ᐅ మహా కుంభమేళా



ᐅ మహా కుంభమేళా

జీవకోటి మనుగడకు జలమే ఆలంబన. నీటి వనరులపైనే జీవనచక్రం ఆధారపడి ఉంది. జల ప్రవాహాల వెంటే నాగరికత విలసిల్లింది. ఎక్కడ జలసిరులు పరిఢవిల్లుతాయో, అక్కడ జీవన వికాసం వర్ధిల్లుతుంది. అందుకే జల నిధుల్నీ, నదీనదాల్ని దేవతా స్వరూపాలుగా ఆరాధించుకోవడం మన సంప్రదాయంలో ముఖ్యభాగం. ఆ పరంపరకు చెందినవే- పుణ్య స్నానాలు, పవిత్ర పుష్కరాలు, కుంభమేళా మహోత్సవాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా వినుతికెక్కిన మహాకుంభమేళా మకర సంక్రమణం జరిగిన జనవరి 14 నుంచి ప్రారంభమైంది. మహా శివరాత్రి (మార్చి 10) వరకు ఇది కొనసాగుతుంది. 56 రోజుల పాటు నేత్రోత్సవంగా ఆకట్టుకునే ఈ మహాకుంభమేళాలో పుష్యపౌర్ణమి (జనవరి 27) నుంచి ఆచరించే పుణ్యస్నానాలు మరింత పవిత్రమైనవిగా చెబుతారు.
కుంభమేళా ఎప్పుడు ఎక్కడ జరిగేది సూర్యుడు, బృహస్పతిల స్థానాల ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ రెండు గ్రహాలు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లోని త్రయంబకేశ్వర్‌లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్‌లోను, బృహస్పతి వృషభరాశిలో, సూర్యుడు మకరరాశిలో ఉన్న సందర్భంలో ప్రయాగలోను, ఈ రెండు గ్రహాలు వృశ్చికరాశిలో ఉంటే ఉజ్జయినిలోను కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి మూడేళ్లకు ప్రయాగ (అలహాబాద్‌), నాసిక్‌, హరిద్వార్‌, ఉజ్జయినిలలో కుంభమేళా కొనసాగుతుంది. ప్రతి ఆరేళ్లకు హరిద్వార్‌, ప్రయాగలలో అర్ధ కుంభమేళా జరుగుతుంది. పన్నెండేళ్లకోసారి ప్రయాగలోని త్రివేణి సంగమంలో పూర్ణకుంభమేళా వెల్లివిరుస్తుంది. పన్నెండు పూర్ణకుంభమేళాలు అంటే 144 సంవత్సరాలకోసారి మహాకుంభమేళా వస్తుంది. దీన్ని ప్రయాగలోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆ మహాకుంభమేళాయే!

ఈ మహాకుంభమేళాలో మకర సంక్రాంతితో పాటు పుష్యపౌర్ణమి, మౌని అమావాస్య (ఫిబ్రవరి 10), వసంత పంచమి (ఫిబ్రవరి 15), రథసప్తమి (ఫిబ్రవరి 17), మాఘ పౌర్ణమి (ఫిబ్రవరి 25), మహా శివరాత్రి పర్వ దినాల్లో ఆచరించే పవిత్ర స్నానాలు మరింత విశేషమైనవిగా చెబుతారు. పదికోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే ఈ మహాసంరంభం... ఉవ్వెత్తున ఎగసే ఆధ్యాత్మిక భక్తి తరంగం... అనిర్వచనీయమైన భక్తిపారవశ్యం. ఆనందాతిరేకాల అపురూప సన్నివేశం.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ పుణ్యక్షేత్రంలో గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమస్థలిలో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా ప్రకటితమవుతోంది. ఈ కుంభమేళా ఆవిష్కారానికి పురాణ నేపథ్య కథనాన్నీ చెబుతారు. భాగవత, విష్ణు పురాణాలు, రామాయణ, మహాభారతాల ప్రకారం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా అమృతకుంభం వెలువడిందంటారు. ఆ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజులు (మనుషుల గణన ప్రకారం 12 సంవత్సరాలు) యుద్ధం జరిగిందంటారు. ఈ అమృతాన్ని దానవులు సేవిస్తే, వారు అజేయులవుతారని భావించిన దేవతలు శ్రీహరిని శరణు వేడతారు. విష్ణువు మోహినీ రూపంలో ఆ అమృత కలశాన్ని దక్కించుకుని వెళ్తుండగా, అందులోని అమృత బిందువులు ప్రయాగ, హరిద్వార్‌, నాసిక్‌, ఉజ్జయినిలోని పుణ్య నదుల్లో పడ్డాయని పురాణగాథ. అందుకే ఈ పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల ఇహపరముక్తి ఏర్పడుతుందని భక్తుల విశ్వాసం. క్రీ.శ. 629-645 మధ్య కాలంలో హర్షవర్ధనుడి పరిపాలన కాలంలో, మనదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్‌సాంగ్‌ తన రచనలో కుంభమేళా ఉత్సవాన్ని వివరించాడు.

కుంభమేళాకు సంబంధించి యోగశాస్త్రపరంగా ఎన్నో ఆంతర్యాలున్నాయి. ఇడ, పింగళ అనే రెండు ముక్కు రంధ్రాల ద్వారా మన శ్వాసక్రియ కొనసాగుతుంది. ఇడ, పింగళ ద్వారా తీసుకున్న శ్వాస సుషుమ్ననాడి (తిలకం దిద్దుకునే ప్రదేశం) దగ్గర ఏకీకృతమవుతుంది. ఇదే త్రివేణీ సంగమం. ఇడ, పింగళ రంధ్రాలు గంగ, యమునలకు ప్రతీకలైతే- బయటకు గోచరంకాని సుషుమ్ననాడి అంతర్వాహిని అయిన సరస్వతి నదికి సూచిక. శిరస్సు అనే కుంభంలో జరిగే ఈ సమ్మేళన ప్రక్రియే కుంభమేళా. మన వెన్నెముక అడుగున కుండలినీ అనే పాము దాగి ఉంటుంది. యోగ సాధనద్వారా సాధకుడు ఆ సర్పాన్ని మెల్లిగా పైకి ప్రయాణించేలా చేసుకుని తన (కుంభం)లోని సహస్రారానికి చేర్చాలి. అప్పుడు ఆ కుంభం అమృత భాండమవుతుంది. తద్వారా జ్ఞానసిద్ధి ఏర్పడుతుంది. దేవదానవులు ఇడ, పింగళ రంధ్రాలద్వారా తల(కుంభం)లో ఉచ్ఛ్వాస, నిశ్వాసాలతో చిలికినప్పుడు జ్ఞానమనే అమృతం వెలువడిందని చెబుతారు. కుంభమనే శిరస్సులో జ్ఞానామృతాన్ని నింపుకోవడం ద్వారా సాధకుడు దైవత్వాన్ని సాధించవచ్చని క్షీరసాగర మథన ప్రక్రియ సందేశమిస్తుంది. శ్రీకరంగా, శుభకరంగా, పరమ పావనకరంగా శోభిల్లే మహా కుంభమేళా తరుణం... భక్తి విశ్వాసాల ఆలంబనకు ఓ మహత్తర ఘట్టం.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌