ᐅ ఏకాగ్రత



ᐅ ఏకాగ్రత

జ్ఞానానికి ఏకైక మార్గం ఏకాగ్రత. శాస్త్రజ్ఞులు తమ పరిశోధనాంశం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. వారికి ఇంట్లో సంగతులు సైతం పట్టవు. తమ పరిశోధనాంశం తేలేవరకు వేరే ఆలోచనలను దరికి రానీయరు. ఏ పని చేస్తున్నా వారి బుర్రల్లో అదే అంశం మెదులుతూ ఉంటుంది. భార్యతో బండిపై బజారుకు వెళ్లిన శాస్త్రవేత్త, ఆలోచనలో పడి ఆమెను అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలను గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ భౌతిక విషయసంబంధమైన రహస్యాలను తెలుసుకునే ప్రయత్నగతమైన ఏకాగ్రతలు. గృహకృత్యాలూ, కుటుంబ సంబంధాలూ భౌతికమైనవే! అయినప్పటికీ, శాస్త్రజ్ఞులు సర్వమానవాళికీ ఉపయోగపడే ఒక అద్భుత విషయాన్ని ఆవిష్కరించడానికి అహరహమూ శ్రమిస్తుంటారు. మనసును పూర్తిగా ఆ విషయంపైనే నిలుపుతారు. ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పోరాటాలు, ఆర్థిక పరిణామాలు వారిపై ప్రభావాన్ని చూపవు. ఒక సామాన్యుడు వంకాయలు చవగ్గా దొరికేచోటు కనుక్కుని సంతోషిస్తాడు. అదేపనిగా గాలించి అటువంటి దుకాణం ఎక్కడుందో తెలుసుకొని, తన కుటుంబ సుఖజీవనానికి తోడ్పడతాడు. ఈ పనికీ ఏకాగ్రచిత్తం అవసరమే! కానీ, ఈ ఏకాగ్రతకు ఫలం వంకాయలు మాత్రమే! ఏకాగ్రచిత్తంతో పరమేశ్వరుని ధ్యానించి, స్వామి సాక్షాత్కారమైతే, 'వీసెడు వంకాయలు కావాలి'అని కోరడం ఎంత అవివేకం? దీక్షలన్నీ ఉన్నత ఆదర్శాలతో ఉండాలి. మానవాళికి మహత్తర సౌభాగ్యం చేకూర్చేవిగా సాగాలి. అది చిన్నదైనా, పెద్దదైనా, వ్యక్తిగతమైనా సమాజశ్రేయానికైనా, ఒక దీక్ష పూనినవాళ్లకు కావాల్సింది ఏకాగ్రత. చిన్నచిన్న ఆశలకు, అంతరాయాలకు వారి ఏకాగ్రత చెక్కుచెదరదు. విద్యాలయాలు ఏకాగ్రత ఎలా సాధించాలో నేర్పితే చాలు. విద్యార్థులు సులభంగా అన్నీ నేర్చుకోగలరు. ఏకాగ్రచిత్తం యోగి లక్షణం. మన సనాతన సంప్రదాయ విద్యలో గురువు శిష్యుడికి ఏ మతాన్ని గురించీ బోధించడు. ఏకాగ్రతను నేర్పుతాడు. దాన్ని అభ్యసించిన శిష్యుడు తానే అల్లుకుపోతాడు. అన్నీ గురువు దయవల్ల తనకు సంప్రాప్తించినవని చెబుతాడు. కొందరు శిష్యులు గురువును మించిన వారయ్యారు. కేవలం గురువు బొమ్మపెట్టుకొని లక్ష్యశుద్ధితో సాధన చేసి, మేటి విలుకాడయ్యాడు ఏకలవ్యుడు.
ఒక సాధువు చెరువుగట్టు పైనుంచి వెళుతున్నాడు. ఆ గట్టుపై ఒకడు కూర్చుని, గేలంవేసి, తదేక దీక్షతో నీటివైపే చూస్తున్నాడు.

'నాయనా! ఈ దారి ఏ వూరికి పోతుంది?' సాధువు ప్రశ్నించాడు. గేలం పట్టుకున్నవాడు సమాధానం చెప్పలేదు.

'బాబూ! ఈ బాట ఎటు వెళుతుంది?' మళ్లీ అడిగాడు సాధుపుంగవుడు.

గేలం పట్టుకున్నవాడు కన్నార్పకుండా చెరువులోని నీటివైపే చూస్తున్నాడు. పెదవి మాత్రం కదపలేదు. సాధువుకు కోపం వచ్చింది.

'ఏవయ్యా! నిన్నే! ఎన్నిసార్లడగాలి? చెవుడా ఏం?' అతడు మాత్రం బదులు పలకలేదు.

హఠాత్తుగా గేలానికి చేప తగులుకుంది. మరుక్షణమే ఒక్క విసురున గేలాన్ని బయటకు లాగి, చేపను బుట్టలో వేసుకున్నాడు. సాధువు అతడివైపు కొరకొర చూస్తున్నాడు.

అతడు హడావుడిగా చేపలబుట్ట సర్దుకొని, గేలాన్ని పక్కనపెట్టి, సాధువును చూసి నమస్కరించాడు.

'అయ్యా! తమరేదో ఇందాక అడిగినట్లున్నారు... క్షమించండి! నా దృష్టి అంతా చెరువులోని చేపవైపే ఉంది. బెండు మునిగిన మరుక్షణమే గేలం బైటికి లాగాలి. లేకపోతే చేప తప్పించుకుపోతుంది. నేను చేసేపని నుంచి దృష్టి మరల్చకూడదు కదా! ఆ సమయంలో నాకు మరే ఇతర శబ్దమూ వినబడదు, కనబడదు. మీకు కోపం వచ్చినట్లుంది... నాది తప్పయితే క్షమించండి!' అన్నాడు.

సాధువుకు జ్ఞానోదయమైంది. రెండు చేతులూ ఎత్తి నమస్కరించాడు. 'గురుదేవా! నేను ఎందరు గురువులను ఆశ్రయించినా సరైన మార్గం బోధపడలేదు. నాకు తోవచూపగల గురువెవరో ఈ సమీప గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని, వెతుక్కుంటూ వచ్చాను! ఏకాగ్రత లేనిదే ఎన్ని జపాలు తపాలు చేసినా నిరుపయోగమేనని ఇప్పుడు గ్రహించాను. ఈ పరమసత్యాన్ని నాకు బోధపరచిన తమరే నా గురువులు!' అని ఆ సాధువు వెనుదిరిగిపోయాడు.

- డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు