ᐅ శోభాయాత్ర

ᐅ శోభాయాత్ర

జీవితం ఓ శోభాయాత్ర. ప్రపంచంతో, ప్రకృతితో కలిసి భగవంతుడివైపు సాగే పవిత్ర యాత్ర. పునిస్త్రీలు పూజా సంభారాల తట్టలతో, బుట్టలతో వెంటరాగా మానసికంగా మంత్రజపం చేసుకుంటూ పైకి భగవంతునికి జయజయధ్వానాలు పలుకుతూ శుభ్రవస్త్రాలతో, శుభ సంస్కారాలతో భక్తజనం సాగే వూరేగింపు శోభాయాత్ర. ఔను. మన జీవితం కూడా ఓ శోభాయాత్ర. నిరంతర శోభాయాత్ర. సద్గుణాల సుమాలతో, సద్భావనల సంభారాలతో, సంతోషమానసంతో ఆ సాకేత రాముని సన్నిధి చేరేందుకు చేసే శుభయాత్ర. మనం భగవత్‌ కృపకై అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తుంటాం. మనం మనకు తెలీకుండానే ఆయనపై జీవిత కాల యాత్ర చేస్తూనే ఉంటాం. జీవించటమనే యాత్ర చేస్తున్నాం తెలుసా... దేహమనే ఆసనం మీద శ్వాస అనే నిరంతర అజపాజపం చేస్తూ జీవాత్మ పరమాత్మలో లయమయ్యేందుకు చేసే ఈ సజీవ యాత్రాసాధన సౌభాగ్య వశాన మనిషికి లభించిన ఉత్కృష్టవరం. అయితే మనం దాని ఔన్నత్యాన్ని, దుర్లభమైనది లభించిన అదృష్టాన్ని... గుర్తిస్తున్నామా? జీవితమనే దివ్య శోభాయాత్రను శుష్కయాత్రగా భావిస్తున్నాం. క్షుద్రయాత్రగా జీవిస్తున్నాం. ఎవరికైనా జీవితం ఒకటే. కాకపోతే వారివారి అభిరుచీ, సంస్కారాల మీద వారి జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఆ విధానమే మన జీవన ఫలాన్ని, సాఫల్యాన్ని నిర్ణయిస్తుంది. శివలింగాన్ని రాతిగుండుగా భావించేవారికి అది పచ్చడి బండగా మాత్రమే ఉపయోగపడుతుంది. అదే, దైవంగా స్వీకరించేవారికి జీవన సాఫల్య సాధనగా ఆశీర్వదిస్తుంది. జీవితమూ అంతే. దాని ఉద్దేశాన్ని, అపురూపతను గ్రహించి శోభాయమానం చేసుకోగలిగినవారికి అది ఓ శోభాయాత్ర. భౌతిక సుఖయానంగా భావించేవారికి, భ్రమించేవారికి జీవితం బతుకుబండి లాగే ఎద్దుగా... ఓ భారయాత్ర.
ప్రాతః కాలంలో ఆస్తికులందరూ కలిసి చేసే నగర సంకీర్తనలా ఆహ్లాదకరంగా, ఆనందమయంగా సాగవలసినది మన జీవిత యాత్ర. గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే శోభాయాత్రలా కావలసివున్నది. అది దాని లక్షణం. ఉద్దేశం. కానీ మన అవిద్యతో, అజ్ఞానంతో ఆ సుందర యాత్రను చిందరవందర యాత్రగా మలచుకుంటున్నాం. మనం వూహించుకుందాం... ఈ చిందరవందర గందరగోళ యాత్ర మళ్ళీ దారిలో పడితే? వడగాడ్పులు తగ్గి మలయ సమీరాలు వీస్తే? ప్రాతః సంధ్య పారిజాతాలు రాల్చే వేళ సంకీర్తనలు చేస్తూ సాగే భక్తి సమూహంలా జీవితం తోటి సాధకులతో, సాటి భక్తులతో, భాగవతోత్తములతో, ప్రకృతితో, పంచభూత ప్రకృతితో, భూతప్రీతితో ఓ శోభాయాత్రలా నవ్వుల పువ్వులతో, ప్రేమపత్రితో పరమాత్మ సాన్నిధ్యానికై ఓ జీవితయాత్ర, ఓ శోభాయాత్ర చేస్తే...?

- చక్కిలం విజయలక్ష్మి