ᐅ బంధమోక్షాలు



ᐅ బంధమోక్షాలు

స్వేచ్ఛను హరించేది బంధం. బంధాన్ని వదిలించేది మోక్షం. బంధమోక్షాలకు స్థూలంగా చెప్పే నిర్వచనాలివి. మనిషి బంధానికి గురికావడానికీ, మోక్షాన్ని పొందడానికీ కారకులెవరు? భగవంతుడా, కుటుంబమా, అదృష్ట దురదృష్టాలా, సమాజమా? ఇవేవీ కారణాలు కావనీ, మనుషుల బంధమోక్షాలకు మనసే మూలకారణమనీ శాస్త్రాలు చెబుతున్నాయి.
బంధానికి మూలకారణం కోరిక. సుఖాలు కావాలని కోరుకున్నప్పుడు ఆ సుఖాలను సంపాదించుకోవడానికి అమితంగా కష్టపడాలి. సుఖాలవెంట పరుగులు తీయాలి. అష్టకష్టాలు పడి సుఖాలను సాధించుకుంటే అవి మనిషిని స్వేచ్ఛగా ఉండనీయవు. అవి వెంటపడేవాళ్లను తమ అదుపులోకి తీసుకుంటాయి. ఒక సుఖం మరొక సుఖంవైపు ప్రేరేపిస్తుందేగాని, అది అంతటితో వూరుకోదు. ఒక్కొక్క సుఖమూ చేరుతూ చేరుతూ చివరికి అనంతంగా విస్తరిస్తాయి. ఇక మనిషి వాటిచుట్టూ పరుగులు తీయడంతప్ప మరొకటి చేయలేడు.

మోక్షానికి మూలకారణం సర్వసంగ పరిత్యాగం. అంటే, అన్నింటితో స్నేహాన్ని వదులుకోవడం. అటువంటప్పుడు మనసులోకి ఏదీ రావడంకానీ, పోవడంకానీ ఉండదు. అంతా శూన్యంగా ఉండే స్థితి అన్నమాట. యోగులు సాధించే అత్యున్నతస్థితి ఇది. ఇందులో రాగద్వేషాలకూ, స్వార్థానికీ తావులేదు. అన్నింటినీ వదలివేయడమే ప్రధానం.

అసలు బంధమోక్షాలు రెండు పదాల్లోనే ఇమిడి ఉన్నాయనీ, 'మమ' (ఇదంతా నాది) అనుకోవడం బంధమనీ, 'న మమ' (ఇదంతా నాదికాదు) అనుకోవడం మోక్షమనీ, వేదాంతుల మాట. అందరూ 'మమ' అని అనుకొనేవాళ్లే. 'న మమ' అనేవాళ్లు లోకంలో చాలా అరుదు. దీనికి కారణం మనుషులు త్రిగుణాలకు లోబడి ఉండటమే. త్రిగుణాల్లో సత్వం మనిషిలోని సాత్విక ప్రవృత్తినీ, రజస్సు రాగద్వేషాలనూ, తమస్సు అనాలోచిత కర్మలనూ కలిగిస్తుంది. త్రిగుణాలు మనసుకు అధీనమై ఉంటాయి. కనుక బంధానికీ, మోక్షానికీ మనసే కారణమని పెద్దలమాట.

ప్రేమ, అనురాగం, ఆసక్తి, అభిలాష, ఆకాంక్ష... ఇలా ఎన్నో విషయాలు బంధానికి కారణాలవుతున్నాయి. ఆకాశంలో ఎన్నో పక్షులు విహరిస్తుంటాయి. చెట్లమీద వాలి సేదదీరుతుంటాయి. కానీ, రామచిలుకలను చూడగానే మనిషికి దాన్ని పట్టుకోవాలనీ, ఆ తరవాత వాటిని పంజరంలో బంధించి, ఇంట్లో పెట్టుకోవాలనీ అనిపిస్తుంది. దీనికి కారణం రామచిలుక పలుకులు మధురంగా ఉండి, ఆకర్షించడమే. ఈ గుణం కారణంగానే రామచిలుకలు పంజరాల్లో బంధీలవుతున్నాయి.

మనసు లగ్నం కాకపోతే బంధం లేనేలేదు. మనసుతో అనుకుంటేనే బంధాలు ఏర్పడుతాయి. మనసు సన్యసించిననాడు ఏదీ మనిషిని బంధించలేదు. మనసుతో అనుసంధానించినప్పుడు ఇంద్రియాలు పనిచేయడం, మనసును కలపకపోతే ఇంద్రియాలు పనిచేయకపోవడాన్ని చూసినప్పుడు బంధమోక్షాలకు కారణం మనసేనని స్పష్టంగా తెలుస్తుంది.

మనిషి బంధాలనుంచి విముక్తం కావాలంటే జ్ఞానాన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకు- అత్యంత ఆప్తులైనవారు ఎవరైనా మరణించినప్పుడు, వారితో ఉన్న మానసికానుబంధంతో ఎంతో దుఃఖం కలుగుతుంది. దుఃఖం కూడా మనిషికి బంధమే. మరణం జీవకోటికి సహజమనీ, అది ఆప్తులకైనా, ఇతరులకైనా ఎప్పుడైనా సంభవించేదే కనుక ఎక్కువగా విచారించరాదనీ మనసును సమాధానపరచుకొన్నప్పుడు దుఃఖం దూరమవుతుంది. దాని పర్యవసానంగా బంధమూ నశిస్తుంది.

అన్నీ తనకే కావాలనుకునే నరుడికి ఏదీ వదులుకోవడం ఇష్టం ఉండదు. చివరికి తనకు పనికిరాని వస్తువైనా సరే, దాచుకొంటాడే కానీ త్యాగం చేయడు. ఇది మనిషి బలహీనత. ఈ బలహీనతవల్లే బంధాల్లో చిక్కుకొంటాడు. అందుకే పెద్దలు సదా త్యాగబుద్ధిని అలవరచుకోవాలని చెబుతారు. త్యాగంవల్లనే అమృతత్వం సిద్ధిస్తుందని వేదవాక్కు. త్యాగం అనేది మనోనిర్ణయానికి అధీనమై ఉంటుందేగాని, మాటలతో సాధ్యంకాదు. కనుక, మనిషి అన్నింటినీ మానసికంగా వదిలించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే విముక్తి లభిస్తుంది. లేకుంటే ఎన్ని సంపదలున్నా, ఎన్ని సౌఖ్యాలున్నా మనిషి ఇంద్రియాల చెరసాలలో బందీగానే జీవితమంతా గడపవలసివస్తుంది.

- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ