ᐅ ఆధ్యాత్మిక ప్రగతి



ᐅ ఆధ్యాత్మిక ప్రగతి

లోకంలో సాధారణమార్గాలు వేరు, ఆధ్యాత్మిక మార్గాలు వేరు.
అతి తక్కువమంది ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. కోరి కొండనెక్కేవారు ఎందరు? నేల మీదనే బావుందనుకుంటారు అధికులు.
ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక వృత్తి- ఆదాయ మార్గాలుగా మనకు తెలుసు. ఆధ్యాత్మిక మార్గం వల్ల సామాన్యులకు ఎలాంటి ప్రయోజనమూ కనిపించదు. వ్యర్థమని కూడా అనిపిస్తుంది. మహా భక్తుల జీవితాలు పరిశీలిస్తే, వాళ్లను ప్రాపంచిక ప్రలోభాల్లోకి లాక్కురావాలని అయినవాళ్లు పడిన ప్రయాసలెన్నో కనిపిస్తాయి.

భక్తులకు మొదటి పరీక్ష, దరిద్రం.

దరిద్రుడు దేనికైనా సిద్ధపడతాడు. ఆ పూట గడవాలి గనక, దేనికీ సంకోచించడు. కానీ, భక్తుడు అలా కాదు. అల్ప సంతోషిగా, తృప్తిగా జీవిస్తాడు. దరిద్రంవల్ల కలిగే అవమానాలను మందహాసంతో స్వీకరిస్తాడు.

భక్తతుకారం అలాంటి జీవితమే గడిపాడు.

సిరిసంపదలతో తులతూగుతూ కూడా భక్తుడిగా రాణించగలవాళ్లు చాలా అరుదు. సుఖభోగాలకు విరక్తుడు కాకపోతే భగవంతుడి పట్ల భక్తి కలగదు.

సంపన్నుడు జ్ఞాని కావచ్చు. భక్తుడు కావటం చాలా కష్టం. జనకుడు రాజర్షిగా రాణించాడు. మహాజ్ఞానిగా పేరు పొందాడు. కానీ, భక్తశ్రేణిలోకి రాలేకపోయాడు.

జ్ఞాని భగవంతుని గురించి తెలుసుకోగలడు.

భక్తుడు భగవంతుడి సాన్నిహిత్యాన్ని పొందగలడు. ఇదే ఇద్దరికీ తేడా.

నిష్కల్మషమైన ఏ ఆధ్యాత్మిక మార్గమైనా యోగమేనని శ్రీకృష్ణుడు చెప్పాడు. యోగ్యత కలిగించేదే యోగం. దైవానుగ్రహ యోగ్యతే యోగానికి ప్రధాన లక్ష్యం.

భక్తులు- భగవంతుణ్ని ప్రేమించటం, ఆరాధించటం, సేవలో తరించటం తమ కర్తవ్యంగా భావిస్తారు. ప్రవర్తిస్తారు. ఫలితాల కోసం నిరీక్షించరు. రాలేదని నిరాశ చెందరు. దీన్నే నిస్వార్థభక్తి అంటారు.

సాధకులు అలా కాదు.

'సాధించటానికే సాధన' అన్నట్లు తమ ప్రగతిని కొలమానం వేసుకుంటూ ఉంటారు. కుండలినీ నిద్ర లేచిందా, ఏ చక్రం తాకింది, ఏ చక్రం దాటింది, సహస్రారం ఎప్పుడు చేరుకుంటుంది? ఇదే ధ్యాస!

నీళ్లు మోసేవాడు ఒకడు- శివుడికి నూరు బిందెల నీళ్లు అభిషేకం చేస్తే రాజయోగం పడుతుందని తెలిసి వెంటనే ఆ పనిలో పడ్డాడు. ప్రతి పది బిందెల నీళ్లకు శరీరంకేసి చూసుకునేవాడు, రాజలక్షణాలు ఏమైనా వచ్చాయా? నెత్తిమీద కిరీటం వచ్చిందా అని తడిమి చూసుకునేవాడు- తొంభైతొమ్మిది బిందెల నీళ్లూ అభిషేకించాక నూరో బిందెను కోపంగా శివుడి నెత్తికేసి కొట్టాడట! కారణం- తనకు తక్షణ రాజయోగం కలగలేదని. ఇలాంటి సాధన పనికిరాదు!

చెట్లు కూడా సాధన చేస్తాయి. ఆకులు రాలుస్తాయి. కొత్తచివుళ్లు వేస్తాయి. మెలమెల్లగా ఆకాశంవైపు ఎదుగుతుంటాయి. అవి ఆకాశం వైపే... ఆ పరంధాముడి వైపే దృష్టి పెడతాయి. నేలచూపులు చూడవు. ఎదుగుతూనే ఉండాలనే ఆకాంక్ష వాటిలో గాఢంగా కనిపిస్తుంది.

సాధకుడి ఆదర్శం అలా ఉండాలి.

పాము కుబుసాన్ని విడిచినట్టు తనలోని దుర్గుణాలు వదిలేస్తూ చెదరని విశ్వాసంతో సాధన చెయ్యాలి.

మలిన వస్త్రాన్ని శుభ్రం చేస్తున్న కొద్దీ మెరిసిపోయినట్లు, మనలోని మాలిన్యాలనే దుర్లక్షణాలు వదిలించుకొంటున్న కొద్దీ మనసు ఉత్తేజితమవుతుంది. ఆత్మ ప్రబోధితమవుతుంది. మనలో ఆధ్యాత్మిక వికాసం ఆరంభమవుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తిత్వం నిర్మాణమవుతుంది.

అప్పుడు మనం ఒక విభిన్నత కలిగి ఉంటాం.

అందరిలాగా ప్రవర్తించం. మన మాటల్లో, చర్యల్లో ప్రసన్నత, ఆత్మీయత తొణికిసలాడతాయి.

ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా, మనల్ని అవమానించినా, మనం కోపగించుకోం.

'ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం గనుక?' అనే వైరాగ్య భావన మనల్ని స్థిరచిత్తుల్ని, ప్రసన్న చిత్తుల్ని చేస్తుంది. అంతకన్నా ఆధ్యాత్మిక ప్రగతి ఇంకేముంటుంది.

- కాటూరు రవీంద్రత్రివిక్రమ్‌