ᐅ ధీరులదే విజయధ్వజం



ᐅ ధీరులదే విజయధ్వజం

అగ్నిని తలకిందులుగా పెట్టినా, దాని జ్వాల వూర్ధ్వంగానే ప్రసరిస్తుంది గాని, అధోముఖంగా కాదు. మహాపురుషులు తమకు ఎంత కష్టం కలిగినా ధీరత్వాన్ని వీడరు.
ధీరుడంటే ఎవరు?
కష్టాలు కలిగినవని అధిక దుఃఖాన్నిగాని, సుఖాలు చూరగొన్నామని అధిక సంతోషాన్ని గాని పొందనివాడే ధీరుడు. నీతివేత్తలు నిందించినా, భూషించినా, సంపదలు వచ్చినా, పోయినా, మరణం సంభవించినా, సంభవించకపోయినా ధీరులైనవారు న్యాయమార్గాన్ని వీడరు. కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తారు. ధీరుడు భూశయ్యను, మెత్తని పరుపును- సమానభావంతో చూస్తాడు. ఒక తావున బొంతగుడ్డను కట్టుకుంటాడు. ఇంకోచోట పీతాంబరాన్ని ధరిస్తాడు. తాను తలచింది సాధించి, విజయశిఖరాన్ని అధిరోహించే వరకు ఎన్ని విఘ్నాలు కలిగినా లెక్కచేయక ప్రయత్నిస్తూనే ఉంటాడు.
అమృతంకోసం పాలసముద్రాన్ని మధిస్తున్న దేవతలు రత్నం లభించిందని సంతోషించలేదు. కాలకూటానికి భయపడనూ లేదు. అమృతం లభించేవరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవాంతరాలకు అధైర్యం చెందలేదు. వృక్షాన్ని ఛేదించినా మళ్ళా చిగురు పుడుతుంది. క్షీణించిన చంద్రుడు మరలా అభివృద్ధి చెందుతాడు. ధీరులు కార్యసాధనలో కలిగే కష్టాలను గాంచి, వెనకంజ వేయక ముందుకే సాగిపోతారు.

కథానాయకులు చతుర్విధాలని లాక్షణికుల ఉవాచ. ధీరోదాత్తుడు, ధీరోద్ధతుడు, ధీరశాంతుడు, ధీరలలితుడు అనే నాలుగు విధాల్లోనూ 'ధీర' సమానంగా కనబడుతున్నది. దీన్నిబట్టి ఉత్తములకు ధీరత్వం ముఖ్య లక్షణమని తెలుస్తున్నది. శ్రీరాముడు ధీరోదాత్తుడు, ఆదర్శపురుషుడు. ఆదర్శ పురుషులందరూ జీవితంలో కష్టాలు నష్టాలు చవిచూసినవారే. అయినా ధీరగుణం వారిని ఆదర్శమార్గంలోనే నడిపింది.

విపత్తు అనే సముద్రాన్ని దాటే ఓడగా, రణమహీస్థలికి శ్రీరామరక్షగా, సకల సుగుణ ప్రధానంగా ధైర్యగుణాన్ని విజ్ఞులు ప్రశంసిస్తారు. కాషాయాంబరాలు ధరించి, సనాతన ధర్మకాంతులను విశ్వమంతా విస్తరింపజేసిన స్వామి వివేకానందుడు ధీరుల్లో అగ్రగణ్యుడు. ఆయన విశ్వమత మహాసభలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళినప్పుడు అన్నీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. పరిచయ పత్రం పోయింది. ప్రపంచంలో అత్యున్నత సంపన్న దేశంలో, ఒక పేదదేశ సంస్కృతికి ప్రతినిధిగా వెళ్ళిన నిర్ధనుడు! ధూళిధూసరితమైన వస్త్రాలు ధరించిన సన్యాసి! వేదికపై వివేకానందుడు ధీరుడై నిలిచాడు. అనర్గళ ప్రసంగంతో సర్వధర్మాలవారిని సమ్మోహితులను గావించాడు. విజయధ్వజాన్ని ఎగురవేసి, భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని లోకానికి చాటాడు. ధీరుడికి అపజయం లేదని నిరూపించాడు!

- పి.భారతి