ᐅ గురు గోబిందసింగ్
ᐅ గురు గోబిందసింగ్
సిక్కు గురువుల్లో ఆద్యుడు గురునానక్‌దేవ్ (1469-1539). ఆయన కులమతాతీతమైన ఆధ్యాత్మిక వ్యవస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా దైవధర్మాన్ని బోధించిన జగద్గురువు నానక్, ఆయన తదనంతరం గురు అంగద్ దేవ్ (1504-1552), గురు అమర్‌దాస్ (1479-1574), గురు రామ్‌దాస్ (1534-1581), గురు అర్జున్‌దేవ్ (1563-1606), గురు హర్‌గోవింద్ (1595-1644), గురు హర్‌రాయ్ (1630-1661), గురు హరికిషన్ (1656-1664), గురు తేగ్‌బహదూర్ (1621-1675) సిక్కు ధర్మాన్ని అనేక కష్టనష్టాలకోర్చి రక్షించారు.
పీడిత తాడిత ప్రజల పాలిట సిక్కు ధర్మం రక్షా కవచమైంది. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గురువులూ చెయ్యని త్యాగాలు సిక్కు గురువులు చేశారు. అనేక ధర్మయుద్ధాలు చేశారు.
కాశ్మీరు పండితుల ప్రార్థన మన్నించి, హిందూ ధర్మ రక్షణ కోసం ఆత్మబలిదానం చేసిన మహోన్నత త్యాగమూర్తి గురు తేగ్‌బహదూర్. ఆయన తరవాత, తొమ్మిదేళ్ల అతి పిన్న వయస్సులో, ఆయన కుమారుడైన గోబిందరాయ్ గురుసింహాసనం అధిష్ఠించారు.
గోబిందరాయ్ బాల్యంనుంచే చదువు, సాహిత్యం, యుద్ధవిద్యల్లో ఆరితేరారు. తండ్రిని మొగలాయీ పాలకులు శిరచ్ఛేదం చేశాక- సిక్కుల్లో ఆశించినంత ఆవేశం, తిరుగుబాటు రాకపోవటం గోబిందరాయ్‌ని మనస్తాపానికి గురిచేసింది. సిక్కులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆకాంక్షించారు.
సిక్కులు అసహాయ శూరులై అనితర సాధ్యమైన క్రమశిక్షణతో, కులమత జాతి విచక్షణకు అతీతంగా, ధర్మరక్షణే కర్తవ్యంగా జీవించాలనే పవిత్ర ఆశయంతో ఖాల్సాపంథ్ అనే అత్యుత్తమ ఉద్యమాన్ని ప్రారంభించారు గురు గోబిందరాయ్.
సిక్కులు సింహసమానులుగా జీవించాలనే సంకల్పంతో ప్రతి సిక్కు పేరు చివర్న 'సింగ్' అని చేర్చారు. ఖాల్సాపంథ్ రూపకల్పన 30-3-1699న ఆనందపూర్ సాహిబ్‌లో జరిగింది.
అదొక అద్భుత ఆధ్యాత్మిక చారిత్రక సంఘటన. గురు గోబింద్‌రాయ్ ఆనాటి నుంచి గురు గోబింద్ సింగ్‌గా ప్రసిద్ధిపొందారు. ఆత్మబలిదానానికి సిద్ధపడిన అయిదుగురు సిక్కులు- లాహోర్‌కి చెందిన క్షత్రియుడు దయారామ్, హస్తినాపూర్‌కి చెందిన జాట్‌వీరుడు ధరమ్ చంద్, హిమ్మత్‌రాయ్ అనే కుమ్మరి, మొహకమ్‌చంద్ అనే దర్జీ, సాహెబ్‌చంద్ అనే క్షురకుడు- పంచ ప్యారీలుగా ప్రసిద్ధి చెందారు.
వారికి తన స్వహస్తాలతో 'పహుర్' ఉత్సవంలో తయారుచేసిన అమృతతీర్థం ఇచ్చి, సింగ్ బిరుదు ప్రదానం చేశారు. తిరిగి వారి నుంచి అమృతతీర్థం స్వీకరించి, తన పేరు చివర సింగ్ జతచేసుకున్నారు.
సిక్కు ధర్మం స్వీకరించి, ఖాల్సాలుగా జీవించాలనుకునేవారు ఇలాగే 'అమృతతీర్థం' పుచ్చుకోవాల్సి ఉంటుంది.
'ఖాల్సా' అంటే జీవితకాల పవిత్రయోధుడు.
కఠినాతి కఠినమైన జీవన విధానంతో ఖాల్సాలు ధర్మజీవితం గడుపుతారు. కకార పంచకాలు- కేశాలు, కృపాణ్, కచ్ఛా, కడ, కంఘా తప్పనిసరిగా ధరించాలి. సిక్కు ధర్మంలో ఉచ్చనీచ విచక్షణ, పూర్వకుల మత ప్రసక్తిగానీ ఉండవు. ఒకే పాత్రలోని ఆహారాన్ని అందరూ స్వీకరిస్తారు.
సిక్కులు ఎలాంటి దుర్వ్యసనాల జోలికి పోకూడదు. సమభావం, సమసమాజం, సద్భావన, సమాజ రక్షణ, దేశభక్తి- సిక్కులకు పంచప్రాణాలు. ఇలాంటి అసమాన యోధుల్ని తీర్చిదిద్దిన ఘనత గురు గోబింద సింగ్‌దే.
'నా ఖాల్సా సైనికుడు ఒక్కొక్కడూ లక్షాపాతికవేల శత్రువులను సంహరించగలడు' అని ప్రకటించటమే కాదు- ఆచరణ సాధ్యంగా రుజువుచేసిన మహాయోధుడు గురు గోబింద సింగ్. తన జీవితకాలంలో పద్నాలుగు ధర్మయుద్ధాలు చేశారాయన. చిన్న సైన్యంతోనే మహాసైన్యాలను మట్టి కరిపించారు.
గురు గోబింద సింగ్ కేవలం సిక్కులకే కాదు ప్రతి భారతీయుడికీ ప్రాతఃస్మరణీయుడు. కారణం, ఆయన ఏ మతానికో పరిమితం కాలేదు. మానవత్వానికి రక్షకుడిగా నిలిచాడు. అందరు మానవుల్ని ఆత్మస్వరూపులుగానే భావించాడు. గాయపడిన శత్రువుల్ని కూడా ఆదుకున్న మహనీయుడు.
ఆయన జన్మదినం మానవత్వానికి మహోత్సవం.
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్