ᐅ మీలాదున్నబి



ᐅ మీలాదున్నబి

ఎదురైన కష్టాలతో పోరాడి మానవుల మనస్సులలోని తమస్సును విడదీస్తే అవినీతి, అన్యాయాలకు శ్వాస ఆగిపోతుంది. ప్రతి వూరు, వాడ శాంతిమందిరాలై శోభిల్లుతాయి. సమత్వపు సౌరభాలు గుబాళిస్తాయి. అందాల ఆలోచనలు విరబూస్తాయి- అని భావించి జీవితాంతం లోకశ్రేయం కోసం కృషిచేసిన మహోన్నతుల్లో ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) ఒకరు. ప్రవక్త వాక్కులు, చేతలు నిస్వార్థ ఆదర్శాలకు ప్రతిరూపాలు. ఆయన జీవితం సత్యసంధతకు, సహనానికి, ఉన్నత మానవీయ గుణాలకు నెలవు. నిరంతరం సచ్ఛీలతను, సన్మార్గాన్ని ఆయన ప్రబోధించేవారు. బోధించింది స్వయంగా ఆచరించేవారు. అనాథగా జీవితాన్నారంభించి మహోన్నత వ్యక్తిగా ఎదిగి ప్రజాస్వామ్య వ్యవస్థకు నాంది పలికారు.
ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) రబీ ఉల్‌ అవ్వల్‌ మాసం పన్నెండో తేదీ (క్రీ.శ. 571 ఏప్రిల్‌ 20) మక్కాలో జన్మించారు. మీలాద్‌ జన్మదినం. నబి అంటే ప్రవక్త. మీలాద్‌-ఉన్‌-నబి అంటే ప్రవక్త జన్మదినం. సంప్రదాయబద్ధంగా ముస్లిములు మీలాదున్నబిని జరుపుకొంటారు.

ప్రవక్త పుట్టిన అరబ్‌ దేశం ఆ సమయంలో ఎన్నో దురాచారాలకు లోనైంది. మూఢభావాలు, మూర్ఖవిశ్వాసాలు, అలజడులు, దౌర్జన్యాలు చెలరేగాయి. ఒక వ్యక్తి తన ప్రవర్తనవల్ల మరో వ్యక్తిని బాధించడం నీచప్రవృత్తిగా భావించేవారు కాదు. కరుణ, జాలి, ప్రేమ మాత్రమే మానవుణ్ని ఉన్నత స్థానంపై నిలుపుతాయనేవారు ప్రవక్త. మహాప్రవక్త (స.అ.సం.) ప్రవచనాలు జనుల్లో బలమైన మార్పు తెచ్చాయి. అరబ్బులు వివేచనా మార్గం అవలంబించారు. బానిసలు పతనావస్థనుంచి పైకి రాగలిగారు. అరేబియాలో శాంతి పరిఢవిల్లింది. సువిశాల అరబ్‌ ద్వీపకల్పం ప్రవక్త వశమైంది. ఇరవై మూడేళ్లలో నైతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సంస్కరణలను ప్రవక్త అక్కడ నెలకొల్పారు. రాజాధిరాజై కూడా ఒక పేదవాడిగా ఆయన జీవితం గడిపారు. ఆయనలో సుఖసంపదలపై అనురక్తి, అధికారంపై ఆసక్తి ఎంతమాత్రం లేవు.

ఒకసారి మహాప్రవక్త ఓ పల్లెటూరి పేద వ్యక్తిని తన దగ్గరికి పిలిచారు. అతడి చేతులు కాయలు కాచి ఉన్నాయి. ప్రవక్త గమనించారు. అరచేతుల్ని ముద్దుపెట్టుకొన్నారు. పేదవాడు బతుకుతెరువు కోసం కూలిపని చేసేవాడు. ఎక్కడా ఎవ్వరినీ యాచించేవాడు కాదు. ప్రవక్త తమ ప్రవచనాల్లో సాధ్యమైనంతవరకు యాచించడం తగదనేవారు. ఎవరైనా ఇవ్వడానికి లేదా ఇప్పించడానికి ప్రయత్నించాలనేవారు. ఒకరి ఎదురుగా చేయిచాచి అర్థించడంకన్నా కట్టెలు కొట్టి జీవితం గడపడం ఎంతో ఉత్తమం అని ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) ప్రవచించేవారు.

ప్రవక్త ఇల్లు మట్టితో కట్టింది. పైకప్పు ఖర్జూరపు ఆకులు. గృహస్థుగా ఆయన జీవితం గడిపారు. చిరిగిన తమ బట్టల్ని తామే కుట్టుకొనేవారు. తమ దుస్తుల్ని స్వయంగా ఉతుక్కునేవారు. చెప్పులు బాగుచేసుకొనేవారు. పశువులకు మేత వేసేవారు. ఖర్జూరపు పండ్లు, మేకపాలు ఆయన ఆహారం. ఒక్కోసారి అవీ ఉండేవి కావు. ధరించే వస్త్రాలకు ఎన్నో అతుకులు. సాధారణ కూలివాడిగా కష్టపడి జీవించేవారు. తాను రాజ్యాధిపతి. వచ్చిన సంపదంతా ఎప్పటికప్పుడు ప్రజల కోసం వినియోగించేవారు.

'భగవంతుడా! నన్ను పేదవాడిగా ఉండేటట్లు అనుగ్రహించు' అని ముహమ్మద్‌ ప్రవక్త (స.అ.సం.) వేడుకొన్నారు. లోకంలో అపూర్వమైన కోరిక ఇది. ఆయన అభిలషిస్తే అత్యంత సంపన్న జీవితం గడపగలరు. బంగారు తూగుటుయ్యాలలో వూగగలరు. అయినా పేదరికాన్నే కోరుకొన్నారు.

స్వర్గం నీ తల్లి పాదాల కిందే ఉంది, ఎక్కడో కాదు; భక్తుడు మృదు స్వభావాన్ని అలవరచుకొన్నప్పుడే సర్వేశ్వరుడు అతడికి చేరువవుతాడు; అసత్యం, అసూయ, ఆడంబరం, వంచన హృదయంలో చోటుచేసుకొంటే ఆత్మగౌరవం మంటకలుస్తుంది. వ్యక్తి విలువ పతనమవుతుంది; పొరుగువాడి ఆకలిబాధ గుర్తించక కడుపునిండా తినేవాడు పాపాన్ని మూటకట్టుకొంటాడు; మనిషికి గర్వం కొంచెమైనా ఉండకూడదు. ఆవగింజంత గర్వమున్నా స్వర్గ ప్రవేశం ఉండదు; శ్రామికుడి కష్టార్జిత వేతనం అతడి చెమట చుక్కలు ఆరకముందే చెల్లించాలి...'

ఇవన్నీ మహాప్రవక్త ప్రవచనాలు. అవి విషతుల్యమైన హృదయ కాఠిన్యాన్ని తొలగించి మృదుత్వాన్ని దరిచేర్చగలవు. దౌష్ట్యాగ్నిని చల్లార్చగలవు. మానవతా దీపాన్ని వెలిగించి, శాంతిసుమాల పరిమళాల్ని వెదజల్లగలవు.

- డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా