ᐅపరిపూర్ణుడు



ᐅపరిపూర్ణుడు

రాజ్యంలో సుఖశాంతులు నెలకొనాలంటే, ఆ రాజు ప్రజల్లో నాటుకున్న భయాన్ని పోగొట్టాలి. రాజుకు శత్రుభయం పోతే, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు సుఖంగా జీవనం సాగిస్తారు. జీవుడనే రాజుకు శరీరం ఒక రాజ్యంలాంటిది. రాజుకు ఉన్నట్టే జీవుడికి బయట, లోపల శత్రువులు ఉండటంలో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది? ఆ శత్రువుల ఆట కట్టించేదాకా రాజులిద్దరూ మెలకువగా ఉండాలి. శత్రువుల గుండెల్లో నిద్రపోవాలి. కనిపించే శత్రువును గుర్తించి తగిన చర్య తీసుకోవటం అంత కష్టమైన పని కాదు. కాని, చడీచప్పుడూ చేయకుండా ఎప్పటికప్పుడు మెరుపు దాడిచేసే శత్రువును పట్టుకోవటం కష్టం. పట్టుకోగలిగినా మట్టుపెట్టడం మరింత క్లిష్టమైన పని. ఎందువల్ల కష్టతరం అంటే, ఈ కనిపించని శత్రువు స్నేహం నటిస్తూ, వెనక గోతులు తవ్వుతాడు. గోతిలో పడదోసేదాకా ప్రేమ నటిస్తూనే ఉంటాడు. ఇలాంటి ప్రియమైన శత్రువును లొంగదీసుకోవాలంటే రాజుకైనా, నవద్వారపురంలో తిష్ఠ వేసుకొన్న జీవుడనే రారాజుకైనా ఓర్పు, నేర్పు అవసరం. ఆ గూఢ శత్రువును పూర్తిగా అదుపు చేయకపోతే సుఖశాంతులకు కడు దూరంగా ఉండిపోవలసిందే! శాంతిభద్రతలు కరవైతే రాజు గాని ప్రజలు గాని ఎలా సుఖంగా ఉండగలరు? జీవుడి విషయంలో ఇది అక్షర సత్యమే.
కోరికలన్నింటికి పుట్టినిల్లు మనసు. మనసున్నంత కాలం మనిషికి కోరికలు, జన్మలు తప్పవు. తీరని కోరికలు తీర్చుకోవటానికి వచ్చి, ఈ జన్మలో మరిన్ని కోరికలు మూట కట్టుకుంటున్నాడు మానవుడు. సాలెపురుగులా తాను కోరికల వలలో చిక్కుకుని చావు పుట్టుకల వలయం నుంచి బయటికి రాలేక సతమతమవుతున్నాడు. ఈ విషవలయం ఛేదించి బయటపడే మార్గం ఏమిటి? మార్గనిర్దేశం చేయగల జీవనసూత్రం మనిషికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. తెలివైన రాజు మొట్టమొదట శత్రుస్థావరాలు కనిపెట్టినట్టుగా ముందుగా శత్రుస్థానాలను కనుక్కుని నియంత్రించగలిగితే ఆ తరవాత శత్రువును లొంగదీయటం సులభం. శరీరం, ఇంద్రియాలు, మనసు అనే స్థావరాలను ఆవరించుకున్న ఆ కనిపించని కామ శత్రువును లొంగదీయటానికి తగిన ప్రక్రియ- నియతి. నియతి అంటే నియమం, ఇంద్రియ నిగ్రహం.

కోరికను నియంత్రించటానికి శరీరాన్ని, ఇంద్రియాల్ని, మనసును అదుపాజ్ఞల్లో పెట్టుకోవటానికి, సమాలోచన చేసి సమన్వయించుకునే బుద్ధి మనిషికి ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. అలా చేయలేని పక్షంలో కామ శత్రువు పద్నాలుగు తలలతో రావణాసురుడికన్నా భయంకరంగా రెచ్చిపోగలదు. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, నాలుగు అంతఃకరణాలు- (మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం) వెరసి పద్నాలుగు తలలు. దశకంఠుడి ప్రాణాలు బొడ్డులో ఉన్నట్టు, మిగతా పదమూడు కరణాలను లొంగదీసే శక్తి బుద్ధికి ఉంది. దీనికి ఆత్మశక్తి తోడైతే మరెలాంటి బలమైన శత్రువుకూ చోటుండదు. శరీరంకంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి బలీయం, సూక్ష్మం, శ్రేష్ఠం. బుద్ధికంటె ఆత్మపరమైనది కాబట్టి ఆత్మాశ్రయ బుద్ధి ద్వారా మనసును వశపరచుకుని దుర్జయుడైన కామశత్రువును జయించాలని స్వయాన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు.

ఆ విధంగా బాహ్య అంతఃకరణాలను అదుపులోకి తేగలిగితే విషయసుఖాలకు దూరమై మనిషి నిత్యానందాన్ని అన్వేషిస్తాడు. శత్రు విజయం సాధించిన మానవుడు పరిపూర్ణుడవుతాడు. నిత్యానందానుభూతి ఒక్కటే అతడి జీవితంలో పరమ గమ్యమై వెలుగు నింపుతుంది.

- ఉప్పు రాఘవేంద్రరావు