ᐅ ఇది గ్రహిస్తే చాలు
ᐅ ఇది గ్రహిస్తే చాలు
చేలో జొన్న కంకులు విరగకాశాయి. పక్షులు గింజలకోసం గుంపులుగా వచ్చాయి. మంచెమీది రైతు చేతిలోని వడిసెల రివ్వున ఎగిరింది. పక్షులన్నీ కకావికలమైపోయాయి.
గింజలు కనిపిస్తే తినడం పక్షుల ధర్మం. పక్షులబారి నుంచి పంటను కాపాడుకోవడం రైతు ధర్మం. ఇక్కడ రైతుదీ స్వధర్మమే. పక్షులదీ స్వధర్మమే.
గయుడు ప్రాణభీతితో అర్జునుణ్ని శరణు కోరతాడు. అభయమిచ్చాడు కిరీటి. అటు తరవాత తెలుస్తుంది శ్రీకృష్ణుడి శపథం గురించి. విలవిల్లాడిపోతాడు. అటు ఆత్మబంధువైన శ్రీకృష్ణుడు, ఇటు ఇచ్చినమాట. తెప్పరిల్లి స్వధర్మానికే కట్టుబడాలని నిశ్చయించుకున్నాడు. శ్రీకృష్ణుడితో పోరుకే సిద్ధపడ్డాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కిరీటికి గీతాబోధన గావిస్తూ స్వధర్మాన్ని పాటించి యుద్ధం చేయమని ఉద్బోధిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు.
నీటి మడుగువద్ద విగతజీవులై పడి ఉన్న సోదరులను చూసి విస్తుపోతాడు ధర్మజుడు. యక్షుడు ప్రత్యక్షమవుతాడు. యక్షప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతాడు.
సంతుష్టుడైన యక్షుడు, 'నీ సోదరుల్లో ఒక్కరిని కోరుకో... బతికిస్తాను' అంటాడు.
'కుంతీదేవికి జ్యేష్ఠ పుత్రుణ్ని నేను. అలాగే మాత మాద్రికి జ్యేష్ఠ సుతుడు నకులుడు. అతణ్నే బతికించండి' అని కోరతాడు.
అతడి శీలసంపదకు, విచక్షణకు సంతసించిన యక్షుడు ధర్మజుని సోదరులందరినీ పునర్జీవితులను గావిస్తాడు.
గాడితప్పని స్వధర్మాచరణకు మహాభారతం మనకందించిన గొప్ప ఉదాహరణ ఇది.
పంచేంద్రియాలు స్వధర్మాలను కోల్పోతే మనసు, శరీరం విలవిల్లాడిపోతాయి. మనసు, శరీరం స్వధర్మాన్ని విస్మరిస్తే- జీవితం కల్లోలిత సాగరమవుతుంది.
ఓ గొప్ప నిర్ణయాత్మక శక్తి- స్వధర్మం!
జీవితం ప్రయోగశాల మాత్రమే కాదు. భగవానుడు పెట్టిన గొప్ప పరీక్షగానూ భావించాలి. నెగ్గుకు రావడానికి మనకిచ్చిన ఉపకరణం స్వధర్మాచరణే. కొన్నికొన్ని సమయాల్లో స్వధర్మాచరణ మీమాంసకు గురిచేయవచ్చు. కష్టాలు కొనితేవచ్చు. ఇతరులకు ప్రతిబంధకంగానూ ఉండవచ్చు. ఉన్నతస్థానంలో ఉంచవచ్చు. లేదా ఏకాకిగా మార్చనూవచ్చు. సంధిగ్ధావస్థలో పడవేయనూవచ్చు.
బిడ్డలను పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా చేయడంవరకే తల్లిదండ్రుల ధర్మం. వారి నుంచి ప్రతిఫలంగా ఏమీ ఆశించకూడదు. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను గౌరవించడం. ఆదరిస్తూ పోషించడం, కంటికిరెప్పలా కాపు ఉండటం బిడ్డల ధర్మం. అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను జీవిత భాగస్వామిగా, జీవన సహచరిగా చూసుకోవడం భర్త ధర్మం. తోడునీడగాఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం భార్య ధర్మం.
విద్యార్జనకై వచ్చినవారికి అంకితభావంతో విద్యాదానం గావించడం గురువు ధర్మమైతే- గురువును భగవంతునిలా పూజించి, గౌరవించడం విద్యార్థి ధర్మం. శీలసంపద, వివేకంతో కూడిన విచక్షణ స్వధర్మాచరణలో ఉండితీరాలి. అది రాణిస్తుంది. ఆదర్శప్రాయంగానూ ఉంటుంది.
మనం అనునిత్యం చూస్తున్నదేమిటి, గమనిస్తున్నదేమిటి? కల్లోలిత మనస్కులుగా ఉండేవారిని, సమస్యలంటూ అపోహలంటూ అనర్థాలంటూ ఒత్తిళ్ళంటూ విసుగుతూ వేసారేవారిని, ప్రశాంత జీవనం అంటూ వెంపర్లాడేవారిని చూస్తున్నాం. దీనికంతటికీ కారణం ఒక్కటే- స్వధర్మాన్ని విస్మరిస్తూ, పరధర్మం గురించి ఆలోచించడమే. ఈ సూక్ష్మాన్ని గ్రహిస్తే చాలు... సుఖవంతమైన నూరేళ్ల జీవనం మన సొంతమయ్యేందుకు.
- దానం శివప్రసాదరావు