోచనలు విరబూస్తాయి- అని భావించి జీవితాంతం లోకశ్రేయం కోసం కృషిచేసిన మహోన్నతుల్లో ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) ఒకరు. ప్రవక్త వాక్కులు, చేతలు నిస్వార్థ ఆదర్శాలకు ప్రతిరూపాలు. ఆయన జీవితం సత్యసంధతకు, సహనానికి, ఉన్నత మానవీయ గుణాలకు నెలవు. నిరంతరం సచ్ఛీలతను, సన్మార్గాన్ని ఆయన ప్రబోధించేవారు. బోధించింది స్వయంగా ఆచరించేవారు. అనాథగా జీవితాన్నారంభించి మహోన్నత వ్యక్తిగా ఎదిగి ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికారు.
ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) రబీ ఉల్‌ అవ్వల్‌ మాసం పన్నెండో తేదీ (క్రీ.శ. 571 ఏప్రిల్‌ 20) మక్కాలో జన్మించారు. మీలాద్‌ జన్మదినం. నబి అంటే ప్రవక్త. మీలాద్‌-ఉన్‌-నబి అంటే ప్రవక్త జన్మదినం. సంప్రదాయబద్ధంగా ముస్లిములు మీలాదున్నబిని జరుపుకొంటారు.

ప్రవక్త పుట్టిన అరబ్‌ దేశం ఆ సమయంలో ఎన్నో దురాచారాలకు లోనైంది. మూఢభావాలు, మూర్ఖవిశ్వాసాలు, అలజడులు, దౌర్జన్యాలు చెలరేగాయి. ఒక వ్యక్తి తన ప్రవర్తనవల్ల మరో వ్యక్తిని బాధించడం నీచప్రవృత్తిగా భావించేవారు కాదు. కరుణ, జాలి, ప్రేమ మాత్రమే మానవుణ్ని ఉన్నత స్థానంపై నిలుపుతాయనేవారు ప్రవక్త. మహాప్రవక్త (స.అ.సం.) ప్రవచనాలు జనుల్లో బలమైన మార్పు తెచ్చాయి. అరబ్బులు వివేచనా మార్గం అవలంబించారు. బానిసలు పతనావస్థనుంచి పైకి రాగలిగారు. అరేబియాలో శాంతి పరిఢవిల్లింది. సువిశాల అరబ్‌ ద్వీపకల్పం ప్రవక్త వశమైంది. ఇరవై మూడేళ్లలో నైతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంస్కరణలను ప్రవక్త అక్కడ నెలకొల్పారు. రాజాధిరాజై కూడా ఒక పేదవాడిగా ఆయన జీవితం గడిపారు. ఆయనలో సుఖసంపదలపై అనురక్తి, అధికారంపై ఆసక్తి ఎంతమాత్రం లేవు.

ఒకసారి మహాప్రవక్త ఓ పల్లెటూరి పేద వ్యక్తిని తన దగ్గరికి పిలిచారు. అతడి చేతులు కాయలు కాచి ఉన్నాయి. ప్రవక్త గమనించారు. అరచేతుల్ని ముద్దుపెట్టుకొన్నారు. పేదవాడు బతుకుతెరువు కోసం కూలిపని చేసేవాడు. ఎక్కడా ఎవ్వరినీ యాచించేవాడు కాదు. ప్రవక్త తమ ప్రవచనాల్లో సాధ్యమైనంతవరకు యాచించడం తగదనేవారు. ఎవరైనా ఇవ్వడానికి లేదా ఇప్పించడానికి ప్రయత్నించాలనేవారు. ఒకరి ఎదురుగా చేయిచాచి అర్థించడంకన్నా కట్టెలు కొట్టి జీవితం గడపడం ఎంతో ఉత్తమం అని ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) ప్రవచించేవారు.

ప్రవక్త ఇల్లు మట్టితో కట్టింది. పైకప్పు ఖర్జూరపు ఆకులు. గృహస్థుగా ఆయన జీవితం గడిపారు. చిరిగిన తమ బట్టల్ని తామే కుట్టుకొనేవారు. తమ దుస్తుల్ని స్వయంగా ఉతుక్కునేవారు. చెప్పులు బాగుచేసుకొనేవారు. పశువులకు మేత వేసేవారు. ఖర్జూరపు పండ్లు, మేకపాలు ఆయన ఆహారం. ఒక్కోసారి అవీ ఉండేవి కావు. ధరించే వస్త్రాలకు ఎన్నో అతుకులు. సాధారణ కూలివాడిగా కష్టపడి జీవించేవారు. తాను రాజ్యాధిపతి. వచ్చిన సంపదంతా ఎప్పటికప్పుడు ప్రజల కోసం వినియోగించేవారు.

'భగవంతుడా! నన్ను పేదవాడిగా ఉండేటట్లు అనుగ్రహించు' అని ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) వేడుకొన్నారు. లోకంలో అపూర్వమైన కోరిక ఇది. ఆయన అభిలషిస్తే అత్యంత సంపన్న జీవితం గడపగలరు. బంగారు తూగుటుయ్యాలలో వూగగలరు. అయినా పేదరికాన్నే కోరుకొన్నారు.

స్వర్గం నీ తల్లి పాదాల కిందే ఉంది, ఎక్కడో కాదు; భక్తుడు మృదు స్వభావాన్ని అలవరచుకొన్నప్పుడే సర్వేశ్వరుడు అతడికి చేరువవుతాడు; అసత్యం, అసూయ, ఆడంబరం, వంచన హృదయంలో చోటుచేసుకొంటే ఆత్మగౌరవం మంటకలుస్తుంది. వ్యక్తి విలువ పతనమవుతుంది; పొరుగువాడి ఆకలిబాధ గుర్తించక కడుపునిండా తినేవాడు పాపాన్ని మూటకట్టుకొంటాడు; మనిషికి గర్వం కొంచెమైనా ఉండకూడదు. ఆవగింజంత గర్వమున్నా స్వర్గ ప్రవేశం ఉండదు; శ్రామికుడి కష్టార్జిత వేతనం అతడి చెమట చుక్కలు ఆరకముందే చెల్లించాలి...'

ఇవన్నీ మహాప్రవక్త ప్రవచనాలు. అవి విషతుల్యమైన హృదయ కాఠిన్యాన్ని తొలగించి మృదుత్వాన్ని దరిచేర్చగలవు. దౌష్ట్యాగ్నిని చల్లార్చగలవు. మానవతా దీపాన్ని వెలిగించి, శాంతిసుమాల పరిమళాల్ని వెదజల్లగలవు.

- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

ᐅ మనసా... కవ్వించకే



ᐅ మనసా... కవ్వించకే!

మనసుకు రూపమంటూ లేదు. కాని, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబరవీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేలమీద పరుగులు తీస్తుంది' అన్నాడో మహాకవి. నిజమే... రంగు, రుచి, వాసన ఏమి లేకపోయినా మనిషిని జీవించినంతకాలం నడిపించేది మనసే. అది తలచుకుంటే హిమోన్నత శిఖరాల మీద కూర్చోబెడుతుంది. లేదా అధఃపాతాళానికైనా తొక్కేస్తుంది. 'నేరం నాది కాదు, నా మనసుది' అంటే చెల్లదు. మనసు బుద్ధి చెప్పినట్లు నడుచుకోక తప్పదు.
మనసును అదుపులో ఉంచుకోగలిగితే మనిషి మహోన్నతుడు. లేకుంటే మహాపతితుడు. ప్రతి దినమూ మనసును సాధనతో ఆరాధనతో శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోక తప్పదు. మనసు మన అధీనంలో ఉండక పోవడానికి ప్రధాన కారణాలు- మన తిళ్లు, ఒత్తిళ్ళు. ఈ రెంటిమీద శ్రద్ధవహించడం అత్యవసరం. సాత్వికాహారం మనసును క్రమపద్ధతిలో నియంత్రించ గలుగుతుంది. ధ్యానం దాన్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. మానవ జీవన పయనంలో నేడు మానసిక ఒత్తిడి రాజ్యమేలుతోంది. ఈ ఒత్తిడికి బానిసైన మనిషి వివేకం, జ్ఞానం కోల్పోయి- ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. మనుషుల్లో పెరుగుతున్న మానసిక రుగ్మతల వల్లనే దౌర్జన్యాలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు, హత్యలు విశృంఖలంగా పెరుగుతున్నాయి.

మానసిక సమస్యలు, సంఘర్షణలు ఏదో ఒక కారణంవల్ల, పరిస్థితుల ప్రభావంవల్ల ఎదురైనా వివేచనతో, విజ్ఞతతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.

మనసు తాలూకు ప్రవృత్తి తరంగంలా చంచలమైనది. దాని తేజస్సు అగ్నికన్న వేడైనది. దాన్ని అతిక్రమించడం పర్వతారోహణకన్న కఠినమైనది. అనంతమైనది. అనంతమైన సుఖదుఃఖాది భావాలు, అనుభూతులు మనసునుంచే ఆవిర్భవిస్తున్నాయి. మనసుది ఓ బాల్య చాపల్యం. క్షణికానందం, క్షణికావేశం, క్షణిక సంతృప్తి, క్షణిక రౌద్రం మొదలైనవన్నీ చంచల హృదయం దుర్లక్షణాలు. ఈ దుర్లక్షణాలను మనం దూరం చేసుకోవాల్సి ఉంటుంది.

మనసే జగత్కర్త. మనసే పురుషుడు. మనోనిశ్చయంవల్ల సంపాదితమయ్యేది మనసు తాలూకు ప్రతిబింబమే అవుతుంది. ఏకీకృత మనసుతో చేసే ఏ కార్యమైనా సఫలీకృతమవుతుంది. సత్ఫలమిస్తుంది. చివరికి బ్రహ్మ వరకు అన్నీ మనసు ద్వారా సాధించవచ్చునంటారు. మనసు దేనికి అనుసంధానమవుతుందో, కర్మేంద్రియాలు దానికి అనుగుణంగా స్పందిస్తాయి. విత్తనం నుంచి వృక్షం, లత, పుష్పం, ఫలం- ఇవన్నీ పుట్టినట్లు మనసునుంచే ప్రేమ, శాంతం, క్రోధం, ద్వేషం మొదలైనవన్నీ పుడుతున్నాయి. అయితే మనసులోని ఆలోచనలు సక్రమంగా ఉన్నంత వరకు కర్మలు కూడా సక్రమంగా, సధార్మికంగా ఉంటాయి. మనసు గతి తప్పితే మనిషికి దుర్గతే! మనసు అమలినంగా ఉంటే లోకమంతా పవిత్రంగానే కనపడుతుంది. తనను గురించి మనసులో ఆలోచించేవాడు మానవుడు, అందరి గురించి ఆలోచించేవాడు భగవంతుడు. మనసుకు, సత్వ-రజ-స్తమో గుణాలని మూడు గుణాలున్నాయి. సత్వగుణం మంచిమనిషి లక్షణం. మిగిలిన రెండు గుణాలూ మనోదోషాలు. అంటే మనసును పదిమందిలోనూ దూషింపజేసేవి, వ్యాధులకు కారణం అయ్యేవి. మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు కారణభూతమైన సత్వగుణాన్ని సర్వదా పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి.

మనోవేగాన్ని మించిందిలేదు. అయితే మనసుకంటె శక్తిమంతమైంది బుద్ధి. దానికన్న శక్తిమంతమైంది ఆత్మ. ఆత్మ, బుద్ధి ప్రేరణతో మనసు సద్భావనా ప్రవాహంలో ప్రయాణిస్తూంటుంది. ధర్మాధర్మాలకు, బంధమోక్షాలకు మనసే కేంద్రం. 'ఈ మనసు ప్రమధనశీలమైంది. అంటే, క్షోభ కలిగిస్తుంది. ఎంత మొండిదో, అంత బలవంతమైంది. దీన్ని అధీనంలో ఉంచుకోవడమంటే గాలిని గుప్పెటలో పట్టుకున్నంత కష్టతరమైంది. అయితే అభ్యాసం, వైరాగ్యం ద్వారా మాత్రమే మనసును స్వాధీనంలో ఉంచుకోవచ్చు' అంటాడు కృష్ణపరమాత్మ భగవద్గీతలో.

మనసనేది ఈ నేలమీద పుట్టిన ప్రతి మనిషినీ ప్రభావితం చేస్తుందన్నది అక్షర సత్యం. మనసు మనిషిచేత తప్పుచేయించిందీ- అంటే, వెంటనే ఆ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం కలగజేయడమూ ఆ మనసు పనే. అప్పుడే అది నిజమైన పథనిర్దేశిక, దిక్సూచిక అనిపించుకుంటుంది.

జితేంద్రియుడైనవాణ్ని, విరాగిని, జ్ఞానిని, అనుభవశీలిని, సాధకుణ్ని మనసు ఏ విధంగాను ప్రలోభపెట్టలేదు. నీరు పల్లంవైపు ప్రవహించినట్లే, మనసు చెడువైపే మొగ్గుతుంది. అప్పుడు మనసును పరిపరివిధాల చరించకుండా నిరోధించాలి. నియంత్రించాలి. మనసు రెండు విధాలు- శుద్ధ మనసు, కల్మష మనసు. కామసంకల్పంతో నిండింది కల్మష మనసు. కామవాసనా రహితమైనది శుద్ధ మనసు. అనుచితమైన కోరికలకు బానిసవుతున్న మనసును అదుపులో పెట్టుకోవలసి ఉంటుంది. ఏ విషయ వాసనాసక్తీలేని మనసు ముక్తి పొందడానికి అర్హత సంపాదిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను స్వచ్ఛంగా ఆహ్వానిస్తుంది. మనసు కవ్విస్తే, మనిషి తలొగ్గితే అన్నీ అనర్థాలే!

ఆదిశంకరులన్నారు- 'నా మనసనే కోతి మోహమనే అడవిలో సంచరిస్తోంది. డబ్బు, కోరికలనే చెట్లకొమ్మలపైన ఎగురుతోంది. ఈ కోతిని అధీనంలో ఉంచుకో ప్రభూ!'... ఈ ఆవేదన సకల మానవజాతి ఆవేదన. కాముడి బారినుంచి బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తప్పించుకోలేక భంగపడ్డారు. అయితే మానవజాతికి ఉన్న గొప్ప అవకాశమేమంటే- మనసును సర్వదా నిర్మలంగా ఉంచుకోవడానికి భగవన్నామస్మరణం చేయడం. ఈ కలియుగంలో మనసును ముక్తిమార్గాన నడిపించేందుకు శంకర భగవత్పాదులే చెప్పారు.- 'భజగోవిందం' అని అంతకుమించిన ధన్యోపాయం లేదు. మానవుడు ఇదొక్కటి ఆచరణలో పెడితే చాలు, తెరుచుకుంటాయి మోక్షద్వారాలు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅ త్రిశంకు స్వప్నం



ᐅ త్రిశంకు స్వప్నం

ఒకవైపు ఆధ్యాత్మికలోకాల పిలుపులు, మరోవైపు జీవన మాధుర్యాల తలపులు. అటు దైవం, ఇటు జీవితం. సత్యశివ సౌందర్యాలు దూరతీరాలనుంచి రా రమ్మని ఆహ్వానిస్తుంటాయి. మమ్మల్ని వదలేస్తావా అని నిత్య భవబాంధవ్యాలు కలవరిస్తుంటాయి.
ఈ జీవితం స్వర్గ, వాస్తవాల మధ్య వేళ్లాడే త్రిశంకు స్వప్నం. జీవితాన్ని వదులుకోలేం పూర్తిగా. ఆధ్యాత్మికత వైపు తిరిగి ప్రయాణించకుండా ఉండలేం. ఇది చాలామంది పరిస్థితి. యథార్థ స్థితి. చివరికి రెంటికీ చెడిన రేవడులా మారిన స్థితి. నైరాశ్యం, అసంతృప్తి, ఏదో కోల్పోతున్నామన్న పరివేదన, నిరాసక్తత, నిస్సహాయత, నిర్వీర్యత, నిర్లిప్తత- ఇదీ జీవితం! ఇదా జీవితం, ఇదేనా?

జీవితంలోనే ఉండి భగవంతుణ్ని సాక్షాత్కరింపజేసుకోలేమా? అలా దైవాన్ని పొందగలిగిన భక్తులు గతంలో లేరా? అది అసంభవమా, అలా చేయడం తప్పా? జీవితం 'సగం విరిగిన వీనస్‌' కాదు. భగవంతుడిపై వెల్లివిరిసిన ఆలోచనల ప్రవాహాల్లో జీవితం పూర్ణ వికసిత బింబంగా, దివ్య ప్రతిమగా మారుతుంది.

బాధల గండశిలలు దాటిన పిమ్మట ఆనందతీరాలు కనిపిస్తాయి. పొరపాట్లు, తప్పిదాలు, అసత్యాలు అస్తమించిన చోట సత్యం నిండుగా ప్రకాశిస్తుంది. చీకటి మబ్బులు చెదిరిపోయిన సీమలో వెలుగుధారలు కురిసిపోతాయి. జుగుప్సావహమైన లోకపు వైకల్యాల వెనక ఒక అతిలోక సౌందర్యం రాశీభూతమై ఉంటుంది రహస్యంగా.

వికృత రూపాలు నిండిన ఈ లోకాన్ని చూసి అవతారాలు, దేవతలు ఏనాడూ అసహ్యించుకోరు. అలా లోకాన్ని నిరసిస్తే వారు అవతారాలే కాదు. వైకల్య శాపగ్రస్త అయిన కుబ్జ శ్రీకృష్ణుని భువనమోహన స్పర్శతో అతిలోక రమణీయ రూపసిగా మారలేదా? కబంధుడు వికృత స్వరూపుడు. శ్రీరాముడి దివ్యాస్త్రం అగ్నిస్పర్శతో తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు కదా! మానవ వైకల్యానికి సత్యమే దివ్య ఔషధం.

భగవంతుడివైపు తిరిగినప్పుడు సగం విరిగిన జీవన ప్రతిమ పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అంతమాత్రాన ప్రతిమ తన ప్రత్యేక విలువను పోగొట్టుకోలేదు.

సర్వ మానవాళిలో దివ్య సౌందర్య మహత్వాన్ని వీక్షించి, ప్రేమించి, ఆనందాన్ని పొందితే అంతకుమించిన భగవత్‌ సాక్షాత్కార దర్శనం ఉంటుందా?

'నీలో దైవాన్ని దర్శించు, నీ పొరుగువాడిలో దైవాన్ని తిలకించు. దేశంలో దైవాన్ని వీక్షించు. మానవాళిలో దైవత్వాన్ని చూడు. చెట్టులో, రాయిలో, మృగంలో, ప్రపంచంలోపలా, వెలుపలా దైవాన్ని చూడటం నేర్చుకో'- అన్న తత్వవేత్తల ప్రవచనసారం తెలుసుకుంటే చాలు, జీవితం ధన్యమవుతుంది, సార్థకత చెందుతుంది. పూర్ణత పొందుతుంది.

ప్రపంచాన్ని చిరంతన భగవద్రూపంగా దర్శించగలిగితే మనం విముక్తులవుతాం. భగవంతుని అక్షరధామంలో ముక్తి పురుషులుగా భాసిస్తాం.

ఆ అనుభవమే ఈ భూమిపై జీవన్ముక్తికి కాంతి మార్గం. భగవంతుని భువన సామ్రాజ్యంలో నిత్యులమై నిరవధిక ఆనందం పొందుతాం! యోగులైనా, జీవన విరాగులైనా, జీవన ప్రేమికులైనా చేరవలసిన మహోన్నత శిఖరం అదే, అదే!!

- కె.యజ్ఞన్న

ᐅ హృదయవాసి



ᐅ హృదయవాసి

దేవుడికి పూజ చేస్తే బావుంటుంది. అతడి నామం జపిస్తే బావుంటుంది. రోజుకు రెండుసార్లు స్నానం చేసి శుద్ధిగా ఉండి నుదుట నామం దిద్దుకుని 'భక్తుడు' అనిపించుకుంటే బావుంటుంది. ఇలా అనిపించుకోవడం వెనక మనసుకు ఏదైనా ఆరాటం ఉందా? ఈ జీవితాన్ని కోరుకునేవాళ్లు ఎందరు? ఎందుకు ఇలా ఉంటే బావుంటుంది? ఇది భగవంతుడికి సంబంధించిన జీవితంలా కనిపిస్తోంది. ఇదే ఆధ్యాత్మికతా, ఇంతటితో దైవసాక్షాత్కారం అయిపోతుందా?
దేవుడి కోసం కొండలు, కోనలు తిరిగినవాళ్లు ఉన్నారు. జుట్టు జడలు కట్టి, పిచ్చివాళ్లయిపోయి ఏకాంతంగా ఆ ఈశ్వరుడి అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నవాళ్లూ ఉన్నారు. సత్సంగాలు, భజనలు, సామూహిక ప్రార్థనలు చేస్తూ జీవితంలో సింహభాగాన్ని వెచ్చిస్తున్న వాళ్లూ ఉన్నారు. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, గురువులను విశ్వసిస్తూ ఏదో ఒక సాధనలో ఎంతో కొంత దూరం వెళ్లి అక్కడ ఆగిన వాళ్లూ ఉన్నారు.

దేవుడి కంటే ముందు మనిషికి, అతడి జీవితం కరుణించాలి. జీవితం అతడికి ఆ అవకాశం ఇవ్వాలి. జీవితం చాలా విలువైనది. జీవితం భగవంతుడి వరప్రసాదం. చక్కగా జీవించాలి. గొప్పగా జీవించాలి. జీవితాన్ని ప్రతిక్షణం ఆనందమయం చేసుకోవాలి. నిజమైన ఆనందాన్ని కనుగొనాలి. జీవిత పుష్పం సృష్టికర్త తోటలో పరిమళాలు గుబాళించాలి.

మనం భగవంతుడి వెంటపడటం కాదు. భగవంతుడే మన వెంటపడాలి. ఎన్ని చేసినా, ఎలా ఉన్నా, ఏ ఆహార్యం ఎలా మార్చుకున్నా బాహ్యాడంబరాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు కాదు దేవుడు. అంతరంగం నిజాయతీగా ఉండాలి. వినయ విధేయతలు కలిగి, మానవ హృదయాల్లో నిండి ఉన్న భగవంతుడి వైపు ప్రేమతో మన జీవితం సాగిపోవాలి. కళ్లముందు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి మించిన సాధనావస్తువు మరొకటి లేదు. ఇదెంత సమ్మోహన పరుస్తున్నా, ఈ రంగులు, ఈ మాయలు అక్కర్లేని వాళ్లెవరు? కాని, వీటిని తప్పక అధిగమించాలి. మనం ఎదగాలి. ఆలోచన విస్తృత పరచుకోవాలి. అంతర్ముఖులు కావాలి. ఈ విశ్వచక్రం తిప్పుతున్నవాడిని నిలబెట్టి నిలదియ్యాలి. వాడెక్కడ ఉంటాడో, ఏ ప్రదేశంలో ఉంటాడో, ఎంత అందంగా ఉంటాడో? ఇంత అద్భుతమైన జగత్తును ఒక గొప్ప కళాఖండంగా నివాసయోగ్యంగా తీర్చిదిద్దిన ఆ దివ్య సౌందర్యమూర్తి హృదయం ఎలా ఉంటుందో?ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఆ ప్రేమమూర్తి పలుకులు వినాలి. ఆ రూపాన్ని తనవితీరా దర్శించాలి.

ఎంత దూరమైనా పరుగుతీస్తాను. ఎన్ని కష్టాలకైనా వెనకాడను. ఏ పుణ్యక్షేత్రంలో అతడు దాగిఉన్నా, ఎంత లోతైన లోయలో అతడు తిరుగుతున్నా, ఏ కొండ శిఖరంపైన అతడు కూర్చున్నా, అతడిని పట్టుకుంటాను... ఇలా సాగే ఆలోచనా స్రవంతి భగవంతుడికి మనకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అతడిపై మనకు ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు ఆట మొదలవుతుంది. కష్టాలు ప్రారంభమవుతాయి. కన్నీళ్లు వస్తాయి. ఎంత దూరం వెళ్తున్నా దైవం జాడలేదు. ఎందుకీ అన్వేషణ? వృథా ప్రయాస అనిపిస్తుంది. వూహించని పరీక్షలు, హఠాత్పరిణామాలు... దైవదూషణ కూడా జరుగుతుంది. ఎంతో కోపంగా, పరుషంగా మాట్లాడతాం. ఎదుట దైవం తలవంచుకుని ఒక వ్యక్తిలాగ నిలుచున్నట్లు భావిస్తూ అతడికి శాపనార్థాలు పెడతాం. మనం ఇప్పుడు భగవంతుడితో మాట్లాడుతున్నాం. ఆ అవకాశం ఆయన ఇచ్చాడు. ఆయన కూడా నిత్యం మనతో మాట్లాడుతూనే ఉన్నాడు... ప్రతి సంఘటనలో, ప్రతి సందర్భంలో అతడు మనకు బోధ చేస్తూనే ఉన్నాడు. ఆ దృష్టికోణం మన దగ్గర లేదు. ఆ నేత్రం ఇంకా తెరుచుకోలేదు.

నిద్రపోతూ కల కన్నాం. ఆ కలలో కొన్ని వేల మైళ్లు ప్రయాణం చేశాం. కళ్లు తెరిచాం. స్వప్నం తొలగిపోయింది. చూస్తే, మన ఇంటిలో మన పరుపు మీదే నిద్రపోతూనే ఉన్నాం. మరి ఈ ప్రయాణమంతా ఏమైనట్లు?

భగవంతుడి కోసం తిరగాలి. తప్పులేదు. కాని, అతడు యథాతథంగా ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఆ దిశలో ప్రయాణం చెయ్యాలి. అదెలా తెలుస్తుంది? గాలి పీల్చుకోవడానికి కాశీ వెళ్లాలా? ఆకాశం చూడటానికి అమర్‌నాథ్‌ వెళ్లాలా? 'నన్ను చూడాలంటే మొట్ట మొదట నిన్ను చూడు' అంటాడు భగవంతుడు. మనకు హృదయం ఇచ్చింది అతడు కూర్చోవడానికే. మనలో లేని భగవంతుడు బయట ఎన్నటికీ ఉండడు. 'ప్రాణులకు ప్రాణమై ఉన్నాడు ఈశ్వరుడు' అంటాడు కబీరు.

- ఆనంద సాయి స్వామి

ᐅ ఏకాగ్రత



ᐅ ఏకాగ్రత

జ్ఞానానికి ఏకైక మార్గం ఏకాగ్రత. శాస్త్రజ్ఞులు తమ పరిశోధనాంశం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. వారికి ఇంట్లో సంగతులు సైతం పట్టవు. తమ పరిశోధనాంశం తేలేవరకు వేరే ఆలోచనలను దరికి రానీయరు. ఏ పని చేస్తున్నా వారి బుర్రల్లో అదే అంశం మెదులుతూ ఉంటుంది. భార్యతో బండిపై బజారుకు వెళ్లిన శాస్త్రవేత్త, ఆలోచనలో పడి ఆమెను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలను గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ భౌతిక విషయసంబంధమైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నగతమైన ఏకాగ్రతలు. గృహకృత్యాలూ, కుటుంబ సంబంధాలూ భౌతికమైనవే! అయినప్పటికీ, శాస్త్రజ్ఞులు సర్వమానవాళికీ ఉపయోగపడే ఒక అద్భుత విషయాన్ని ఆవిష్కరించడానికి అహరహమూ శ్రమిస్తుంటారు. మనసును పూర్తిగా ఆ విషయంపైనే నిలుపుతారు. ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పోరాటాలు, ఆర్థిక పరిణామాలు వారిపై ప్రభావాన్ని చూపవు. ఒక సామాన్యుడు వంకాయలు చవగ్గా దొరికేచోటు కనుక్కుని సంతోషిస్తాడు. అదేపనిగా గాలించి అటువంటి దుకాణం ఎక్కడుందో తెలుసుకొని, తన కుటుంబ సుఖజీవనానికి తోడ్పడతాడు. ఈ పనికీ ఏకాగ్రచిత్తం అవసరమే! కానీ, ఈ ఏకాగ్రతకు ఫలం వంకాయలు మాత్రమే! ఏకాగ్రచిత్తంతో పరమేశ్వరుని ధ్యానించి, స్వామి సాక్షాత్కారమైతే, 'వీసెడు వంకాయలు కావాలి'అని కోరడం ఎంత అవివేకం? దీక్షలన్నీ ఉన్నత ఆదర్శాలతో ఉండాలి. మానవాళికి మహత్తర సౌభాగ్యం చేకూర్చేవిగా సాగాలి. అది చిన్నదైనా, పెద్దదైనా, వ్యక్తిగతమైనా సమాజశ్రేయానికైనా, ఒక దీక్ష పూనినవాళ్లకు కావాల్సింది ఏకాగ్రత. చిన్నచిన్న ఆశలకు, అంతరాయాలకు వారి ఏకాగ్రత చెక్కుచెదరదు. విద్యాలయాలు ఏకాగ్రత ఎలా సాధించాలో నేర్పితే చాలు. విద్యార్థులు సులభంగా అన్నీ నేర్చుకోగలరు. ఏకాగ్రచిత్తం యోగి లక్షణం. మన సనాతన సంప్రదాయ విద్యలో గురువు శిష్యుడికి ఏ మతాన్ని గురించీ బోధించడు. ఏకాగ్రతను నేర్పుతాడు. దాన్ని అభ్యసించిన శిష్యుడు తానే అల్లుకుపోతాడు. అన్నీ గురువు దయవల్ల తనకు సంప్రాప్తించినవని చెబుతాడు. కొందరు శిష్యులు గురువును మించిన వారయ్యారు. కేవలం గురువు బొమ్మపెట్టుకొని లక్ష్యశుద్ధితో సాధన చేసి, మేటి విలుకాడయ్యాడు ఏకలవ్యుడు.
ఒక సాధువు చెరువుగట్టు పైనుంచి వెళుతున్నాడు. ఆ గట్టుపై ఒకడు కూర్చుని, గేలంవేసి, తదేక దీక్షతో నీటివైపే చూస్తున్నాడు.

'నాయనా! ఈ దారి ఏ వూరికి పోతుంది?' సాధువు ప్రశ్నించాడు. గేలం పట్టుకున్నవాడు సమాధానం చెప్పలేదు.

'బాబూ! ఈ బాట ఎటు వెళుతుంది?' మళ్లీ అడిగాడు సాధుపుంగవుడు.

గేలం పట్టుకున్నవాడు కన్నార్పకుండా చెరువులోని నీటివైపే చూస్తున్నాడు. పెదవి మాత్రం కదపలేదు. సాధువుకు కోపం వచ్చింది.

'ఏవయ్యా! నిన్నే! ఎన్నిసార్లడగాలి? చెవుడా ఏం?' అతడు మాత్రం బదులు పలకలేదు.

హఠాత్తుగా గేలానికి చేప తగులుకుంది. మరుక్షణమే ఒక్క విసురున గేలాన్ని బయటకు లాగి, చేపను బుట్టలో వేసుకున్నాడు. సాధువు అతడివైపు కొరకొర చూస్తున్నాడు.

అతడు హడావుడిగా చేపలబుట్ట సర్దుకొని, గేలాన్ని పక్కనపెట్టి, సాధువును చూసి నమస్కరించాడు.

'అయ్యా! తమరేదో ఇందాక అడిగినట్లున్నారు... క్షమించండి! నా దృష్టి అంతా చెరువులోని చేపవైపే ఉంది. బెండు మునిగిన మరుక్షణమే గేలం బైటికి లాగాలి. లేకపోతే చేప తప్పించుకుపోతుంది. నేను చేసేపని నుంచి దృష్టి మరల్చకూడదు కదా! ఆ సమయంలో నాకు మరే ఇతర శబ్దమూ వినబడదు, కనబడదు. మీకు కోపం వచ్చినట్లుంది... నాది తప్పయితే క్షమించండి!' అన్నాడు.

సాధువుకు జ్ఞానోదయమైంది. రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు. 'గురుదేవా! నేను ఎందరు గురువులను ఆశ్రయించినా సరైన మార్గం బోధపడలేదు. నాకు తోవచూపగల గురువెవరో ఈ సమీప గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని, వెతుక్కుంటూ వచ్చాను! ఏకాగ్రత లేనిదే ఎన్ని జపాలు తపాలు చేసినా నిరుపయోగమేనని ఇప్పుడు గ్రహించాను. ఈ పరమసత్యాన్ని నాకు బోధపరచిన తమరే నా గురువులు!' అని ఆ సాధువు వెనుదిరిగిపోయాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅ బంధమోక్షాలు



ᐅ బంధమోక్షాలు

స్వేచ్ఛను హరించేది బంధం. బంధాన్ని వదిలించేది మోక్షం. బంధమోక్షాలకు స్థూలంగా చెప్పే నిర్వచనాలివి. మనిషి బంధానికి గురికావడానికీ, మోక్షాన్ని పొందడానికీ కారకులెవరు? భగవంతుడా, కుటుంబమా, అదృష్ట దురదృష్టాలా, సమాజమా? ఇవేవీ కారణాలు కావనీ, మనుషుల బంధమోక్షాలకు మనసే మూలకారణమనీ శాస్త్రాలు చెబుతున్నాయి.
బంధానికి మూలకారణం కోరిక. సుఖాలు కావాలని కోరుకున్నప్పుడు ఆ సుఖాలను సంపాదించుకోవడానికి అమితంగా కష్టపడాలి. సుఖాలవెంట పరుగులు తీయాలి. అష్టకష్టాలు పడి సుఖాలను సాధించుకుంటే అవి మనిషిని స్వేచ్ఛగా ఉండనీయవు. అవి వెంటపడేవాళ్లను తమ అదుపులోకి తీసుకుంటాయి. ఒక సుఖం మరొక సుఖంవైపు ప్రేరేపిస్తుందేగాని, అది అంతటితో వూరుకోదు. ఒక్కొక్క సుఖమూ చేరుతూ చేరుతూ చివరికి అనంతంగా విస్తరిస్తాయి. ఇక మనిషి వాటిచుట్టూ పరుగులు తీయడంతప్ప మరొకటి చేయలేడు.

మోక్షానికి మూలకారణం సర్వసంగ పరిత్యాగం. అంటే, అన్నింటితో స్నేహాన్ని వదులుకోవడం. అటువంటప్పుడు మనసులోకి ఏదీ రావడంకానీ, పోవడంకానీ ఉండదు. అంతా శూన్యంగా ఉండే స్థితి అన్నమాట. యోగులు సాధించే అత్యున్నతస్థితి ఇది. ఇందులో రాగద్వేషాలకూ, స్వార్థానికీ తావులేదు. అన్నింటినీ వదలివేయడమే ప్రధానం.

అసలు బంధమోక్షాలు రెండు పదాల్లోనే ఇమిడి ఉన్నాయనీ, 'మమ' (ఇదంతా నాది) అనుకోవడం బంధమనీ, 'న మమ' (ఇదంతా నాదికాదు) అనుకోవడం మోక్షమనీ, వేదాంతుల మాట. అందరూ 'మమ' అని అనుకొనేవాళ్లే. 'న మమ' అనేవాళ్లు లోకంలో చాలా అరుదు. దీనికి కారణం మనుషులు త్రిగుణాలకు లోబడి ఉండటమే. త్రిగుణాల్లో సత్వం మనిషిలోని సాత్విక ప్రవృత్తినీ, రజస్సు రాగద్వేషాలనూ, తమస్సు అనాలోచిత కర్మలనూ కలిగిస్తుంది. త్రిగుణాలు మనసుకు అధీనమై ఉంటాయి. కనుక బంధానికీ, మోక్షానికీ మనసే కారణమని పెద్దలమాట.

ప్రేమ, అనురాగం, ఆసక్తి, అభిలాష, ఆకాంక్ష... ఇలా ఎన్నో విషయాలు బంధానికి కారణాలవుతున్నాయి. ఆకాశంలో ఎన్నో పక్షులు విహరిస్తుంటాయి. చెట్లమీద వాలి సేదదీరుతుంటాయి. కానీ, రామచిలుకలను చూడగానే మనిషికి దాన్ని పట్టుకోవాలనీ, ఆ తరవాత వాటిని పంజరంలో బంధించి, ఇంట్లో పెట్టుకోవాలనీ అనిపిస్తుంది. దీనికి కారణం రామచిలుక పలుకులు మధురంగా ఉండి, ఆకర్షించడమే. ఈ గుణం కారణంగానే రామచిలుకలు పంజరాల్లో బంధీలవుతున్నాయి.

మనసు లగ్నం కాకపోతే బంధం లేనేలేదు. మనసుతో అనుకుంటేనే బంధాలు ఏర్పడుతాయి. మనసు సన్యసించిననాడు ఏదీ మనిషిని బంధించలేదు. మనసుతో అనుసంధానించినప్పుడు ఇంద్రియాలు పనిచేయడం, మనసును కలపకపోతే ఇంద్రియాలు పనిచేయకపోవడాన్ని చూసినప్పుడు బంధమోక్షాలకు కారణం మనసేనని స్పష్టంగా తెలుస్తుంది.

మనిషి బంధాలనుంచి విముక్తం కావాలంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకు- అత్యంత ఆప్తులైనవారు ఎవరైనా మరణించినప్పుడు, వారితో ఉన్న మానసికానుబంధంతో ఎంతో దుఃఖం కలుగుతుంది. దుఃఖం కూడా మనిషికి బంధమే. మరణం జీవకోటికి సహజమనీ, అది ఆప్తులకైనా, ఇతరులకైనా ఎప్పుడైనా సంభవించేదే కనుక ఎక్కువగా విచారించరాదనీ మనసును సమాధానపరచుకొన్నప్పుడు దుఃఖం దూరమవుతుంది. దాని పర్యవసానంగా బంధమూ నశిస్తుంది.

అన్నీ తనకే కావాలనుకునే నరుడికి ఏదీ వదులుకోవడం ఇష్టం ఉండదు. చివరికి తనకు పనికిరాని వస్తువైనా సరే, దాచుకొంటాడే కానీ త్యాగం చేయడు. ఇది మనిషి బలహీనత. ఈ బలహీనతవల్లే బంధాల్లో చిక్కుకొంటాడు. అందుకే పెద్దలు సదా త్యాగబుద్ధిని అలవరచుకోవాలని చెబుతారు. త్యాగంవల్లనే అమృతత్వం సిద్ధిస్తుందని వేదవాక్కు. త్యాగం అనేది మనోనిర్ణయానికి అధీనమై ఉంటుందేగాని, మాటలతో సాధ్యంకాదు. కనుక, మనిషి అన్నింటినీ మానసికంగా వదిలించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే విముక్తి లభిస్తుంది. లేకుంటే ఎన్ని సంపదలున్నా, ఎన్ని సౌఖ్యాలున్నా మనిషి ఇంద్రియాల చెరసాలలో బందీగానే జీవితమంతా గడపవలసివస్తుంది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

ᐅ ఇది గ్రహిస్తే చాలు



ᐅ ఇది గ్రహిస్తే చాలు

చేలో జొన్న కంకులు విరగకాశాయి. పక్షులు గింజలకోసం గుంపులుగా వచ్చాయి. మంచెమీది రైతు చేతిలోని వడిసెల రివ్వున ఎగిరింది. పక్షులన్నీ కకావికలమైపోయాయి.
గింజలు కనిపిస్తే తినడం పక్షుల ధర్మం. పక్షులబారి నుంచి పంటను కాపాడుకోవడం రైతు ధర్మం. ఇక్కడ రైతుదీ స్వధర్మమే. పక్షులదీ స్వధర్మమే.

గయుడు ప్రాణభీతితో అర్జునుణ్ని శరణు కోరతాడు. అభయమిచ్చాడు కిరీటి. అటు తరవాత తెలుస్తుంది శ్రీకృష్ణుడి శపథం గురించి. విలవిల్లాడిపోతాడు. అటు ఆత్మబంధువైన శ్రీకృష్ణుడు, ఇటు ఇచ్చినమాట. తెప్పరిల్లి స్వధర్మానికే కట్టుబడాలని నిశ్చయించుకున్నాడు. శ్రీకృష్ణుడితో పోరుకే సిద్ధపడ్డాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కిరీటికి గీతాబోధన గావిస్తూ స్వధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని ఉద్బోధిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు.

నీటి మడుగువద్ద విగతజీవులై పడి ఉన్న సోదరులను చూసి విస్తుపోతాడు ధర్మజుడు. యక్షుడు ప్రత్యక్షమవుతాడు. యక్షప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతాడు.

సంతుష్టుడైన యక్షుడు, 'నీ సోదరుల్లో ఒక్కరిని కోరుకో... బతికిస్తాను' అంటాడు.

'కుంతీదేవికి జ్యేష్ఠ పుత్రుణ్ని నేను. అలాగే మాత మాద్రికి జ్యేష్ఠ సుతుడు నకులుడు. అతణ్నే బతికించండి' అని కోరతాడు.

అతడి శీలసంపదకు, విచక్షణకు సంతసించిన యక్షుడు ధర్మజుని సోదరులందరినీ పునర్జీవితులను గావిస్తాడు.

గాడితప్పని స్వధర్మాచరణకు మహాభారతం మనకందించిన గొప్ప ఉదాహరణ ఇది.

పంచేంద్రియాలు స్వధర్మాలను కోల్పోతే మనసు, శరీరం విలవిల్లాడిపోతాయి. మనసు, శరీరం స్వధర్మాన్ని విస్మరిస్తే- జీవితం కల్లోలిత సాగరమవుతుంది.

ఓ గొప్ప నిర్ణయాత్మక శక్తి- స్వధర్మం!

జీవితం ప్రయోగశాల మాత్రమే కాదు. భగవానుడు పెట్టిన గొప్ప పరీక్షగానూ భావించాలి. నెగ్గుకు రావడానికి మనకిచ్చిన ఉపకరణం స్వధర్మాచరణే. కొన్నికొన్ని సమయాల్లో స్వధర్మాచరణ మీమాంసకు గురిచేయవచ్చు. కష్టాలు కొనితేవచ్చు. ఇతరులకు ప్రతిబంధకంగానూ ఉండవచ్చు. ఉన్నతస్థానంలో ఉంచవచ్చు. లేదా ఏకాకిగా మార్చనూవచ్చు. సంధిగ్ధావస్థలో పడవేయనూవచ్చు.

బిడ్డలను పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా చేయడంవరకే తల్లిదండ్రుల ధర్మం. వారి నుంచి ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను గౌరవించడం. ఆదరిస్తూ పోషించడం, కంటికిరెప్పలా కాపు ఉండటం బిడ్డల ధర్మం. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను జీవిత భాగస్వామిగా, జీవన సహచరిగా చూసుకోవడం భర్త ధర్మం. తోడునీడగాఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం భార్య ధర్మం.

విద్యార్జనకై వచ్చినవారికి అంకితభావంతో విద్యాదానం గావించడం గురువు ధర్మమైతే- గురువును భగవంతునిలా పూజించి, గౌరవించడం విద్యార్థి ధర్మం. శీలసంపద, వివేకంతో కూడిన విచక్షణ స్వధర్మాచరణలో ఉండితీరాలి. అది రాణిస్తుంది. ఆదర్శప్రాయంగానూ ఉంటుంది.

మనం అనునిత్యం చూస్తున్నదేమిటి, గమనిస్తున్నదేమిటి? కల్లోలిత మనస్కులుగా ఉండేవారిని, సమస్యలంటూ అపోహలంటూ అనర్థాలంటూ ఒత్తిళ్ళంటూ విసుగుతూ వేసారేవారిని, ప్రశాంత జీవనం అంటూ వెంపర్లాడేవారిని చూస్తున్నాం. దీనికంతటికీ కారణం ఒక్కటే- స్వధర్మాన్ని విస్మరిస్తూ, పరధర్మం గురించి ఆలోచించడమే. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే చాలు... సుఖవంతమైన నూరేళ్ల జీవనం మన సొంతమయ్యేందుకు.

- దానం శివప్రసాదరావు

ᐅ గురు గోబిందసింగ్‌



ᐅ గురు గోబిందసింగ్‌

సిక్కు గురువుల్లో ఆద్యుడు గురునానక్‌దేవ్‌ (1469-1539). ఆయన కులమతాతీతమైన ఆధ్యాత్మిక వ్యవస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా దైవధర్మాన్ని బోధించిన జగద్గురువు నానక్‌, ఆయన తదనంతరం గురు అంగద్‌ దేవ్‌ (1504-1552), గురు అమర్‌దాస్‌ (1479-1574), గురు రామ్‌దాస్‌ (1534-1581), గురు అర్జున్‌దేవ్‌ (1563-1606), గురు హర్‌గోవింద్‌ (1595-1644), గురు హర్‌రాయ్‌ (1630-1661), గురు హరికిషన్‌ (1656-1664), గురు తేగ్‌బహదూర్‌ (1621-1675) సిక్కు ధర్మాన్ని అనేక కష్టనష్టాలకోర్చి రక్షించారు.
పీడిత తాడిత ప్రజల పాలిట సిక్కు ధర్మం రక్షా కవచమైంది. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గురువులూ చెయ్యని త్యాగాలు సిక్కు గురువులు చేశారు. అనేక ధర్మయుద్ధాలు చేశారు.

కాశ్మీరు పండితుల ప్రార్థన మన్నించి, హిందూ ధర్మ రక్షణ కోసం ఆత్మబలిదానం చేసిన మహోన్నత త్యాగమూర్తి గురు తేగ్‌బహదూర్‌. ఆయన తరవాత, తొమ్మిదేళ్ల అతి పిన్న వయస్సులో, ఆయన కుమారుడైన గోబిందరాయ్‌ గురుసింహాసనం అధిష్ఠించారు.

గోబిందరాయ్‌ బాల్యంనుంచే చదువు, సాహిత్యం, యుద్ధవిద్యల్లో ఆరితేరారు. తండ్రిని మొగలాయీ పాలకులు శిరచ్ఛేదం చేశాక- సిక్కుల్లో ఆశించినంత ఆవేశం, తిరుగుబాటు రాకపోవటం గోబిందరాయ్‌ని మనస్తాపానికి గురిచేసింది. సిక్కులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు.

సిక్కులు అసహాయ శూరులై అనితర సాధ్యమైన క్రమశిక్షణతో, కులమత జాతి విచక్షణకు అతీతంగా, ధర్మరక్షణే కర్తవ్యంగా జీవించాలనే పవిత్ర ఆశయంతో ఖాల్సాపంథ్‌ అనే అత్యుత్తమ ఉద్యమాన్ని ప్రారంభించారు గురు గోబిందరాయ్‌.

సిక్కులు సింహసమానులుగా జీవించాలనే సంకల్పంతో ప్రతి సిక్కు పేరు చివర్న 'సింగ్‌' అని చేర్చారు. ఖాల్సాపంథ్‌ రూపకల్పన 30-3-1699న ఆనందపూర్‌ సాహిబ్‌లో జరిగింది.

అదొక అద్భుత ఆధ్యాత్మిక చారిత్రక సంఘటన. గురు గోబింద్‌రాయ్‌ ఆనాటి నుంచి గురు గోబింద్‌ సింగ్‌గా ప్రసిద్ధిపొందారు. ఆత్మబలిదానానికి సిద్ధపడిన అయిదుగురు సిక్కులు- లాహోర్‌కి చెందిన క్షత్రియుడు దయారామ్‌, హస్తినాపూర్‌కి చెందిన జాట్‌వీరుడు ధరమ్‌ చంద్‌, హిమ్మత్‌రాయ్‌ అనే కుమ్మరి, మొహకమ్‌చంద్‌ అనే దర్జీ, సాహెబ్‌చంద్‌ అనే క్షురకుడు- పంచ ప్యారీలుగా ప్రసిద్ధి చెందారు.

వారికి తన స్వహస్తాలతో 'పహుర్‌' ఉత్సవంలో తయారుచేసిన అమృతతీర్థం ఇచ్చి, సింగ్‌ బిరుదు ప్రదానం చేశారు. తిరిగి వారి నుంచి అమృతతీర్థం స్వీకరించి, తన పేరు చివర సింగ్‌ జతచేసుకున్నారు.

సిక్కు ధర్మం స్వీకరించి, ఖాల్సాలుగా జీవించాలనుకునేవారు ఇలాగే 'అమృతతీర్థం' పుచ్చుకోవాల్సి ఉంటుంది.

'ఖాల్సా' అంటే జీవితకాల పవిత్రయోధుడు.

కఠినాతి కఠినమైన జీవన విధానంతో ఖాల్సాలు ధర్మజీవితం గడుపుతారు. కకార పంచకాలు- కేశాలు, కృపాణ్‌, కచ్ఛా, కడ, కంఘా తప్పనిసరిగా ధరించాలి. సిక్కు ధర్మంలో ఉచ్చనీచ విచక్షణ, పూర్వకుల మత ప్రసక్తిగానీ ఉండవు. ఒకే పాత్రలోని ఆహారాన్ని అందరూ స్వీకరిస్తారు.

సిక్కులు ఎలాంటి దుర్వ్యసనాల జోలికి పోకూడదు. సమభావం, సమసమాజం, సద్భావన, సమాజ రక్షణ, దేశభక్తి- సిక్కులకు పంచప్రాణాలు. ఇలాంటి అసమాన యోధుల్ని తీర్చిదిద్దిన ఘనత గురు గోబింద సింగ్‌దే.

'నా ఖాల్సా సైనికుడు ఒక్కొక్కడూ లక్షాపాతికవేల శత్రువులను సంహరించగలడు' అని ప్రకటించటమే కాదు- ఆచరణ సాధ్యంగా రుజువుచేసిన మహాయోధుడు గురు గోబింద సింగ్‌. తన జీవితకాలంలో పద్నాలుగు ధర్మయుద్ధాలు చేశారాయన. చిన్న సైన్యంతోనే మహాసైన్యాలను మట్టి కరిపించారు.

గురు గోబింద సింగ్‌ కేవలం సిక్కులకే కాదు ప్రతి భారతీయుడికీ ప్రాతఃస్మరణీయుడు. కారణం, ఆయన ఏ మతానికో పరిమితం కాలేదు. మానవత్వానికి రక్షకుడిగా నిలిచాడు. అందరు మానవుల్ని ఆత్మస్వరూపులుగానే భావించాడు. గాయపడిన శత్రువుల్ని కూడా ఆదుకున్న మహనీయుడు.

ఆయన జన్మదినం మానవత్వానికి మహోత్సవం.

- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

ᐅ ప్రేమపరీక్ష



ᐅ ప్రేమపరీక్ష

ప్రేమ స్వరూపమైన ఆ పరమాత్మను సాధకుడు నిండుమనసుతో ప్రేమిస్తాడు. నిరంతరం ఆ పరమాత్మ పేరునే స్మరిస్తుంటాడు. అతడు సంపూర్ణ ప్రేమమూర్తిగా మారిపోతాడు. చివరికి ఆ సాధకుడే ఓ పరమాత్మ అవుతాడు. పరమాత్ముడు సకల సద్గుణ భూషణుడు. సర్వాంతర్యామి. నిరాకారుడు. ఎవరికీ కనిపించడు.
ఆ పరమాత్మ భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడు. ప్రేమించినవారికి ఆశీస్సులందిస్తాడు. అలాంటి పరమాత్మను నిత్యం ప్రేమించడం అసలైన ప్రేమా? కాదు.

ఆ పరమాత్మ తనను ప్రేమించమని ఎవర్నీ అడగడు. కానీ, భక్తులకెన్నో పరీక్షలు పెడుతుంటాడు.

సాధకుడి మనసులో ఉన్న ప్రేమను పరీక్షిస్తుంటాడు. ఈ పరీక్షలో సాధకుడు విజయం సాధించాలంటే నిర్మలమైన మనసుతో ఆ పరమాత్మ సృష్టించిన ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రేమించాలి.

ఆ పరమాత్మ సృష్టించిన అన్ని ప్రాణుల్నీ ప్రేమించాలి. అదంత సులభం కాదంటారు చాలామంది. ఆ పరమాత్మను ప్రేమించినవాళ్లు ఆ బ్రహ్మండనాయకుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని ఎందుకు ప్రేమించరు? ప్రేమించాలి.

అసలైన ప్రేమంటే ఇదే! పరమాత్మ అనుగ్రహం సంపాదించాలంటే ఈ లోకంలో అందర్నీ సమదృష్టితో చూడాలి. ఈ లోకం అందమైనది కాదు. నిజమే.

ఇక్కడ అనాథలుంటారు. అంగవైకల్యంతో బాధపడేవాళ్లుంటారు. గూడు, గుడ్డ లేని పేదవాళ్లుంటారు. అల్పులు, అధములు ఉంటారు.

పరమాత్మ సృష్టించిన అద్భుతమైన జలపాతాల్ని, నదుల్ని, కొండల్ని, లోయల్ని ప్రేమించిన సాధకుడు విధివంచితుల్ని ఎందుకు ప్రేమించలేడు? పరమాత్మ పెట్టిన ప్రేమపరీక్షలో నెగ్గాలంటే సాధకుడు ఎలాంటి భేదభావమూ లేకుండా అందర్నీ ప్రేమించాలి.

పరోపకారంతో అందరి పట్లా దయకలిగి ఉండాలి.

చాలామంది పుణ్యంకోసం నదుల్లో మునుగుతూ తీర్థయాత్రలు చేస్తుంటారు. చుట్టుపక్కలవాళ్లను మాత్రం ద్వేషిస్తుంటారు. దీనివల్ల ఆ పరమాత్మ అనుగ్రహం లభించదు. మనకు కావలసిన ప్రేమను ఒకరికి పంచితేనే... తిరిగి దాన్ని పొందగలుగుతాం. ఇది సత్యం.

ఇతరులు ఏది చేస్తే మన మనసు నొచ్చుకుంటుందో... ఆ పనులు మనం ఇతరులకు చెయ్యకుండా ఉండటమే ఉత్తమ ధర్మమని మహాభారతం చెబుతోంది. అందుకే ప్రతీ ప్రాణిపట్ల దయకలిగి... సహాయం, సహకారం అందించాలి. ఎదుటి వ్యక్తి దుఃఖాన్ని పోగొట్టాలి.

చేతులు కలిస్తేనే ఎంత కష్టమైన పనైనా సాధ్యమవుతుంది. సహాయంవల్ల మనిషి ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తాడు. అంటే... ప్రతీ ఒక్కరిలో ప్రేమ వెల్లివిరియాలి.

పూర్ణమానవుడిగా మారాలనుకున్న సాధకుడు స్వచ్ఛమైన ప్రేమతో ఈ విశ్వాన్ని ప్రేమించాలి. అదే జీవన ధర్మం. అదే జీవన న్యాయం. అలా మారిన సాధకుణ్ని లోకమంతా ప్రేమిస్తుంది. అతణ్ని పరమాత్మలా కొలుస్తుంది. అప్పుడు సాధకుడు ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాడు. విజేతగా నిలిచిపోతాడు!

- విశ్వనాథ రమ

ᐅ శోభాయాత్ర

ᐅ శోభాయాత్ర

జీవితం ఓ శోభాయాత్ర. ప్రపంచంతో, ప్రకృతితో కలిసి భగవంతుడివైపు సాగే పవిత్ర యాత్ర. పునిస్త్రీలు పూజా సంభారాల తట్టలతో, బుట్టలతో వెంటరాగా మానసికంగా మంత్రజపం చేసుకుంటూ పైకి భగవంతునికి జయజయధ్వానాలు పలుకుతూ శుభ్రవస్త్రాలతో, శుభ సంస్కారాలతో భక్తజనం సాగే వూరేగింపు శోభాయాత్ర. ఔను. మన జీవితం కూడా ఓ శోభాయాత్ర. నిరంతర శోభాయాత్ర. సద్గుణాల సుమాలతో, సద్భావనల సంభారాలతో, సంతోషమానసంతో ఆ సాకేత రాముని సన్నిధి చేరేందుకు చేసే శుభయాత్ర. మనం భగవత్‌ కృపకై అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తుంటాం. మనం మనకు తెలీకుండానే ఆయనపై జీవిత కాల యాత్ర చేస్తూనే ఉంటాం. జీవించటమనే యాత్ర చేస్తున్నాం తెలుసా... దేహమనే ఆసనం మీద శ్వాస అనే నిరంతర అజపాజపం చేస్తూ జీవాత్మ పరమాత్మలో లయమయ్యేందుకు చేసే ఈ సజీవ యాత్రాసాధన సౌభాగ్య వశాన మనిషికి లభించిన ఉత్కృష్టవరం. అయితే మనం దాని ఔన్నత్యాన్ని, దుర్లభమైనది లభించిన అదృష్టాన్ని... గుర్తిస్తున్నామా? జీవితమనే దివ్య శోభాయాత్రను శుష్కయాత్రగా భావిస్తున్నాం. క్షుద్రయాత్రగా జీవిస్తున్నాం. ఎవరికైనా జీవితం ఒకటే. కాకపోతే వారివారి అభిరుచీ, సంస్కారాల మీద వారి జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఆ విధానమే మన జీవన ఫలాన్ని, సాఫల్యాన్ని నిర్ణయిస్తుంది. శివలింగాన్ని రాతిగుండుగా భావించేవారికి అది పచ్చడి బండగా మాత్రమే ఉపయోగపడుతుంది. అదే, దైవంగా స్వీకరించేవారికి జీవన సాఫల్య సాధనగా ఆశీర్వదిస్తుంది. జీవితమూ అంతే. దాని ఉద్దేశాన్ని, అపురూపతను గ్రహించి శోభాయమానం చేసుకోగలిగినవారికి అది ఓ శోభాయాత్ర. భౌతిక సుఖయానంగా భావించేవారికి, భ్రమించేవారికి జీవితం బతుకుబండి లాగే ఎద్దుగా... ఓ భారయాత్ర.
ప్రాతః కాలంలో ఆస్తికులందరూ కలిసి చేసే నగర సంకీర్తనలా ఆహ్లాదకరంగా, ఆనందమయంగా సాగవలసినది మన జీవిత యాత్ర. గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలా కావలసివున్నది. అది దాని లక్షణం. ఉద్దేశం. కానీ మన అవిద్యతో, అజ్ఞానంతో ఆ సుందర యాత్రను చిందరవందర యాత్రగా మలచుకుంటున్నాం. మనం వూహించుకుందాం... ఈ చిందరవందర గందరగోళ యాత్ర మళ్ళీ దారిలో పడితే? వడగాడ్పులు తగ్గి మలయ సమీరాలు వీస్తే? ప్రాతః సంధ్య పారిజాతాలు రాల్చే వేళ సంకీర్తనలు చేస్తూ సాగే భక్తి సమూహంలా జీవితం తోటి సాధకులతో, సాటి భక్తులతో, భాగవతోత్తములతో, ప్రకృతితో, పంచభూత ప్రకృతితో, భూతప్రీతితో ఓ శోభాయాత్రలా నవ్వుల పువ్వులతో, ప్రేమపత్రితో పరమాత్మ సాన్నిధ్యానికై ఓ జీవితయాత్ర, ఓ శోభాయాత్ర చేస్తే...?

- చక్కిలం విజయలక్ష్మి

ᐅ పుణ్యాల పండుగ

ᐅ పుణ్యాల పండుగ

పుణ్యపర్వం సంక్రాంతి. ఏ కర్మలవలన మనం పవిత్రులమవుతామో వాటిని పుణ్యాలు అంటారు. అలాంటి సత్కర్మలకు సత్కాలం లభించడం యోగం. వర్షరుతువులో వ్యవసాయం వలె- పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు యోగ్యమై విశేష ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.
సూర్యశక్తిలోని దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, దాన్ని పొందే పద్ధతులను ధార్మిక గ్రంథాల ద్వారా అందించారు. సౌరకాంతి పరివర్తనాన్ని ఆధారం చేసుకున్న పర్వం సంక్రాంతి. ఏ మాసమైనా సంక్రమణం దివ్యపర్వమే. అయినా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమైన మకర సంక్రమణానికి విశిష్ట ప్రాధాన్యముందని శాస్త్రోక్తి. స్నాన దాన జపతపాది పుణ్యకర్మలు ఈ పర్వకాలంలో పుష్టినిస్తాయని, సత్సంకల్పాలు అవశ్యం ఫలిస్తాయని ఆర్షగ్రంథాల మాట.

దేవతలను, పితృదేవతలను పూజలతో, తర్పణలతో తృప్తిపరచి వారి అనుగ్రహం వల్ల కుటుంబసౌఖ్యాన్ని, సర్వసంపత్సమృద్ధిని పొందడానికి ఈ పర్వం మహోపయోగమని ధర్మశాస్త్రకర్తల వచనం. ఈ సంక్రాంతిని 'తిల సంక్రాంతి' అనీ వ్యవహరిస్తారు. సంక్రాంతికున్న వివిధ విశిష్టాంశాల్లో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అంశాన్ని పాటిస్తుంది.

దేవతలకు (ప్రత్యేకంగా శివుడికి) నువ్వులనూనె దీపాన్ని అర్పించడం, నువ్వులతో వండిన వంటకాలను నివేదించి, ఆ ప్రసాదాలను ఆరగించడం శ్రేష్ఠమని అనుష్ఠాన ప్రధాన గ్రంథాలు చెబుతున్న విశేషం. తిలలను, బెల్లపు పదార్థాలను కలిపి ఒకొరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కొన్ని ప్రాంతాల ఆచారం. కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యభగవానుడికి నివేదించడం వేదాల యజ్ఞాల్లోని అంశం. ఆ వేదసంస్కృతి సామాన్యుల్లోనూ వ్యాప్తమై 'పొంగల్‌' పేరుతో జరుగుతోంది. దీనికి మూలం- వైదికమైన 'ఆగ్రయణేష్టి'.

మంచి కాలంలో మంచి ఆలోచన, మంచి ఆచరణ- అనే ఒక మంగళకర భావన ఈ పర్వంలో వ్యాపించి ఉంది. సోమవారంనాడు ఈ సంక్రమణం రావడం శుభసూచకమని, సంపత్కరమనీ జ్యోతిష శాస్త్రం చెప్పిన ఫలం.

సూక్ష్మ దివ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలతోపాటు, అన్ని భారతీయ పర్వాల్లాగా ఈ పర్వంలోనూ ప్రకృతితో మానవుడికున్న ఆత్మీయబంధం గోచరిస్తుంది. ప్రాణదాత్రి అయిన సౌరశక్తిలోని పరిణామాల్లో దివ్యత్వాన్ని దర్శించడం గొప్ప సంస్కారం.

ప్రకృతిలో జీవనగతిపై ప్రభావం చూపే పంచభూతాలు, గ్రహాల రీతులను గమనించి; ఒక దానితో ఒకటి అనుబంధమై, ఒకదానిపై ఒకటి స్పందనను ప్రసరిస్తున్న విశ్వరహస్యాలను గ్రహించి- రుషులు కొన్ని పద్ధతులను నిర్దేశించారు.

ప్రకృతి పరిణామాల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక చైతన్యవంతమైన ఆత్మీయతను చాటిచెప్పే పండుగలివి- అని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే స్పష్టపడుతుంది. ప్రతి ఇల్లూ లక్ష్మీకళతో ఉట్టిపడుతూ, బంధుమిత్రులతో కళకళలాడటం సంక్రాంతి శోభ. సామాజికంగా ఉన్న సమైక్యతకు ఈ పర్వం ఒక తార్కాణం. 'దానం' ద్వారా అభ్యుదయం సాధించాలని చాటిన ధర్మశాస్త్రాలు, ఈ పండుగను 'దానపర్వం'గా అభివర్ణించాయి. ఈ సంక్రాంతినాడు సస్యలక్ష్మీ కళను ఆరాధించడం, వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అవశ్యకర్తవ్యంగా భావిస్తారు. ఈ పంటల పండుగనాడు మహాలక్ష్మిని ఆరాధించడం శ్రేష్ఠమని దేవీమహిమా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పౌష్యలక్ష్మి, సంక్రాంతిలక్ష్మి- అని కీర్తించే జగజ్జననిని రంగవల్లులతో, పసుపు కుంకుమలతో, నవధాన్యంతో ఆరాధించడం సంప్రదాయం.

కొన్ని ప్రాంతాల్లో ముత్తయిదువులు పసుపు కుంకాలను పంచుకుంటూ సౌభాగ్యకాంక్షను వ్యక్తపరచడం సంప్రదాయంగా ఉంది. దివ్యత్వ మానవత్వాలతో ప్రకృతి సౌందర్యం పరిమళించడం సంక్రమణ సంపద.

- సామవేదం షణ్ముఖశర్మ

ᐅ భోగిమంట



ᐅ భోగిమంట... భోగాల పంట!

మనిషి ఆలోచనలను గ్రహించడానికి మాట ఎలాగో, ఒక జాతి ఆలోచనలను, ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ! ఏ ప్రాంతంలో అయినా, పండుగలను జరుపుకొనే తీరు పరిశీలిస్తే- ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత ప్రజల అలవాట్లు కట్టుబాట్లు తెలుస్తాయి. కనుకనే పండుగలను జాతి జీవనాడికి కొలమానాలుగా చెబుతారు. వాటిని సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. పండుగలనాటి జనజీవన వ్యవహారశైలిని రూపొందించిన మన పెద్దల దృష్టిలో ప్రాణికోటి అంటే మానవులొక్కరే కాదు- జంతువులు, వృక్షాలతో సహా సృష్టిలోని జీవజాలం మొత్తాన్ని వారు ప్రాణికోటిగా పరిగణించారు. ఆచార వ్యవహారాల్లో వాటికి భాగం పంచారు. పశువులూ పక్షులూ మానవ పరివారంలో భాగమేనన్నది పండుగల ద్వారా మనపెద్దలు అందించిన సందేశం. సంక్రాంతి పండుగ దానికి చక్కని ఉదాహరణ. సంక్రాంతి అనే మాటకు చేరువ కావడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని సంక్రాంతిగా పరిగణిస్తారు. పండుగలనేవి మనుషుల్ని కలపడానికే పుట్టాయి. సంక్రాంతి రోజుల్లో మన విధులను పరిశీలిస్తే ప్రకృతితో లయకలిపి జీవించడమే సంక్రాంతి అనే మాటకు అసలు అర్థంగా తోస్తుంది.
మూడు రోజుల పెద్దపండుగలో మొదటిది భోగి పండుగ. ధనుర్మాసానికి ముగింపు అది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న దానికి సంకేతమే భోగి. పాతసామాన్లు, చీపుళ్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులు లాంటి మానవ దారిద్య్ర చిహ్నాలను మంటల్లో తగలబెట్టడం ఆనాటి ఆచారం. లేమి చీకట్లలోంచి భోగవికాసాల్లోకి దారిచూపే ఆ మంటల్ని భోగిమంటలన్నారు. మర్నాటి నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనిషి ఉత్సాహంగా ఆహ్వానించడానికి అవి చిహ్నాలు. పండిన పంటలు చేతికి అందే ఆనందపు రోజులవి. తెల్లగా వెల్లలు పూసిన గాదెలు నిండు ధాన్యపు రాశులతో కళకళలాడే సమయం అది. వాటిని గరిసెల్లో గాదెల్లో నింపడానికి ముందే గ్రామీణులు తమ ఇళ్లచూరులకు, దేవాలయ ప్రాంగణాల్లోను కొత్త ధాన్యపు కంకుల్ని కుచ్చులుగా కట్టి వేలాడదీస్తారు. చూడటానికి అవి వడ్ల కిరీటాల్లా ఉంటాయి. పిచుకలనూ, పిట్టలనూ అవి ఆహ్వానిస్తాయి. మందలు మందలుగా చేరిన పక్షుల బృందగానాల రొదతో కొత్త సున్నాలు వేసిన రైతుల ఇళ్లు చిలకలు వాలిన చెట్లు అయిపోతాయి. ఇంటికి పండుగ వాతావరణాన్ని ఆపాదించడంలో ఆ సందడి చాలా ముఖ్యమైనది. పిల్లల కేకలు, పక్షుల అరుపులు లేకుండా నిశ్శబ్దంగా ఉసూరుమంటూ ఉండే ఇంటికి పండుగ శోభ రమ్మన్నా రాదు. ఇంటి ముంగిట ముగ్గుల్లోని గుల్లసున్నం ఘాటు, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమల వింత పరిమళాలను కలుపుకొని ఇల్లంతా చక్కగా వ్యాపించిందంటే పెద్దపండుగ వచ్చేసిందని అర్థం.

ఇంతలో తంబురమీటుతూ, 'హరిలో రంగ హరి' వినిపిస్తూ (వైష్ణవం) హరిదాసులు, 'శంభో' అని పెద్దధ్వనితో శంఖం పూరిస్తూ (శైవం) జంగందేవరలు, 'అంబ పల్కు జగదంబ పల్కులను వినిపించే బుడబుక్కల వాళ్లూ, 'అయ్యగారికి దండం అమ్మగారికి దండం' అంటూ గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు శోభ చేకూరుస్తాయి. సంపదల సమృద్ధితో సంతోషంగా ఉన్న గృహస్థులు వారిని సత్కరిస్తారు. భోగినాటి ఆకర్షణల్లో గొబ్బెమ్మల పూజ ప్రధానమైనది. భాగవతంలోని కాత్యాయనీ వ్రతమే దీనికి పునాది. కన్యలు వేకువనే లేచి, వాకిట రంగవల్లులు తీర్చి. ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి, గుమ్మడి పూలతో అలంకరించి, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే దృశ్యం చూస్తే పండుగంటే ఇదేసుమా అనిపిస్తుంది. పట్టు పరికిణీలు, వెండిమువ్వల కేరింతలు... భోగి కళ కన్నుల పండుగ! 'సుబ్బీ సుబ్బమ్మ! శుభములీయవె, తామర పూవంటి తమ్ముణ్నీయవె, చేమంతి పూవంటి చెల్లెలినీయవె' అంటూ కన్నెపిల్లలు గొబ్బెమ్మల రూపంలోని గౌరీదేవిని ఆరాధిస్తారు. ఈ పాటలోని నిజమైన ఆంతర్యం చివరి పంక్తిలో ఉంది. 'మొగలి పువ్వంటి మొగుణ్ని ఈయవే'- అనేదే అసలైన ప్రార్థన. భార్య సంపెంగ పూవులాను, మొగుడు మొగలిపూవులాను ఉండాలనుకోవడంలో చక్కని చమత్కారం ఉంది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు. మొగలిపూవు శివార్చనకు పనికిరాదు. 'నా మనిషి నాకే సొంతం' తరహా గడుసు అంతరార్థం కారణంగా ఈ పాట తరతరాలుగా నిలిచింది. ఇక తల్లిహోదా పొందిన ఇల్లాళ్లకు ఈరోజు చేతినిండా పని. పదిమందినీ పిలిచి పేరంటం చేసి, తమ పిల్లల నెత్తిన రేగుపళ్లు కొబ్బరిముక్కలు పచ్చిశెనగలు నాణాలు కలిపిన భోగిపళ్ల సంబరాలతో హారతులు ఆశీస్సులు ఇప్పిస్తారు. భోగినాడు ఇంద్రుడికి పొంగలి నైవేద్యం ఆనవాయితీ. రాబోయే వేసవితాపాన్ని తగ్గించి, తొలకరినీ, సకాల, సంపూర్ణ వర్షాలతో పంటలను బాగా అనుగ్రహించాలన్న ప్రార్థనలతో 'ఇంద్ర పొంగలి' నివేదిస్తారు. మొత్తంమీద పెద్దాచిన్నా, ఆడామగ, పిల్లామేకా, పక్షీపశువూ, చెట్టుచేమా... మొత్తం మానవ పరివారానికి చెందిన పూర్తిస్థాయి పండుగ ఇది. అందుకే ఇది పెద్దపండుగ!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

ᐅ విలువలు



ᐅ విలువలు

ఆధునిక సమాజంలో 'విలువలు బాగా పడిపోతున్నా'యన్నమాట తరచూ వింటున్నాం. ఈ విలువలకున్న విలువేమిటి, విలువలంటే అసలేమిటి, మానవ జీవితంలో వీటిపాత్ర ఏమిటి, వీటికున్న ప్రాధాన్యమేమిటి? ఇలా ప్రశ్నలు ఉదయించడం సహజం. ఒకజాతి లేదా వర్గం అభ్యున్నతికీ, మహేతిహాసానికీ విలువలు మూలస్తంభాలవంటివి. ఇవి అసలైన జీవన ధర్మసూత్రాలు. మానవుని మనుగడకు అవసరమైన నైతిక సిద్ధాంతాలు. వీటిని మనం మానవీయ విలువలని కూడా అంటాం. ఇవన్నీ మనకు వేదాలు, పురాణేతిహాసాలు, శాస్త్రాలు, ధార్మిక గ్రంథాలు, పూర్వజుల అనుభవసారాలు, నైతిక వేదికలు మున్నగువాటి నుంచి లభ్యమవుతాయి. సజ్జనులు, యోగిపుంగవుల వంటివారి ప్రవచనాలనుంచి వీటిని మనం పొందవచ్చు.
ఒక మంచిమాట, మంచిపాట, మంచి కవిత, మంచి కథ, చిత్రం, పరిచయం, భాషణం, సంఘటన మనలోని మాలిన్యాన్ని, అశాంతిని, ఆవేశాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. మనలో మంచిగుణాలకు, భావాలకు, ఆలోచనలకు ప్రేరణ కలిగిస్తాయి. క్రమక్రమంగా మనలోని చెడును చెరిపివేసి మన అభ్యున్నతికి దోహదపడతాయి. భారతీయాత్మ అయిన ఆధ్యాత్మిక దిశవైపు నడిపిస్తాయి. సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మానవుడికి ప్రసాదిస్తాయి.

మన జీవితంలో అతి ముఖ్యమైన అమూల్యమైన అంశం కాలం. అటువంటి కాలానికున్న విలువను, మహిమను గ్రహించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే కలిగే ఆత్మసంతృప్తే వేరు. అప్పుడు కలిగే ఆనందం అనుభవైకవేద్యం. విలువలు తెలుసుకోవడానికీ సత్యం బాగా ఉపయోగపడుతుంది.

జీవితానికి అర్థం జీవిస్తేనే తెలుసుకోగలం. మరణానికి అర్థం ఆత్మీయులు మరణించినప్పుడు తెలుస్తుంది. విలువ కట్టడానికి వీలులేని ఈ జీవితాన్ని అర్ధాంతరంగా మనకు మనంగా అంతం చేసే హక్కు మనకు లేదు. దాన్ని హక్కుగా మనం లాగేసుకుంటే జాతికీ, లోకానికే కాదు- మనల్ని సృష్టించి, నాలుగు మంచి పనులు చెయ్యమని ఈ నేలమీదికి పంపిన పరమాత్మకు కూడా కృతఘ్నులమనిపించుకుంటాం. ఇంక మన జీవితానికి అర్థమేమిటి, మనకుండే గుర్తింపేమిటి? ఎంతసేపు 'నేను, నా కుటుంబం, నా మనవళ్లు, మనవరాళ్లు, వాళ్ల లక్షల సంపాదన, నా రోగాలకు సరిపడే వైద్యం.....' ఇలాంటి సంకుచితమైన ఆలోచనలతో శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుమిట్టాడుతూ, కూపస్థమండూకంలా అదే స్వర్గతుల్యమనుకుంటూ కాలక్షేపం చేయడమేనా? ఇలా విలువలకు తిలోదకాలిస్తూ లక్ష్యహీనంగా బతికేయడమేనా? అది తెలుసుకునేందుకు కూలంకషంగా స్వాధ్యయనం చేయాలి. స్వావలంబన అలవరచుకోవాలి. సత్సంగం చేయాలి. సాధుత్వం అలవరచుకోవాలి.

పొరపాట్లనేవి ఎంతటి మహనీయులకైనా సహజమే. వాటిని గ్రహించి, అవి పునరావృతం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించడమే 'మనీషి' కాగోరేవాడి లక్షణం. వాల్మీకి మొదట బోయవాడై అడవిలో వేటాడుతూ, మృగాలను చంపుతూ వాటి మాంసాన్ని తన భార్యకు వండమని ఇస్తున్నప్పుడు- 'నీ పాపంలో నేను భాగస్వామిని కాను' అన్న భార్య పలికిన ఒక్కమాటకు, హృదయ పరివర్తన చెందాడు. మనోప్రక్షాళన చేసుకుని, తక్షణం బాణం వదిలి గంటం పట్టి శ్రీమద్రామాయణమనే రసామృత కలశాన్ని లోకానికి ప్రసాదించాడు. అలా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడేందుకు మానవుడు బద్ధకంకణుడైతే, ఈ లోకంలో ప్రతిమనిషికీ ఎదుటిమనిషి పరమాత్మలా దర్శనమిస్తాడు. గోస్వామి తులసీదాసు, భార్య రత్నావళి వ్యామోహంలో పడి, భోగవిలాసాలకు బానిసైనప్పుడు- 'నామీద చూపే ఈ ప్రేమను రాముని మీద చూపిస్తే మీ జీవనమే పావనమైపోదా?' అన్న ఒక్క చురకకు, మనసు మార్చుకుని, రామభక్తుడై, భక్తిజ్ఞాన వైరాగ్య సంపన్నుడై ప్రపంచానికి 'రామచరిత మానస్‌' అనే ధర్మదీపికను అందించాడు. ధర్మాన్ని మించిన కరదీపిక మానవుడికి ఇంతవరకు లభ్యం కాలేదు; మున్ముందు కాబోదు. ధర్మాచరణ వల్లనే మానవుడు ఆత్మజ్ఞానం పొందగలడు. ఆత్మజ్ఞాని కాని పురుషుడెన్నటికీ పరిపూర్ణుడు కాలేడు.

భగవత్కరుణను పొందాలంటే విలువల్ని కాపాడుకోవడమే అర్హత. అనుక్షణం విలువల్ని ఆదరించేవాడే ఆధ్యాత్మిక పరిపక్వతను ఆర్జించగలడు. విలువల కలువల చలువ పందిరినీడలో సేదదీరడం తెలిసిన మానవుడే సార్థక జన్ముడు!

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

ᐅ వీడా పురుషుడు



ᐅ వీడా పురుషుడు!

భగవంతుణ్ని పరమ పురుషుడన్నారు. పురుషోత్తముడన్నారు. శ్రీరాముణ్ని మర్యాదా పురుషోత్తముడన్నారు. 'పురుష' పదానికి అంతరార్థం, ఆధ్యాత్మికార్థం వేరే ఉన్నా- లోకంలో మగవాణ్నీ పురుషుడనే అంటారు. భగవత్‌ సమానంగా పిలిపించుకునే మగవాడు నీచాతినీచంగా మృగాడని అనిపించుకునే అధోస్థాయికి దిగజారాడేమిటి? పెద్దలు మనకు చెప్పేమాట, చేసే సూచన- 'మన వంశానికి కొత్తగా పేరు తేకపోయినా ఫరవాలేదు. పెద్దలు సంపాదించిపెట్టిన మంచిపేరుకు మచ్చతేవద్దు' అని. తండ్రిగా, సోదరుడిగా, భర్తగా, దైవసమానంగా మెలగాల్సిన మగవాడు తాను పెట్టిన గుడ్లను తానే మింగేసే పాములా స్త్రీని, తన తల్లిని, తన సోదరిని, తన బిడ్డను తానే చిదిమేస్తున్నాడు. కబళిస్తున్నాడు. ఆ పరమేశ్వరి కూడా మాతృరూపంలో అంటే స్త్రీ రూపంలో సంస్థితురాలై ఉంది. బాలాత్రిపుర సుందరిగా బాలికై, బిడ్డయి సేవలందుకుంటోంది. ఆ నారాయణుని సోదరిగా కృష్ణ, నారాయణి అని పిలిపించుకుంటూ పూజలందుకుంటోంది.
పుట్టింది మొదలు తల్లిగానో, సోదరిగానో, భార్యగానో, బిడ్డగానో, చివరకు కోడలిగానో ఓ మగువ తోడు, ఆసరా లేనిది మగవాడికి మనుగడే లేదు. కవచ కుండలాల్లా, కొంగుబంగారంలా స్త్రీ మగవాడిని ఏదో రూపంలో రక్షణ కవచంలా కాచుకుంటూనే ఉంది.

పూర్వం రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు గెలిచిన రాజు ఎంత క్రూరుడైనా శత్రురాజుల అంతఃపుర కాంతలకు హాని తలపెట్టకపోవటం అటుంచి సోదరి సమానంగా గౌరవించి పంపేవాడు. భార్యను తప్ప లోకంలోని మిగిలిన స్త్రీలనెల్లా మాతృభావంతో మన్నించే సంస్కృతికి నెలవైన భారతదేశంలో ఇప్పుడీ కీచక పర్వం ఏమిటి? మన సంస్కృతిని ఆరాధిస్తూ ఈ అమృతతుల్య దేశాన్ని వీక్షించి ధన్యులమవుదామని వచ్చే విదేశీ వనితలను సైతం వదలటంలేదంటే, ఈ వూహాతీతమైన ధోరణిని నిలదీసేందుకు, నిరసించేందుకు సైతం వాళ్లకు మాటలు రాక నిశ్చేష్టులైపోతున్నారంటే వాళ్లముందు మనం తలలు ఎక్కడ పెట్టుకోవాలి? తల్లిదండ్రులు, గురువు సమానంగా 'అతిథి దేవోభవ' అనే మహామంత్రాన్ని మనకుపదేశించిన మన వేదాలు 'వేద ప్రమాణం' అనే మాటకు తిలోదకాలు వదులుకోవాల్సిందేనా? ఆచరించేవారు లేనప్పుడు ఆ దేశాల అవసరం మాత్రం ఏముంది?

స్త్రీ పురుషులు అన్నివిధాలా సమానులు. సమాన ప్రతిపత్తి, సమాన శక్తి, సృష్టి చాలనం కోసం శరీర నిర్మాణంలో కొన్ని సర్దుబాట్లు, కొన్ని వెసులుబాట్లు... అంతే. తీగకు వృక్షం పందిరి అవుతుంది. ప్రేమతో ఆదరిస్తుంది. తీగ వృక్షానికి శోభనిస్తుంది. ఆత్మీయ పరిష్వంగాన్నిస్తుంది. ఎంత తీయని అందమైన బంధం! ఆపాటి ఇంగితం లేదా మనుషులకు? మృగాళ్లకు! ఎవరో చేసే దుర్మార్గానికి మగజాతినే నిరసించాల్సి వస్తోంది. అసహ్యించుకోవాల్సి వస్తోంది... తండ్రి అయినా... సోదరుడైనా, బిడ్డ అయినా. ఇదంతా కేవలం స్త్రీల సమస్యే కాదు. పురుషుల సమస్య కూడా. మొత్తం మానవజాతి సమస్య. స్త్రీలు అసహ్యించుకునే జాతిలో తాముండటం వాళ్లకైనా జీర్ణించుకోలేని అంశమే. అవమానకరమే. అభ్యంతరకరమే.

ఈ లోకంలోనే మానవతిగా, అభిమానవతిగా, ఆ గుణాలకు ఉత్కృష్ట సంకేతంగా నిలిచిన స్త్రీ... ఆ అభిమానం ముందు, ఆత్మగౌరవం ముందు ప్రాణాన్ని సైతం తృణప్రాయంగా తోసిరాజంటుంది. ఆడపడుచంటే మన ఇంటి ఆడపిల్ల ఒక్కతేనా? ఏ ఆడపిల్లయినా ఒక ఇంటి ఆడపడుచు కాదా? మన దేశం కూడా స్త్రీకి సంకేతంగా 'మాతృభూమి'గా మన్ననలందుకుంటోంది. మనం నివసించే, మనను భరించే భూమిని కూడా భూమాత అంటున్నాం. ముక్కోటి దేవతలకు నిలయమైన ఆవును 'గోమాత' అంటున్నాం. ఏ రకంగా అయినా సరే... మన అత్యున్నత గౌరవాన్ని అందుకునే స్థానంలో తప్పనిసరిగా స్త్రీ మూర్తి ఉంటోంది. అలాంటి దేవీమూర్తినా ఇలా ఘోరంగా అవమానించడం?!

ఈ లోకంలోనే పవిత్రతకు, ప్రేమకు, సేవకు తిరుగులేని ప్రతీక స్త్రీ. దురదృష్టవశాత్తు ఆ పవిత్ర పరిమళానికి కోమల దళాలు, సౌకుమార్యం, సున్నితత్వం, స్నిగ్ధత్వం ఉన్నాయి. వాటిని ఆసరాగా చిదిమేస్తున్న అసురుడు మృగాడు. జీవితాన్నే పరిమళింపజేసే స్త్రీని కాలరాస్తున్న కాలయముడు.

నిప్పుకు చెద పట్టదు. కానీ, విచిత్రం... మన సంస్కృతిని జాడ్యం పట్టింది. సంస్కృతి మనను రక్షించే తల్లి. మనం రక్షించుకోవలసిన బిడ్డ కూడా. మన బిడ్డకు జబ్బు చేస్తే- తల్లీ తండ్రీ ఇరువురూ ఒక ఆందోళనై, ఒక ఆత్మీయతై, ఒక ఆత్మ అయి, బిడ్డను కాపాడుకుంటాం. ఒక తల్లికి అనారోగ్యం చేస్తే ఆమె బిడ్డలు ఆడ, మగ తేడా లేకుండా ఆదుర్దా పడతాం. మరి మన సంస్కృతిని అందరూ ఒక్కటై, తల్లీతండ్రీ అయి, బిడ్డలను కూడా రక్షించుకోవలసిన అవసరం ఉంది. భారతీయ సంస్కృతిని తన భుజాల మీద మోసే కంకణబద్ధురాలు స్త్రీ. ఆమెనే కూలదోస్తే ఇక సంస్కృతికి దిక్కెవరు?

- చక్కిలం విజయలక్ష్మి

ᐅ ధీరులదే విజయధ్వజం



ᐅ ధీరులదే విజయధ్వజం

అగ్నిని తలకిందులుగా పెట్టినా, దాని జ్వాల వూర్ధ్వంగానే ప్రసరిస్తుంది గాని, అధోముఖంగా కాదు. మహాపురుషులు తమకు ఎంత కష్టం కలిగినా ధీరత్వాన్ని వీడరు.
ధీరుడంటే ఎవరు?
కష్టాలు కలిగినవని అధిక దుఃఖాన్నిగాని, సుఖాలు చూరగొన్నామని అధిక సంతోషాన్ని గాని పొందనివాడే ధీరుడు. నీతివేత్తలు నిందించినా, భూషించినా, సంపదలు వచ్చినా, పోయినా, మరణం సంభవించినా, సంభవించకపోయినా ధీరులైనవారు న్యాయమార్గాన్ని వీడరు. కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు. ధీరుడు భూశయ్యను, మెత్తని పరుపును- సమానభావంతో చూస్తాడు. ఒక తావున బొంతగుడ్డను కట్టుకుంటాడు. ఇంకోచోట పీతాంబరాన్ని ధరిస్తాడు. తాను తలచింది సాధించి, విజయశిఖరాన్ని అధిరోహించే వరకు ఎన్ని విఘ్నాలు కలిగినా లెక్కచేయక ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అమృతంకోసం పాలసముద్రాన్ని మధిస్తున్న దేవతలు రత్నం లభించిందని సంతోషించలేదు. కాలకూటానికి భయపడనూ లేదు. అమృతం లభించేవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవాంతరాలకు అధైర్యం చెందలేదు. వృక్షాన్ని ఛేదించినా మళ్ళా చిగురు పుడుతుంది. క్షీణించిన చంద్రుడు మరలా అభివృద్ధి చెందుతాడు. ధీరులు కార్యసాధనలో కలిగే కష్టాలను గాంచి, వెనకంజ వేయక ముందుకే సాగిపోతారు.

కథానాయకులు చతుర్విధాలని లాక్షణికుల ఉవాచ. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరశాంతుడు, ధీరలలితుడు అనే నాలుగు విధాల్లోనూ 'ధీర' సమానంగా కనబడుతున్నది. దీన్నిబట్టి ఉత్తములకు ధీరత్వం ముఖ్య లక్షణమని తెలుస్తున్నది. శ్రీరాముడు ధీరోదాత్తుడు, ఆదర్శపురుషుడు. ఆదర్శ పురుషులందరూ జీవితంలో కష్టాలు నష్టాలు చవిచూసినవారే. అయినా ధీరగుణం వారిని ఆదర్శమార్గంలోనే నడిపింది.

విపత్తు అనే సముద్రాన్ని దాటే ఓడగా, రణమహీస్థలికి శ్రీరామరక్షగా, సకల సుగుణ ప్రధానంగా ధైర్యగుణాన్ని విజ్ఞులు ప్రశంసిస్తారు. కాషాయాంబరాలు ధరించి, సనాతన ధర్మకాంతులను విశ్వమంతా విస్తరింపజేసిన స్వామి వివేకానందుడు ధీరుల్లో అగ్రగణ్యుడు. ఆయన విశ్వమత మహాసభలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళినప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. పరిచయ పత్రం పోయింది. ప్రపంచంలో అత్యున్నత సంపన్న దేశంలో, ఒక పేదదేశ సంస్కృతికి ప్రతినిధిగా వెళ్ళిన నిర్ధనుడు! ధూళిధూసరితమైన వస్త్రాలు ధరించిన సన్యాసి! వేదికపై వివేకానందుడు ధీరుడై నిలిచాడు. అనర్గళ ప్రసంగంతో సర్వధర్మాలవారిని సమ్మోహితులను గావించాడు. విజయధ్వజాన్ని ఎగురవేసి, భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటాడు. ధీరుడికి అపజయం లేదని నిరూపించాడు!

- పి.భారతి

ᐅ పలాయన మంత్రం తగనిది



ᐅ పలాయన మంత్రం తగనిది!

ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కర్తవ్య వైముఖ్యం తగనిది. సమస్యల నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. పారిపోతున్న కొద్దీ సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎప్పటికైనా వాటిని ఎదుర్కోవాల్సిందే. మానవులందరిలోనూ యోగబలం ఉంటుంది. సమస్యలను అధిగమించడానికి సాధనతో యోగబలాన్ని ప్రకటితం చేసుకోవాలి. ఎంతటి కష్టాన్నైనా భరించగల బలమే యోగబలం. సమస్యలు ఆవహించినప్పుడు కొందరు భగవన్నామ స్మరణ చేస్తారు. తీర్థయాత్రలు చేస్తామని ముడుపులు కడుతుంటారు. మంత్రాలు చదువుతారు. ఇవన్నీ సమస్య నుంచి చేసే పలాయన మంత్రాలే!
మనిషికి దైవం ప్రజ్ఞను ప్రసాదించాడు. శరీరంలో శక్తినిచ్చాడు. ఆలోచనా పటిమనిచ్చాడు. కష్టాలు సంభవించినప్పుడు దైవం మనకు కల్పించిన యోగాలన్నింటినీ ఉపయోగించుకోవాలి. ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చు.

రావణుడితో యుద్ధానికి సంసిద్ధం కాగానే శ్రీరాముడికి వానరసేనతో సహా సముద్రాన్ని దాటాల్సిన సమస్య ఎదురైంది. వంద యోజనాల సముద్రాన్ని దాటడం కష్టమే. తాను అంగీకరిస్తే హనుమంతుడు సీతను లంకనుంచి తీసుకురాగలడు. సమస్యకు అది పరిష్కారం కాదు. అవతార పురుషుడైన శ్రీరామచంద్రుడికి సముద్రుడు వరసకు మామ! కనుక తొలుత మామను ప్రాధేయపడ్డాడు. దారి కల్పించాల్సిందిగా వేడుకొన్నాడు. సమాధానం రాకపోవడంతో ఆహారం మాని దర్భశయనం చేసి మామపై అలుక ప్రదర్శించాడు. అయినా సముద్రుడు మారుపలకలేదు. సీత లంకలోనే రావణుని చెరలో ఉంది కనుక తన సేనతో అక్కడికి వెళ్లక తప్పదు. క్రోధాన్ని ప్రదర్శించి సముద్రంలో నీటిబొట్టు లేకుండా చేస్తానని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దెబ్బకు దేవతలైనా దిగివస్తారన్నట్లు సముద్రుడు భయంతో చేతులు జోడిస్తూ సాక్షాత్కరించాడు. తన ఉపరితలంపై ఎంతటి బరువైన వస్తువైనా తేలియాడే వరం ఇచ్చాడు. రామసేనలోని నీలుడి ప్రతిభతో వారధి నిర్మింతమైంది. రావణ సంహారం జరిగింది. శ్రీరాముడు అలా యోగబలంతో సమస్యను పరిష్కరించుకొన్నాడు. మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడు సైతం సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఈ ప్రపంచంలో సుఖాలన్నీ మరెన్నో కష్టాలను వెంట తెచ్చుకొనే వస్తుంటాయి. వాటన్నింటినీ పరిష్కరించుకొంటూ ముందుకు సాగకతప్పదు.

సమస్యలు ఆవహించినప్పుడు కొందరు భీరత్వం ప్రదర్శిస్తుంటారు. పిరికితనంవల్ల శరీరం బలహీనమవుతుంది. ఎవరైనా బలహీనతలతో బాధపడుతున్నప్పుడు వారికి ధీరవచనాలు బోధించాలి. ధీరత్వంవల్ల శక్తి పుంజుకొంటుంది. ఒక చిన్న ధైర్యవాక్యమైనా ఎదుటివారిని ఉత్తేజితులను చేస్తుంది. మన లక్ష్యమనే శిల్పానికి మనమే శిల్పులం. ఇలా శిల్పిగా మారే అవకాశం మానవేతర జీవులకు లేదు. ఎందుకంటే జంతువును ప్రకృతి నిర్దేశిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు ప్రకృతిని సైతం మనిషి నిర్దేశిస్తాడు. మనిషిలో రెండు ప్రకృతులు ఉన్నాయి. ఒకటి బాహ్య ప్రవృత్తి. ఈ ప్రవృత్తి బలహీనంగా ఉంటుంది. బాహ్య ప్రకృతిని నమ్మి సమస్యలను పరిష్కరించాలనుకొంటే సాధ్యపడకపోవచ్చు. బాహ్య ప్రకృతిలో భయాలు, పిరికితనాలు, శంకలు, అపనమ్మకాలు ఉంటాయి. ఇవన్నీ సమస్యలకు దూరంగా పారిపోయేలా చేస్తాయి. బుద్ధిగా పేర్కొనే ఆంతరంగిక ప్రకృతి మనిషిలోని మరో ప్రవృత్తి. బుద్ధిని వినియోగిస్తే ఎలాంటి సమస్యనైనా తేలికగా పరిష్కరించుకోవచ్చు. బాహ్య అంతర్గత ప్రవృత్తుల కలయికే మనిషి.

మనిషికి కష్టాలు, నష్టాలు, మానసిక శారీరక బాధలు సంభవించినప్పుడు దైవం మనకు ప్రసాదించిన అనంత తత్వజ్ఞానం ఆవిష్కరింపజేసుకోవాలి. తొలుత మేఘాలతో కప్పబడి ఉన్న సూర్యుడు మబ్బులు తొలగిన తరవాత ఎలా భాసిస్తాడో, అనంత తత్వజ్ఞానంవల్ల కష్టాలు సమస్యలు తొలగి వెలుగులు పరిష్కారమార్గాలు కనపడతాయి. మనిషి భయం వీడి జీవించడం అలవరచుకోవాలి. అప్పుడే సంపూర్ణత్వం సాధ్యమవుతుంది. సంపూర్ణత్వమే మానవుడి పరిణామ ఉచ్చదశ. భగవత్సాయుజ్యమే మానవ లక్ష్యం.

- అప్పరుసు రమాకాంతరావు

ᐅ ఉత్సాహం



ᐅ ఉత్సాహం

ఎనభయ్యేళ్ల వృద్ధుడు తెల్లవారుజామునే లేచి, చకచకా నడుచుకుంటూ వెళుతున్నాడు. దారిలో కనబడినవారినందర్నీ సరదాగా పలకరిస్తున్నాడు. అతడి ముఖంలో ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంది. అతడితో మాట్లాడినవారందరిలోనూ లోగడలేని ఉత్సాహం పుట్టుకువస్తోంది. ఒక పదహారేళ్ల కుర్రాడు ఉసూరుమంటూ విద్యాలయానికి బయలుదేరాడు. అయిష్టంగా నడుస్తున్నాడు. 'ఇంత పొద్దున్నే తరగతులు పెట్టకపోతే ఏం పోయింది ఆ పంతులయ్యకి... మా ప్రాణాలు తీయడానికి కాకపోతే...' అని గొణుక్కుంటూ కాళ్లీడుస్తున్నాడు. ఇంతలో వృద్ధుడికి కుర్రాడు తారసపడ్డాడు. 'ఏరా మనవడా! నాతోబాటు నడవగలవంట్రా?' అన్నాడు వృద్ధుడు బోసినోటితో ముసిముసి నవ్వులు రువ్వుతూ! యువకుడు తప్పనిసరై వేగంపెంచి నడవసాగాడు. సమాజంలో ఇటువంటి దృశ్యాలు సామాన్యం. పిల్లలు పెద్దవాళ్లను అనుకరిస్తారు, అనుసరిస్తారు. యువకులకు పోటీతత్వం ఉంటుంది. వాళ్లను ప్రోత్సహించాలేగాని ఎక్కడాలేని ఉత్సాహాన్ని ప్రదర్శించగలరు. ఆ ఉత్సాహమే వారిని ముందుకు నడిపిస్తుంది.
మానవుడికి జీవన గమనంలో ఎన్నో కష్టానష్టాలు ఎదురవుతాయి. వాటినన్నింటినీ గుర్తుచేసుకుంటూ ఉంటే మిగిలేవి కన్నీళ్లే, నిరాశా నిస్పృహలే. వీటితో ఏ పనీ సక్రమంగా చేయలేని దురవస్థ, దుర్భరస్థితి. దీంట్లోనుంచి బయటపడే ఉపాయం ఏది?

రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని వెళ్లిన తరవాత శ్రీరాముడంతటి మహాపురుషుడూ మానసికంగా కుంగిపోయాడు. ఆ సందర్భంలో లక్ష్మణుడు అన్నయ్యను ఓదారుస్తూ చెప్పిన మాటలు అందరూ నడవదగిన బాటలు.

'అన్నా! అన్నింటికంటే ఉత్సాహం మిక్కిలి బలమైంది. దాన్నిమించిన శక్తి దేనికీ లేదు. ఉత్సాహవంతుడు ఈ లోకంలో దేన్నయినా సాధించగలడు!' అని లక్ష్మణుడు శ్రీరాముడి హృదయాన్ని తిరిగి ఉత్సాహంతో నింపుతాడు. శ్రీరాముడు కార్మోన్ముఖుడై సీతాన్వేషణకు పూనుకొంటాడు. కొన్ని పరిస్థితుల్లో ఏ పనీ చేయబుద్ధి పుట్టదు. ఇలా డీలా పడిపోయి, దిగులుతో కూలబడే పరిస్థితి వస్తూ ఉంటుంది. 'ఎందుకు ఈ బతుకు?' అని భావించుకుంటూ, ఒక నిరుత్సాహ సముద్రంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అర్జునుడంతటి మహావీరుడికే కురుక్షేత్రంలో ఈ భావన కలిగింది. అస్త్రశస్త్రాలు వదిలేసి నిస్పృహకు లోనయ్యాడు. శ్రీకృష్ణుడు అర్జునుణ్ని 'నీకు ఈ అకర్మణత్వం ఎందుకు వచ్చింది?' అని ప్రశ్నించాడు. 'గీత' బోధించాడు. భగవద్గీత విన్న తరవాత అర్జునుడిలో ఉత్సాహం పొటమరిచింది. విల్లు అందుకున్నాడు. ఇలా శ్రీకృష్ణుడు గీతామృతాన్ని ప్రసాదించి, మానవాళికి దైన్యాన్ని దూరంచేసి, ఉత్సాహంగా జీవన సమరంలో పాల్గొనే మానసిక స్థితిని అనుగ్రహించాడు.

'నిరుత్సాహం అప్రతిష్ఠాకరం... స్వర్గప్రాప్తికి ప్రతిబంధకం... లోకంలో దీనత్వం, విషాదం అనేవాటికి స్థానంలేదు... మన దేహాన్ని, మనసును దుర్భలం చేసే ఆలోచనే పాపం అంటే! ఈ బలహీనతను వదిలిపెట్టాలి... దిగులుపడటం తగనిపని' అని కృష్ణుడు బోధించాడు.

మన పాదాలపై మనం నిలబడాలి. స్వతంత్రంగా ప్రవర్తించాలి. ప్రకృతి బంధాలను తెంచుకోవాలి. ఉపనిషత్తులు దుర్బలత్వం తగదని పలు విధాలుగా హెచ్చరిస్తున్నాయి. బలంగా, దృఢంగా నిలబడమని ప్రబోధిస్తున్నాయి. అభీః (భయంలేకుండా) అనే మాట ఎన్నోసార్లు ఉపనిషత్తుల్లో వినబడుతుంది. ఏ మంచిపని చేయడానికైనా మొదట ఉండాల్సింది ఉత్సాహగుణం. ఆయుధం పట్టి తెల్లవాడిని వెళ్లగొట్టాలని ప్రయత్నించిన అల్లూరి సీతారామరాజుకు ఎంత ఉత్సాహం ఉందో, అహింసాయుత పోరాటం గావించిన గాంధీజీకీ అంతే ఉత్సాహం ఉంది. ధీరులైనవారి ఉత్సాహం రుజుమార్గంలో పయనింపజేస్తుంది. పారతంత్య్రంలో ఆత్మవిశ్వాసం పోగొట్టుకున్న భారతజాతికి వివేకానందస్వామి నూతనోత్సాహాన్ని కలిగించి, కర్తవ్యోన్ముఖుల్ని గావించాడు.

'ఓ వీరపుత్రా! నేను భారతీయున్ని అని గర్వించు. భారతీయుడు నా సోదరుడు. నా ప్రాణానికి ప్రాణం... భారత సమాజం నా బాల్యడోలిక, యౌవనంలో నందన వనం, వార్ధక్యంలో వారణాసి అని సగర్వంగా ప్రకటించు' అని పిలుపిచ్చాడు. వివేకానందుని పలుకులు జాతీయోద్యమానికి వూపిరిపోశాయి. దేశంలో నూతనోత్సాహం వెల్లివిరిసింది.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు

ᐅపరిపూర్ణుడు



ᐅపరిపూర్ణుడు

రాజ్యంలో సుఖశాంతులు నెలకొనాలంటే, ఆ రాజు ప్రజల్లో నాటుకున్న భయాన్ని పోగొట్టాలి. రాజుకు శత్రుభయం పోతే, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు సుఖంగా జీవనం సాగిస్తారు. జీవుడనే రాజుకు శరీరం ఒక రాజ్యంలాంటిది. రాజుకు ఉన్నట్టే జీవుడికి బయట, లోపల శత్రువులు ఉండటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది? ఆ శత్రువుల ఆట కట్టించేదాకా రాజులిద్దరూ మెలకువగా ఉండాలి. శత్రువుల గుండెల్లో నిద్రపోవాలి. కనిపించే శత్రువును గుర్తించి తగిన చర్య తీసుకోవటం అంత కష్టమైన పని కాదు. కాని, చడీచప్పుడూ చేయకుండా ఎప్పటికప్పుడు మెరుపు దాడిచేసే శత్రువును పట్టుకోవటం కష్టం. పట్టుకోగలిగినా మట్టుపెట్టడం మరింత క్లిష్టమైన పని. ఎందువల్ల కష్టతరం అంటే, ఈ కనిపించని శత్రువు స్నేహం నటిస్తూ, వెనక గోతులు తవ్వుతాడు. గోతిలో పడదోసేదాకా ప్రేమ నటిస్తూనే ఉంటాడు. ఇలాంటి ప్రియమైన శత్రువును లొంగదీసుకోవాలంటే రాజుకైనా, నవద్వారపురంలో తిష్ఠ వేసుకొన్న జీవుడనే రారాజుకైనా ఓర్పు, నేర్పు అవసరం. ఆ గూఢ శత్రువును పూర్తిగా అదుపు చేయకపోతే సుఖశాంతులకు కడు దూరంగా ఉండిపోవలసిందే! శాంతిభద్రతలు కరవైతే రాజు గాని ప్రజలు గాని ఎలా సుఖంగా ఉండగలరు? జీవుడి విషయంలో ఇది అక్షర సత్యమే.
కోరికలన్నింటికి పుట్టినిల్లు మనసు. మనసున్నంత కాలం మనిషికి కోరికలు, జన్మలు తప్పవు. తీరని కోరికలు తీర్చుకోవటానికి వచ్చి, ఈ జన్మలో మరిన్ని కోరికలు మూట కట్టుకుంటున్నాడు మానవుడు. సాలెపురుగులా తాను కోరికల వలలో చిక్కుకుని చావు పుట్టుకల వలయం నుంచి బయటికి రాలేక సతమతమవుతున్నాడు. ఈ విషవలయం ఛేదించి బయటపడే మార్గం ఏమిటి? మార్గనిర్దేశం చేయగల జీవనసూత్రం మనిషికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. తెలివైన రాజు మొట్టమొదట శత్రుస్థావరాలు కనిపెట్టినట్టుగా ముందుగా శత్రుస్థానాలను కనుక్కుని నియంత్రించగలిగితే ఆ తరవాత శత్రువును లొంగదీయటం సులభం. శరీరం, ఇంద్రియాలు, మనసు అనే స్థావరాలను ఆవరించుకున్న ఆ కనిపించని కామ శత్రువును లొంగదీయటానికి తగిన ప్రక్రియ- నియతి. నియతి అంటే నియమం, ఇంద్రియ నిగ్రహం.

కోరికను నియంత్రించటానికి శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనసును అదుపాజ్ఞల్లో పెట్టుకోవటానికి, సమాలోచన చేసి సమన్వయించుకునే బుద్ధి మనిషికి ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. అలా చేయలేని పక్షంలో కామ శత్రువు పద్నాలుగు తలలతో రావణాసురుడికన్నా భయంకరంగా రెచ్చిపోగలదు. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు- (మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం) వెరసి పద్నాలుగు తలలు. దశకంఠుడి ప్రాణాలు బొడ్డులో ఉన్నట్టు, మిగతా పదమూడు కరణాలను లొంగదీసే శక్తి బుద్ధికి ఉంది. దీనికి ఆత్మశక్తి తోడైతే మరెలాంటి బలమైన శత్రువుకూ చోటుండదు. శరీరంకంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి బలీయం, సూక్ష్మం, శ్రేష్ఠం. బుద్ధికంటె ఆత్మపరమైనది కాబట్టి ఆత్మాశ్రయ బుద్ధి ద్వారా మనసును వశపరచుకుని దుర్జయుడైన కామశత్రువును జయించాలని స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు.

ఆ విధంగా బాహ్య అంతఃకరణాలను అదుపులోకి తేగలిగితే విషయసుఖాలకు దూరమై మనిషి నిత్యానందాన్ని అన్వేషిస్తాడు. శత్రు విజయం సాధించిన మానవుడు పరిపూర్ణుడవుతాడు. నిత్యానందానుభూతి ఒక్కటే అతడి జీవితంలో పరమ గమ్యమై వెలుగు నింపుతుంది.

- ఉప్పు రాఘవేంద్రరావు

ᐅఅహం బ్రహ్మాస్మి



ᐅఅహం బ్రహ్మాస్మి!

జీవితంలోంచి భగవంతుడు మాయమైతే... ఏమీ లేదు. శూన్యం కూడా కాదు. ఉనికే లేదు. ఆలోచించేందుకిక్కడ ఏమీ మిగలదు. నాస్తికుడు, భగవత్‌ ద్వేషి కూడా ఆస్తికుడికంటే, భక్తుడికంటే అధికంగా భగవంతుని స్మరిస్తాడు. మరి ద్వేషించేందుకైనా ఒక శాల్తీ అంటూ ఉండాలి కదా? ఈ విషయాన్ని మనకు హిరణ్యకశ్యపుడు, కంసుడు లాంటి హరిద్వేషులు తేటతెల్లం చేస్తారు. సంకల్ప సహితంగానో, సంకల్ప రహితంగానో మనిషి సదా సదానందుని స్మరణలోనే, స్మృతిలోనే ఉంటాడు. ఎందుకంటే మనిషి 'నేను'నైనా మరచిపోతాడేమోగానీ నారాయణుని మరచిపోడు. తానంటూ లేనినాడు, నేనంటూ లేనినాడు- మిగిలేది 'ఆయనే'. ఆ స్పృహ కలిగి ఉండటమే- భక్తి, ప్రేమ. అదే, జన్మరాహిత్యానికి మార్గం.
మనం ఒకటి ఆలోచించాలి. సృష్టిలో ఏదీ సంకల్ప రహితంగానో, యథాలాపంగానో, ఉద్దేశరహితంగానో ఉనికి కలిగిలేదు. అంటే, తనకు తాను తెలీకుండా పుట్టిన జీవి... జీవిస్తూ, తన జన్మోద్దేశాన్ని నిర్వర్తిస్తూ ఉందంటే దాని వెనక కర్త అంటూ ఒకరుండాలి కదా? ఆ ఒకరే, ఆ కర్తే... భగవంతుడు. మనను, సమస్త బ్రహ్మాండాలను సృష్టించినవాడు. ఆ క్రీడామయుడి, క్రీడాప్రియుడి క్రీడలో మనం పావులం. పాత్రలం. క్రీడ అంటేనే గెలుపోటములు. అంతకంటే ముందు క్రీడించటం. ఆ చెలగాటాన్ని ఆనందించటం. ఆ క్రీడలో వైవిధ్యం, వైరుధ్యం. దీనికి సహకరించేదే 'మాయ'. మన విషయంలో అయితే అదంతా కలిపి 'జీవితం'. భగవంతుడెంత దయామయుడంటే క్రీడను తానొక్కడే ఆస్వాదించకుండా పావులమైన మనమూ ఆస్వాదించే అవకాశాన్ని కల్పించాడు. కష్టసుఖాలు, చెలగాటాలు, గెలుపోటములు... ఈ జీవితం ఎంత చైతన్యవంతం... ఎంత వైవిధ్యం!

ఆయన సృష్టించిన జీవితం ఇది. ఆయన నిర్ణయించిన ఆట ఇది. ఆయన కేటాయించిన పాత్ర మనది. ఆ స్పృహలోనే ఉంటూ ఆటను ఆనందించాలి. నిర్వహించాలి. ప్రతిక్షణం, ప్రతికోణం, ప్రతి పని, ప్రతి ఫలితం... ఆయనే. ఆయనే. ఈ స్పృహ మనకుండాలి. నిజం... భగవంతుడు లేకుండా జీవితం ఏమీ లేదు. ఏమీ మిగలదు. శూన్యం కూడా ఆయనే. ఈ మాత్రానికి 'నేను' అంటూ అహం ఎందుకు, దేవుడు లేడనే వితండ వాదం ఎందుకు? బాల్యంలో తండ్రి అజమాయిషీలో, పెద్దయ్యాక గురువు, ఆ తరవాత జీవిత భాగస్వామి, చివరగా పిల్లలూ... ఇదీ మానవ జీవిత క్రమం. వీరి అజమాయిషీలోనే మనం జీవిస్తాం. ఆయా సమయాలకు అది అజమాయిషీగా చికాకు, ఇబ్బంది కలిగించినా- పోనుపోను... ఆ అజమాయిషీ వెనక వారికి మనపట్ల ఎంత శ్రద్ధ, భద్రతపట్ల బాధ్యత, ప్రేమ ఉన్నాయో అర్థమవుతుంది. భగవంతుడు సృష్టించిన ఈ బంధుబలగాల అజమాయిషీనే మనం అర్థం చేసుకోగలిగినప్పుడు, అంగీకరించగలిగినప్పుడు- వారిని, మనను, సమస్త విశ్వాసాలనూ సృష్టించిన ఆ భగవంతుని నమ్మేందుకు, ఆయన అజమాయిషీని అంగీకరించేందుకు, కృతజ్ఞులమై, బద్ధులమై, విధేయులమై ఉండేందుకు... ఏమిటి సందేహం, ఏమిటి సంకోచం? ఇంతకంటే అమాయకత్వం మరొకటి ఉందా! ఈ పసి మనస్తత్వం నుంచి బయటపడదాం. ఈ పద భావనను తొలగించుకుందాం. 'మార్జాల కిశోర న్యాయం'లా తల్లి పాత్రలో ఆయన ఉండి మననేం చేయాలో, ఎక్కడుంచాలో, ఎక్కడికి చేర్చాలో ఆయనే చేస్తున్నప్పుడు, ఆయన ప్రమేయం లేకుండా శ్వాసకూడా పీల్చలేని మనం, అర్భకులం కుహనాహంకారంతో ఎగిరిపడటం ఎందుకు? మనకు తెలుసా? మనం ఎవరో కాదు. అమృత పుత్రులం. బ్రహ్మపుత్రులం. అద్దంలో చూసుకునేదాకా మనం అమ్మలా ఉన్నామన్న సంగతి మనకు తెలీదు. ఆత్మలో స్థితులమయ్యేదాకా మనం ఆత్మ అన్న సంగతి మనకు కూడా తెలీదు. ఆత్మ ఎవరో కాదు. పరమాత్మే! పరబ్రహ్మమే!

అహం బ్రహ్మాస్మి!

- చక్కిలం విజయలక్ష్మి

ᐅనేడు వసంతం


ᐅనేడు వసంతం

పూలు పూయనీ మాననీ నేడు మాత్రం వసంతం' అంటాడు ఓ కవి. నిజమే. ప్రతీ మనిషి వసంతం లాంటి వర్తమానాన్ని నమ్ముకొని ముందుకు సాగినప్పుడే విజేత కాగలుగుతాడు.
కాలం, కెరటం ఎవరికోసం ఆగవు. అవిశ్రాంతంగా ముందుకు పరిగెడుతూంటాయి. అలాగే మనిషి కూడా వర్తమానంలో ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా నడిస్తేనే కార్యసాధకుడు కాగలుగుతాడు. అందుకే దేవుడిచ్చిన ప్రతీ క్షణాన్ని, ప్రతీ అవకాశాన్ని మనిషి సద్వినియోగం చేసుకోవాలి.

కాలాన్ని దైవస్వరూపంగా ప్రాచీనులు పేర్కొన్నారు. కాలనిర్ణేత కూడా ఆ భగవంతుడే. కాలానికి అధిదేవత సూర్యభగవానుణ్ని శాస్త్రాలు నారాయణ స్వరూపమని వర్ణించాయి. క్రమం తప్పని సూర్యోదయం ప్రతినిత్యం క్రమశిక్షణతో మెలగాలని మానవాళికి సందేశాన్ని అందిస్తుంది.

మనిషి ఏది పొందాలన్నా కాలం కలిసి రావాలంటారు. అంటే నేటి ఆలోచనలే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అందువల్ల మనిషి నిరంతరం స్వయంకృషితో ముందుకు సాగాలి.

ఒక్కొక్కప్పుడు ఎన్నో ప్రతికూల పరిస్థితులు వర్తమానంలో ఎదురవుతాయి. ఆ పరిస్థితులను ఆపే శక్తి ఎవరికీ లేదు. పురాణపురుషులైనా కాలానికి తలొంచి కర్మఫలాలు అనుభవించినవారే.

కాలప్రభావంవల్ల ధర్మరాజు భార్య, సహోదరులతో కలిసి అరణ్యాల్లో గడిపాడు. నల మహారాజు అష్టకష్టాలు అనుభవించాడు. దైవాంశతో జన్మించిన శ్రీరాముడు తనకెదురైన ప్రతికూల పరిస్థితులన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించి వర్తమానంతో రాజీపడుతూ ముందుకు సాగి నడతలో సాటిలేని నాయకుడుగా పేరుపొందాడు. రావణుని సంహరించి అవతార లక్ష్యాన్ని పూర్తిచేశాడు. పుట్టింది మొదలు ఎన్ని కష్టాలు ఎదురైనా దేనికీ చలించకుండా, ఎవరికీ లొంగకుండా దుష్టశిక్షణతో పురోగమిస్తూ ప్రతీ పనిలోను విజయం సాధించాడు శ్రీకృష్ణుడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా అందరికీ బోధించాడు.

ఈ సందేశాన్ని అర్థంచేసుకున్న మనిషి వర్తమానంలో జరిగే ప్రతీ సంఘటనను స్థితప్రజ్ఞతతో స్వీకరించి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడు.

అందంగా, పచ్చగా కనిపించే ప్రకృతి కూడా కాలగతినిబట్టి నడుచుకోవడం ఎంత విచిత్రం, ఎంత అద్భుతం! గ్రీష్మరుతువు తరవాత తొలకరి ప్రారంభమై వానజల్లులు కురిసి సేద్యానికి అనువుగా పుడమి మారడం, పైరుపంటలు పండటం... ఈ విధంగా ప్రకృతి ప్రాణులకు ఆహారం అందివ్వడం ఎంత గొప్పతనమో కదా. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే, ప్రకృతికి ప్రతీ క్షణం వసంతమే. ప్రతీ రుతువూ ఆనందకరమే.

గతించిపోయినదాన్ని గుర్తుచేసుకుంటూ వర్తమానాన్ని విస్మరించే మనిషికి ఏనాడూ మంచి భవిష్యత్తు ఉండదు. భావిజీవితం గురించి మితిమీరిన ఆశలు పెంచుకోవడమూ ఎవరికీ మంచిది కాదు. స్వయంకృషితో కొనసాగుతూ అంకితభావంతో ముందడుగు వేసే మనిషి ఆశయ సాధనలో విజయం సాధిస్తాడు.

'ఎంత ఆహ్లాదాన్ని కలిగించేదైనా భవిష్యత్తును విశ్వసించవద్దు... గతించిన గతాన్ని గురించి చింతించవద్దు. వర్తమానాన్నే నమ్ముకో, ఈ క్షణం నుంచే... ఇప్పటినుంచీ ధైర్యంతో పనిచేయడం ప్రారంభించు...'- అంటాడు అమెరికన్‌ కవి లాంగ్‌ఫెలో. ఇది సత్యం. వర్తమానంలో జీవిస్తూ శ్రమించేవాడే నిజమైన సాధకుడు. మనిషి చేసే పనిలో జీవం ఉట్టిపడాలంటే అతడు వర్తమానాన్ని నమ్ముకోవాలి. ప్రతీ క్షణంలో మమేకమవుతూ అంకితభావంతో పనిలో నిమగ్నం కావాలి. అప్పుడే మనిషి విజేత కాగలుగుతాడు. కాలం అమూల్యమైనది. తిరిగి రానిది. అందుకే కార్యసాధకులు గమ్యం చేరడానికి స్పష్టమైన కాలనిర్ణయం చేసుకోవాలి. ఆ కాలపరిమితిలోనే లక్ష్యాన్ని సాధించాలి. సంకల్పబలంతోనే మనిషి అంతరిక్షంలోకి దూసుకుపోతున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని వూపిరిగా చేసుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఎన్నెన్నో విజయాలు సాధిస్తున్నాడు.

వర్తమానంలో ఎదురయ్యే ప్రతీ కార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసే మనిషిని ఎలాంటి ఒత్తిళ్లూ దరిచేరవు. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడవుతాడు. అంతర్ముఖుడుగా మారతాడు. అప్పుడతని హృదయం ఓ ప్రశాంత నిలయం. వర్తమానం ఎల్లప్పుడూ అతనికి నిత్యవసంతం.

- విశ్వనాథ రమ

ᐅమౌన క్రతువు


ᐅమౌన క్రతువు

భగవంతుడు కరుణాసముద్రుడు. అనంత కరుణామయుడు కాబట్టే సముద్రంతో పోలుస్తారు. ప్రతి ఒక్కరూ ఆయన కృపకు పాత్రులే. కృపను పొందాలంటే భక్తి ముఖ్యం. మనం ఆయనను ఆరాధించినకొలదీ ఆయన మాధుర్యం పెరుగుతూనే ఉంటుంది. ఆయన దయను అనుభవించిన కొలదీ ఆయన నుంచి ప్రవహించే అమృత ప్రవాహాల్లో మన జీవితాలు పులకించిపోతాయి మరింతగా. సముద్ర మథనం చేస్తే అమృతం లభించింది దేవతలకు. భగవంతుడే ఒక సుధాసాగరం భక్తులకు.
భగవంతుణ్ని ఎలా ఆరాధించాలి? భగవంతుణ్ని సంతృప్తిపరచడానికి మనం ఏ గుణాలు ప్రోది చేసుకోవాలి? ముక్తి అనేది ఒక మౌన శిఖరం. నీరవత. ఏ పనీ చేయకుండా నిశ్శబ్దంలో నిమగ్నం కావడం. ఏమీ చేయకుండా నిష్క్రియత్వం పొందడం తేలిక అనిపిస్తుంది. కాని ప్రయత్నం చేస్తేనేగాని ఆ మౌనవ్రతం ఎంత కష్టమో తెలియదు.

ఒక ఆలయంలో ఓ వ్యక్తి మౌనంగా కూర్చొనేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మిగిలినవారు ఆలయాన్ని శుభ్రం చేసేవారు. పూజారులు పూజాదికాల్లో మునిగేవారు. అతను మాత్రం ఏ పనీ చేసేవాడు కాడు. పూజారులు ప్రసాదం పంచిపెట్టే సమయంలో అతనికి కొంచెం ఎక్కువగానే పెట్టేవారు. పగలంతా పనిచేసేవారికన్నా ఆ వ్యక్తికి ఎక్కువ ప్రసాదం ఎందుకు పెడుతున్నారా అని మిగిలినవారు ఆశ్చర్యపడేవారు. ఏ పనీ చేయకుండా మౌనవ్రతం పాటించడం చాలా కష్టం అని పూజారులు వారికి చెప్పారు. భగవంతుణ్ని ధ్యానం చేయాలంటే మౌనాన్ని పాటించి తీరాలి. మనం ఎప్పుడూ మాట్లాడుతుంటే భగవంతుణ్ని గురించి ఎలా ఆలోచించగలం? ఆలయంలో పూజ చేస్తున్నా, భగవంతునివైపు తిరిగి ప్రణామం చేస్తున్నా మనం మాట్లాడుతూనే ఉంటాం. అటువంటి సంభాషణలు మన దృష్టిని మరల్చివేస్తాయి. మన ఆలోచనలు భగవంతుడి దాకా చేరలేవు.

భగవంతుడు రాశీభూతమైన జ్ఞానం. అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టే కాంతి స్వరూపం. ఆలయదీపాలు, కర్పూరజ్వాలలు అందుకు సాక్ష్యం. ప్రపంచ జ్ఞానం కోసం కాకుండా ఆత్మజ్ఞానం కోసం భగవంతుణ్ని ప్రార్థించాలి. మానవాళి అందరి సంక్షేమం కోసం ప్రార్థించాలి. కాని మనలో చాలామంది తమకోసమే ప్రార్థించి వూరుకొంటారు. ప్రార్థన జీవితంలో భాగం కావాలి. కాదు, జీవితమే కావాలి.

జ్ఞానాన్ని పొందాలంటే మనకు (మనశ్శరీరాలకు) క్రమశిక్షణ అవసరం. ఈ క్రమశిక్షణ, ఏకాగ్రత కోసమే యజ్ఞయాగాది క్రతువులు ఏర్పరచారు మన పెద్దలు. ఆ క్రతువులు ఆరాధన కాదు. హృదయంతో ప్రార్థించడం కానేకాదు. అవి బాహ్య ఉపకరణాలు మాత్రమే. యజ్ఞాలవల్ల లభించే స్వర్గసుఖాలు మన లక్ష్యాలు కాకూడదు. నిజమైన ప్రార్థన దేన్నీ కోరదు.

సత్య సాక్షాత్కారం పొందడానికి జీవితాన్ని ఒక సౌందర్య యజ్ఞంగా మలచుకోవాలి. జీవితమథనంతో భగవంతుని కారుణ్య అమృతం కోసం జీవితాన్నే ఒక మౌన ఆనంద క్రతువుగా మార్చుకోవాలి. జీవితాన్ని దివ్య మానవతాయాగంగా తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే భగవంతుడి కరుణాదృష్టి, కరుణావృష్టి మనపై వర్షిస్తాయి. అప్పుడే మన జీవితాలు నవ వేదాలవుతాయి. మన నిశ్శబ్దాలు విశ్వమంత్ర ధ్వానాలవుతాయి. మౌనం అమృతగానం అవుతుంది. జీవనదీపాలు మహోన్నత భవితవ్యాలవైపు, మహోజ్జ్వల ప్రస్థానాల వైపు హోమాగ్ని శిఖలై ప్రజ్వరిల్లుతాయి.

- కె.యజ్ఞన్న

ᐅ అంతర్నేత్రం


ᐅ అంతర్నేత్రం

అన్ని పనులూ అయిపోయాక, కొన్ని క్షణాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవటం సాధారణంగా మనలో చాలామందికి అలవాటు ఉండదు. చక్కగా కళ్లు మూసుకుని కూర్చోవడం ఒక కళ. ఆ కళను అభ్యసించాలి.
ఈ గందరగోళ జీవితంలో ప్రశాంతంగా కూర్చోవడం సాధ్యపడటంలేదు. నిర్మలమైన ఆకాశాన్ని చూడటం మరిచిపోయాం. నిశ్చలమైన మనసును అనుభూతి చెందటం మనకు తెలియటం లేదు.

కళ్లు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం మనల్ని వదలిపోదు. బాహ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి అంతరంగ ప్రపంచంలోకి ప్రవేశిస్తాం. లోపల ఎన్నో అద్భుతాలు. ఓ చిన్న కనురెప్ప రెండు ప్రపంచాలను వేరుచేస్తూ, కలుపుతూ ఉంటుంది.

కళ్లు మూసుకుని లోపలికి వెళుతున్న కొలది, కళ్లు తెరుచుకుని చూస్తున్నప్పుడు కనిపించేదంతా ఓ కలగా, మాయగా చివరికి శూన్యంగా మారిపోతుంది. అక్కడ గొప్ప ప్రశాంతత ఉంటుంది.

ఒక గురువు కళ్లు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతణ్ని ఓ వ్యక్తి సమీపించి 'మీరు చేస్తున్నది ఏమిటి?' అని అడిగాడు.

'లోపల చూస్తున్నాను' అని ఆ గురువు చెప్పాడు. ఆ వ్యక్తి గందరగోళంలో పడిపోయాడు.

'కళ్లు మూసుకుని చూస్తున్నారా?' ఆశ్చర్యపోతూ అడిగాడు.

'అవును... అదే నిజమైన చూపు'

కళ్లు తెరుచుకున్నప్పుడు అవి అనంతంలోకి చేరుకోగలవు. కాని అవే కళ్లు మూసుకుని లోపలికి చూసినప్పుడు అనంతత్వపు ద్వారాలు తెరుచుకుంటాయి. అక్కడ మన స్వస్వరూపం కనిపిస్తుంది. అప్పుడే విశ్వరూపం బయటపడుతుంది.

కనిపిస్తున్న దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు. ఆ దృశ్యాన్ని ప్రదర్శిస్తున్నవాణ్ని చూడాలని అనుకోరు. ఈ అందాలకు, ఆనందాలకు, అనుభూతులకు కారణం... లోపల ఉంది.

రబియా అనే ఒక యోగిని ఉండేది. ఓ సుందరమైన ప్రభాతవేళలో ఎవరో 'రబియా! కుటీరంలో ఏం చేస్తున్నావు? బయటికి రా, ఇక్కడికొచ్చి చూడు. ఎంత అందమైన ఉదయాన్ని సృష్టించాడో దేవుడు!' అన్నారు.

కుటీరం లోపలి నుంచి రబియా ఇలా అంది. 'నీకు బయట కనిపిస్తున్న ఆ సుందర ఉదయాన్ని సృష్టించిన వాణ్ని నేను ఇక్కడినుంచే చూస్తున్నాను. ఓ మిత్రుడా! నువ్వే లోపలికొస్తే మంచిది. బయట ఉన్న ఏ అందమూ అందం అనిపించుకోదు- ఇక్కడున్న అందం ముందు!'

దర్శింపజేస్తున్నవాణ్ని దర్శించాలి!

కాని, కళ్లు మూసుకునే ఉంటాం. లోపల ఉండం. ఎప్పుడూ బయటే ఉంటాం. మూసుకున్నంత మాత్రాన కళ్లు మూతపడతాయా? కళ్లు మూసుకున్నా బయట దృశ్యాలు వేదిక మీద ప్రదర్శించే దృశ్యాల్లా అలా వెంటాడుతూనే ఉంటాయి...

కనురెప్పలు మూతపడటం- కళ్లు మూసుకోవడం కాదు. కళ్లు మూసుకోవడం అంటే లోపలికి దిగి వస్తున్న కలల నుంచి, ఆలోచనల నుంచి స్వేచ్ఛను పొందడం.

కళ్లు మూసుకోవడం అంటే- దృశ్యాలన్నీ మాయమైపోయి అంతరంగంలో నిశ్చలంగా ఉండిపోవడం. కళ్లు మూసుకోవడం అంటే, నిశ్చలానందాన్ని అనుభవించడం. కళ్లు మూసుకోవడం అంటే, దివ్య చైతన్యాన్ని నీ ముందర సాక్షాత్కరింపజేసుకోవడం. అదే సత్యం. అదే బ్రహ్మానంద పారవశ్యం. అదే జగత్తును ఆడిస్తున్న క్రీడ. అదే శివం. అదే సుందరం.

చూపు మారితే సర్వస్వమూ మారుతుంది!

- ఆనంద సాయిస్వామి

ᐅబోధివృక్షం


ᐅబోధివృక్షం

బోధించటం అంటే ఆత్మజ్ఞానాన్ని మాటల్లో పదిలంగా అందించటం. అలాంటి బోధను చెవులతో మాత్రమే వినకూడదు. మనసు, బుద్ధి, ఆత్మతో కలిపి వినాలి. అంటే- ఇంద్రియాలను ఏకీకృతం చేసి, ప్రతి వాక్కును పొల్లుపోకుండా అందుకోవాలి. మనసును భిక్షాపాత్ర చేసుకోవాలి. బుద్ధితో ఆ పాత్రను పదిలంగా పుచ్చుకోవాలి.
బోధ కేవలం జ్ఞానులే చేయగలుగుతారు.

జ్ఞానం అంటే భగవంతుడి హృదయకోశంలో ఉన్న ప్రేమామృతం. దానికి అక్షర రూపం కల్పిస్తే జ్ఞానం అవుతుంది. 'అందరినీ ప్రేమించు... ఎవరినీ ద్వేషించకు... అందరిలోను నేనే ఉన్నాను' అనేది పరమాత్మ ప్రపంచానికి ఇచ్చే జ్ఞానబోధ. దీన్ని మహర్షులు అందుకోగలిగారు. మరెందరో మహాత్ములూ అందిపుచ్చుకోగలిగారు. వారే ప్రపంచానికి ప్రేమను బోధిస్తున్నారు. దానికి అనేక రూపాలు కల్పిస్తున్నారు. పంచదారతో ఎన్నెన్నో మధుర భక్ష్యాలు చేస్తారు. అన్నింట్లో ఉండే మూలపదార్థం తియ్యదనమే కదా? అలాగే, బోధలన్నింటి మూలపదార్థం ప్రేమ ఒక్కటే.

ఆహరహం చెదరని ప్రేమను భక్తి అంటారు. భక్తిలో సంపూర్ణత్వం సాధిస్తే అది పరమ భక్తి అవుతుంది. పరమ భక్తుల హృదయ కమలంలో అంతర్యామి ఆనంద పారవశ్యంతో సేద తీరుతుంటాడు. ఆంజనేయుడు తన రాముణ్ని హృదయ కమలంలో అనుక్షణం వీక్షిస్తూనే ఉంటాడు. ప్రహ్లాదుని మలి అవతారంగా కీర్తించే రాఘవేంద్రస్వామి హృదయమూ శ్రీరాముని దివ్యధామమే. అలాగే త్యాగయ్య, అన్నమయ్యలు... వీరంతా పరమభక్తులు.

కొందరిని కారణజన్ములుగా చెబుతారు. అటువంటివారు తమ జన్మంతాపరమాత్మ సృష్టికి సేవ చేస్తూనే గడుపుతారు. గురునానక్‌, గౌతమ బుద్ధుడు, జీసస్‌, మహ్మద్‌- ఇలా ఈ కోవకు చెందిన ఎందరో ఈ ప్రపంచంలోకి వచ్చి, తమ బోధలనే అమూల్య ఆస్తులను ఆస్తికులకు అందించి నిష్క్రమించారు. మనిషిని మనీషిగా మార్చడమే జ్ఞానబోధ లక్ష్యం. దురదృష్టవశాత్తు మనకు బోధలపేరుతో బాధలు పెట్టే కుహనా గురువులు ఎక్కువయ్యారు. వీరిని నమ్ముకున్నవారికి మిగిలేది పశ్చాత్తాపమే.

బుద్ధుడు తన సత్యాన్వేషణలో అనేక వృక్షాల నీడలో సేదతీరాడు. బోధివృక్షం నీడలోనే ఆయనకు జ్ఞానోదయమైంది. అంతర్యామిలోకి పరమాత్మ అనంతజ్ఞానం ప్రవహించింది. ఆయనలోని అశాంతి అంతరించి, శాశ్వతమైన శాంతి వికసించింది.

అదే బోధివృక్షం నీడలో కూర్చుంటే మనమూ అలాగే బుద్ధులం కాగలమా? అసంభవం. ఎందుకంటే, సిద్ధార్థుడు బాల్యంనుంచే ఆధ్యాత్మిక జిజ్ఞాసువు. సత్యదర్శనం కోసం అశాంతిగా అడవులు, చెట్లు పుట్టలు పట్టుకు తిరిగాడు. ప్రాపంచిక భావనలన్నింటినీ వదిలించుకున్నాడు. శరీరభ్రాంతి నుంచీ బయటపడ్డాడు. అంతర్యామి దర్శనం కోసం ఆరాటపడ్డాడు. అలసిసొలసినా, శరీర బాధలు వేధించినా తన లక్ష్యం మీద గురి తప్పనీయలేదు. భగవంతుడు ఆ క్షణం కోసమే నిరీక్షించి, వెంటనే బుద్ధుణ్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ క్షణమే మహోదయం.

బోధివృక్షం నీడలో సిద్ధార్థుడు బుద్ధుడు కావటం కాదు. బుద్ధుడు అక్కడ జ్ఞానమూర్తి అయినందువల్లనే అది బోధివృక్షమైంది. అసలు బోధివృక్షం బుద్ధుడే. ఈ రహస్యం గ్రహించలేక ఎందరో బోధివృక్షాన్ని పూజిస్తూ, బుద్ధుడి బోధలు విస్మరిస్తున్నారు.

ఎవరు కేవలం బోధలతో సరిపెట్టక, తాము ఆ బోధలను ఆచరిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారో- వారే బోధివృక్షాలని మనం గ్రహించాలి.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌

ᐅఋష్యాశీస్సులు



మంచి కోరిక, సంకల్పం... వీటికి బలం ఉంది. కోరికను సాధించుకోవాలనుకోవడమే సంకల్పం.
ధర్మబద్ధమైన కోరిక దృఢ సంకల్పమై చక్కగా వ్యక్తీకరించినప్పుడు అది 'సత్యం' అవుతుంది... అని వేదవాఞ్మయం చెబుతోంది. అందువల్లనే శుభకామనలు, శుభ సంకల్పాలు, నిష్కపటంగా వ్యక్తీకరించడమనే సంప్రదాయం ఏర్పడింది. వేదాలను మొదలుకొని మన ప్రార్థనలు, ఆకాంక్షలు ఈ మూడు అంశాలతోనే ఏర్పడ్డాయి. వ్యక్తిత్వాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకొనేందుకు, సత్కార్యాలను సాఫల్యంగా ఆచరించేందుకు ఈ విధమైన ప్రార్థనలు మనోవాక్కర్మలకు స్ఫూర్తినిస్తాయి. వ్యక్తిగతంగానూ, సమాజహితపరంగానూ, ధార్మిక సూత్రాలకుగాను- శుభాన్ని కాంక్షించడం సమంజసం.

* శుభమైన సంకల్పాలు కలవారు, రక్షణను అందించగలిగే బుద్ధిమంతులు, చురుగ్గా పనిచేసేవారు, ఎందరికో ప్రేరణ ఇవ్వగలవారు, సరైన సమర్థులను సమన్వయించగలిగేవారు దేశానికి సంపదలను సమకూర్చగలరు- అని 'రుగ్వేదం' చెబుతోంది. అటువంటివారు పరిపాలకులుగా ఉండాలి- అనే ఆకాంక్ష శాస్త్రంలో కనబడుతుంది. అంటే- నేతల్లో అలాంటి లక్షణాలుండాలి... అనే భావన కూడా ప్రధానం.

* నా దేశంలోని పంటలు ఆరోగ్యాలను ప్రసాదించాలి. ఆయువును దీర్ఘంచేసేలా, రోగరహితమై ఉండాలి- అనే ఆకాంక్ష అధర్వవేదంలో ఉంది.

ఈ శుభాకాంక్షలనే - 'మేము సావధానులమై ఈ దేశ క్షేమానికి అర్పితులమవుదుము గాక!' అనే శుభసంకల్పం కూడా వ్యక్తపరచారు రుషులు. మన బాధ్యతలకు మనమే నిబద్ధులమయ్యేందుకు శుభాకాంక్షలు ప్రార్థనలవుతున్నాయని తెలుసుకోవాలి.

* ఐశ్వర్య సాధనతోపాటు, దాన్ని సమనీతిలో విభజించేలా మా బుద్ధులు పనిచేయాలి. హింసకులను మా ప్రయత్నాలు అదుపు చేయుగాక!- అని రుగ్వేద భావన.

* దేశాభివృద్ధికి అపరాధ ప్రవృత్తులను, దేష్యులను తొలగించమని దేవతలను కోరడం రుగ్వేదం ఎనిమిదో మండలంలో కనబడుతుంది. సమాజహితాన్ని దెబ్బతీసేవారు ఒక గుంపుగా ఏర్పడకుండా వారిని నిర్మూలించమని ప్రార్థించడమూ ఉంది.

* 'నేను అవినీతిపరుల పట్ల దయచూపను. వారిని శిక్షించవలసినదే' అనే భావన దేశహితాన్ని కోరేవారికి, ఉండాలని అధర్వవేదం చెబుతోంది.

* భూసంపదను భూమత సంతానమైన మానవులందరూ సమానంగా అనుభవించాలి- అనే సమభావన అధర్వవేదంలో పల్లవించి ఫలించి కనిపిస్తోంది.

ఆకాంక్షను ప్రార్థనగా మార్చడంవల్ల, మన సంకల్పం దైవసంకల్పమై సిద్ధిస్తుందని ఆర్షదృష్టి.

* నేను, నావారు మనోబలంతో ఉండాలనే కాంక్ష పలుచోట్ల వేదాల్లో కనబడుతోంది. మన పుత్రపౌత్రులు కూడా బలాఢ్యులై, సమర్థులై ఉండాలి- అనే కుటుంబ సంక్షేమ సంభావన రుషి ఆలోచన. దృఢశరీరులైన పౌరులుండాలి. వారే దేశానికి సైతం బలం.

* 'నా ఇంట పూలమొక్కలు, చక్కని తృణాలు దూర్వాదులు సమృద్ధిగా ఉండాలి. కొరతలేని నీరు ఉండాలి' అనే రుగ్వేద ప్రార్థనలో, ఒక చక్కని ఇల్లు ఎలా ఉండాలి అనే మంచి ఆలోచన ప్రాచీన కాలంలో మనదేశంలో ఎంత స్పష్టంగా ఉందో అవగతమవుతుంది.

* కాలంలో పరిణమించే రుతువులు, సంవత్సరాలు, ప్రకృతి మార్పులు- మనలను అభివృద్ధి పరచాలనే శుభాశంస/ యజుర్వేదంలో, అధర్వవేదంలో కొన్ని మంత్రాలు స్పష్టం చేశాయి. కాలంలోని మలుపులు కలిసిరావాలి అని ఆశలుండటం ఒక సహజ శుభాకాంక్ష.

* లోకానికి హితం కలిగించే స్వభావం కలవారు, జ్ఞానానికి ప్రాధాన్యమిస్తూ, మితి కలిగిన సంపదను మాత్రమే అనుభవించేవారు దానానికి తగినవారు- అని చెబుతున్నది వేదం. అటువంటివారు నా దానాన్ని గ్రహింతురు గాక!- అని వాంఛించాలి. ఇదీ ఆర్ష సంస్కృతి.

* మేధాశక్తి, రక్షణశక్తి కలిసి నడిచే సమాజం పుణ్యలోకమే- అని భావిస్తూ, అలాంటి చోటుగా మా ప్రాంతం భాసించాలి- అనే ఆశయం వేదరుషి హృదయంలో మెరుస్తోంది.

* ఒకే లక్ష్యంతో కలిసి నడిచే సమభావన, సహకారం, సమసంకల్పం కలిగిన వాళ్లమై మేలు కలిగించుకోవాలి- అనే సమాజ క్షేమ సూత్రాలను రుషులు అందించారు.

* 'యమరాజ్యం' కావాలనే అద్భుత భావన యజుర్వేదంలో ఉంది. 'యమం' అంటే 'నియంత్రణ'.

యమ-నియమ-సంయమ... ఈ మూడూ వ్యక్తిలోనూ, సమాజ జీవన సరళిలోనూ ఉంటేనే భద్రత, పురోగతి. నిగ్రహశక్తితో కూడిన సత్యం, ఇంద్రియ నియంత్రణ, అహింస, అక్రమార్జన లేకుండటం, అవినీతి రాహిత్యం-యమం.

స్వధర్మ పాలన, అధ్యయనం, శౌచం, సంతోషం, తపస్సు, ఈశ్వరార్చన- నియమం. ధ్యానం, ధారణ- సంయమం.

అసంఖ్యాకమైన శుభంకర ఆలోచనలను ఎన్నింటినో ఇచ్చిన రుషుల వాక్కుల్లో కొన్ని తళుకులు మాత్రమే ఇవి. వీటిని మన దృష్టిలో నిలుపుకొని సాగిననాడు మన కాలాన్ని మనమే విజయవంతం చేసుకోగలం.

- సామవేదం షణ్ముఖశర్మ