ᐅ విలువలు
ᐅ విలువలు
ఆధునిక సమాజంలో 'విలువలు బాగా పడిపోతున్నా'యన్నమాట తరచూ వింటున్నాం. ఈ విలువలకున్న విలువేమిటి, విలువలంటే అసలేమిటి, మానవ జీవితంలో వీటిపాత్ర ఏమిటి, వీటికున్న ప్రాధాన్యమేమిటి? ఇలా ప్రశ్నలు ఉదయించడం సహజం. ఒకజాతి లేదా వర్గం అభ్యున్నతికీ, మహేతిహాసానికీ విలువలు మూలస్తంభాలవంటివి. ఇవి అసలైన జీవన ధర్మసూత్రాలు. మానవుని మనుగడకు అవసరమైన నైతిక సిద్ధాంతాలు. వీటిని మనం మానవీయ విలువలని కూడా అంటాం. ఇవన్నీ మనకు వేదాలు, పురాణేతిహాసాలు, శాస్త్రాలు, ధార్మిక గ్రంథాలు, పూర్వజుల అనుభవసారాలు, నైతిక వేదికలు మున్నగువాటి నుంచి లభ్యమవుతాయి. సజ్జనులు, యోగిపుంగవుల వంటివారి ప్రవచనాలనుంచి వీటిని మనం పొందవచ్చు.
ఒక మంచిమాట, మంచిపాట, మంచి కవిత, మంచి కథ, చిత్రం, పరిచయం, భాషణం, సంఘటన మనలోని మాలిన్యాన్ని, అశాంతిని, ఆవేశాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తాయి. మనలో మంచిగుణాలకు, భావాలకు, ఆలోచనలకు ప్రేరణ కలిగిస్తాయి. క్రమక్రమంగా మనలోని చెడును చెరిపివేసి మన అభ్యున్నతికి దోహదపడతాయి. భారతీయాత్మ అయిన ఆధ్యాత్మిక దిశవైపు నడిపిస్తాయి. సంపూర్ణ వ్యక్తిత్వాన్ని మానవుడికి ప్రసాదిస్తాయి.
మన జీవితంలో అతి ముఖ్యమైన అమూల్యమైన అంశం కాలం. అటువంటి కాలానికున్న విలువను, మహిమను గ్రహించి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటే కలిగే ఆత్మసంతృప్తే వేరు. అప్పుడు కలిగే ఆనందం అనుభవైకవేద్యం. విలువలు తెలుసుకోవడానికీ సత్యం బాగా ఉపయోగపడుతుంది.
జీవితానికి అర్థం జీవిస్తేనే తెలుసుకోగలం. మరణానికి అర్థం ఆత్మీయులు మరణించినప్పుడు తెలుస్తుంది. విలువ కట్టడానికి వీలులేని ఈ జీవితాన్ని అర్ధాంతరంగా మనకు మనంగా అంతం చేసే హక్కు మనకు లేదు. దాన్ని హక్కుగా మనం లాగేసుకుంటే జాతికీ, లోకానికే కాదు- మనల్ని సృష్టించి, నాలుగు మంచి పనులు చెయ్యమని ఈ నేలమీదికి పంపిన పరమాత్మకు కూడా కృతఘ్నులమనిపించుకుంటాం. ఇంక మన జీవితానికి అర్థమేమిటి, మనకుండే గుర్తింపేమిటి? ఎంతసేపు 'నేను, నా కుటుంబం, నా మనవళ్లు, మనవరాళ్లు, వాళ్ల లక్షల సంపాదన, నా రోగాలకు సరిపడే వైద్యం.....' ఇలాంటి సంకుచితమైన ఆలోచనలతో శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుమిట్టాడుతూ, కూపస్థమండూకంలా అదే స్వర్గతుల్యమనుకుంటూ కాలక్షేపం చేయడమేనా? ఇలా విలువలకు తిలోదకాలిస్తూ లక్ష్యహీనంగా బతికేయడమేనా? అది తెలుసుకునేందుకు కూలంకషంగా స్వాధ్యయనం చేయాలి. స్వావలంబన అలవరచుకోవాలి. సత్సంగం చేయాలి. సాధుత్వం అలవరచుకోవాలి.
పొరపాట్లనేవి ఎంతటి మహనీయులకైనా సహజమే. వాటిని గ్రహించి, అవి పునరావృతం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించడమే 'మనీషి' కాగోరేవాడి లక్షణం. వాల్మీకి మొదట బోయవాడై అడవిలో వేటాడుతూ, మృగాలను చంపుతూ వాటి మాంసాన్ని తన భార్యకు వండమని ఇస్తున్నప్పుడు- 'నీ పాపంలో నేను భాగస్వామిని కాను' అన్న భార్య పలికిన ఒక్కమాటకు, హృదయ పరివర్తన చెందాడు. మనోప్రక్షాళన చేసుకుని, తక్షణం బాణం వదిలి గంటం పట్టి శ్రీమద్రామాయణమనే రసామృత కలశాన్ని లోకానికి ప్రసాదించాడు. అలా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తపడేందుకు మానవుడు బద్ధకంకణుడైతే, ఈ లోకంలో ప్రతిమనిషికీ ఎదుటిమనిషి పరమాత్మలా దర్శనమిస్తాడు. గోస్వామి తులసీదాసు, భార్య రత్నావళి వ్యామోహంలో పడి, భోగవిలాసాలకు బానిసైనప్పుడు- 'నామీద చూపే ఈ ప్రేమను రాముని మీద చూపిస్తే మీ జీవనమే పావనమైపోదా?' అన్న ఒక్క చురకకు, మనసు మార్చుకుని, రామభక్తుడై, భక్తిజ్ఞాన వైరాగ్య సంపన్నుడై ప్రపంచానికి 'రామచరిత మానస్' అనే ధర్మదీపికను అందించాడు. ధర్మాన్ని మించిన కరదీపిక మానవుడికి ఇంతవరకు లభ్యం కాలేదు; మున్ముందు కాబోదు. ధర్మాచరణ వల్లనే మానవుడు ఆత్మజ్ఞానం పొందగలడు. ఆత్మజ్ఞాని కాని పురుషుడెన్నటికీ పరిపూర్ణుడు కాలేడు.
భగవత్కరుణను పొందాలంటే విలువల్ని కాపాడుకోవడమే అర్హత. అనుక్షణం విలువల్ని ఆదరించేవాడే ఆధ్యాత్మిక పరిపక్వతను ఆర్జించగలడు. విలువల కలువల చలువ పందిరినీడలో సేదదీరడం తెలిసిన మానవుడే సార్థక జన్ముడు!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి